క్రిములను మటుమాయం చేసేస్తుంది
ఇళ్లలో కిచెన్ ప్లాట్‌ఫామ్స్, బాత్‌రూమ్ గచ్చు వంటివి సూక్ష్మజీవులకు ఆవాసాలుగా ఉంటాయనేది తెలిసిందే. సూక్ష్మజీవుల బెడద తప్పించుకోవడానికి చాలామంది ఫినైల్ వంటివి వాడుతుంటారు. అయితే, వాటి వాసనను భరించడం చాలా కష్టం. అలాంటి బెడదేమీ లేకుండానే సూక్ష్మక్రిములను తొలగించుకోవడం ఇప్పటి వరకు దాదాపు అసాధ్యంగానే ఉంటూ వచ్చింది. అయితే, ఈ ఫొటోలో మోడర్న్ మంత్రదండంలా కనిపిస్తున్న పరికరం సూక్ష్మక్రిముల పాలిట మంత్రదండంలాగానే పనిచేస్తుంది. ఇది అల్ట్రావయొలెట్ శానిటైజర్.
సూక్ష్మక్రిములకు ఆలవాలాలుగా ఉండే ప్రదేశాల్లో ఉపరితలానికి కాస్త చేరువగా ఈ పరికరాన్ని నెమ్మదిగా మంత్రదండం ఆడించినట్లుగా ఆడిస్తే చాలు... సూక్ష్మ క్రిములు అక్కడికక్కడే నాశనమైపోతాయి. ఇంతకీ ఇదెలా పనిచేస్తుందంటారా..? రీచార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఈ పరికరంలో ఒక బల్బు ఉంటుంది. స్విచాన్ చేయగానే బల్బు వెలిగి దీని నుంచి అల్ట్రావయొలెట్ కిరణాలు వెలువడతాయి. ఇందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు సోకిన ప్రదేశంలో సూక్ష్మక్రిములు అక్కడికక్కడే నశిస్తాయి. ఇన్‌ఫ్లుయెంజాకు దారితీసే వైరస్, ఇ-కోలి, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా సైతం దీని ధాటికి పూర్తిగా నాశనమవుతాయి.