ప్రపంచవ్యాప్తంగా మానవాళికి పెనుముప్పుగామారిన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్
విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వినియోగమే కారణం
ఏఎంఆర్ వల్ల 2019 నుంచి ఏటా 49 లక్షల మరణాలు
2050 నాటికి ఈ సంఖ్య కోటికి చేరవచ్చని అంచనా
యాంటీబయాటిక్స్ వినియోగం తగ్గించాలంటున్న శాస్త్రవేత్తలు
18 నుంచి ‘ఏఎంఆర్ అవగాహన వారోత్సవాలు’
సాక్షి, విశాఖపట్నం: అతి సర్వత్రా వర్జయేత్... అని పెద్దలు చెప్పినట్లుగా మేలు చేస్తున్నాయని యాంటీబయాటిక్స్‌ను మితిమీరి వాడటం మానవాళి మనుగడకు ముప్పుగా మారుతోంది. అతిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మనుషులకు మేలు చేసే మైక్రోబ్స్‌ను నాశనం చేస్తున్నాయి. కీడు చేసే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరగడానికి కారణమవుతున్నాయి.
ప్రపంచ బ్యాంక్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ఏఎంఆర్ వల్ల 2019 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏటా 49 లక్షల మంది మరణిస్తున్నారు. మన దేశంలో కూడా 2019లో ఏఎంఆర్ కారణంగా దాదాపు 3లక్షల మంది మృతిచెందారు. ఏఎంఆర్ మరణాలు ఎక్కువగా దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో గుర్తించారు.
ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కారక మరణాల కన్నా అధికంగా ఏఎంఆర్ మరణాలు ఏటా కోటి వరకు నమోదవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తలసరి ఆదాయం, డిమాండ్‌కు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచుకోవడానికి మన దేశంలో కూడా వాణిజ్య, జంతు, వ్యవసాయ ఉత్పత్తుల్లో యాంటీబయాటిక్స్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది.
దీనిని అరికట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఏఎంఆర్ ముప్పును ప్రపంచమంతా కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ అవేర్‌నెస్ వీక్’ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఏమిటీ ఏఎంఆర్ ?
» కంటికి కనిపించని సూక్ష్మ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్ మొదలైనవి మనిషి శరీరం లోపల, బయట, చుట్టూ ఉంటాయి. వీటన్నింటినీ మైక్రోబ్స్ అని పిలుస్తారు.
» కొన్ని రకాల జీవక్రియలకు మైక్రోబ్స్ అవసరం. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి మంచి బ్యాక్టీరియాలు, వైరస్‌లు సహాయకారిగా ఉంటాయి. వ్యవసాయం, పరిశ్రమల్లోను వీటి ప్రాధాన్యం పెరిగింది.
» ఈ మైక్రోబ్స్ కేవలం మేలు చేయడమే కాదు... కొన్ని సందర్భాల్లో మానవాళితోపాటు జంతువులు, మొక్కలకు హాని కలిగిస్తాయి. అందుకే యాంటీ మైక్రోబియల్ టీకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టీకాలు ప్రమాదకర మైక్రోబ్స్‌ను అంతం చేయడం, వాటి వ్యాప్తిని తగ్గించడం చేస్తుంటాయి.
» అయితే, యాంటిబయాటిక్స్ అధికంగా వాడటం వల్ల చెడు మైక్రోబ్స్ తమ శరీరంలో ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. టీకాలకు లొంగకుండా మొండిగా మారి సూపర్ బగ్స్‌గా రూపాంతరం చెందుతాయి. అప్పుడు టీకాలు, ఔషధాలు వినియోగించినా ఎలాంటి ఫలితం కనిపించదు. దీనినే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు.
వన్ హెల్త్ అప్రోచ్ అవసరం
ఏఎంఆర్ అనేది మానవ ఆరోగ్యం, జంతువులు, వ్యవసాయం, ఆహారం, పర్యావరణం... ఇలా అన్నింటిపైనా ప్రభావం చూపిస్తోంది. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే ‘వన్ హెల్త్ అప్రోచ్’ ఆధారంగా మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్య, పర్యావరణ రంగాల మధ్య సమన్వయంతో కూడిన సహకార చర్యలు అవసరం.
ఈ ముప్పు నుంచి కాపాడుకునేందుకు, సమస్యను పరిష్కరించడానికి 2017లో మన దేశం జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 2022లోనే ఏపీలో కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం. – డాక్టర్ బి.మధుసూదనరావు, ఐసీఏఆర్–సీఐఎఫ్‌టీ ప్రిన్సిపల్ సైంటిస్ట్
ఆహారభద్రత, సుస్థిరాభివృద్ధికి ముప్పు
» ప్రస్తుతం ఏఎంఆర్ మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, సుస్థిర అభివృద్ధికి సైతం ముప్పుగా పరిణమించింది.
» ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం కేవలం ప్రాణనష్టంలోనే కాదు... అన్ని దేశాలను ఆర్థికంగా దిగజార్చేంత శక్తి ఏఎంఆర్‌కు ఉంది.
» ఏఎంఆర్ కారణంగా 2050 నాటికి 100 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని ప్రపంచం చవిచూస్తుందని అంచనా.
» జీడీపీలో 3.5శాతం తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉంది.
» ఏఎంఆర్ వల్ల ప్రపంచ ఎగుమతుల్లో 3.5% వరకు తగ్గవచ్చు.
» మితిమీరిన యాంటీబయాటిక్స్ వినియోగం వల్ల పశువుల ఉత్పత్తి 7.5శాతం తగ్గుతుంది.
» ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి 28 మిలియన్ల మంది పేదరికంలో కూరుకుపోతారు.
Comments
Please login to add a commentAdd a comment