ప్రపంచానికి పెనువిపత్తుగా ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’
ప్రజలు, వైద్యుల్లో యాంటీబయోటిక్స్ వినియోగంపై అవగాహన అవసరం
వ్యాధిని స్పష్టంగా నిర్ధారించాకే వైద్యులు యాంటీబయోటిక్స్‌ను సూచించాలి
వ్యాధి నిర్ధారణ ఫలితాల్లో జాప్యాన్ని అధిగమించేందుకు ఏఐ వినియోగం
ఇండియన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ చైర్మన్ బుర్రి రంగారెడ్డి
‘కోవిడ్–19 మానవాళిని మూడేళ్లు మాత్రమే ఇబ్బందులకు గురి చేసింది. దీనికి జేజమ్మలా తయారైంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎమ్మార్). ఇది భవిష్యత్‌లో మానవాళిని నిరంతరం ఇబ్బందులకు గురి చేయనుంది. దీనివల్ల భవిష్యత్‌లో ప్రపంచం తీవ్రమైన గడ్డు పరిస్థితిని చవిచూడబోతున్నాం’ అని ఇండియన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ చైర్మన్ డాక్టర్ బుర్రి రంగారెడ్డి హెచ్చరించారు.
ఈ విపత్తు నుంచి బయటపడాలంటే ప్రజలు యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వినియోగం తగ్గించాలని సూచించారు. వీటిని వైద్యుల సూచనలు లేకుండా సొంతంగా వినియోగించకూడదని స్పష్టం చేశారు. వైద్యులు సైతం క్లినికల్ పరీక్షల అనంతరం,, వ్యాధి నిర్ధారణ అయ్యాక ప్రోటోకాల్స్ ప్రకారమే యాంటీబయోటిక్స్‌ను చికిత్స కోసం వాడాలన్నారు.
కంటికి కనిపించకుండా చాపకింద నీరులా మానవ ఆరోగ్యానికి పెను విపత్తుగా మారుతున్న ఏఎమ్మార్ నియంత్రణ, ప్రజలు, వైద్యులు పాటించాల్సిన జాగ్రత్తలను ‘సాక్షి’తో రంగారెడ్డి పంచుకున్నారు. ఆయన భారత, ఏపీ ఏఎమ్మార్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనలో సలహాదారుగా ఉన్నారు. ఏఎమ్మార్‌పై రంగారెడ్డి ఏమంటున్నారంటే.. –సాక్షి, అమరావతి
టాప్–10లో ఇదే ప్రధానం
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టిన పెన్సిలిన్ ఇంజెక్షన్ 1940 దశకంలో వినియోగంలోకి వచ్చింది. ఇది ఆరోగ్య రంగం, రోగుల సంరక్షణలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. అనంతరం రకరకాల యాంటీబయోటిక్స్ తయారీ ఊపందుకుంది. వీటివల్ల సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే అనేకానేక ఇన్ఫెక్షన్‌లను నయం చేస్తూ బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తూ వైద్య రంగం ముందుకు వెళ్లింది.
పెన్సిలిన్ కనుగొన్న సమయంలోనే దీన్ని విచ్చలవిడిగా వినియోగిస్తే బ్యాక్టీరియాలో ఒకరకమైన నిరోధకత పెరిగి మనం ఇచ్చే ఏ మందులకు పని చేయకుండా సూపర్ బగ్స్‌గా మారతాయని అలెగ్జాండర్ హెచ్చరించారు. వైద్యులు, ప్రజలు లెక్కలేనితనంతో విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్‌ని వినియోగించడంతో ఏఎమ్మార్ సమస్య ఉత్పన్నం అవుతోంది.
ప్రపంచ ప్రజారోగ్య రంగంలో ఎదుర్కొంటున్న టాప్–10 సమస్యల్లో ఏఎమ్మార్ ప్రధానమైందని డబ్ల్యూహెచ్‌వో సైతం హెచ్చరించింది. అతిగా యాంటీబయోటిక్స్ వినియోగంతో మనుషుల్లో సూపర్ బగ్స్ పెరిగిపోతున్నాయి. దీంతో 80 శాతం యాంటీబయోటిక్స్ పనిచేయడం లేదని ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వో తేల్చాయి.అడ్వాన్స్‌డ్ డ్రగ్స్ సైతం 10 మందికి ఇస్తే అందులో 9 మందిలో పనిచేయడం లేదు. సెప్సిస్ వంటి జబ్బులు వచి్చనప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయక చేతులు ఎత్తేసే పరిస్థితులు చూస్తున్నాం.
యాక్షన్ ప్లాన్‌ను ఆచరణలో పెట్టాలి
2016లో డబ్ల్యూహెచ్‌వో ఏఎమ్మార్‌ను విపత్తుగా పరిగణించి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దానికి అనుగుణంగా 2022లో యాక్షన్ ప్లాన్‌ను రూపొందించిన నాలుగో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రస్తుత రోజుల్లో ఏదైనా జబ్బు చేస్తే వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఒకటి రెండు రోజుల్లో నయమవ్వాలని ప్రజలు భావిస్తున్నారు. వైద్యులపై ఒత్తిడి తెచ్చి యాంటీబయోటిక్స్ రాయించుకుంటున్న వారు ఉంటున్నారు. లేదంటే ఆ వైద్యుడిని పనికిమాలిన వాడికింద లెక్కగడుతున్నారు
మరికొందరైతే వైద్య పరీక్షలు దండగని భావించి.. నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి ఫార్మాసిస్ట్ ఇచి్చన యాంటీబయోటిక్స్ వేసుకుంటున్నారు. ఈ చర్యలతో తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని వారే పాడుచేసుకుంటున్నారు. చనిపోతామని తెలిసి ఏ వ్యక్తిని కావాలనే విషాన్ని కొనుక్కుని తినడు. యాంటీబయోటిక్స్ విషయంలోనూ ప్రజలు అదే విధంగా ఆలోచించాలి.
రోగులు, ప్రభుత్వాలపై ఆర్థిక భారం
ఏఎమ్మార్‌ను అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వాలు, వైద్యులు పరిగణించాలి. లేదంటే ప్రజారోగ్య వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ప్రజలు, దేశాలు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తుంది. గతంలో చాలా పెద్దపెద్ద జబ్బలకు పెన్సి
లిన్, సల్ఫర్ డ్రగ్ ఇస్తే మూడు నుంచి నాలుగు రోజుల్లో రోగి కోలుకుని ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది.
ప్రస్తుతం చాలా సందర్భాల్లో అవి పనిచేయకపోవడంతో ఒక డోస్, రెండో డోస్ అని డోస్‌ల మీద డోస్‌లు యాంటీబయోటిక్ మందులు వాడాల్సి వస్తోంది. దీంతో రోగులు, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. చికిత్సా సమయం పెరుగుతోంది. ఒక రోగాన్ని తగ్గించడం కోసం యాంటీబయోటిక్స్‌ను డోస్‌ల మీద డోస్‌లు ఇవ్వడం శరీరంలో మరో సమస్యకు దారితీస్తోంది. జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా నిరీ్వర్యమై, జీర్ణకోశ వ్యాధులు ఎక్కువవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment