యూరినరీ, బ్లడ్ ఇన్‌ఫెక్షన్‌లు, న్యుమోనియా చికిత్సల్లో తగ్గిన సాధారణ యాంటీబయాటిక్స్ ప్రభావం
వ్యాధి కారక చెడు బ్యాక్టీరియాకు పెరిగిన సాధారణ యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే శక్తి
దేశంలో యాంటీ బయాటిక్స్ నిరోధకతపై ఐసీఎంఆర్ విడుదల చేసిన నివేదికలో వెల్లడి
గతేడాది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 99,492 నమూనాలు విశ్లేషించిన ఐసీఎంఆర్
యాంటీ బయాటిక్స్ అతి వినియోగం కొంపముంచుతోంది. దగ్గు, జలుబు, ఇలా ఏ చిన్న అనారోగ్య సమస్యకైనా ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగి పోయింది. దీంతో వ్యాధి కారక సూక్ష్మజీవులు రోగనిరోధక శక్తిపెంచుకుని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)తీవ్ర సమస్యగా మారుతోంది.
ఫలితంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(యూటీఐ), బ్లడ్ ఇన్‌ఫెక్షన్, న్యూమోనియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు సాధారణ యాంటీ బయోటిక్ మందులతో చికిత్సలు కష్టతరంగా మారాయని ఐసీఎంఆర్ చెబుతోంది.
ఐసీఎంఆర్‌కు చెందినఏఎంఆర్ రీసెర్చ్, సర్వైలెన్స్ నెట్‌వర్క్ విభాగం ఇటీవల 2023 నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. 2023 జనవరి నుంచి డిసెంబర్ మధ్య దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 99,492 నమూనాలను విశ్లేషించి, ఆ ఫలితాల ఆధారంగా నివేదికను విడుదల చేశారు.
20 శాతం తక్కువ ప్రభావం
విశ్లేషించిన నమూనాల్లో 22,182 రక్తం, 20,026 యూరిన్, 19,360 అంటు వ్యాధులు, 17, 902 లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మిగిలినవి ఇతర బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లకు చెందినవి. కాగా సెఫోటాక్సిమ్, సెప్టాజిడిమ్, సిప్రోఫ్లా్లక్సాసిన్, లెవోఫ్లాక్సాసిన్ వంటి కీలక యాంటీ బయాటిక్స్ బ్యాక్టీరియాతో కలిగే ఇన్‌ఫెక్షన్‌లను నయం చేయడంలో 20 శాతం తక్కువ ప్రభావాన్ని చూపినట్టు నిర్ధారించారు.
ఉదాహరణకు పైపెరాసిలిన్–టాజోబాక్టమ్ ప్రభావం 2017లో 56.8 శాతం ఉండగా 2023లో 42.4 శాతానికి తగ్గింది. గ్యాస్ట్రోఎంటరైటిస్‌కు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫీ వంటి బ్యాక్టీరియా ఫ్లూరోక్వినోలోన్ ఔషధానికి 95 శాతానికిపైగా నిరోధకతను పెంచుకుందని స్పష్టమైంది. మూత్రనాళ, ఇతర ఇన్‌ఫెక్షన్‌లలో చికిత్స కోసం వినియోగించే అమికాసిన్ ప్రభావం 2017లో 79.2 శాతం ఉండగా, 2023లో 68.2 శాతానికి పడిపోయింది.
ఏఎంఆర్ ముప్పు నుంచి బయటపడటానికి తక్షణ చర్యలు అవసరమని ఈ నివేదిక నొక్కి చెప్పింది. యాంటీ బయాటిక్స్ విక్రయాలు, వినియోగంపై కఠినమైన నిబంధనలు ఉండాలని వెల్లడించింది. వ్యవసాయరంగంలోనూ యాంటీ బయాటిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టాలని స్పష్టం చేసింది.
ఏటా 10 లక్షల మంది మృతి
యాంటీ బయాటిక్స్ అపరిమిత వినియోగం కారణంగా వ్యాధులు సోకిననప్పుడు చికిత్సల్లో అవి పని చేయక ప్రపంచంలో ఏటా 10 లక్షల మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. 1990–2021 మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాన్సెట్‌లో ప్రచురించిన స్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. రాబోయే 25 ఏళ్లలో నాలుగు కోట్ల మంది మృత్యువాత పడే ప్రమాదం ఉన్నట్టు అంచనా వేసింది.
భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో 2025–2050 మధ్య యాంటీ బయాటిక్స్‌కు లొంగని వ్యాధులతో 1.18 కోట్ల మరణాలు సంభవిస్తాయని పేర్కొంది. మానవాళి ఎదుర్కొంటున్న 10 అతిపెద్ద ఆరోగ్య సవాళ్లలో ఏఎంఆర్ ఒకటని డబ్ల్యూహెచ్‌వో సైతం ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిందని గుర్తు చేసింది.
- సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment