
ఐదేళ్లలో భారీగా పెరిగిన థర్డ్ ఏసీ ప్రయాణికులు
2024–25లో 26 కోట్ల మంది
ఆదాయంలోనూ భారీగా పెరుగుదల
రైల్వే శాఖ నివేదిక
సాక్షి, అమరావతి : రైళ్లలో థర్డ్ ఏసీకి ప్రయాణికుల నుంచి డిమాండ్ భారీగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో థర్డ్ ఏసీ ప్రయాణికుల సంఖ్య, ఆదాయమూ కూడా రెండింతలకు పైగా పెరిగినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రధానంగా కోవిడ్ అనంతరం థర్డ్ ఏసీ ప్రయాణికుల సంఖ్య పెరగడం గమనార్హం. కోవిడ్ ప్రభావంతో 2020–21లో డిమాండ్ బాగా తగ్గినప్పటికీ, ఆ తర్వాత ఏటేటా భారీగా పెరిగింది. 2024–25లో థర్డ్ ఏసీ కోచ్‌ల టికెట్ల ద్వారా రూ.30,089 కోట్లు రాబడి వచ్చిందని రైల్వే శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది.
నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ..
2019–20లో భారతీయ రైళ్లలో 11 కోట్ల మంది ప్రయాణించారు. వీరిలో 1.4 శాతం మాత్రమే థర్డ్ ఏసీ కోచ్‌లలో ప్రయాణానికి మొగ్గు చూపారు. ఆ ఏడాది థర్డ్ ఏసీ టికెట్ల ద్వారా రైల్వే శాఖకు రూ.12,370 కోట్ల రాబడి వచి్చంది.
కోవిడ్ అనంతర పరిణామాలతో గత ఐదేళ్లలో థర్డ్ ఏసీ ప్రయాణికుల సంఖ్య అమాంతం పెరిగింది. 2024–25లో థర్డ్ ఏసీలో 26 కోట్ల మంది ప్రయాణించారు. మొత్తం రైల్వే ప్రయాణికుల్లో వీరు 19 శాతానికి పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2019–20తో పోలిస్తే 2024–25లో రైల్వే టికెట్ల రాబడిలో స్లీపర్ క్లాస్ ప్రయాణికుల వాటా తగ్గింది. 2019–20లో స్లీపర్ క్లాస్ టికెట్ల వాటా 27శాతం ఉంది. మొత్తం రాబడి రూ.50,669 కోట్లు కాగా అందులో స్లీపర్ క్లాస్ టికెట్ల ద్వారా రూ.13,641కోట్లు వచ్చింది. మొత్తం ప్రయాణికులు 809 కోట్ల మంది కాగా, 37 కోట్ల మంది స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించారు.
అంటే 4.6 శాతం. 2024–25లో మొత్తం రైల్వే రాబడిలో స్లీపర్ క్లాస్ కోచ్ టికెట్ల వాటా 19.5 శాతానికి తగ్గింది. సంఖ్యాపరంగా స్లీపర్ క్లాస్ ప్రయాణికుల సంఖ్య మాత్రం పెరిగింది. మొత్తం 38 కోట్ల మంది అంటే మొత్తం ప్రయాణికుల్లో 5.25 శాతం మంది స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించారు.
Comments
Please login to add a commentAdd a comment