
కోవిడ్ తర్వాత ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ధనికుల సంపద
ఇదే సమయంలో మరింత పెరిగిన పేదల సంఖ్య
1990లో మొత్తం ఆదాయంలో బిలియనీర్ల వాటా 34 శాతం
ఇప్పుడు 57 శాతానికి అప్
కోట్లాది మందిఆదాయం22.2% నుంచి 15 శాతానికి డౌన్
సాక్షి, అమరావతి: కోవిడ్ అనంతరం ధనికుల సంపద గణనీయంగా పెరుగుతోంది. అదే సమయంలో పేదల సంఖ్య పెరుగుతూ పోతోంది. 1990లో దేశంలోని మొత్తం ఆదాయంలో 34 శాతం వాటా బిలియనీర్లది కాగా, ఇప్పుడు అది 57 శాతానికి పెరిగింది. అయితే, అదే సమయంలో కోట్లాది మంది ఆదాయం 22.2 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది.
దేశంలో లగ్జరీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ సాధారణ వినియోగ వస్తువులకు లేకపోవడం గమనార్హం. భారత్ వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఉన్నందున, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఉండాలని బ్లూమ్ వెంచర్స్ నివేదిక సూచిస్తోంది. నివేదికలోని మరిన్ని అంశాలు పరిశీలిస్తే...
అందుబాటులో లేని ఇళ్లు..
ఐదేళ్ల క్రితం అందుబాటు ధరలో ఇళ్ల సంఖ్య 40 శాతం ఉండగా, ఇప్పుడు అది 18 శాతానికి తగ్గింది. గడచిన పదేళ్లలో ద్రవ్యోల్బణం పెరిగినా, మధ్యతరగతి వేతనాలు పెరగలేదు. దేశ అభివృద్ధి వేగవంతం కావాలంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా చర్యలు తీసుకోవడం అవసరం.
14 కోట్ల మందికే కొనుగోలు శక్తి
140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో కేవలం 13–14 కోట్ల మందికే సముచితమైన కొనుగోలు శక్తి ఉంది. ఇది మెక్సికో జనాభాకు సమానం. దేశ వినిమయ శక్తిలో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరో 30 కోట్ల మంది కొనుగోలు శక్తిని పెంచుకునే దశలో ఉన్నారు. అయితే, మిగిలిన 100 కోట్ల మందికి కొనుగోలు శక్తి లేకపోవడం ఆరి్థక అసమతుల్యతను సూచిస్తోంది.
కోవిడ్ అనంతరం భారత ఆరి్థక వ్యవస్థ ‘‘కే–ఆకారపు‘ (వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందని దేశ ఒడిదుడుకుల వృద్ధి బాట) వృద్ధిబాటను అనుసరిస్తోంది. ధనికులు మరింత ధనవంతులవుతుండగా, పేదలు మరింత వెనుకబడుతున్నారు.
లగ్జరీ వినియోగంలో పెరుగుదల
దేశంలో ఆల్ట్రా లగ్జరీ వస్తువులు, ఖరీదైన ఫోన్లు, విలాస భవంతులకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఐదేళ్ల క్రితం అందుబాటు ధరలో ఉన్న ఇళ్ల సంఖ్య 40 శాతంగా ఉండగా, ఇప్పుడు అది 18 శాతానికి పడిపోయింది. బ్రాండెడ్ ఉత్పత్తులకు భారతదేశం ప్రధాన మార్కెట్‌గా మారుతోంది. ఖరీదు ఎంతైనా నచి్చన వస్తువులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. అంతర్జాతీయ కళాకారులు కోల్డ్‌ప్లే, ఈడీ షీరన్ వంటి ప్రముఖ సంగీత ప్రదర్శనల టిక్కెట్లు వేగంగా అమ్ముడుపోవడం, దేశంలో లగ్జరీ వినియోగం ఎలా పెరిగిందో సూచిస్తోంది.
పెరగని మధ్యతరగతి వేతనాలు...
దేశ వినిమయ వ్యవస్థలో అత్యంత కీలకమైన మధ్యతరగతి ప్రజల జీతాలు గడచిన కొన్నేళ్లుగా పెరగకపోవడం ప్రధాన సమస్య. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, జీతాలు పెరగకపోగా, వాస్తవంగా తగ్గాయి. భవిష్యత్తులో కూడా మధ్యతరగతి ప్రజలు ఇలాంటి గడ్డుపరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
పన్ను మినహాయింపు పరిమితి పెరిగినా.. సమస్యలే..
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని గత బడ్జెట్‌లో రూ.12.75 లక్షల ఆదాయం ఉన్నవారిని ఆదాయపన్ను నుంచి మినహాయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దిగువ మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని భావిస్తున్నారు. అయితే, మరోవైపు, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోనున్నట్లు పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే తయారీ, ఐటీ రంగాల్లో ఉద్యోగావకాశాలు తగ్గుతున్నాయి.
పేదల కొనుగోలు శక్తిలో తగ్గుదల..
కోవిడ్ తర్వాత పేదల వినిమయ సామర్థ్యం గణనీయంగా తగ్గింది. దీనితో పాటు, పొదుపు శక్తికూడాబలహీనపడింది. వ్యక్తిగత, క్రెడిడ్ కార్డుల వంటి అన్‌సెక్యూర్డ్ రుణాలు పెరిగిపోవడంతో ప్రజలు రుణ ఊబిలో చిక్కుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా, రిజర్వ్ బ్యాంక్ ఇటువంటి రుణాలపై ఆంక్షలు విధించింది. దేశీయ గృహ పొదుపు 50 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment