యాంటీ బయోటిక్స్ విచ్చలవిడి వాడకంతో ఆరోగ్యానికి ముప్పు
శరీరంలో సూక్ష్మజీవనాశక నిరోధకత (ఏఎంఆర్) ఉత్పన్నం
ఆరోగ్య విపత్తుల్లో ఏఎంఆర్ ప్రధానమైనదంటున్న డబ్ల్యూహెచ్‌వో
జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటికి యాంటీ బయోటిక్స్ వాడొద్దని హెచ్చరిక
సాక్షి, అమరావతి: జలుబుకు మందు వేస్తే వారానికి.. వేయకపోతే ఏడు రోజులకు తగ్గుపోతుందనేది తెలుగు నాట తరచూ వినిపించే మాటే. స్మార్ట్ ఫోన్లు వచ్చాక దగ్గు.. జలుబు.. జ్వరం.. ఒంట్లో నలతగా అనిపిస్తే వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అందులో సూచించే మందులను మెడికల్ షాపులకు వెళ్లి కొనేస్తున్నారు. వాటిలో యాంటీ బయోటిక్స్ కూడా ఉంటున్నాయి. కొందరైతే మెడికల్ షాపులకు వెళ్లి తనకొచ్చిన నలత ఏమిటో చెప్పి నేరుగా యాంటీ బయోటిక్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ అలవాటు ఆరోగ్యానికి పెనుముప్పు తెచ్చిపెడుతోంది.
చాలా ప్రమాదం సుమా!
యాంటీ బయోటిక్స్‌ను మితిమీరి వినియోగించడం వల్ల సూక్ష్మజీవనాశక నిరోధకత (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్) సమస్య ఉత్పన్నం అవుతోంది. వైద్య నిపుణుల సలహా లేకుండా యాంటీ బయోటిక్స్‌ను ఇష్టారీతిన వినియోగిస్తే.. వ్యాధి కారకాలు రోగనిరోధక శక్తి పెంచుకుని.. చివరకు ఏ మందుకూ లొంగకుండా మరింత బలం పుంజుకుంటాయి.
టీకాలు, ఔషధాలు ప్రయోగించినా ఫలితం లేకుండాపోతుంది. ఇలా తయారు కావటాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. ఏఎంఆర్ కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది మరణిస్తున్నారు. గత ఏడాది దక్షిణాఫ్రికా, యూకేలో జరిగిన ఓ అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది.
కాగా.. 2050 నాటికి ఏఎంఆర్ కారణంగా మృత్యువాత పడేవారి సంఖ్య కోటికి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న తొలి పది ఆరోగ్య సంక్షోభాల్లో ఏంఎఆర్ ఒకటని డబ్ల్యూహెచ్‌వో సైతం స్పష్టం చేస్తోంది.
ప్రి్రస్కిప్షన్ లేకుండానే..
వైద్యులను సంప్రదించకుండా.. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయోటిక్స్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డ్రగ్ అండ్ కాస్మొటిక్స్ చట్టం 1945లోని షెడ్యూల్ హెచ్, హెచ్1 మందులను వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడదని ఔషధ నియంత్రణా శాఖ హెచ్చరిస్తున్నా మెడికల్ షాపుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.
మరోవైపు వైద్య శాఖ సైతం ఏంఎఆర్‌పై ప్రత్యేక ప్రణాళికను రచించింది. పశుసంవర్ధక, పంచాయతీరాజ్, మునిసిపాలిటీ, ఇతర శాఖలను సమన్వయ పరుచుకుంటూ ఏంఎఆర్ నియంత్రణపై ముందుకు అడుగులు వేస్తోంది. ప్రజలకు సైతం యాంటీబయోటిక్స్ వాడకంపై అవగాహన కల్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment