AP: రోగం తిరగబెట్టింది | Chandrababu Govt Neglected Govt Hospitals In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: రోగం తిరగబెట్టింది

Published Wed, Aug 14 2024 4:24 AM | Last Updated on Wed, Aug 14 2024 12:48 PM

శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి కాళ్లు  నుజ్జునుజ్జయిపోగా ప్రైవేట్‌ అంబులెన్స్‌లో అతడిని శ్రీకాకుళం రిమ్స్‌కు  తరలించారు. తీవ్ర రక్తస్రావమవుతున్నా పట్టించుకోకుండా రిమ్స్‌ వద్ద  అంబులెన్స్‌లోనే బాధితుడిని అరగంటకు పైగా ఇలా వదిలేశారు.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి కాళ్లు నుజ్జునుజ్జయిపోగా ప్రైవేట్‌ అంబులెన్స్‌లో అతడిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. తీవ్ర రక్తస్రావమవుతున్నా పట్టించుకోకుండా రిమ్స్‌ వద్ద అంబులెన్స్‌లోనే బాధితుడిని అరగంటకు పైగా ఇలా వదిలేశారు.

కూటమి ప్రభుత్వ పాలనలో సర్కారు ఆస్పత్రులు.. మళ్లీ పాత రోజులు

‘ప్రైవేట్‌’కు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూపొందించిన జీరో వేకెన్సీ విధానానికి తూట్లు  

వివిధ కారణాలతో ఖాళీ అయిన పోస్టులు భర్తీ కాని దుస్థితి 

ఉద్దేశ పూర్వకంగా రెండు నెలల్లోనే అధ్వాన స్థితికి తీసుకొచ్చిన పెద్దలు 

నిర్వహణ గాలికొదిలేసి చోద్యం చూస్తున్న వైనం.. వెరసి ఆస్పత్రుల్లో వేధిస్తున్న మందులు, సర్జికల్స్‌ కొరత 

చిన్నపాటి మందుల కోసం చీటీ పట్టుకుని బయటకు పరుగులు 

డ్యూటీకి ఎవరొస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో తెలియని దుస్థితి

రోగుల బంధువులే అటెండర్‌ అవతారం ఎత్తాల్సిన పరిస్థితి 

రోగులకు విసుగు తెప్పించే కుతంత్రం  

మునుపటికొకడు ఒక కుక్కపై కక్షగట్టి చంపాలనుకుని.. ‘అది పిచ్చి కుక్క’ అని అరిచాడట. పక్కనున్న వారందరూ తలో రాయి వేసి దానిని హతమార్చారట. ప్రభుత్వాసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వ తీరు అచ్చం అలానే ఉంది. రెండున్నర నెలల వరకు ప్రభుత్వాసు పత్రులంటే పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల్లో అపార నమ్మకం కలిగేలా పనితీరు ఉండింది. కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఉద్దేశ పూర్వకంగా వాటిని పతనావస్థకు తీసుకెళ్లేలా అడుగులు వేస్తోంది. ఒక్కో విభాగాన్ని నిర్వీర్యం చేస్తూ.. పేద రోగులకు వైద్య సేవలు సరిగా అందకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. మందులు అయిపోయినా, సిబ్బంది సీట్లలో లేకపోయినా పట్టించుకోవడం లేదు. ఆస్పత్రుల నిర్వహణను అంతకంటే పట్టించు కోవడం లేదు. క్రమంగా ప్రజల్లో దురభిప్రాయం కలిగేలా చేసి.. ‘ప్రైవేట్‌’కు కట్టబెట్టాలన్నదే సర్కారు లక్ష్యం. రాష్ట్రంలో ఆ చివర ఉన్న అనంతపురం నుంచి ఈ చివరనున్న శ్రీకాకుళం వరకు కేవలం ఈ రెండు నెలల్లోనే ఏ ఆస్పత్రి నిర్వహణ చూసినా అస్తవ్యస్తంగా మారిపోవడమే ఇందుకు తార్కాణం. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన వాస్తవమిది.

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌: ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసి, ప్రైవేట్‌ ఆస్పత్రులు, వ్యక్తులకు మేలు చేయాలన్న లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ మేరకు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని మారుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ వ్యవస్థలను తీసుకుని వెళ్లేలా ఆ పార్టీ నాయకులు లీకులు ఇస్తున్నారు. 

ఈ క్రమంలోనే వైద్య శాఖలోని నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ముందుకు తీసుకుని వెళతామని ఇప్పటికే ప్రకటించారు. అదే విధంగా 2014–19 తరహాలోనే టెలీమెడిసిన్, ల్యాబ్‌లు, ఇతర సేవలను ప్రైవేట్‌కు కట్టబెట్టి ప్రభుత్వ నిధులను లూఠీ చేయడానికి  ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందికి కొరత లేకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూపొందించిన జీరో వేకెన్సీ విధానానికి కూటమి సర్కార్‌ ఇప్పటికే తిలోదకాలు ఇచ్చేసింది. 

గత ప్రభుత్వంలో సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ఖాళీ అయిన వైద్య పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. ఎన్నికలకు ముందు నియామకాలు దాదాపు పూర్తయిన పోస్టుల ప్రక్రియనూ కూటమి ప్రభుత్వం ఆపేసింది. నోటిఫికేషన్లను సైతం రద్దు చేసింది.  కూటమి ప్రభుత్వం నిరంతర నియామక ప్రక్రియకు ఇలా పుల్‌స్టాప్‌ పెట్టడంతో ఆస్పత్రుల్లో రోగుల సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంకో వైపు మందులు, సర్జికల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బోధనాస్పత్రులు, సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో కొరత నెలకొంది. 

పలు చోట్ల గ్లౌజ్‌లు, సిరంజులకూ దిక్కులేదు
జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్‌లు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లా, బోధనాస్పత్రుల్లో ఇందులో చాలా మందులు లేవు. విశాఖ కేజీహెచ్, గుంటూరు, కర్నూలు, విజయవాడ జీజీహెచ్, తదితర పెద్దాసుపత్రుల్లో సైతం 100 రకాల మందుల కొరత ఉంది. పాడేరు ఆస్పత్రిలో చాలా వ్యాధుల నివారణకు సంబంధించిన యాంటిబయాటిక్స్‌ మందులు లేవు. 

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి పంపిణీ కాకపోవడంతో రోగులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మందులనే పంపిణీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో సిరంజులు కూడా బయటకు రాసిస్తున్నారు. రూ.30 నుంచి రూ.1000 విలువ చేసే మందుల వరకు చీటి రాసి బయటకు పంపుతున్నారు. చేసేది లేక చాలా మంది ప్రైవేటు మెడికల్‌ షాపులో మందులు కొనుగోలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో గ్లౌజ్‌ల కొరత ఉంది. 

రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు చికిత్సలు, ఆపరేషన్‌ల సమయంలో కావలసిన కాటన్, ఐవీ క్యానల్, స్కానింగ్‌ జల్‌ కొరత ఉంది. కొన్ని రకాల సర్జికల్‌ వస్తువులు, రోజుకు రూ.5 వేలు లోపు వస్తువులను ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నారు. ఆపరేషన్‌ సమయంలో రోగులు ప్రైవేట్‌ మందుల దుకాణంలో కొనుగోలు చేసి తీసుకుని వచ్చి వైద్యులకు ఇస్తున్నారు. రెండు నెలల నుంచి ఫాంటాప్‌ ఇంజక్షన్‌లు లేవు. 

విజయవాడ జీజీహెచ్‌లో షుగర్‌ ఇన్‌ఫెక్షన్, నరాల సమస్య, గుండె జబ్బుల రోగులు బయట మందులు కొనుగోలు చేస్తున్నారు. కాంబినేషన్‌ మందులు, మల్టీ విటమిన్‌ మందులు దాదాపు పూర్తిగా బయటే కొనాల్సి వస్తోంది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన రోగులకు హై యాంటిబయోటిక్‌ ఇంజక్షన్‌ అవసరమైన వారు బయట కొనుగోలు చేస్తున్నారు. ఖరీదైన ఆల్బుమిన్‌ ఇంజక్షన్‌లు, ఇన్‌పేషెంట్‌గా చేరి, డిశ్చార్జి అయిన రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేక పోవడంతో బయటకు రాస్తున్నారు. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో 608 మందులకు గాను 566 మందులు రేట్‌ కాంట్రాక్ట్‌లో ఉన్న వాటిని రాష్ట్ర వ్యాప్తంగా 13 సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ ద్వారా ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా సరఫరా చేసేవారు. తక్కువ వినియోగం ఉన్న మందులను డి–సెంట్రలైజ్డ్‌ బడ్జెట్‌ ద్వారా స్థానిక సరఫరాదారుల నుంచి నేరుగా ఆస్పత్రులకు అందించారు. 

ఇలా విలేజ్‌ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200లకు పైగా, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా సరఫరా చేసేవారు. ఈ ఏడాది రెండో క్వార్టర్‌కు సంబంధించి మందుల సరఫరాను కూటమి ప్రభుత్వం ఆలస్యంగా సరఫరా చేయడంతో ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. 

విజయవాడ ప్రభుత్వాసుపత్రి  ఓపీ వద్ద బారులుతీరిన రోగులు 

నోటిఫికేషన్లు రద్దుకు యత్నాలు
ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు, ఇతర ఆస్పత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ వంటి పారామెడికల్‌తో పాటు ఇతర పోస్టులను ఉమ్మడి 13 జిల్లాల్లో జిల్లాకు 200 నుంచి 250 చొప్పున భర్తీ చేయడానికి సార్వత్రిక ఎన్ని­కలకు ముందు నోటిఫికేషన్లు ఇచ్చారు. దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిశీలన, మెరిట్‌ జాబితాలను సిద్ధం చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇచ్చేలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. 

ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే కోడ్‌ కంటే ముందే పోస్టుల భర్తీ పూర్తి చేశారు. మిగిలిన జిల్లాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం మొత్తం నోటిఫికేషన్లను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే అంశాన్ని వైద్య శాఖ పరిశీలిస్తోంది. గత ప్రభుత్వంలో వైద్య శాఖలో మానవ వనరుల కొరతకు తావు లేకుండా ఏకంగా 54 వేల పోస్టులను భర్తీ చేశారు. ప్రత్యేకంగా వైద్య శాఖ నియామకాల కోసమే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు.  
హిందూపురంలోని జిల్లా ఆస్పత్రి ఓపీ కౌంటర్‌ వద్ద రోగుల పడిగాపులు 

ఇంటి నుంచి తెచ్చుకున్న కుర్చీలోనే

ఇతని పేరు శ్రావణ్‌కుమార్‌. నెల్లూరు రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న పేద వ్యక్తి. వయస్సు 60 ఏళ్లు పైబడి ఉన్నాయి. షుగర్‌ ఉండటంతో ఇన్‌ఫెక్షన్‌ వచ్చి నాలుగు నెలల క్రితం ఒక కాలుకు యాంపుటేషన్‌ (సర్జరీ చేసి మోకాలు వరకు తొలగించారు) చేశారు. నడవలేడు కనుక మూత్ర విసర్జనకు కెథీటర్‌ వేశారు. ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉండాలంటే ఈ కెథీటర్‌ను వారం, లేదా పది రోజులకు ఒకమారు మార్చి కొత్తది వేయాలి. ఇలా మార్పించుకునేందుకు తరచూ పెద్దాస్పత్రిలోని ఎమర్జెన్సీ (క్యాజువాలిటీ)కి ఆటోలో వస్తాడు. ఇటీవల ఒకటి, రెండు దఫాలుగా వీల్‌ చైర్‌ దొరకలేదు. ఎండలో గంటకు పైగా ఉంచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఇంటి వద్ద నుంచే కుర్చీ తెచ్చుకున్నారు. దానిలోనే ఎమర్జెన్సీ వార్డు వద్దకు తీసుకెళ్తున్నారు. అక్కడ వారు గంటల కొద్దీ చూస్తే గాని కెథీటర్‌ మార్పు జరగ లేదు.

బిడ్డతో పాటు ఆక్సిజన్‌ సిలిండర్‌ 
నెల్లూరు నగరానికి చెందిన ఈ ఫొటోలోని పసిబిడ్డ పేరు హృతిక్‌నందన్‌. ఇతనికి మూడేళ్లు. తలలో గడ్డ ఉండటంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ నెల్లూరులోని పెద్దాస్పత్రిలో చిన్న పిల్లల వార్డులో చేర్చారు. ఆక్సిజన్‌ మీద వైద్యం పొందుతున్నాడు. ఇక్కడ వాంతులు కావడంతో డాక్టర్లు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రాశారు. పిల్లల వార్డు నుంచి ఎంఆర్‌ఐ తీసే చోటు కొంత దూరంలో ఉంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు ఆ పసిబిడ్డ తండ్రి.. బిడ్డకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ సిలిండర్‌ను తోసుకుంటూ పరీక్షలకు తీసుకెళ్లాడు.  

ఆక్సిజన్‌ సిలెండర్‌ని తోసుకుంటూ వెళ్తున్న ఈమె పేరు శాంతి. గుండె జబ్బుతో బాధపడుతున్న అమ్మకు సీరియస్‌గా ఉందని మధురవాడ నుంచి 108 వాహనంలో విశాఖ కేజీహెచ్‌కు ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. లోపలికి వెళ్లి త్వరగా క్యాజువాలిటీకి తీసుకెళ్లి వైద్యం అందించాలంటూ అక్కడున్న సిబ్బందిని వేడుకున్నారు. ఎవ్వరూ స్పందించలేదు. ఓ నర్స్‌ వచ్చి వివరాలు తీసుకున్నారు. వెంటనే ఆక్సిజన్‌ సిలిండర్‌ని ఇచ్చి.. శాంతి తీసుకొచ్చిన అమ్మ బాధ్యతని వార్డు బాయ్‌కి అప్పగించారు. 

నర్స్‌ అటు వెళ్లగానే.. సిలెండర్‌ని వార్డు బాయ్‌ శాంతి చేతికి ఇచ్చి.. నువ్వే తీసుకురావమ్మా అంటూ విసుక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. శాంతి ఆ సిలెండర్‌ని మోసుకుంటూ బయటికి వచ్చింది. తన కుటుంబ సభ్యులు, 108 వాహన సిబ్బంది సహాయంతో సిలెండర్‌ని తానే తోసుకుంటూ క్యాజువాలిటీకి అమ్మని తీసుకెళ్లింది. అరగంట నుంచి అడుగుతున్నా.. ఎవ్వరూ స్పందించలేదు.. అమ్మకి ఏదైనా అయితే.. ఎవరిది బాధ్యత సార్‌ అంటూ కన్నీటి పర్యంతమైంది.

ఇలాగైతే ఎలా? 

నా బిడ్డ శ్రీవిద్యకు రెండ్రోజులుగా జ్వరం వస్తోంది. ఆత్మకూరులో అంతంత మాత్రంగానే చూస్తారని తెలిసి, అనంతపురం పెద్దాస్పత్రిలోనైతే బాగా వైద్యం అందిస్తారని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే ఉదయం 10 గంటలైనా వైద్యులు రాలేదు. ఉదయం 8 గంటల నుంచి వేచి చూస్తున్నాం. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. 
– ఆదినారాయణ, బి.యాలేరు, ఆత్మకూరు మండలం

రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో ఇదీ సంగతి

శ్రీకాకుళంలోని రిమ్స్‌లో నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఆధార్‌కార్డులతో వచ్చినప్పటికీ సెల్‌ఫోన్‌ లేక ఓపీ రశీదు పొందలేకపోతున్నారు. కాళ్లావేళ్లా బతిమాలిడితే... ఎవరో ఒకరు స్పందించి కొందరికి ఓపీ ఇప్పిస్తున్నారు. ఫోన్లు లేని చాలా మంది వైద్యం పొందలేక ఇళ్లకు వెనుదిరిగారు.  ఫ్యాన్లు, ఏసీలు, సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఐసీయూలో కూడా ఏసీలు పని చేయని దుస్థితి.

⇒ రాజమహేంద్రవరం, ఒంగోలు, నంద్యాల, విశాఖ, బాపట్ల, చిత్తూరు, గుంటూరు, పాడేరు, విజయనగరం, నర్సరావుపేట, పార్వ­తీపురం, కాకినాడ, తిరుపతి రుయా ఆస్పత్రుల్లో పాలన అస్తవ్యస్తమైంది. నాలుగవ తరగతి సిబ్బందితో ఇబ్బందులెదుర­య్యాయి. స్ట్రెచర్లు, వీల్‌ చైర్లు అందుబాటులో లేవు. చాలా చోట్ల ఈసీజీ, 2డీ ఎకో మిషన్లు మొరాయిస్తున్నాయి. రక్త పరీక్షల రిపోర్టుల కోసం రోజుల తరబడి తిప్పుకుంటున్నారు. పారిశుధ్య లోపం బాగా ఇబ్బంది పెడుతోంది. బాత్‌రూంలు, మరుగుదొడ్లలో చాలా చోట్ల రన్నింగ్‌ వాటర్‌ లేదు. మంచి నీరు కూడా అందుబాటులో లేదు. 

ఆక్సిజన్‌ సిలెండర్లు సైతం బంధువులే మోసుకెళ్లారు. రెండు నెలలుగా మందుల సరఫరా నిలిచి పోయింది. మృతదేహాలు పెట్టేందుకు తగినన్ని ప్రీజర్లు లేవు. ఆసుపత్రిలో రోగులకు పెడుతున్న భోజనం నాసిరకంగా ఉంది. నిధులు లేక శానిటేషన్‌ లోపం కనిపిస్తోంది. సెక్యూరిటీకి సైతం జీతాలు సక్రమంగా అందడం లేదు. వార్డుల్లోకి కోతులు, కుక్కలు చొరబడుతున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు సరిగా లేవు.    మహాప్రస్తానం వాహనాలు అందుబాటులో లేవు.  విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే వెంటనే జనరేటర్‌ వేయడం లేదు.  దోమలను అరికట్టలేక పోతున్నారు.  

⇒ భీమవరంలో బాలింతల వార్డుల్లో ఏసీలు పని చేయడం లేదు. ఎక్స్‌రే, ఈసీజీ టెక్నీషియన్లు లేరు. రక్త పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది. డెడ్‌ బాడీ ఫ్రీజర్లు దెబ్బ తిన్నాయి. స్కానింగ్‌ కోసం ఏలూరుకు రిఫర్‌ చేస్తున్నారు.  

⇒ కర్నూలు జీజీహెచ్‌లో ఒకటి, రెండు రకాల యాంటిబయాటిక్స్‌ మాత్రమే ఉన్నాయి.  దళారులు, ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకులు ఆసుపత్రిలో బాహాటంగా తిరుగుతున్నారు. వార్డు బాయ్‌లు, స్ట్రెచర్‌ బాయ్‌లు లేక రోగుల కుటుంబీకులే ఆ పని చేస్తున్నారు. శానిటేషన్‌ సిబ్బంది సగానికి సగం డ్యూటీలో కనిపించలేదు. కోతుల బెడద విపరీతంగా ఉంది.  ఆసుపత్రిలో సైన్‌ బోర్డులు లేవు.

⇒ హిందూపురం జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ మిషన్‌ చెడిపోయింది. మరమ్మతులు చేయలేదు. చాలా మంది రోగులను స్థానికంగా ప్రైవేట్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు.  

⇒ అనంతపురం జీజీహెచ్‌లో  పారిశుధ్య నిర్వహణ దారుణంగా ఉంది.  వార్డుల్లో బయోవేస్ట్‌ డబ్బాలు ఏర్పాటు చేయలేదు. మందుల కొరత ఉంది. రక్త పరీక్షల రిపోర్టుల్లో జాప్యం జరుగుతోంది. 160కి గాను 60 ఏసీలు మాత్రమే పని చేస్తున్నాయి. గైనిక్, ఎక్స్‌రే, రక్తనిధి వార్డుల్లో కరెంటు పోతే చిమ్మ చీకటే.

⇒ అనకాపల్లిలో ఉదయం 10 గంటల నుంచి 11.45 గంటల వరకూ కరెంట్‌ లేదు. జనరేటర్‌ ఉన్నా, 10 నిమిషాల పాటు మాత్రమే పని చేసిం­ది. ఎక్స్‌రే కోసం చాలా మంది ఇబ్బంది పడ్డారు.  గర్భిణీలకు అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ చేస్తున్నా.. రిపోర్టు ఇవ్వడం లేదు. తెల్ల పేపర్‌పై పెన్‌తో రాసి పంపిస్తున్నారు. సర్జికల్‌ గ్లౌజులు, కాటన్, ఐవి క్యానల్, స్కానింగ్‌ జల్‌ కొరత ఉంది.  రోగులకు ఇచ్చే భోజనంలో నాణ్యత తగ్గింది.  

⇒ కృష్ణాజిల్లా మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో స్ట్రక్చరు, వీల్‌చైర్స్‌ సరిపడా లేవు. ఉన్న వాటిలో బంధువులే తోసుకెళ్తున్నారు. బాగా పని చేస్తున్న వెంటిలేటర్లను గదుల్లో పెట్టి తాళాలు వేశారు. రోగులకు కనీసం బీపీ కూడా చూడటం లేదు.  

⇒ విజయవాడ జీజీహెచ్‌లో నాల్గవ తరగతి సిబ్బంది కొరత చాలా ఉంది. అవుట్‌పేషెంట్‌ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులే చూస్తున్నారు. ఓపీలో ఇన్‌పేషెంట్స్‌గా చేర్చిన వారిని మరుసటి రోజు పరీక్షించి మందులు రాస్తున్నారు. అత్యవసర కేసుల్లో వార్డుకు తరలించడానికి ఎక్కువ సమయం పడుతోంది.

⇒ ఏలూరు జీజీహెచ్‌లో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ కోసం రోగులు కనీసం 15, 20 రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. వీల్‌ చైర్లు, స్ట్రెచర్లు సరిపడా లేవు. ఓపీకి వచ్చే రోగులు, వారి బంధువులు గంటల తరబడి బయట షెడ్ల కింద ఉండాల్సి వస్తోంది. కనీసం ఫ్యాన్లు కూడా లేవు. రెండు ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రైవేటు సంస్థ సరఫరా చేస్తున్న ఆక్సిజన్‌ ట్యాంకర్‌ నుంచి మాత్రమే రోగులకు ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది.  

⇒ కడపలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌)లోని ఐపీ, ఓపీ విభాగాల్లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఓపీ విభాగంలో కుర్చీలు, స్ట్రక్చ­ర్లను మూలన పడేశారు.   మెడికల్‌ ఐసీయూలో ఏసీలు పని చేయడం లేదు. పెడస్టల్‌ ఫ్యాన్లు పెట్టారు. ఎంఆర్‌ఐ, ఇతర ఓపీ విభాగాల్లోకి యథేచ్చగా కోతులు, కుక్కలు వస్తున్నాయి.  

రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం 
ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అల్టిమేటం  
ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోయి ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారుతోందని, అందువల్ల ఈ నెల 15వ తేదీ నుంచి సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. సమస్యను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) ఆరోగ్యశ్రీ సీఈవోకు మంగళవారం లేఖ రాసింది. 

ఆస్పత్రుల నిర్వహణకు నిధులు లేక సిబ్బంది జీతాల చెల్లింపు, మౌలిక సదుపాయాలు, మందులు, డిస్పోజబుల్స్‌ నిర్వహించడం కూడా కష్టతరంగా మారినట్టు పేర్కొంది. గత నెల 30న సీఈవోను కలిసి సమస్యల్ని వివరించినప్పటికీ ఎటువంటి కదలిక లేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
శ్రీకాకుళం/శ్రీకాకుళం క్రైమ్‌: రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జునుజ్జయి­పోయిన ఓ క్షతగాత్రుడు ఆస్పత్రికి వస్తే.. గంట పాటు అతనికి వైద్యం అందించకుండా శ్రీకాకుళం రిమ్స్‌ వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీనిపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రణస్థలం వద్ద యూబీ పరిశ్రమకు చెందిన కార్మికుడు పతివాడ సన్యాసినా­యుడును మంగళవారం మ«ధ్యాహ్నం లారీ ఢీకొట్టింది. 

ప్రమాదంలో అతని రెండు కాళ్లు నుజ్జునుజ్జయిపోయాయి. మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రమాదం జరిగింది. సన్యాసినాయుడును యూబీ కంపెనీ అంబులెన్స్‌లో 2.55 గంటలకు శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకువచ్చారు. అంబులెన్సు నుంచి అతడ్ని తీసుకెళ్లడానికి అరగంట వరకు ఎవరూ రాలేదు. 3.45 ప్రాంతంలో సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స మాత్రమే చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement