కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం
పీపీపీ విధానంలో కళాశాల, బోధనాస్పత్రిపై ప్రైవేట్ వ్యక్తులదే అజమాయిషీ.. వారు నిర్ణయించిన మేరకే వైద్య విద్య ఫీజులు.. పేదల వైద్యానికీ చార్జీల వసూలు
ప్రతిపక్షంలో ఉండగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తప్పుబట్టిన టీడీపీ
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో దాన్ని రద్దు చేసి తీరుతామని హామీ
ఇప్పుడు గద్దెనెక్కాక మాట మార్చి ఏకంగా ప్రైవేట్ వారికి ధారాదత్తం
2014–19 మధ్య ఒక్క వైద్య కళాశాలనూ ఏర్పాటు చేయని చంద్రబాబు.. అంత డబ్బు లేదని.. ఖర్చు దండగని అడుగు ముందుకు వేయని వైనం
వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా 17 కొత్త కాలేజీలకు శ్రీకారం
ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే లక్ష్యం
మరోవైపు మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా మరిన్ని ఎంబీబీఎస్ సీట్లు.. మెరుగైన నిర్వహణ కోసం కొన్ని సీట్లకు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానం
తద్వారా ఇటు ప్రజలు, అటు విద్యార్థులకు ప్రయోజనం
ఇప్పుడు మళ్లీ బాబు రాకతో పేద రోగుల జేబులకు చిల్లు
చంద్రబాబు ప్రభుత్వం అంటేనే అన్నింటా వసూళ్లకు మారుపేరు. ఎవరికైనా సరే.. ఏదైనా సరే.. ఉచితంగా ఇవ్వడం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. గతంలో యూజర్ చార్జీల బాదుడుతో పేదలను పీల్చి పిప్పి చేసిన ఆయన, ఇప్పుడు అంతకు మించి అంటూ అన్నింటా ‘ప్రైవేట్’ పాట పాడుతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంటే ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందడంతో పాటు విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్న గత ప్రభుత్వ మంచి ఉద్దేశాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది. కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తామని సెలవిచ్చింది. దీంతో ఆ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల ఫీజు ఆకాశాన్నంటడం ఖాయం. కష్టపడి కన్వీనర్ సీటు తెచ్చుకోగలిగిన పేద పిల్లలు అంత ఫీజు కట్టలేక వైద్య విద్యకు దూరం కావాల్సిన దుస్థితి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా పరిస్థితి మారిపోయింది.
2014-19 బాబు పాలనలో..
20 లక్షలకు పైనే జనాభా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో గతంలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఒక్కటీ లేదు. మెరుగైన వైద్యం కోసం విశాఖ వెళ్లాల్సిందే. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయాలని 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధి కోరగా.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయలేం. అందుకు రూ.350 కోట్లు కావాలి. నిర్వహణకు ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యం కాదు. ప్రైవేట్ వైద్య కళాశాలకైతే అనుమతి ఇస్తాం’ అని నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.
2019-24 వైఎస్ జగన్ హయాంలో..
‘‘ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తాం. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తాం’ అని 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లాకు రూ. 500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. శరవేగంగా నిర్మాణం చేపట్టి 2023–24 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాలను ప్రారంభించారు. ఇప్పుడు బోధనాస్పత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయి.
నేడు మళ్లీ బాబు రాకతో..
కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టబోతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలో ఉన్న కళాశాల, బోధనాస్పత్రి ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలోకి వెళ్లనున్నాయి. ప్రైవేట్ కళాశాలల తరహాలో ఎంబీబీఎస్ కోర్సుల ఫీజుల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది. ఇక బోధనాస్పత్రుల్లో నిర్దేశించిన చార్జీలు చెల్లిస్తేనే ప్రజలకు వైద్యం అందించే దుస్థితి దాపురించనుంది.
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నెలకొల్పిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ తరహాలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు పేద, మధ్య తరగతి వర్గాల వైద్య విద్య కలను సాకారం చేయాలనే ఉన్నత ఆశయంతో చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వాటిని ఇప్పుడు పీపీపీ పేరిట ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో పెట్టి పేద, మధ్య తరగతి ప్రజల వైద్యం, విద్యార్థుల విద్య కలలను కాలరాసేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది.
జగన్ మోడల్ ఇలా..
⇒ పేదలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు
⇒ మెడికల్ సీట్లు మన రాష్టంలోనే ఉంటాయి... ఫీజులు తక్కువ
⇒ పోటీతత్వం పెరిగి ప్రైవేట్‌లో కూడా రేట్లు తగ్గుతాయి.
⇒ ప్రభుత్వమే కాలేజీలను నిర్మించి నిర్వహిస్తుంది.
⇒ మెరుగైన నిర్వహణకు కొన్ని సీట్లు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ఉంటాయి.
⇒ అవి కాలేజీ అభివృద్ధికే ఉపయోగిస్తారు.
⇒ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెడికల్ కాలేజీలను నిర్వహిస్తారు.
గుజరాత్ మోడల్ ఇదీ..
⇒ భూమి, ఆస్పత్రిని ప్రభుత్వమే సమకూరుస్తుంది.
⇒ మెడికల్ కాలేజీని మాత్రమే కడతారు
⇒ మొదటి ఏడాదే ఆదాయం రూ.50 కోట్లతో మొదలవుతుంది.
⇒ ఏటా ఫీజులు పెంచుకుంటూ వెళ్లి 30 ఏళ్ల తరువాత వదిలించుకుని వెళ్లిపోతారు.
ఒకేసారి 17 కళాశాలలు ఓ చరిత్ర
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి 17 కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటిలో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి ఒకే ఏడాది అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పిచారు. 1923లో రాష్ట్రంలో మొదటిసారిగా ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 11 కళాశాలలు మాత్రమే ఉన్నాయి.
అయితే ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించి వైద్య విద్యలో సరికొత్త రికార్డును వైఎస్ జగన్ నెలకొల్పారు. ఈ విద్యా సంవత్సరం (2024–25)లో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మిగిలిన ఏడు వైద్య కళాశాలలను వచ్చే 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించగా ఈలోగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది.
నిజమైన అమ్మకం అంటే ఇదే!
గతేడాది మెరుగైన నిర్వహణ కోసం ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు గత ప్రభుత్వంపై నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వీరికి వంతపాడే ఈనాడు ‘వైద్య విద్యనూ అమ్మేశారు’ ‘వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్’ అంటూ కట్టుకథలు రాసుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేసింది. తద్వారా ప్రభుత్వ పెద్దల బినామీల జేబులు నింపేందుకు బాటలు పరిచారు.
పీపీపీతో వైద్యానికి తూట్లు
ఇక సీఎం చంద్రబాబు చెబుతున్న గుజరాత్ పీపీపీ విధానాన్ని పరిశీలిస్తే.. గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా బోధనాస్పత్రి, కళాశాలను నెలకొల్పడం), బ్రౌన్ ఫీల్డ్ (అప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి కొత్త వైద్య కళాశాలను నెలకొల్పడం) ఇలా రెండు విధాలుగా పీపీపీ విధానాన్ని అవలంబిస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ విధానంలో కళాశాల, ఆస్పత్రి నెలకొల్పడానికి ఎంతో చౌకగా ప్రభుత్వమే భూమిని కేటాయిస్తుంది.
ఆ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు కళాశాల, బోధనాస్పత్రిని నిర్మిస్తారు. కొన్నేళ్ల పాటు వారి ఆధ్వర్యంలోనే ఆస్పత్రి, కళాశాల నడుస్తుంది. బ్రౌన్ ఫీల్డ్ విధానంలో అప్పటికే నడుస్తున్న 300 పడకల ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి, ఇచ్చిన భూమిలో కళాశాలను ప్రైవేట్ వారు నిర్మిస్తారు. ఈ రెండు విధానాల్లో కళాశాలల్లో ఫీజులపై నియంత్రణ లేదు. 2023–24 విద్యా సంవత్సరం ఫీజులను ఒకసారి గమనిస్తే ఆ విషయం స్పష్టం అవుతుంది.
అక్కడ ప్రభుత్వ పరిధిలో నడిచే కళాశాలల్లో కన్వీనర్ కోటా (ప్రభుత్వ కోటా) సీట్లకు రూ.25 వేలు ఫీజు ఉంది. అదే పీపీపీ కళాశాలల్లో కన్వీనర్ కోటాకు రూ.5.50 లక్షలు, రూ.6.65 లక్షలు వరకూ ఉన్నాయి. యాజమాన్య (బీ కేటగిరి) కోటాకు రూ.17 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఫీజులున్నాయి.
ప్రస్తుతం మన రాష్ట్రంలో గత ఏడాది ప్రారంభించిన ఐదు కొత్త వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాకు కేవలం రూ.15 వేలు మాత్రమే ఫీజు ఉంది. ఇక గ్రీన్ ఫీల్డ్‌లో కళాశాలలకు అనుబంధంగా ఉండే ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వైద్య సేవలకు ప్రజలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదల ప్రయోజనాలకు తూట్లు పొడిచేందుకు కూటమి సర్కారు నడుం బిగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పేదల ప్రయోజనాలే లక్ష్యంగా
పేదల ఆరోగ్య ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏఎస్‌ఆర్, పార్వతీపురం మన్యం లాంటి గిరిజన ప్రాంతాలు, పల్నాడు, అన్నమయ్య, సత్యసాయి లాంటి వెనుకబడిన జిల్లాల్లో ఈ కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి లాంటి మారుమూల గ్రామాల ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం 150 కి.మీ ప్రయాణించి గుంటూరు వెళ్లాల్సి వస్తోంది. అదే పిడుగురాళ్లలో సూపర్ స్పెషాలిటీ బోధనాస్పత్రి ఏర్పాటుతో పల్నాడు ప్రజలకు చేరువలో వైద్య చికిత్సలు లభిస్తాయి. ఇలా ప్రతి కొత్త జిల్లాలో ఒక బోధనాస్పత్రిని అందుబాటులోకి వచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ప్రజలకు వ్యయప్రయాసలు లేకుండా చేయాలని వైఎస్ జగన్ భావించారు.
ఇప్పటి వరకూ ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్‌స్సెషాలిటీ ఆస్పత్రులు లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులు అరకొర వసతులతో నడిపే ఆస్పత్రుల్లో చేసిందే వైద్యం అనే పరిస్థితులున్నాయి. ప్రభుత్వ బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఏ చీకూ చింతా లేకుండా పూర్తి ఉచితంగా గుండె, కిడ్నీ, కాలేయం సంబంధిత, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులకు చికిత్సలు లభిస్తాయి.
అంతేకాకుండా 17 కొత్త కళాశాలల ద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూర్చి మన విద్యార్థులు వైద్య విద్య కోసం రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని వైఎస్ జగన్ యోచించారు. మన విద్యార్థులకు తాముంటున్న ప్రాంతాల్లో తల్లిదండ్రుల కళ్లెదుటే వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించాలనుకున్నారు.
ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్, లాక్‌డౌన్ లాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి కొత్త వైద్య కళాశాలల విషయంలో గత ప్రభుత్వం అడుగులు వేసింది. వైద్య కళాశాలల నిర్మాణానికి నిధుల సమీకరణతో పాటు వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏపీ మెడికల్, ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా కళాశాలల నిర్మాణ భారాన్ని ప్రభుత్వమే భరించి లాభాపేక్ష లేకుండా వాటిని నిర్వహించాలనేది వైఎస్ జగన్ విధానం.
తమిళనాడు మోడల్ కావాలి
ప్రభుత్వాన్ని దోచేసి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడం గుజరాత్ మోడల్. అది ప్రజలకు అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేలు చేసే తమిళనాడు తరహా 69 శాతం రిజర్వేషన్ మోడల్‌ను ఏపీలో అమలు చేయాలి. సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులో లేకుండా చేయడమే చంద్రబాబు విధానం అనే విషయం గత చరిత్రను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది.
ధనికులకే వైద్య విద్య అందుబాటులో ఉండేలా ఫీజులను ఆయన పాలనలో అమాంతం పెంచారు. 2014–19 మధ్య రూ.2.5 లక్షలుగా ఉన్న ఎంబీబీఎస్ బీ కేటగిరి ఫీజును అమాంతం పెంచారు. రూ.5 లక్షలున్న మెడికల్ పీజీ బీ కేటగిరి ఫీజును రూ.25 లక్షలకు తీసుకుని వెళ్లారు. కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్లకు సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారు.
– డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, గుంటూరు
ప్రభుత్వ పరిధిలోనే కొనసాగాలి
పీపీపీ విధానంలో గుజరాత్ తరహాలో కొత్త వైద్య కళాశాలలను నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజల్లో అనేక అనుమనాలు రేకెత్తుతున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రైవేట్ వ్యక్తుల ఆ«దీనంలో కళాశాలలు నడవాలన్నదే గుజరాత్ విధానం అయితే దాన్ని ఇక్కడ అమలు చేయకూడదు. గుజరాత్ తరహా ప్రైవేటీకరణ విధానాలను ఏపీ ప్రజలు ఆహ్వానించరు. ప్రభుత్వ పరిధిలోనే కళాశాలలను నిర్వహించాలి. అప్పుడే పేదలకు మేలు జరుగుతుంది.
– సీహెచ్. బాబురావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment