అబద్ధపు ప్రచారంతో నిలిపివేసిన టీడీపీ ప్రభుత్వం
జగన్ హయాంలో జరిగిన రీ సర్వేలో తప్పులంటూ పదేపదే ఆరోపణలు
రెవెన్యూ సదస్సుల్లో ఒక్క తప్పూ కనపడలేదు
రీ సర్వే బాగుండడంతో కేంద్రం కితాబు
అందుకు ప్రోత్సాహకంగా ఇప్పటికే రూ.200 కోట్లు విడుదల
దీంతో గత్యంతరం లేక సర్వే కొనసాగిస్తున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూములను యజమానులకు పూర్తి హక్కులతో అప్పజెప్పేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేను చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొనసాగించక తప్పడంలేదు. రైతులు, ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన ఈ రీసర్వేపై ఎన్నికల సమయంలో చంద్రబాబు, కూటమి నేతలు ఎంతగా దు్రష్పచారం చేసినప్పటికీ, అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రారంభించాల్సిన తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత్యంతరం లేక రీ సర్వేను మళ్లీ ప్రారంభించాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అందుకనుగుణంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో రీ సర్వే కొనసాగించేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రీ సర్వే, అందులో భాగమైన లాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూములు లాగేసుకున్నారని, కబ్జా చేశారని, విస్తీర్ణం తగ్గించేశారని, రికార్డులు ట్యాంపర్ చేశారంటూ చంద్రబాబు ఎన్నికల్లో రకరకాల తప్పుడు ఆరోపణలు చేశారు. భూముల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే లాండ్ టైట్లింగ్ చట్టంపై అభూతకల్పనలు సృష్టించి, దాన్ని రద్దు చేస్తామని చెప్పారు.
అధికారంలోకి రాగానే రద్దు చేశారు. 17 వేల గ్రామాలకుగానూ 6,800కి పైగా గ్రామాల్లో పూర్తయిన భూముల రీ సర్వేను కూడా నిలిపివేశారు. సర్వేలో తప్పులు జరిగాయని, వాటిని సరి చేస్తామంటూ హడావుడి చేశారు. ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ రీ సర్వేలో జరిగిన తేడాలపై వినతులు తీసుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు వచి్చన విజ్ఞాపనల్లో భూతద్దం పెట్టి వెతికినా రీ సర్వేలో వారు ఆశించిన స్థాయిలో తప్పులు దొరకలేదు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన రీ సర్వేలో లోపాలు లేవని రెవెన్యూ సదస్సుల్లోనే స్పష్టమైంది.
జగన్ హయాంలో జరిగిన సర్వేకురూ.200 కోట్ల ప్రోత్సాహకం
కేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో దేశంలోనే మొదటిసారిగా జరిగిన రీ సర్వేను కొనియాడింది. అన్ని రాష్ట్రాలు భూముల రీ సర్వే చేసి డిజిటల్ రికార్డులు రూపొందించుకోవాలని స్పష్టం చేసింది. అలా చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఆమె చెప్పిన రీ సర్వేను ఏపీ అప్పటికే చాలా వరకు చేయడంతో ఈ ప్రోత్సాహకానికి రాష్ట్రం ఎంపికైంది.
జగన్ హయాంలో జరిగిన రీ సర్వేకి ప్రోత్సాహకంగా వచి్చన రూ.200 కోట్లను ఇప్పడు టీడీపీ ప్రభుత్వం స్వీకరించింది. ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా స్వయంగా ప్రకటించారు. రీ సర్వేలో పెద్దగా లోపాలు లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం దానికి ప్రోత్సాహకం ప్రకటించడంతో అనివార్య పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం దానిని కొనసాగిస్తోంది.
మండలానికో గ్రామంలో పైలట్‌గా సర్వే
రీసర్వే కొనసాగింపునకు ప్రభుత్వం కలెక్టర్లకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. మొదట మండలానికి ఒక గ్రామాన్ని పైలట్‌గా తీసుకుని 200 నుంచి 250 ఎకరాల్లో రీ సర్వే చేయాలని సూచించింది. సర్వేలో ప్రైవేటు భూములతోపాటు గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, నీటి వనరులున్న భూములు, పోరంబోకు భూములను కొలిచి సరిహద్దు రాళ్లు నాటాలని చెప్పింది.
సర్వే బృందాలు భూ యజమానులతోపాటు చుట్టుపక్కల భూముల యజమానులకు నోటీసులు ఇవ్వాలని తెలిపింది. సర్వే గురించి ఆ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, సోషల్ మీడియా ద్వారా కూడా సమాచారం పంపాలని సూచించింది. ఇప్పటికే కొన్ని జిల్లాలు సర్వే బృందాలను నియమిస్తుండగా మరికొన్ని జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో రీ సర్వే ప్రారంభించాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment