సాక్షి, తాడేపల్లి: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అమలుకాని హామీలు ఇచ్చి చంద్రబాబు ఇప్పుడు వాటిని అమలుచేయడం లేదన్నారు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. తల్లికి వందనం అని పేరు పెట్టి శఠగోపం పెట్టారు. అలాగే, రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్.
కాగా, కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలో ఉండి ఉంటే అమ్మఒడి ఇప్పటికే వచ్చేది. తల్లికి వందనం అని చెప్పి అందరినీ మోసం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ డబ్బులు ఇస్తామని ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయ్యింది. విద్యార్థుల డేటా అంటూ కాలం గడుపుతున్నారు. తల్లికి వందనం అని పేరు పెట్టి శఠగోపం పెట్టారు.
వైఎస్ జగన్ ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ సమయానికి వచ్చేదని విద్యార్థులు, తల్లిదండ్రులు అనుకుంటున్నారు. చంద్రబాబు ఇప్పటికీ కూడా విద్యాదీవెన, వసతిదీవెన ఇవ్వలేదు. కొన్ని కాలేజీలు ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకున్నారు. మా ప్రభుత్వంలో వసతి దీవెన, విద్యాదీవెనకు రూ.18వేల కోట్లు ఖర్చు చేశాం. మేము అధికారంలో ఉండి ఉంటే ఈపాటికి సున్నావడ్డీ రుణాలు కూడా జమ అయ్యేవి. పథకాల అమలుపై ప్రతీ అక్కచెల్లెమ్మ ప్రశ్నిస్తున్నారు.
జూన్‌లో 43లక్షల మంది తల్లులకు పథకంలో నిధులు జమ అయి ఉండేవి. ఏమన్నా అంటే వివరాలు సక్రమంగా లేవంటారు. 50 రోజులైంది. ఇంకా డేటా ఏమిటి. అమ్మ ఒడి (తల్లికి వందనం) కోసం 43లక్షల తల్లులు, 82లక్షల పిల్లలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విద్యాదీవెన కింద ఒక త్రైమాసిక ఫీజు వచ్చి ఉండేది. అలాగే, వసతి దీవెన కింద పిల్లలకు ఒక విడత లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద ఆర్థిక సాయం అంది ఉండేది.
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే రైతుభరోసా ఇప్పటికే వచ్చేదని అన్నదాతలు అనుకుంటున్నారు. రైతులకు రూ.20వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. రైతుభరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మా ప్రభుత్వంలో మేము ఒక్క రైతుభరోసా కిందే రూ.34,378 కోట్లు ఇచ్చాం. వైఎస్ జగన్ ఉంటే మాకు ఇన్సూరెన్స్ వచ్చేదని రైతులు భావిస్తున్నారు. రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం ఇప్పటికే చంద్రబాబు కట్టలేదు. మేము కట్టాల్సిన ఇన్సూరెన్స్‌ను కోడ్ ఉందని మీరే ఆపించారు. రాష్ట్రంలో రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. మేము గతంలో ప్రతీ ఎకరాకు ఇన్సూరెన్స్ చేశాం. జియో ట్యాగింగ్ చేశాం. ఆర్బీకేల ద్వారా అన్నీ అందాయి. ప్రతీ రైతు చంద్రబాబును నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది. హామీల అమలుపై ఎవరూ ప్రశ్నించకూడదా?. రాష్ట్రంలో పాలనపై జనాల్లో చర్చ మొదలైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సూపర్ సిక్స్ ఏమైంది?
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైంది? అందులో ప్రకటించిన పథకాలు ఏమయ్యాయి?. తల్లికి వందనం లేదు? మూడు ఉచిత సిలిండర్లు లేవు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఏమయ్యాయి? ఆ వివరాలు ఉన్నాయి కదా?. ఓటర్ల జాబితాలో 18 ఏళ్లు నిండిన వారే ఉంటారు? ఆ జాబితా చాలు కదా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment