సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ హయాంలో పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరిగిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఐదేళ్ల పాటు ఏ సమస్యా లేకుండా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించారన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వృద్దులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు వాలంటీర్లు అండగా నిలిచారన్నారు.
‘‘చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను బ్రేక్ చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాలంటీర్లను పక్కకు తప్పించారు. ఇది పెన్షన్‌దారులకు శరాఘాతంగా మారింది. చంద్రబాబు నిర్వాకంతో 44 మంది వృద్దులు పెన్షన్ల కోసం వెళ్లి మృతిచెందారు. ఎన్నికలకు ముందు పింఛన్లను వెయ్యి పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు. ఒక చెత్తో ఇస్తున్నట్టు నటిస్తూ రెండో చేత్తో పెన్షన్లు తొలగిస్తున్నారు. 66 లక్షలకు పైగా పెన్షన్లు జగన్ హయాంలో అందించారు. ఇప్పుడు 3 లక్షలమంది పెన్షన్లను చంద్రబాబు తొలగించారు’’ అని విష్ణు మండిపడ్డారు.
‘‘అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వృద్ధులు, వికలాంగుల ఆత్మగౌరవం దెబ్బ తీశారు. ఇంకా 2 లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇవ్వకపోగా అదనంగా మరో మూడు లక్షల పెన్షన్లు తొలగించటం అన్యాయం. పెన్షన్‌దారుల మీద కూడా ఇలా కుట్రలు చేయటం అవసరమా?. పార్టీలు మారితేనే పెన్షన్ ఇస్తామని టీడీపీ వారు అంటున్నారు. ఇలాంటి ధోరణి మంచిది కాదు’’ అని మల్లాది విష్ణు హితవు పలికారు
‘‘వైఎస్ జగన్ హయాంలో అర్హులందరికీ పెన్షన్ అందించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో పార్టీ మారితేనే పెన్షన్లు ఇస్తామనటం సరికాదు. అలా కాదంటే పక్క జిల్లాలకు పెన్షన్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయటం సబబు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలమంది పెన్షన్లు తొలగించటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment