
సాక్షి, విజయవాడ: దేవి నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ కామన్ సైట్‌లో స్థానికులు నిర్మించుకుంటున్న గణపతి ఆలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నిర్మాణం పూర్తవుతున్న సమయంలో బుల్డోజర్లతో కూల్చేశారు. వీఎంసీ కూల్చి వేసిన గణపతి ఆలయాన్ని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు.

ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, వీఎంసీ అధికారులపై మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడతామంటూ కూటమి నేతలు వేషాలేస్తున్నారని.. కూటమి పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో వైకుంఠద్వార దర్శనం క్యూలైన్లలో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు పోయాయి’’ అని మల్లాది ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆలయాల కూల్చివేతలే. గతంలో విజయవాడలో ఆలయాలను కూల్చివేశారు. ఇటీవల కాశీనాయన ఆశ్రమాన్ని, జ్యోతిక్షేత్రంలోని అన్నదాన సత్రాలను కూల్చివేశారు. హిందూధర్మం అని వేషాలేసుకునే పవన్ కల్యాణ్‌కు తన పోర్టుపోలియోలో ఏం జరుగుతుందో తెలియదా?. నిన్న కాక మొన్న వివినరసరాజు వీధిలో గోశాలను కూల్చేశారు. ఈ రోజుకీ గోవులు ఎండలో మాడిపోతున్నాయి.
ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ స్థానికులు ఏడాది క్రితం ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రారంభ దశలో అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడెలా కూల్చుతారు. ఆలయ గర్భగుడిని బుల్డోజర్లతో కూల్చివేశారు. ఎవరి ఆదేశాల మేరకు వీఎంసీ అధికారులు గణపతి ఆలయాన్ని కూల్చివేశారు. కూల్చివేతలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment