ఇది ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం | Sajjala Ramakrishna Reddy Calls Protest On Electricity Charges Hike | Sakshi
Sakshi News home page

ఇది ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం

Published Fri, Dec 20 2024 12:15 AM | Last Updated on Fri, Dec 20 2024 12:15 AM

Sajjala Ramakrishna Reddy Calls Protest On Electricity Charges Hike
  • వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలతో పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్‌
  • ఈ నెల 27న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
  • ఇది అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడాల్సిన సందర్భం
  • వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ అంతా క్రియాశీలకంగా పాల్గొనాలి
  • ఈ నెల 21న వైఎస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి
  • సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లకు అండగా నిలబడాలి, అవసరమైన లీగల్‌ ఎయిడ్‌ వెంటనే అందివ్వాలి

తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం...ఈ విషయంలో తక్షణమే పెంచిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజల తరుపున వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..

ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం
రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత వైఎస్‌ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోవైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా ఏఈ లేదా డీఈ కార్యాలయంకు వెళ్ళి, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలని సూచించారు.

‘ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడయింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ రెండో కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.

ఇందుకు సంబంధించి వైఎస్సార్‌ సిపి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. ఈ కార్యక్రమాన్ని ముందు జిల్లా స్ధాయిలో నిర్వహించాలని భావించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నియోజకవర్గ స్ధాయిలో చేయాలని మన అధినేత జగన్‌ అందుబాటులో ఉన్న నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్ధాయిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు అందరూ తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. నియోజకవర్గ ఇంఛార్జ్‌లంతా కూడా తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ దోపిడినీ ఎండగట్టాలని సజ్జల పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి..
ఈ నెల 21 న మన అధినేత వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, జగన్‌గారిపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి, పార్టీ క్యాడర్‌ అంతా ఉత్సాహంగా పాల్గొని జగన్‌గారిపై ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలి, ఈ వేడుకలను అందరం విజయవంతం చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు.

సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా ఉందాం
సోషల్‌ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్‌ సెల్‌ సిద్దంగా ఉంది, ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్‌ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి. ఇటీవల సోషల్‌ మీడియా యాక్టివిస్టుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను  పోలీసులకు తెలియజేసి, దానిని అతిక్రమిస్తే వచ్చే ఇబ్బందులను పోలీసులకు తెలియజేయాలి. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లకు అవసరమైన సహాయం చేసేందుకు పార్టీ నాయకులు కూడా వెంటనే అందుబాటులో ఉండాలి’ అని సజ్జల హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement