ఆరు నెలల పాటు రకరకాల డైవర్షన్లతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇంకో నాలుగున్నరేళ్లు కాలం గడిపేందుకు కొత్త ఆయుధం చేతికి చిక్కింది! సూపర్‌సిక్స్ వాగ్ధానాల గురించి కాకుండా... తన ‘స్వర్ణాంధ్ర 2047’వైపునకు ప్రజల దృష్టి మరల్చేందుకు ప్లాన్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది! దీన్ని తయారు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపునకే అమలు పర్యవేక్షణ బాధ్యతలూ అప్పగిస్తారట. ఇదే బోస్టన్ గ్రూప్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అధికార వికేంద్రీకరణపై ఒక దార్శనిక పత్రం తయారు చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. అందులో భాగంగా ఏపీకి మూడు రాజధానులతో మేలని ఈ కంపెనీ తేలిస్తే అప్పట్లో తెలుగుదేశం, ఇతర రాజకీయ పక్షాలు తీవ్రంగా విమర్శించాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అంకెలంటే మహా మోజు. ఏ విషయంలోనైనా పెద్ద పెద్ద అంకెలు చెప్పి చెప్పడం ఆయనకు రివాజు. తాజా డాక్యుమెంట్‌లోనూ ఈ అంకెల గారడీ కనిపిస్తుంది. ‘ఈనాడు’ వంటి అనుకూల మీడియానైతే.. స్వర్ణాంధ్ర-2047తో ఆంధ్రప్రదేశ్ సమూలంగా మారిపోతోందన్న కలరింగ్ ఇచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లయిన సందర్భంగా ప్రధాని మోడీ వికసిత్ భారత్ పేరుతో నిర్దిష్ట లక్ష్యాలను నిర్ధేశించుకున్నట్లు చంద్రబాబు కూడా చేస్తే తప్పేమీ కాకపోవచ్చు కానీ.. కేవలం ప్రచారం యావతోనే, ప్రజల దృష్టిని ఏమార్చడమే ధ్యేయంగా పనిచేస్తే ఎన్ని విజన్లు రూపొందించినా ప్రయోజనం ఉండదు.
1995-2004 మధ్యకాలంలో చంద్రబాబు విజన్-202 డాక్యుమెంటే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అప్పట్లో ఆయన దక్షిణ కొరియాలో అమలు అవుతున్న ఒక డాక్యుమెంట్ తీసుకు వచ్చి, ఏపీలో కూడా అలాంటి పద్ధతులు అమలు చేస్తామని అనేవారు. ఆ తర్వాత విజన్ అన్నారు. జన్మభూమి పేరుతో ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి కొన్ని చిన్ని, చిన్న పనులు చేయించే వారు. ‘ఈనాడు’ మద్దతుతో ఆయన ఏమి చేసినా సాగిపోయింది. విజన్-2020లోనూ వివిధ శాఖలకు సంబంధించిన లక్ష్యాలు రాసుకున్నారు. కానీ అవి వాస్తవానికి, దూరంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. ఉన్న అంచనాలు కొని రెట్లు ఎక్కువ చేసి లక్ష్యాలను నిర్దేశించేలా చంద్రబాబే ఆదేశించేవారని అధికారులు చెప్పేవారు.
ఇలా వాస్తవికతకు దూరంగా ఉండటంతో ఆ విజన్ డాక్యుమెంట్ ఉత్తుత్తి కార్యక్రమంగా మిగిలిపోయింది. విజన్ 2020 డాక్యుమెంట్ విడుదల చేసిన నాలుగేళ్లకు ఉమ్మడి టీడీపీ ఓటమితో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ రెండు దఫాలు అధికారంలో కొనసాగింది. 2014 నాటికి ఉమ్మడి ఏపీ కాస్తా రెండు రాష్ట్రాలుగా చీలిపోయింది. తదుపరి ఆయన విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పదేళ్లు బాబు చెప్పిన విజన్ 2020ని ఎవరూ ప్రస్తావించే వారు కారు. చంద్రబాబును ఎద్దేవ చేయాలనుకుంటే మాత్రమే దీని గురించి మాట్లాడేవారు. 2014 టరమ్‌లో 2029 నాటికి ఏపీ దేశంలోనే నంబర్ ఒన్ అవుతుందని పబ్లిసిటీ చేసేవారు. అందుకోసం ఏవేవో చేస్తున్నట్లు అనేవారు. అవేవి జరగలేదు. 2019లో టీడీపీ ఓటమి పాలైంది. ఇప్పుడు 2047 నాటికి స్వర్ణాంధ్ర అంటున్నారు.
ఏ ప్రభుత్వమైనా తమ ఎజెండాల ప్రకారం పాలన చేస్తాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకుడు గుంతలు, చెరువుల బాగు చేత తదితర చిన్న ,చిన్న కార్యక్రమాలకు పరిమితమైతే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భారీ నీటిపారుదల స్కీములకు ప్రాధాన్యమిచ్చింది. ఫలితమే పులిచింతల, మల్యాల లిఫ్ట్, గుండికోట ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టులు. వై.ఎస్. చాలా దూరదృష్టితో పోలవరం ప్రాజెక్టు కింద కాల్వలు తవ్వించారు. విజన్ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో కాల్వల తవ్వకాన్ని వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కుడి కాల్వ, పట్టిసీమ లిఫ్‌్టల ద్వారా కృష్ణానదిలోకి నీటిని తీసుకువెళ్లి, నదుల అనుసంధానించినట్లు చెప్పుకున్నారు. తెలుగుదేశంకు చిత్తశుద్ది, ఆ డాక్యుమెంట్ లోని అంశాలపై నమ్మకం లేదూ అనేందుకు వీటిపై ఏరోజూ కనీస సమీక్షలు జరపకపోవడమే నిదర్శనం. ప్రచారం కోసం మాత్రం తన విజన్-2020 వల్లే హైదరాబాద్ అభివృద్ది అయినట్లు చెప్పుకుంటూంటారు.
స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్లోని దశ సూత్రాలను చదివితే వాటిల్లో కొత్తేమిటి? అన్న సందేహం రాకమానదు. ‘అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం’ కాదనేది ఎవరు? కానీ ఇవన్నీ ఎలా వస్తాయి? పేదరిక నిర్మూలన వీటిల్లో ఒకటిగా చెప్పుకున్నారు. బాగానే ఉంది. కానీ ఇందుకు సంపన్నులు ముందుకు రావాలని పిలుపివ్వడం ఏమిటి? ఎంతమంది సంపన్నులు ఎందరు పేదలను ఉద్ధరిస్తారు? ఇంకో సంగతి. పూర్తిస్థాయి అక్షరాస్యతకు కూడా 2047నే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఇంకో పాతికేళ్లు ఏపీలో నిరక్షరాస్యులు ఉంటారని చెప్పడమే కదా!
ఇప్పుడు విజన్ 2047 అంటున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారం చేసిన సూపర్ సిక్స్ మాటేమిటి? వాటివల్ల వెల్త్, హెల్త్, హాపీనెస్ సమకూరవని తీర్మానించేసుకున్నారా? వాటిపై శాసనసభలో ఎలాంటి వివరణ ఇవ్వకుండా కొత్తగా ఈ నినాదాలు ఇవ్వడాన్ని జనం నమ్ముతారా? సూపర్ సిక్స్ లో ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని ఇచ్చిన హామీ దశ సూత్రాలలో ఎందుకు భాగం కాలేదు? రెండో పాయింట్ ఉద్యోగ, ఉపాధి కల్పన. సూపర్ సిక్స్‌లో కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అంతవరకు నిరుద్యోగ భృతిగా నెలకు రూ.మూడు వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. కాని బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. పైగా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారు.
నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ది మూడో అంశంగా ఉన్న దశ సూత్రాల్లో స్కిల్ స్కామ్ వంటివి జరక్కుండా జాగ్రత్త పడితే బాబుకే మేలు. నీటి భద్రత, రైతులకు వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ , ఇంధన వనరులు, నాణ్యమైన ఉత్పత్తులతో అంతర్జాతీయ బ్రాండింగ్, స్వచ్ఛ ఆంధ్ర మొదలైన వాటిని ప్రస్తావించారు. వీటి ద్వారానే ఏపీ అభివృద్ది చెందితే, తలసరి ఆదాయం 3200 పౌండ్ల నుంచి 42 వేల పౌండ్లకు పెరిగితే అంతకంటే కావల్సింది ఏమి ఉంటుంది? కాని వచ్చే ఇరవై ఏళ్లలో ప్రజల ఆదాయం 14 రెట్లు, అది కూడా పౌండ్లలో పెరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అంబానీ, అదాని తదితర భారీ పెట్టుబడిదారుల ఆదాయం పెరగవచ్చు. వారికి ఏపీకి సంబంధం ఉండదు. పేదవాడి ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగుపడుతుదన్నది కీలకం.
ఇదీ చదవండి: నాటి మంచికి కీడు చేయకుంటే అదే పదివేలు!
ఒకవైపు జగన్ టైమ్ లో నిర్మాణం ఆరంభించిన పోర్టులను ప్రైవేటు పరం చేయాలని ఆలోచిస్తూ, ఇంకో వైపు కొత్తగా మెగా పోర్టులు ప్లాన్ చేస్తామని చంద్రబాబు అంటున్నారు. ఇలాంటి అతిశయోక్తులు చాలానే ఉన్నాయి. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని, ఇది రాసి పెట్టుకోండని చంద్రబాబు చెబుతున్నారు.అప్పటికి ఈయనకు 99 ఏళ్లు వస్తాయి. గత ముఖ్యమంత్రి జగన్ పేదలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపడితే అదంతా విధ్వంసం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఆ తర్వాత జగన్ స్కీములకు మూడు రెట్లు అదనంగా సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు.తీరా అధికారంలోకి వచ్చాక వాటికి మంగళం పాడే విధంగా ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా దాట వేస్తున్నారు.వాటికి బదులు స్వర్ణాంధ్ర 2047 అంటూ కొత్త రాగం తీస్తున్నారు.
అంతేకాదు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలని చెబుతున్నారు. అవి ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియదు. ఈ నేపథ్యంలోనే ఈ స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్ ఒక డొల్ల అని జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి డాక్యుమెంట్ల పేరుతో అబద్దాలాడితే తమ దేశంలో జైలుకో, ఆస్పత్రికో పంపుతారని ఏపీకి గతంలో వచ్చిన స్విస్ మంత్రి పాస్కల్ వ్యాఖ్యలను జగన్ గుర్తు చేశారు. ఒకవైపు అప్పులు అని ప్రచారం చేస్తూ, ఇంకో వైపు కొత్త, కొత్త వాగ్దానాలు, భారీ అంచనాలతో ప్రణాళికలు, విజన్ లు తయారు చేస్తే వినడానికి బాగానే ఉంటుంది కాని, సామాన్యుడికి ఏమి ఒరుగుతుంది?
ఏది ఏమైనా స్వర్ణాంధ్ర 2047 పేరుతో వస్తున్న కొత్త సినిమాతో ఇక జనం తమకు సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని సుమారు 200 వాగ్దానాలు అమలు చేయనవసరం లేదని చంద్రబాబు చెబుతారా! ఎందుకంటే ప్రజల అభిప్రాయాలను తీసుకుని దీనిని రూపొందిచామని అంటున్నారు కనుక. వారెవరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాగ్దానాల గురించి ప్రశ్నించలేదా? మొత్తం మీద సూపర్ సిక్స్ పోయే ఢాం... ఢాం.. ఢాం! కొత్త విజన్ 2047 వచ్చే ఢాం... ఢాం.. ఢాం! అన్నమాట!!
- కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment