శ్రేయస్‌ అయ్యర్‌ ఊచకోత.. వన్డేలో విధ్వంసకర శతకం | VHT 2024 Mum Vs KA Shreyas Iyer Slam Stormy Ton Dube 36 Ball 63 Mumbai 382 | Sakshi
Sakshi News home page

శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్‌

Published Sat, Dec 21 2024 1:17 PM | Last Updated on Sat, Dec 21 2024 2:59 PM

VHT 2024 Mum Vs KA Shreyas Iyer Slam Stormy Ton Dube 36 Ball 63 Mumbai 382

శ్రేయస్‌ అయ్యర్‌(ఫైల్‌ ఫొటో)

దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ) తొలి మ్యాచ్‌లోనే ముంబై కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దంచికొట్టాడు. కర్ణాటక బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకం బాదాడు. అయ్యర్‌ ధనాధన్ ఇన్నింగ్స్‌ కారణంగా ముంబై భారీ స్కోరు సాధించింది.

కాగా వీహెచ్‌టీ 2024-25 ఎడిషన్‌ రౌండ్‌ వన్‌లో భాగంగా గ్రూప్‌-‘సి’లో ఉన్న ముంబై కర్ణాటకతో తమ తొలి మ్యాచ్‌ ఆడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం బి గ్రౌండ్‌ ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

ఆయుశ్‌, హార్దిక్‌ హాఫ్‌ సెంచరీలు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆరంభంలోనే ఓపెనర్‌ అంగ్‌క్రిష్‌ రఘువంశీ(6) వికెట్‌ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే(78)తో కలిసి వన్‌డౌన్‌ బ్యాటర్‌ హార్దిక్‌ తామోర్‌(84) ముంబై ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. 

అయ్యర్‌ విశ్వరూపం
ఇక నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  కేవలం 55 బంతుల్లోనే 114 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 207కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు.

ఇక శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపగా.. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే కూడా ధనాధన్‌ దంచికొట్టాడు. 36 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో దూబే 63 పరుగులు చేసి.. అయ్యర్‌తో కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.

టీ20 తరహాలో వీరబాదుడు
కాగా వన్డేలో టీ20 తరహాలో వీరబాదుడు బాదిన ఈ ఇద్దరి కారణంగా ముంబై నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి ముంబై 382 పరుగులు సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం విఫలమయ్యాడు.

మొత్తంగా పదహారు బంతులు ఎదుర్కొన్న ‘స్కై’ 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్‌ దూబే రెండు, విద్యాధర్‌ పాటిల్‌, శ్రేయస్‌ గోపాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ముంబై వర్సెస్‌ కర్ణాటక తుదిజట్లు
కర్ణాటక
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), అనీష్ కేవీ, నికిన్ జోస్, స్మరన్ రవిచంద్రన్, అభినవ్ మనోహర్, కృష్ణన్ శ్రీజిత్(వికెట్ కీపర్), శ్రేయస్ గోపాల్, విజయ్‌కుమార్‌ వైశాఖ్, ప్రవీణ్ దూబే, వాసుకి కౌశిక్, విద్యాధర్ పాటిల్.

ముంబై
అంగ్‌క్రిష్‌ రఘువంశీ, ఆయుష్ మాత్రే, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ తామోర్(వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్, శార్దూల్ ఠాకూర్, ఎం.జునేద్ ఖాన్, తనూష్ కొటియన్.

చదవండి: SA vs PAK: చ‌రిత్ర సృష్టించిన పాకిస్తాన్‌.. ప్రపంచం‍లోనే తొలి జట్టుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement