ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైంది? కొద్ది నెలల క్రితం వరకు ఒక పద్ధతి ప్రకారం అన్నీ వ్యవస్థలు నడిచాయి. పలు కొత్త వ్యవస్థలు ప్రజల అవసరాలు తీర్చడానికి ఏర్పాటయ్యాయి. అవి ఎంత బలమైనవిగా రూపుదిద్దుకున్నాయంటే, విపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వంటివారు వాటిని ఏదో రకంగా తామూ కొనసాగిస్తామని చెప్పక తప్పలేదు. అది వలంటీర్ల వ్యవస్థ కావచ్చు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కావచ్చు. ఇళ్ల వద్దకే పౌర సేవలు అందించడం కావచ్చు.. ఇలా ఒకటేమిటి? దేశంలోనే పరిపాలనలో ఒక కొత్త విప్లవాన్ని నాటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఇదే టైమ్‌లో వైఎస్సార్‌సీపీ తెచ్చిన కొన్ని సంస్కరణల విషయంలో పచ్చి అబద్ధాలను కూడా విపక్షం, దానికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా విపరీతంగా ప్రచారం చేశాయి. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. చివరికి వైఎస్సార్‌సీపీ అభిమానులకే అనుమానం కలిగే స్థాయిలో టీడీపీ, జనసేన నేతలు ప్రచారం చేశారు. ముఖ్యంగా భూముల రీసర్వే, లాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై వీరు చేసినంత దుష్ప్రచారం ఇంతా, అంతాకాదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే భూములన్నిటిని లాక్కుంటాడని, దానిపై కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేదంటూ రైతులను భయపెట్టారు. నిజం తెలుసుకునేలోపు అబద్ధం లోకం అంతా తిరిగివచ్చిందన్న సామెతను అక్షర సత్యం చేసి చూపించారు.
తాము అధికారంలోకి వస్తే రీసర్వే రద్దు చేస్తామని, లాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అమలు చేయబోమని నమ్మబలికారు. దాని గురించి అప్పట్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగా ప్రజలకు వివరించి చెప్పబోయినా, పెద్దగా ఫలితం రాలేదు. ఆయన దీనిపై ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నిజాయితీగా లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడేవారు. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కార్యక్రమం అని, దానివల్ల భూ వివాదాలకు శాశ్వతంగా తెరపడుతుందని, భూములపై ఆసాములకు పూర్తి హక్కులు దఖలు పడతాయని ఆయన చెప్పే ప్రయత్నం చేసేవారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు చంద్రబాబు పెద్ద గొంతుతో అసత్యాలను ప్రచారం చేయడంతో వైఎస్సార్‌సీపీపై వ్యతిరేకత పెరిగింది. వైఎస్సార్‌సీపీ ఓటమికి అది కూడా ఒక ప్రధాన కారణం అయింది.
ఎలాగైతేనేం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం దక్కింది. అవకాశం వచ్చిన వెంటనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన ఆయా వ్యవస్థలను కూటమి ప్రభుత్వం ధ్వంసం చేయడం ఆరంభించింది. జగన్‌కు మంచి పేరు తెచ్చిన వాటిని ఏదో రకంగా బదనాం చేయడానికి తన మీడియా బలంతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హామీ ప్రకారం రీసర్వే నిలుపుదల చేస్తున్నామని, లాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఇక్కడే మళ్లీ ట్విస్ట్ ఏర్పడింది. ఈలోగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూ సర్వే చేయించి, టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసే రాష్ట్రాలకు ఏభైఏళ్లపాటు వడ్డీ లేని రుణం అందచేస్తామని ప్రకటించింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం కామ్‌గా యుటర్న్ తీసుకుంది.
ఇప్పటికే అనేక విషయాలలో తన నిర్ణయాలను రివర్స్ చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో కూడా అదే బాటపట్టింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రీసర్వే కొనసాగుతుందని, ఐదు శాతం రైతులలో దీనిపై ఉన్న అసంతృప్తిని పరిష్కరించి ముందుకు వెళతామని ప్రకటించారు. అంటే దీని అర్థం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని యదాతథంగా కొనసాగిస్తామనే కదా? మరి ఎన్నికల ప్రచారంలో ఎందుకంత ఘోరంగా అబద్ధాలు ప్రచారం చేశారంటే ఏమి చెబుతాం. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్ తదితరులు పోటీపడి వదంతులు సృష్టించారు. దానిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గట్టిగా ఎదుర్కోలేకపోయిన ఫలితంగా ఓటమి చవిచూడవలసి వచ్చింది.
ప్రజాస్వామ్యంలో అబద్ధాల ద్వారా అధికారంలోకి రావచ్చని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోసారి రుజువు చేసింది. 1955 మధ్యంతర ఎన్నికలలో కూడా ఆంధ్రరాష్ట్రంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందన్నంతగా ఊపు వచ్చింది. అప్పటికి ఇంకా ఉమ్మడి ఏపీ ఏర్పడలేదు. ఆంధ్ర, రాయలసీమ కలిపి ఆంధ్రరాష్ట్రంగా ఉండేవి. కాంగ్రెస్ పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలు యునైటెడ్ కాంగ్రెస్‌గా ఏర్పడి ఎన్నికలలో పోటీచేశాయి.
అయినా కమ్యూనిస్టులను ఓడించడం కష్టం అని అనుకునేవారు. ఆ క్రమంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే మీడియాలోకానీ, ఆయా సభలలో కానీ కాంగ్రెస్ నేతలు ఒక వదంతిని ప్రచారం చేశారట. అదేమిటంటే కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే భూస్వాముల భార్యల మెడలపై కాడి వేసి దున్నిస్తామని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మాకినేని బసవపున్నయ్య అన్నారన్నది ఆ వదంతి. అప్పట్లో అలాంటివాటిని వెరిఫై చేసుకునే పరిస్థితే తక్కువ. దాంతో అది దావానలంగా వ్యాపించి అధికారంలోకి వస్తామనుకున్న కమ్యూనిస్టు పార్టీ కేవలం పదిహేను సీట్లకే పరిమితం అయిపోయింది. సరిగ్గా అదే మోస్తరుగా ఇప్పుడు భూముల టైటిలింగ్‌కు సంబంధించి టీడీపీ, జనసేన, వారి అనుబంధ మీడియా విపరీతమైన అసత్య ప్రచారం చేశాయి.
సోషల్ మీడియా ఇంత విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చినా, దానిని వైఎస్సార్‌సీపీ ఎంతగా ఖండించినా, రైతులు నమ్మలేకపోయారు. సోషల్ మీడియాను ఎంతగా దుర్వినియోగం చేయవచ్చో ఈ ఉదంతం తెలియచెబుతుంది. భూముల రీసర్వేలో కొన్ని తేడాలు ఉండవచ్చని, అవన్నీ బయటపడితే తమకు నష్టం అని కొందరు భయపడ్డారు. దానిని టీడీపీ ఎన్ క్యాష్ చేసుకుని జనాన్ని ఒక అబద్ధంతో నమ్మించి అధికారంలోకి రాగలిగింది. కానీ అబద్ధం ఏదో ఒకనాడు బయటకు రాకతప్పదు కదా! ఇప్పుడు అదే రీసర్వేని కొనసాగిస్తున్నట్లు మంత్రి చెప్పారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే అనేక విషయాలలో చంద్రబాబు ప్రభుత్వం రివర్స్ నిర్ణయాలు తీసుకుంది. ఉదాహరణకు వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే రైతులకు అవి ఉరితాళ్లు అవుతాయని చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా అధికారం వచ్చాక, ఆ మీటర్లను యధాప్రకారం కొనసాగిస్తామని చెప్పి రైతులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. తల్లికి వందనం గురించి ఇప్పటికే చేతులెత్తేశారు. మూడు గ్యాస్ బండల స్కీమ్ అమలుపై మంత్రి నాదెండ్ల మనోహర్ నాలుక మడతేశారు. వలంటీర్లకు జీతాలు పెంచడం సంగతి అటుంచి వారి ఉన్న ఉద్యోగాలకే దిక్కులేని పరిస్థితిని సృష్టించారు. దేశ చరిత్రలో రెండు నెలల వ్యవధిలో ఇంతగా అప్రతిష్టపాలైన ప్రభుత్వం మరొకటి ఉండకపోవచ్చు.
అయినా ఆ బురద అంతటిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై చిమ్మి తప్పించుకోవాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు చూస్తున్నారు. ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి. చంద్రబాబు ట్రాక్ రికార్డు ఇందుకు భిన్నంగా ఎప్పుడూ లేదు. తనకు మద్దతు ఇచ్చే మీడియా అండతో తాను ఏమి చేసినా సాగిపోతుందన్నది ఆయన నమ్మకం. 1996 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా చంద్రబాబు ఏమి చెప్పింది.. ఎన్నికలయ్యాక ఏమి చేసింది.. అప్పటి కాంగ్రెస్ ప్రముఖ నేత రోశయ్య చాలా అర్థవంతమైన రీతిలో వివరించిన వీడియో వైరల్ అవుతోంది. మూడుదశాబ్దాలుగా చంద్రబాబు ఇదే టెక్నిక్ అమలు చేసినా, ప్రజలు కొన్నిసార్లు ఓడించారు. మరికొన్నిసార్లు ఆయన చేసిన మోసపూరిత వాగ్దానాలను నమ్మి గెలిపించారు.
2024లో కూడా అదే జరిగింది. చిత్తశుద్ధితో తాను చెప్పింది చేయాలని అనుకోవడం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తప్పా? అంటే ఏమి బదులు ఇస్తాం. ప్రజలను మోసం చేయబోనన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను జనం ఓడించారు. చంద్రబాబు ఇలా మోసపూరిత హామీలతో జనాన్ని నమ్మించి, తదుపరి ఐదేళ్లపాటు వారి చెవిలో పూలు పెట్టడం అలవాటైన వ్యవహారమే అని తెలిసినా జనం టీడీపీ కూటమిని గెలిపించారు. ఇందుకు తప్పుపట్టవలసింది చంద్రబాబునా? లేక జనాన్నా?ఎవరి ఆలోచన ప్రకారం వారు నిర్ణయానికి రావొచ్చు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment