హామీలకు కోతలు.. పచ్చమీడియా పైపూతలు! | KSR Comment: How Yellow Media Hails Chandrababu On Cutting budget | Sakshi
Sakshi News home page

హామీలకు కోతలు.. పచ్చమీడియా పైపూతలు!

Published Wed, Nov 13 2024 12:07 PM | Last Updated on Wed, Nov 13 2024 12:56 PM

KSR Comment: How Yellow Media Hails Chandrababu On Cutting budget

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కొత్తగా మంత్రి అయిన పయ్యావుల కేశర్‌ చాలా సంతోషంగా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఉండవచ్చు. టీడీపీ ప్రభుత్వ భజంత్రీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతులు కూడా బడ్జెట్‌ను ఆహా..ఓహో అని యథా ప్రకారం ఆకాశానికి ఎత్తేశాయి. స్వామిభక్తిని చాటుకున్నాయని అనుకుందాం. మరి... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడికీ కొద్దోగొప్పో ఉపయోగపడాల్సిన ఈ ఆర్థిక ప్రణాళిక వారిని మెప్పించిందా?. 

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తాము చేసిన వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్ పెట్టి ఉంటే లెక్కలు అదే రీతిలో చూపించేవారు. అలాకాకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. సూపర్ సిక్స్ గాని, టీడీపీ, జనసేనల సంయుక్త మానిఫెస్టోలోని ఇతర అంశాలను కాని ప్రస్తావిస్తూ ఒక్కోదానికి ఇంత వ్యయం అవుతుంది. ఇంత ఖర్చు చేయబోతున్నాం అని చెప్పగలిగేవారు. కానీ సాధారణ రాజకీయ స్పీచ్ మాదిరి, కల్లబొల్లి మాటలతో, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలతో బడ్జెట్‌ ప్రసంగాన్ని మమ అనిపించారు. 

చంద్రబాబు తరచూ మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఒక మాట అనేవారు.. సంపద సృష్టించి ప్రజలకు పంచుతానూ అని. అదెలాగో అర్థం కాక అంతా తలబాదుకుంటూ ఉంటే.. అది మద్యం అమ్మకాల ద్వారా అన్న విషయం బడ్జెట్‌ చూశాక అర్థమైంది. ఒక్క మద్యం ద్వారానే రూ.10,000 కోట్లు ఆశిస్తోంది ప్రభుత్వం మరి!

బడ్జెట్  ద్వారా కూటమి ప్రభుత్వం సాధించిన తొలి విజయం ఇదే అనుకోవాలి. గత ఏడాది మద్యం ద్వారా సుమారు రూ.16 వేల కోట్లు వస్తే, ఈసారి అది దాదాపు రూ.26 వేల కోట్లు కావచ్చని అంచనా. ఇది సంపద సృష్టి అవుతుందా? లేక ప్రజలను ప్రత్యేకించి పేద వర్గాల బలహీనత మీద సంపాదించడం అవుతుందా? అన్నది ఆలోచించుకోవాలి. ఏపీలో మాఫియాగా మారిన ఈనాడు మీడియా గతంలో జగన్ ప్రభుత్వం నిర్దిష్ట హామీల ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టి అమలు చేసినా, ఏదో విధ్వంసం జరిగిపోయినట్లు, అప్పుల కుప్ప చేయబోతున్నట్లు నానా అరాచకంగా కథనాలు ఇచ్చేది. ఇప్పుడు టీడీపీ బడ్జెట్ గొప్పదనం ఏమిటో చెప్పలేక సతమతమైనట్లు వారిచ్చిన కథనాల తీరును బట్టి అర్థమవుతోంది. 

ప్రతి బడ్జెట్లో మూలధన వ్యయం ఖాతాను ఈనాడు మీడియా ఆస్తుల సృష్టిగా పేర్కొనడాన్ని బట్టే వారు పాఠకులను ఎంత మోసం చేయదలిచిందీ అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం రూ.30 వేల కోట్లకు పైగా మూలధన వ్యయం చేయాలని ప్రతిపాదిస్తే, అప్పుడు దానిని ఆస్తుల సృష్టిగా ప్రస్తావించలేదు.ఈ సారి మరో రెండువేల కోట్లు అదనంగా చేర్చి రూ.32 వేల కోట్లుగా తెలిపారు. ఇదే ఆస్తుల సృష్టి అనండి,సంపద సృష్టి అనండి.. ఆ రకంగా  ప్రజలను  నమ్మించే యత్నం చేశారు. అలాగే సూపర్ సిక్స్ హామీలు అమలు జరిగిపోతున్నట్లుగా రంగుపూసే ప్రయత్నం బడ్జెట్లో జరిగితే, అదే మహద్బాగ్యం అన్నట్లు ఎల్లో మీడియా మభ్య పెట్టే  యత్నం చేసింది. వాటిలో కొన్నిటి ఊసేలేదు. మరికొన్నిటికి చాలీచాలని నిధులు కేటాయించి మమ అనిపించారు. 

బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ సూపర్ సిక్స్  హామీలలో మొదటిది యువతకు ఇరవై  లక్షల ఉద్యోగాలు లేదా నెలకు మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి. కాని దాని గురించి బడ్జెట్ లో మెన్షన్ చేయలేదు. నిరుద్యోగికి ఒక్క రూపాయి కూడా ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపించలేదు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా కూడా కప్పిపుచ్చే యత్నం చేసింది. నిరుద్యోగ భృతి ఎగవేతనే మాత్రం కాదు. గత ప్రభుత్వ హయాంలో వలంటీర్ల రూపంలో సుమారు రెండున్నర లక్షల మందికి నెలకు రూ.ఐదు వేల చొప్పున  ఇస్తే, తాము అధికారంలోకి వస్తే రూ.పది వేలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,లోకేష్ లు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ సంగతే  లేదు..అసలు వలంటీర్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించే నిజాయితీ వారిది. 

రెండోది ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ.15 వేలు ఇవ్వగలమని వాగ్దానం చేశారు. దీనికి తల్లి వందనం అని పేరు  పెట్టారు. ఈ స్కీము అమలు కావాలంటే రూ.12,600 కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేవలం రూ.5387 కోట్లు పెట్టి సరిపెట్టుకోమన్నారు. ఎనభై లక్షల మందికి పైగా పిల్లలు ఉంటే  ఈ కాస్త  మొత్తంతో ఎందకి ఇస్తారో వివరించలేదు. మూడోది ప్రతి రైతుకు ఏటా రూ.ఇరవై వేలు చెల్లిస్తామన్న హామీకి సుమారు రూ.పదివేల కోట్లకు పైగా కావాలి. కాని  కేవలం వెయ్యి కోట్లు రూపాయలు ఇచ్చి రైతులను పండగ చేసుకోమన్నారు. ఇది ఎలా సరిపోతుందో బడ్జెట్ లో వివరించలేదు. ఎల్లో మీడియా చెప్పలేదు. నాలుగో అంశం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు. దీనికి  కేవలం 800 కోట్ల పైచిలుకు మాత్రమే ఇచ్చారు. ఇది ఒక సిలిండర్  ఇవ్వడానికి సరిపోవచ్చు. కోటిన్నర కుటుంబాలు ఉంటే ఇప్పటికి ఐదు లక్షలు మించి ఇవ్వలేదట. 

ఐదో సూపర్ సిక్స్ హామీ ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇవ్వాలి. అధికారంలోకి రావడమే ఆలస్యం అన్నట్లుగా అప్పట్లో కూటమి నేతలు ప్రచారం చేశారు. తీరా చూస్తే అంతా హుళ్లక్కే అని తేలింది. నిజంగా చిత్తశుద్దితో దీనిని అమలు చేస్తే సుమారు 30వేల కోట్లుపైగా అవసరమవుతాయి. మరి దాని సంగతి ఎందుకు చెప్పలేదో తెలియదు. ఆరవ సూపర్ సిక్స్ ఏమిటంటే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. వాస్తవంగా అమలు చేయాలని అనుకుంటే ఆర్టీసీకి పరిహారంగా వచ్చే మార్చి వరకు లెక్కిస్తే, సుమారు 1500  కోట్లు చెల్లించడానికి బడ్జెట్లో పేర్కొనాలి. ఆ విషయం హుష్ కాకి అయినట్లేనా అన్నది ఆర్థిక మంత్రి చెబితే బాగుంటుంది. వీటి పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన 175 వాగ్దానాల గురించి మాట్లాడుకోవడం అనవసరం. బీసీలకు చెందిన వారికి ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని అన్నారు. లెక్కలేసుకుంటే ఇలాంటివి చాలానే ఉన్నాయి. 

అమరావతికి బడ్జెట్లో రూ.3445 కోట్లు కేటాయించగా, రూ10 - 15 వేల కోట్లు రుణాలుగా వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో వరదల నియంత్రణకే రూ.ఎనిమిది  వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రపంచబ్యాంక్ చెబుతోందట. రాష్ట్ర  ప్రజలకు సంపద సృష్టించడమేమోకాని, మిగిలిన ప్రాంతాల ప్రజలు పన్నుల రూపంలో కట్టే  సంపద అంతటిని ఒక్క అమరావతిలో ఖర్చు చేయబోతున్నారని అనుకోవాలి. 

పోలవరం ప్రాజెక్టుకు  రూ.5445 కోట్లు కేటాయించడంం బాగానే ఉన్నా, కేంద్రం నుంచి రావల్సిన డబ్బును సకాలంలో తెచ్చుకోకపోతే, ఇదంతా ఏపీ ప్రజలపై భారం మోపినట్లు అవుతుంది. ఎల్లో మీడియా అత్యంత రహస్యంగా ఉంచేసిన మరో కీలక అంశం అప్పుల గురించి ఈ బడ్జెట్ లో సుమారు రూ.91 వేల కోట్ల రుణాలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇందులో సుమారు అరవై వేల కోట్లు అప్పు చేసేశారు. ఈ స్థాయిలో అప్పు చేయడం పునర్నిర్మాణానికి ఎలా పునాది అవుతుందో చంద్రబాబు, కేశవ్ లే చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో అప్పులు పధ్నాలుగు లక్షల కోట్లకు చేరిందన్నది పచ్చి అబద్దమని కూటమి ప్రభుత్వ బడ్జెట్ ఒప్పుకోక తప్పలేదు. అప్పట్లో రుణాలపై  ఎల్లో మీడియా ఎంత దారుణంగా అసత్యాలు ప్రచారం చేసింది, దానిని చంద్రబాబు ఎలా అందిపుచ్చుకుని ప్రజలను మోసం చేసింది మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి సమగ్రంగా వివరించారు. 

జగన్ టైమ్‌లో అప్పులు చేస్తే  శ్రీలంక అయిపోయినట్లు, ఇప్పుడు చంద్రబాబు ప్రబుత్వం అంతకన్నా అధిక మోతాదులో రుణాలు తెస్తే ఎక్కువ సంపద సృష్టి అన్నట్లు  బిల్డప్ ఇస్తున్నారు. ఈనాడు మీడియా పులకరింతలు గమనించండి. గత జగన్ ప్రభుత్వం చీకట్లు  నింపిందట. ఈ ప్రభుత్వం వేగుచుక్కగా వచ్చిందట. పోర్టులకు, వైద్య కళాశాలలకు, గ్రామాలలో భవనాల నిర్మాణం తదితర అభివృద్ది కార్యక్రమాలకు జగన్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే చీకట్లు, ఇప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ కు డబ్బులు ఇస్తే వేగుచుక్క అయిందని ఈనాడు  మీడియా సూత్రీకరణలాగా ఉంది. 

కేశవ్ తన తొలి బడ్జెట్ లోనే సూపర్ సిక్స్ బాదారని కూడా ఈనాడు సర్టిఫికెట్ ఇచ్చింది. అది నిజమే అయితే ఏ హామీకి ఎంత అవుతుంది? బడ్జెట్లో ఎంత కేటాయించింది ఈనాడు మీడియా అయినా వివరించి ఉండవచ్చు కదా? ప్రజలను మోసం చేయలేదని ధైర్యంగా తెలిపి ఉండవచ్చు. అవేమీ చేయకుండా కూటమి ప్రభుత్వం డకౌట్ అవుతుందన్న భయంతో సిక్స్ కొట్టేసినట్లు ప్రజలను భ్రమలలో పెట్టాలన్నదే ఎల్లో మీడియా తాపత్రయం. విద్యుత్ చార్జీలు,భూముల విలువ పెంపు ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు మొదలైనవి ఉండబోతున్నాయని బడ్జెట్‌ను  బట్టి అర్థమవుతుంది. ఏతావాతా   కూటమి అసలు మోసపూరిత స్వరూపం బడ్జెట్ లో చాలావరకు బహిర్గతం అయిందని చెప్పాలి.

:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement