శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం | KSR Comment On Chandrababu Psycho Politics with TTD Laddu | Sakshi
Sakshi News home page

శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం

Published Fri, Sep 20 2024 11:17 AM | Last Updated on Fri, Sep 20 2024 12:34 PM

KSR Comment On Chandrababu Psycho Politics with TTD Laddu

లడ్డూ ప్రసాదంపై బాబు మతిలేని ప్రేలాపనలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా మతి ఉండే మాట్లాడుతున్నారా?. ఈ అనుమానం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజల్లో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న. ఎందుకంటే.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఉత్తిపుణ్యానికి ఎలాంటి పుకార్లు సృష్టిస్తారో అస్సలు తెలియకుండా పోతోంది. 

తెలుగువాళ్లకు మాత్రమే కాదు.. దేశ ప్రజలందరికీ ఆరాధ్యదైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం గురించి చంద్రబాబు రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఈ కోవకే చెందుతాయి. నిజానికి ఈ వ్యాఖ్యలు ఆయన నీచత్వానికి పరాకాష్ట అని పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. 

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై ఏదో ఒక రకంగా నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న బాబు.. తన హోదాను కూడా మరచిపోతున్నారని, అట్టడుగు స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని ప్రజలు.. ముఖ్యంగా శ్రీవారి భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ కులదైవాన్ని కించపరుస్తున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ఎన్డీయే కూటమి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వాడారని అనడం సర్వత్రా సంచలనమైన చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఇంతటి తీవ్రమైన ఆరోపణ చేసే ముందు చంద్రబాబు వాస్తవాలను ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకుని ఉండాల్సింది. 

ఒకవేళ నిజంగానే అలా జరిగి ఉంటే బాధ్యులపై తీసుకున్న చర్యలను చెప్పి ఉండవచ్చు. తగిన ఆధారాలు చూపడం ద్వారా తన వ్యాఖ్యలకు బలం చేకూర్చి ఉండవచ్చు. బాబు గారు ఇవేవీ చేయలేదు సరికదా.. ఇష్టారీతిన మాట్లాడేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సమావేశంలోనే ఉన్న బీజేపీ, జనసేన నేతలు కూడా చంద్రబాబు వ్యాఖ్యలపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం!. నోరెత్తలేని దయనీయ స్థితిలో ఉన్నారన్నమాట కూటమి భాగస్వాములు!. దేశంలో హిందూ మతానికి తామే హక్కుదార్లు అన్నట్టు వ్యవహరించే బీజేపీ నేతలు కూడా చంద్రబాబు తన వ్యాఖ్యల ద్వారా హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. 

జన సేనాధిపతి పవన్‌ కళ్యాణ్‌ సరేసరి! ప్రతిపక్ష నేతగానూ టీటీడీపై నిత్యారోపణలు.. చంద్రబాబు టీటీడీపై ఆరోపణలు చేయడం ఇదేమీ కొత్త కాదు. గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు రకరకాల ఆరోపణలు చేసేవారు. అబద్ధాలని పదే పదే స్పష్టమైనా ఆరోపణల పర్వం మాత్రం ఆగేది కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రజల్లో లేనిపోని అనుమానాలను రేకెత్తించేందుకు టీటీడీని వాడుకునే వారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్నారంటూ వ్యాఖ్యానించేవారు. కానీ ఇప్పుడు అంటే బాబు గారు అధికారం చేపట్టిన తరువాత అక్కడ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదని విమర్శలు వస్తున్నాయి.

తిరుమల కాటేజీల్లో పారిశుద్ధ్య సమస్యలను ఎత్తిచూపుతూ ఓ భక్తుడు ఇటీవలే ఒక వీడియో పంపిన విషయం ప్రజలకు తెలిసే ఉంటుందది. జగన్ హయాంలో తిరుమల్లో చీమ చిటుక్కు మన్నా ఉన్నవి లేనివీ కల్పించి మరీ అసత్యాలను ‍ప్రచారం చేసిన తెలుగుదేశం ‘ఎల్లో’ మిత్రులు ఈనాడు, ఆంధ్రజ్యోతుల నోళ్లిప్పుడు మాత్రం మూగబోయాయి. అప్పట్లో దేవాలయాలపై దాడులు అంటూ టీడీపీ వర్గాలు కొన్ని కల్పిత గాధలను సృష్టిస్తే.. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఈ పత్రికలు వాటికి విపరీతమైన ప్రచారం కల్పించేవి. అయితే ఇలాంటి కొన్ని ఘటనల్లో టీడీపీ వాళ్లే దేవుడి బొమ్మలు ధ్వంసం చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవడం గమనార్హం. 

ఇప్పుడు కూడా టీడీపీ వర్గాలు చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోతూండటాన్ని కప్పిపుచ్చేందుకు లడ్డూ ప్రసాదంపై అబద్ధపు ప్రచారం మొదలుపెట్టారని అనిపిస్తోంది. తగ్గట్టుగానే అనుకూల మీడియా కూడా అస్తవ్యస్త పరిస్థితులు ఎన్ని ఉన్నా.. అంతా బాగా ఉందన్న కలరింగ్‌ ఇచ్చేందుకు ఆపసోపాలూ పడుతున్నాయి. విశేషం ఏమేమిటంటే లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారని వ్యాఖ్యానించిన రోజు చంద్రబాబు అనుకూల మీడియా కూడా అంతగా నమ్మినట్లు లేదు. ఆ వ్యాఖ్యలను హైలైట్‌ చేయకపోవడం ఇందుకు నిదర్శనం. చంద్రబాబు మాటల్ని ప్రస్తావించకుండా, ప్రచారం కాకుండా జాగ్రత్త పడినట్లున్నారు. అయితే నా వ్యాఖ్యలను ఎందుకు హైలైట్‌ చేయలేదని బాబు గారికి కోపం వచ్చిందో ఏమో.. ఓ దిక్కుమాలిన రిపోర్టు అంటూ ఎవరో అనామకుడు చేసిన వ్యాఖ్యలను తమ పత్రికలో బ్యానర్లుగా ప్రచురించి ‘బాబు’ భక్తిని నిరూపించుకున్నాయి ఆ ఎల్లో పత్రికలు!.  

టీటీడీ అధికారులు పరీక్షలు నిర్వహించి తగు ప్రమాణాలు లేని, వెజిటబుల్ ఫ్యాట్ అని సందేహం వచ్చిన నేతి టాంకర్లను వెనక్కి పంపిస్తే, మరి లడ్డూలలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు అనడం ఏమిటి? తిరుమలలో నిజంగా జంతువుల కొవ్వు వాడి ఉంటే లడ్డూలు పాడు వాసన కొడతాయి. వంటశాల ‘పోటు’లో పనిచేసే వైష్ణవ సంప్రదాయ బ్రాహ్మణులు ఇట్టే కనిపెట్టే వారు. తన వ్యాఖ్యలతో బాబు వారిని కూడా శంకించినట్లు అయ్యింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రెండు నెలల క్రితం అంటే జూలైలోనే వెజిటబుల్‌ ఫ్యాట్‌ కల్తీ జరిగినట్లు గుర్తించి సరఫరాదారులపై చర్య తీసుకున్నామని ఆలయ ఎగ్జిక్యుటివ్‌ అధికారి శ్యామలరావు ప్రకటించడం. అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే తప్పు జరిగిందన్నమాట!. నీచ రాజకీయాలకు పరాకాష్ట... లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు నీచ రాజకీయాలకు పరాకాష్ట అని టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డిలు స్పష్టం చేశారు. 

తన వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు హిందువుల విశ్వాసాలను, తిరుమల పవిత్రతను దారుణంగా దెబ్బతీశారని, అతిపెద్ద పాపానికి ఒడిగట్టారని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. మనిషి పుట్టుక పుట్టినవారు ఎవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరంటూ ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి కుటుంబంతోసహా తాను సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు కూడా తన కుటుంబంతో కలిసి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి సవాల్‌కు చంద్రబాబు స్పందించలేదు. కానీ, ఆయన కుమారుడు లోకేష్ రియాక్ట్‌ అయ్యారు. అయితే అది డబాయింపు మాదిరిగా ఉన్నట్లు  అనిపిస్తుంది..

చంద్రబాబు సెంటిమెంట్ అనే పదాన్ని తరచు వాడినా.. ఆయనకు ఏ సెంటిమెంట్ లేదని కొందరు విమర్శిస్తారు. ఈనాడు రామోజీరావు, రాధాకృష్ణలకు వ్యాపారం తప్ప సెంటిమెంట్ అనే పదం తెలియదని చెబుతారు. కాని రామోజీ కుమారుడు కిరణ్‌కు దైవభక్తి మెండు అని అంటారు. మరి ఆయన సైతం తన పత్రిక ద్వారా స్వామి వారి లడ్డూలపై విష ప్రచారం చేయడానికి పూనుకోవడానికి కారణం చంద్రబాబుకు బానిసత్వం చేయవలసిన పరిస్థితి ఏర్పడడమేనని కొంతమంది విశ్లేషిస్తున్నారు. 

టీటీడీలో అధికారులు, సిబ్బంది కొన్నిసార్లు అవకతవకలకు పాల్పడితే పాల్పడవచ్చేమోగానీ... కాంట్రాక్టర్లు లడ్డూ ప్రసాదానికి జంతువుల కొవ్వు సరఫరా చేసినా సహిస్తారని అనుకోలేము. పరకామణిలో ముడుపుగా వచ్చిన డబ్బుల లెక్కింపులో అవకతవకలకు పాల్పడుతూ పట్టుబడ్డ ఘటనలున్నాయి. సరఫరా చేసే కంపెనీలు కూడా ఇంతటి ఘోరానికి పాల్పడ్డాయి అనేందుకు ఆధారాలూ లేవు. 2015లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కల్తీ నెయ్యిపై ఆరోపణలు రావడంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు వైఎస్ జగన్ గానీ, వైసీపీ నేతలు గానీ ఇలాంటి ఛండాలపు ఆరోపణలు చేయలేదు. చంద్రబాబు మాత్రం ఉచ్ఛ నీచాలు మరిచి తన హయాంలో జరిగిన వాటిని కూడా జగన్‌కి, వైఎస్సార్సీపికి అంటగట్టి బురద చల్లడంకోసం ఇలా మాట్లాడారని అర్థమవుతుంది. కూటమి అధికారంలోకి వచ్చాక కొత్త ఈవో శ్యామలరావు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ప్రైవేట్‌ కంపెని టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యిలో వెజిటబుల్‌ ఫ్యాట్‌ను కలిపినట్టు గుర్తించామని వెల్లడించారు. అలాంటి నెయ్యి టాంకర్లను తిరస్కరిస్తూంటారు. చంద్రబాబుకు వెజిటబుల్ ఫ్యాట్‌ కు, యానిమల్ ఫ్యాట్ కు తేడా తెలియకుండా మాట్లాడారా? లేక కావాలనే వైఎస్సార్ సీపీపై రాయి వేయాలన్న ఉద్దేశంతో మాట్లాడారా అనేది తెలియదు. అలాగే మరొక వీడియో కూడా సోషల్ మీడియాలో వచ్చింది. 

గతంలో టీటీడీ అధికారిణి ఒకరు మీడియాతో మాట్లాడుతూ తమకు సరఫరా అయ్యే నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్‌ తీసి రెండుసార్లు పరీక్షించిన తర్వాతనే తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు సీఎం కాగానే గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఏమైనా అక్రమాలు జరిగివుంటే అవి దొరుకుతాయేమోననే ఆలోచనతో విచారణ చేయమని అధికారులకు ఆదేశాలిచ్చారు. అయినా ఏమీ దొరకక పోయేసరికి ఈ పిచ్చి ఆరోపణ చేశారేమోననే అనుమానం కలుగుతోంది. 2014- 2019 టర్మ్‌లో విజయవాడలో నకిలీ నెయ్యి తయారు చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. టీటీడీ ఉద్యోగి ఒకరితో సంబంధం పెట్టుకొని ఒక వ్యక్తి ఈ నేతిని సరఫరా చేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలాంటివాటన్నటినీ ముఖ్యమంత్రికో, ప్రభుత్వానికో అంటగట్టడం భావ్యంకాదు. కానీ ఎంతసేపూ ఎదుటివారిపై ఏదో ఒకటి రుద్దాలన్న ధోరణితో చంద్రబాబు వ్యవహరిస్తుంటారు. దీంతోపాటు ఆయనకు వేరే ప్రయోజనాలు ఏమైనా వున్నాయా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం వున్న నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లను రద్దు చేసి మళ్లీ కర్ణాటకకు చెందిన నందిని సంస్థకు నెయ్యి కాంట్రాక్టును అప్పగించాలని నిర్ణయించారట. తన కుటుంబ కంపెనీ హెరిటేజ్ తయారు చేసే నెయ్యిని ఈ సంస్థ ద్వారా సరఫరా చేయించే లక్ష్యంతో ఏమైనా చంద్రబాబు ఈ ఆరోపణ చేశారా అనే ప్రశ్నను వైఎస్సార్ సీపీ నేతలు వేస్తున్నారు. ఏది ఏమైనా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ,మతం పేరుతో వైఎస్ఆర్ సీపీపై అభాండాలు వేయడానికి లేదా తన వ్యాపార సంస్థ ప్రయోజనాలకోసం వృద్దాప్య వయసులో ఉన్న చంద్రబాబు ఇలాంటి కుట్ర వ్యూహాలను పన్నడం దారుణంగా కనిపిస్తోంది. ఒక వేళ ఆయన పొరపాటున యానిమల్‌ ఫ్యాట్ అనే పదం వాడి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించి క్షమాపణ చెప్పడం మంచిది.

 
:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement