ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన ఎన్నికల హామీలలో కీలకమైనవాటి జోలికి వెళ్లకుండా.. తేలికగా పూర్తి అయ్యే వాటిపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. అందులో భాగంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయ సంకల్పించారు. ఐదు రూపాయలకే భోజనం సమకూర్చడం దీని లక్ష్యం. ఆగస్టుపదిహేను నాటికి వంద చోట్ల ఈ క్యాంటిన్లు నెలకొల్పుతారు. ఆ తర్వాత మరో నెలలో ఇంకో 83 క్యాంటిన్లు ఏర్పాటవుతాయని టీడీపీ మీడియా కథనాన్ని ఇచ్చింది. అయితే..
2014 టర్మ్‌లో కూడా కొన్ని క్యాంటిన్లు ఏర్పాటు చేసినా, వాటి వల్ల పెద్ద ప్రయోజనం ఒనగూరలేదన్నది ఒక అభిప్రాయం. దీనికోసం పెట్టిన ఖర్చులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నిజంగానే ఈ క్యాంటిన్లు పేదలకు ఎంతవరకు ఉపయోగపడతాయన్నది చర్చనీయాంశం. తమిళనాడులో కూడా అమ్మ క్యాంటిన్ల పేరుతో ఇలాంటి సదుపాయం కల్పించారు. తెలంగాణలో హైదరాబాద్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు చోట్ల ఇలాంటి క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలవడంతో సహజంగానే వీటికి ప్రాధాన్యత తగ్గింది. ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 77 మున్సిపాల్టీలు, 17 కార్పొరేషన్ లు, 29 నగర పంచాయతీలు ఉన్నాయి. అన్నీకలిపి 123 అర్బన్ స్థానిక సంస్థలు ఉన్నాయన్నమాట. ఈ రకంగా చూస్తే పట్టణానికి ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు కావచ్చు. లేదంటే.. కొన్ని నగరాలలో అదనంగా మరో ఒకటో, రెండో నెలకొల్పుతారు. దీంతోనే పేదలందరికి ఆకలితీర్చేసినట్లే అన్నంతంగా ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. బహుశాఒక్కో క్యాంటిన్ లో వంద నుంచి రెండువందల మందికి భోజనం సరఫరా చేయవచ్చు. దీనికిగాను ప్రభుత్వానికి అయ్యే ఖర్చు బాగా తక్కువే. అయినా బాగా ప్రచారానికి ఉపయోగపడుతుందన్నది వ్యూహకర్తల భావనగా ఉంది.
తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మంగా సూపర్ సిక్స్ లోని ముఖ్యమైన అంశాల జోలికి వెళ్లకుండా ఇలాంటి చిన్న,చిన్న హామీలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం కింద ప్రతి విద్యార్దికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇవ్వవలసి ఉంది. దానిని విద్యాశాఖ మంత్రి లోకేష్ వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దానికి ఆయన చూపిన కారణం స్కీమ్ గురించి చర్చించాలట. గత ప్రభుత్వ టైమ్ లో 72 వేల మంది విద్యార్ధులు తగ్గారని, టీచర్ల సంఘాలతో చర్చలు జరపాలని ఆయన అన్నారు. ఇది చాలా చిత్రమైన ప్రకటన.
విద్యార్దులు తగ్గితే ,దాని గురించి తల్లికి వందనం స్కీము అమలును ఆపవలసిన అవసరం ఏమి ఉంటుందో తెలియదు. టీచర్ల సంఘాలు ఈ స్కీము అమలు చేయవద్దని ఏమీ చెప్పలేదు కదా!. పోనీ ఎన్నికల ప్రచార సమయంలో ఆ సంఘాలవారితో ఏమైనా ఆ హామీ గురించి చర్చించి ఖరారు చేశారా?చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లతో పాటు నిమ్మల రామానాయుడు వంటివారు పోటీపడి తల్లికి వందనం స్కీము గురించి ప్రచారం చేశారు కదా!ఇప్పుడేమో విధి విధానాలు ఖరారు కావాలని లోకేష్ అంటున్నారు. మొదట ప్రతి కుటుంబంలో ఒక్కరికే ఈ స్కీము పరిమితం చేయాలని ఆలోచించారు.కాని ప్రజలలో వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అసలు స్కీమునే ఏడాదిపాటు వాయిదా వేసుకున్నారు. దానికి కారణం..
ఈ పధకం అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. గతంలో జగన్ ప్రభుత్వం ఒక్క తల్లికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తేనే సుమారు ఆరేడువేల కోట్ల రూపాయల వ్యయం ఏడాదికి అయ్యేది. అలాంటిది ప్రతి విద్యార్దికి వర్తింపచేయాలంటే ఏడాదికి కనీసం పదిహేనువేల కోట్ల రూపాయల వ్యయం కావచ్చు. అందుకే ప్రభుత్వం వెనుకాడుతోంది. ఈ నేపధ్యంలోనే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటేనే భయం వేస్తోందని అంటున్నారు.
ఏపీలో ప్రతి మహిళకు రూ.1,500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇవ్వడం కూడా సూపర్ సిక్స్ లో భాగమే. ఆ రకంగా ఇవ్వడానికి ఏడాదికి ఇరవైవేల కోట్ల నుంచి పాతికవేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. నిరుద్యోగ భృతి, మూడు గ్యాస్ సిలిండర్లు మొదలైనవి కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది. వాటిని ఎలాగోలా దాటవేయడానికి టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేసి సూపర్ సిక్స్ హామీని అమలు చేసేశామని ప్రచారం చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఈనాడు మీడియా ఇప్పటి నుంచే అన్నా క్యాంటిన్లపై ప్రచారం ఆరంభించింది. ప్రతి పట్టణంలోను ఎక్కడో ఒకటి,రెండు చోట్ల ఐదు రూపాయలకు భోజనం పెట్టి, మొత్తం పేదల ఆకలి తీర్చామని ప్రచారం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా టీడీపీ ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ సూపర్ సిక్స్ ను పక్కనబెట్టి ,ఇలాంటి జిమ్మిక్కులకు జనం ఓకే చెబుతారా?అన్నది సందేహమే.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment