సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే! | Sugali Preethi case took a complete U turn | Sakshi
Sakshi News home page

సుగాలి ప్రీతి కేసు ఇక మూలకే!

Published Sun, Feb 16 2025 5:02 AM | Last Updated on Sun, Feb 16 2025 3:29 PM

 Sugali Preethi case took a complete U turn

చంద్రబాబు సర్కారు రావడంతో రూటు మార్చిన సీబీఐ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పదో తరగతి దళిత విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఇక మూలకు చేరనుంది. గత చంద్రబాబు పాల­నలో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు తూ­తూమంత్రంగా విచారించారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తల్లిదండ్రులు కోరగా, ఆమేరకు వైఎస్‌ జగన్‌ ఉత్తర్వులిచ్చారు. అయినా సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టు­ను ఆశ్రయించారు. 

అప్పటి నుంచి సాగదీస్తూ వచ్చిన సీబీ­ఐ.. ఇప్పు­డు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో పూర్తి­గా యూటర్న్‌ తీసుకుంది. ఈ కేసులో అంత సంక్లిష్టత లేదని హైకోర్టుకు తెలిపింది. వనరుల కొరత కారణంగా చూ­పుతూ తాము దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది. ప్రీతి తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరింది. 

చంద్రబాబు హయాంలో తూతూ మంత్రంగా దర్యాప్తు
కర్నూలు నగర శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీబాయ్‌ 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్‌కి ఉరేసుకుని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్‌ యజమాని కొడుకులు లైంగిక దాడి చేసి చంపేశారని తల్లి­దండ్రులు సుగాలి రాజు నాయక్, పార్వతిదేవి ఆరోపించారు. 

అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ‘జస్టిస్‌ ఫర్‌ సుగాలి ప్రీతి’ పేరుతో సోషల్‌ మీడియాలో పెద్ద ఉద్యమమే జరిగింది. అదే రోజు కర్నూలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పోక్సో చట్ట నిబంధనల కింద కూడా కేసు పెట్టినా, అప్పటి ప్రభుత్వ పెద్దల తీరుతో  తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపారు. 

అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ స్కూలు కరస్పాండెంట్, ఆయన కుమారులను అరెస్ట్‌ చేశారు. తరువాత కొద్ది రోజులకే వారు బెయిల్‌పై బయటకు వచ్చేశారు. చంద్రబాబు హయాంలో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.

సీబీఐ స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్‌
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, సీబీఐ కూడా స్పందించలేదు. దీంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశా­ల మేరకు దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరు­తూ 2020 సెప్టెంబర్‌ 11న హైకోర్టులో ప్రీతి తల్లిదండ్రులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జ­రి­పిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల­ని సీబీ­ఐని ఆదేశించింది. 

ఈ ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ రఘు­రామ రాజన్‌ ఈ నెల 13న హైకోర్టులో కౌంటర్‌ దాఖ­లు చేశారు. ప్రీతి మృతి కేసులో అంతర్రాష్ట్ర పర్యవసానా­లు, తాము జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన సంక్లిష్టత లే­వని అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీబీఐ ప్రధా­న కార్యాలయానికి కూడా తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు పలు ముఖ్య­మైన, సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

అందువల్ల తమకున్న పరిమిత వనరులతో ఈ కేసు దర్యా­ప్తు చేపట్టడం సాధ్యం కాదని హైకోర్టుకు వివరించారు. సీబీ­ఐ ద­ర్యా­ప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ ప్రీతి తల్లిదండ్రులు దాఖ­లు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టేయాలని హై­కోర్టును కో­రా­­రు. ప్రీతి మృతి కేసును అప్పట్లో రాజకీయం­గా వాడుకు­న్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఉప ముఖ్య­మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎలా స్పందిస్తారో చూడాలి. 

న్యాయం చేసిన అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతి కేసులో తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. అనంతరం ఓసారి కర్నూలు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. తమ కుమార్తె మృతి విషయంలో న్యాయం చేయాలని కోరారు. వారికి న్యాయం చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ప్రీతి మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ 2020 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 

అంతేకాక 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలాన్ని కూడా జగన్‌ ప్రభుత్వం ఇచ్చింది. ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది. అయినా చంద్రబాబు కనీస చర్యలు కూడా తీసుకోకపోయినా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాగానే టీడీపీ, జనసేన నేతలు ఈ కేసుపై నానా రాద్ధాంతం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement