బాత్రూమ్‌లో ఆస్కార్... ఇదేం ఆనందం!
ఆ రోజు కేట్ విన్స్‌లెట్‌కి నిద్రపట్టలేదు. ఎందుకంటే, ఆ మర్నాడు ఆస్కార్ అవార్డ్ విజేతల ప్రకటన జరుగుతుంది. బంగారు బొమ్మ దక్కుతుందా? పదే పదే ప్రశ్నించుకున్నారు. రాత్రంతా కలత నిద్రతోనే సరిపోయింది. మర్నాడు ఎన్నో ఆశలతో అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లారు. బంగారు బొమ్మను దక్కించుకున్నారు. తెగ ఆనందపడ్డారు. అంతలోనే డీలా పడ్డారు. ఇంట్లో ఆస్కార్ ఎక్కడ పెట్టాలి? అని డైలమాలో పడ్డారు. హాలులోని షోకేస్‌లో పెడితే, వచ్చినవాళ్లంతా అవార్డును తాకుతారు. దొంగిలించే ఆస్కారం కూడా లేకపోలేదు. కష్టపడి తెచ్చుకున్న అవార్డును దొంగలపాలు చేయడమా? ఊహూ.. అయితే ఆస్కార్ అవార్డ్ పదిలంగా ఉండే చోటు ఏది? అని తీవ్రంగా ఆలోచించారు.
మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అవార్డుని తీసుకెళ్లి బాత్రూమ్‌లో పెట్టేశారు. ఇదేం ఆనందం అనుకుంటున్నారా? బాత్రూమ్‌కు వెళ్లినవాళ్లు ముందు పని కానిస్తారు. ఏ పని చేసినా చేతులు తడి కావడం ఖాయం. ఆ తడి చేతులతో ఆస్కార్‌ని ముట్టుకోరు కదా. ఆ విధంగా ఇంట్లోవాళ్ల బారి నుంచి, ఇంటికొచ్చే అతిథుల బారి నుంచి కూడా ఆస్కార్‌ను కాపాడుకోవచ్చన్నది కేట్ విన్స్‌లెట్ ఆలోచన. ఇక, దొంగలొచ్చారనుకోండి.. బాత్రూమ్‌లో విలువైన వస్తువులు ఉంటాయనుకోరుగా.. సో.. ఆస్కార్ సేఫ్‌గా ఉంటుందనుకుని కేట్ మురిసిపోయారు. 2009లో ‘ది రీడర్’ చిత్రానికిగాను ఆస్కార్ గెల్చుకున్నప్పుడు తాను చేసిన ఈ తతంగాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేట్ విన్స్‌లెట్ గుర్తు చేసుకున్నారు.