
నూరవ అవార్డు వేడుక నుంచి ‘స్టంట్ డిజైన్’కి అవార్డు
‘‘సినిమాల్లో మేజిక్ చేసేవాటిలో స్టంట్స్‌ది కీలక భాగం. ఇప్పుడు ఆస్కార్స్‌లో కూడా భాగం అయ్యాయి. కొత్తగా స్టంట్ విభాగాన్ని చేర్చి, ఇక ప్రతి ఏడాదీ అవార్డు ఇవ్వనున్నాం. 2027లో విడుదలైన సినిమాలకు 2028లో జరిగే నూరవ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఈ విభాగంలో అవార్డు అందించనున్నాం’’ అని ఆస్కార్ అవార్డు కమిటీ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. ‘‘సినిమా తొలి నాళ్ల నుంచి స్టంట్ డిజైన్(Stunt Design) అనేది ఫిల్మ్ మేకింగ్‌లో అంతర్భాగంగా ఉంది.
సాంకేతిక, సృజనాత్మకత కలిగిన కళాకారుల పనిని గౌరవించడం మాకు గర్వకారణం’’ అని అకాడమీ కమిటీ సీఈవో బిల్ క్రామెర్, అకాడమీ అధ్యక్షురాలు జానెట్ యాంగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా కొత్తగా చేర్చిన ఈ స్టంట్ విభాగాన్ని ప్రకటించి, ఓ పోస్టర్‌ని విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో హాలీవుడ్ చిత్రాలు ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్, మిషన్ ఇంపాజిబుల్’ పోస్టర్స్‌తో పాటు తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ పోస్టర్ కూడా ఉండటం భారతీయ సినిమాకి గర్వకారణం అనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు పాటు...’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఇక ఆస్కార్ అవార్డ్స్‌లో కొత్త విభాగం ‘స్టంట్ డిజైన్’ని చేర్చడం పట్ల రాజమౌళి ‘ఎక్స్’ వేదికగా ఈ విధంగా స్పందించారు.
వందేళ్ల నిరీక్షణ ఫలించింది – రాజమౌళి
‘‘వందేళ్ల నిరీక్షణ ఫలించింది. 2027లో విడుదలయ్యే చిత్రాలకు కొత్తగా ఆస్కార్ స్టంట్ డిజైన్ విభాగం చేర్చడం ఆనందంగా ఉంది. ఈ విభాగంలో గుర్తింపును సాధ్యం చేసినందుకు డేవిడ్ లీన్, క్రిస్ ఓ’హారా మరియు స్టంట్ కమ్యూనిటీకి, స్టంట్ వర్క్ శక్తిని గౌరవించనున్నందుకు బిల్ క్రామెర్, జానెట్ యాంగ్‌లకు ధన్యవాదాలు. ఈ కొత్త విభాగం ప్రకటించిన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ యాక్షన్ విజువల్ మెరవడం చాలా సంతోషంగా ఉంది’’ అని రాజమౌళి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
కాగా ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ చిత్రం 2027 మార్చి 25న రిలీజ్ కానుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దశాబ్దాల కల నెరవేరెగా... స్టంట్ విభాగంలో ఆస్కార్ అవార్డును ప్రదానం చేయాలనే విషయంపై దశాబ్దాలుగా కొందరు ఆస్కార్ అవార్డు నిర్వాహకులతో సమావేశమయ్యారు కానీ ప్రయోజనం లేకుండాపోయింది. అయితే స్టంట్ మేన్‌గా కెరీర్ ఆరంభించి, స్టంట్ కో–ఆర్డినేటర్‌గానూ చేసి, ఆ తర్వాత ‘జాన్ విక్ (ఓ దర్శకుడిగా), డెడ్ పూల్ 2, బుల్లెట్ ట్రైన్, ది ఫాల్ గై’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన డేవిడ్ లీచ్ ఈ మధ్య కొందరితో కలిసి ‘స్టంట్ డిజైన్’ విభాగాన్ని చేర్చాలని కోరుతూ, గట్టిగా నినాదాలు చేశారు. దానికి తగ్గ ఫలితం దక్కింది.
ఆ విధంగా స్టంట్ విభాగానికి ఆస్కార్ అవార్డ్స్‌లో గుర్తింపుని కోరిన కొందరి దశాబ్దాల కల నెరవేరినట్లు అయింది. ఇక గతంలో స్టంట్ విభాగంలో అవార్డు లేని సమయంలో 1967లో స్టంట్ డైరెక్టర్ యాకిమా కానట్ట్ గౌరవ ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 2013లో స్టంట్ డైరెక్టర్ హాల్ నీధమ్‌కి కూడా ప్రత్యేక ఆస్కార్ ప్రదానం చేసి, గౌరవించింది ఆస్కార్ అవార్డు కమిటీ. ఇక 2028లో జరగనున్న నూరవ ఆస్కార్ అవార్డుతో ఆరంభించి, ప్రతి ఏటా ‘స్టంట్ డిజైన్’ విభాగంలో అవార్డుని ప్రదానం చేయనున్నారు.