
నవాబుపేట: భూమి అమ్మగా వచ్చిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్య తన బంధువులతో కలసి భర్తను దారుణంగా హత్య చేసి.. బాత్‌రూంలో పాతిపెట్టింది. నెలన్నర తర్వాత బయటపడిన ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో చోటు చేసుకుంది. దుర్పల్లి పంచాయతీ పరిధిలోని మొరంబావికి చెందిన చెన్నయ్య (47) నాలుగు నెలల క్రితం తనకున్న రెండెకరాల భూమిలో ఎకరా పొలాన్ని రూ.14 లక్షలకు అమ్మాడు. ఆ డబ్బులతో ఇల్లు నిర్మాణం చేపట్టి.. కొంత డబ్బుతో తన అక్కాచెల్లెళ్లకు బంగారం ఇచ్చాడు. దీంతో తనకు డబ్బులు లేకుండా చేస్తున్నాడని భావించిన చెన్నయ్య భార్య రాములమ్మ భర్తతో గొడవపడేది.
(చదవండి: గణాంకాలు–వాస్తవాలు)
ఇంటి నిర్మాణ పనులు పూర్తికావచ్చిన నేపథ్యంలో ఇంటిలో వాటా ఇస్తానని చెప్పి బావ పెంటయ్యతో పాటు మరో బంధువుతో కలసి భర్తను చంపేందుకు రాములమ్మ పథకం వేసింది. భర్తకు బాగా మద్యం తాగించి టవల్‌ను గొంతుకు బిగించి హత్య చేసింది. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న ఇంటి బాత్‌రూంలో గుంత తీసి శవాన్ని పాతిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా.. నెల రోజులకు పైగా రాములమ్మ అదే ఇంట్లో నివాసం ఉంటోంది. కాగా జూలై 14వ తేదీ నుంచి అన్న కనిపించడం లేదని, ఎక్కడికి వెళ్లాడని.. చెన్నయ్య చెల్లెలు చెన్నమ్మ వదిన రాములమ్మను నిలదీసింది. ఆమె పొంతనలేని సమాధానం చెప్పడంతో జూలై 20న పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసుగా నమోదు చేశారు.
తొలుత చెన్నయ్య బంధువులను విచారణ చేసిన పోలీసులు, రెండు రోజుల క్రితం భార్య రాములమ్మను కూడా అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం బయటపడింది. బాత్‌రూంలో గుంత తీసి శవాన్ని పూడ్చిపెట్టినట్లు ఆమె చెప్పడంతో గురువారం పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.
(చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..)
సంఘటన స్థలంలో బయటపడ్డ మృతదేహం. (ఇన్‌సెట్‌లో) చెన్నయ్య (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment