కర్ణాటక: కొద్దిరోజుల్లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతీ యువకుని పాలిట బాత్‌రూంలోని గ్యాస్ గీజర్ మృత్యువులా విరుచుకు పడింది. గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన బెంగళూరులోని చిక్కజాల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది.
ఉద్యోగం, సహజీవనం చేస్తూ..
వివరాలు.. చామరాజనగర జిల్లా గుండ్లుపేటే కు చెందిన చంద్రశేఖర్ (30), బెళగావి జిల్లా గోకాక్ నివాసి సుధా రాణి (22) మృతులు. వీరిద్దరూ నగరంలోని గోల్ఫ్ హోటల్‌లో పనిచేసేవారు. చిక్కజాల పరిధిలోని తరబనహళ్లిలో అద్దె ఇంట్లో ఉంటూ సహ జీవనం చేస్తున్నారు. త్వరలో వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 10 తేదీ శనివారం ఉదయం ఇద్దరూ విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. రాత్రి గ్యాస్ గీజర్ ఆన్‌చేసి ఇద్దరూ బాత్‌రూమ్‌లో స్నానం చేయడానికి వెళ్లి బాత్‌రూమ్ కిటికీ మూశారు. స్నానం చేస్తున్న సమయంలో గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీక్ కావడంతో ఇద్దరూ స్పహతప్పి పడిపోయారు. కొంతసేపటికి మృతి చెందారు.
డ్యూటీకి రాకపోవడంతో
ఆదివారం ఇద్దరూ డ్యూటీకి రాకపోవడంతో స్నేహితులు వీరి మొబైల్‌కు ఫోన్ చేయగా స్పందన లేదు. అనుమానం వచ్చి ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. అనుమానం వచ్చి చిక్కజాలపోలీసులకు సమాచారమిచ్చారు. వారు చేరుకుని ఇంటి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ బాత్‌రూంలో శవాలై ఉన్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం అంబేడ్కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి తరువాత వారి కుటుంబాలకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment