చిత్తూరులో ఎస్కార్ట్కు మస్కా
* ఆరుగురు సిబ్బంది కళ్లుగప్పి ఖైదీ పరార్
* ఆస్పత్రి కిటికీలోంచి పారిపోయిన వైనం
* ఎస్కార్ట్ సిబ్బందిపై ఎస్పీ వేటు..?
చిత్తూరు (అర్బన్) : ఓ ఖైదీని పోలీసులు ఆరోగ్యం బాగాలేందంటే ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించిన తరువాత అతడు అర్జెంటుగా బాత్‌రూమ్‌కి వెళ్లాలని చెప్పడంతో చేతికున్న బేడీలను పోలీసులు తొలగించారు. రేయ్.. ఎలాంటి మోసం చెయ్యొద్దురా..! బాత్‌రూమ్‌కు వెళ్లిందే వచ్చేయ్. అని చెప్పి పంపించారు. 5 నిముషాలయింది. ఖైదీ రాలేదు. 10.., 15.., 20 నిముషాలయింది. అయినా రాలేదు. తీరా విషయం ఏంటని చూస్తే బాత్‌రూమ్‌లో ఉన్న కిటీకి సందులోంచి అతడు పరారయ్యాడు.
ఈ సంఘటన శనివారం చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం దిండుక్కల్‌కు చెందిన సెల్వం అనే అన్భు (45) ఈ ఏడాది జూన్ 12న తిరుపతికి గంజారుు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. స్థానిక చంద్రగిరి వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా సెల్వం దాదాపు 150 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. పోలీసులు మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానం రిమాండు విధించగా, అతడు అప్పటి నుంచి చిత్తూరు జిల్లా కారాగారంలో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో సెల్వంతోపాటు మరో ఖైదీ చిన్నదొరైకు జ్వరం రావడంతో శనివా రం చిత్తూరు జిల్లా జైలులో ఎస్కార్ట్‌గా ఉన్న ఓ ఏఎస్‌ఐ, ఐదుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్స అనంతరం ఖైదీలను వ్యానులోకి ఎక్కించడానికి ముందు అర్జెంటుగా బాత్‌రూమ్‌కు వెళ్లాలని సెల్వం ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసులకు చెప్పాడు. దీంతో చేతికున్న సంకెళ్లను తీసిన పోలీసులు నేరుగా బాత్‌రూమ్‌లోకి వెళ్లి వచ్చేయాలని చెప్పి మరీ పంపించారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో ఉన్న మరుగుదొడ్డి లోపలికి వెళ్లి అతడు గడియ పెట్టుకున్నాడు. దాదాపు 20 నిముషాలైనా బయటకు రాలేదు.
అనుమానం వచ్చిన ఎస్కార్ట్ పోలీసులు తలుపులు తట్టినా బయటకు రాలేదు. తలుపులు పగులగొట్టి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుగుదొడ్డిలోని కిటీకీ సందులోంచి సెల్వం పారిపోయినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎస్కార్ట్‌గా వచ్చిన చిత్తూరు ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులపై వేటు వేయడానికి రంగం సిద్ధమయింది. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఖైదీ పారిపోయినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న ఓ ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్, నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్ల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు నివేదిక ఇచ్చిన వెంటనే వారిని ఎస్పీ సస్పెండ్ చేసే అవకాశం ఉంది. పారిపోయిన ఖైదీపై నేరం రుజువైతే దాదాపు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉండటంతో ఈ ఘటనపై ఎస్పీ కూడా సీరియస్‌గా ఉన్నారు.
ఎస్కార్టు వెళ్లిన పోలీసులు వీరే
రిమాండు ఖైదీలకు ఎస్కార్టుగా వెళ్లిన వారిలో చిత్తూరు ఆర్ముడు రిజర్వు (ఏఆర్) ఏఎస్‌ఐ పెరుమాళ్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ దాసు, ఏఆర్ కానిస్టేబుళ్లు వెంకటేష్, అయ్యప్ప, వాసు, రామాంజనేయులు ఉన్నారు.