Escort staff
-
బేడీలపై దురుద్దేశం లేదు
సాక్షి, గుంటూరు: నిజాలతో పనిలేదు.. నిర్ధారించుకునే ప్రయత్నమూ లేదు. విషయం ఏదైనప్పటికీ విమర్శలే పరమావధిగా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. రాజధాని అమరావతిలో దళితులను అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే క్రమంలో పోలీస్ శాఖకు చెందిన ఏఆర్ సిబ్బంది బేడీలు వేయడాన్ని టీడీపీ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునేందుకు ప్రయత్నించడమే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి ఏఆర్ విభాగానికి చెందిన ఎస్కార్ట్ సిబ్బందికి రిమాండ్ ఖైదీల వివరాలు తెలిసే అవకాశం లేదని, ముందు జాగ్రత్తలో భాగంగానే ఇలా వ్యవహరించారని తెలుస్తోంది. నరసరావుపేట సబ్ జైలు నుంచి జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీలను తరలించేటప్పుడు బేడీలు వేయడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసు శాఖ ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. విచారణ జరుగుతోంది.. జైళ్ల శాఖ విజ్ఞప్తి మేరకు పోలీస్ శాఖలోని ఏఆర్ విభాగం సిబ్బంది ఖైదీలకు ఎస్కార్టుగా వెళ్తుంటారు. ఖైదీలను ఫలానా చోట నుంచి నిర్దేశిత ప్రాంతానికి తీసుకువెళ్లాలని మాత్రమే జైలు అధికారులు పోలీసులకు సూచిస్తారు. ఖైదీలు ఏ కేసుల్లో అరెస్టయ్యారు?ఊరు, పేర్లు, తదితర వివరాలపై ఎస్కార్టు పోలీసులకు సమాచారం ఉండదు. ఈ క్రమంలో మంగళవారం నరసరావుపేట నుంచి గుంటూరుకు ఖైదీలను తరలించే సమయంలో ముందు జాగ్రత్తలో భాగంగా 43 మందికి ఎస్కార్టు సిబ్బంది బేడీలు వేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. దీనిపై డీఐజీ త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు ఎస్పీ విశాల్ గున్నీ శాఖాపరమైన విచారణను కొనసాగిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో ఈ నెల 23న జరిగిన రిలే నిరాహార దీక్షలకు కొందరు దళితులు ఆటోల్లో వెళుతుండగా కృష్ణాయపాలెం వద్ద అమరావతి మద్దతుదారులు అడ్డుకుని దాడి యత్నం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేయగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులైన ఈ ఏడుగురితో పాటు హత్యాయత్నం కేసుల్లో ఇద్దరు, డెకాయిట్ కేసులో ముగ్గురు, పోక్సో కేసుల్లో ఇద్దరు, చోరీ కేసుల్లో ముగ్గురు ఖైదీలు, 498ఏ, ఎక్సైజ్, ఇతర క్రిమినల్ కేసుల్లో ఉన్న నిందితులతో కలిపి మొత్తం 43 మందిని ఈనెల 27న నరసరావుపేటలో కరోనా పరీక్షల అనంతరం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఖైదీలకు బేడీలు వేయడం విమర్శలకు తావివ్వడంతో ఆరుగురు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ అదే రోజు ఆదేశాలు జారీ చేశారు. -
బిర్యానీ అన్నారు.. బేర్మనిపించారు..!
ఎస్కార్ట్ సిబ్బందికి రిమాండ్ ఖైదీ ఝలక్ పెప్పర్ స్ప్రేతో దాడి అనుచరులతో కలసి పరారు సినిమాను తలపించిన సన్నివేశం పోలీసుల అదుపులో నిందితుడి సోదరుడు చైతన్యపురి: సమయం: సాయంత్రం 6 గంటల ప్రాంతం స్థలం: చైతన్యపురిలోని గ్రీన్ బావార్చి హోటల్. హోటల్ ముందు ఓ మోటార్ సైకిల్ ఆగింది. దానిపై శేఖర్, ఉపేందర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు...ఆ మధ్యలో బేడీలతో అఖీలుద్దీన్ అనే వ్యక్తి ఉన్నారు. మోటార్ సైకిల్‌ను నిలిపి ముగ్గురూ కిందకు దిగారు. ఇంతలో అఖీలుద్దీన్ కానిస్టేబుల్ వద్ద ఉన్న సెల్ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడు. అతనితో కలసి కానిస్టేబుళ్లు బిర్యానీ తినేందుకు లోపలికి వెళ్లారు. కాసేపటి తరువాత ముగ్గురూ బయటికి వచ్చారు. అప్పుడు అనుకోని సంఘటన చోటుచేసుకుంది. హఠాత్తుగా ముగ్గురు వ్యక్తులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అందులో ఇద్దరు పెప్పర్ స్ప్రేతో కానిస్టేబుళ్లపై దాడి చేశారు. కళ్లు మూసి తెరిచేలోగా అఖీలుద్దీన్ను తమ మోటార్ సైకిల్‌పై ఎక్కించుకొని పరారయ్యారు. ఈ క్రమంలో బృందంలోని మరో వ్యక్తి షకీల్ పోలీసులకు చిక్కాడు. అంతవరకూ ఈ తతంగాన్ని చూస్తున్న జనం ఇదేదో సినిమా షూటింగ్ అనుకున్నారు. కాసేపటికి తేరుకొని... వాస్తవమని తెలిసి విస్తుపోయారు. ఇదీ కథ.. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఈ సంఘటనకు సంబంధించి చైతన్యపురి ఎస్ఐ కోటయ్య తెలిపిన వివరాలివీ.. పాతబస్తీలోని జహనుమా ప్రాంతానికిచెందిన అఖీలుద్దీన్(22) పాత నేరస్థుడు. చైన్ స్నాచింగ్ కేసులలో ఇరుక్కొని గతంలో జైలుకు వెళ్లివచ్చాడు.ఇటీవల కుషాయ్గూడ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులకు చిక్కి... చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఎల్బీనగర్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 802/2014 కేసులోనూ అఖీలుద్దీన్ నిందితుడే. పీటీ వారెంట్‌పై అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఎల్బీ నగర్ పోలీసులు భావించి...జైలు అధికారుల కు లేఖ రాశారు. పీటీ వారెంట్ వేసే సమయంలో నిందితు డు ఉండాలి. ఈ మేరకు చర్లపల్లి జైలు అధికారుల అనుమతితో అఖీలుద్దీన్ను ఎల్బీనగర్ కానిస్టేబుళ్లు శేఖర్, ఉపేందర్‌లు ఎస్కార్ట్‌గా ఉండి సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణను మరుసటి రోజు కు కోర్టు వాయిదా వేసింది. తిరిగి జైలుకు తరలించేందుకు అఖీలుద్దీన్ చేతులకు బేడీలు వేసి.. మోటార్ సైకిల్‌పై శేఖర్, ఉపేందర్‌లు బయలుదేరారు. దారిలో బిర్యానీ తినేందుకు చైతన్యపురిలోని గ్రీన్బావార్చి హోటల్‌కు తీసుకువచ్చారు. ఇలా అడ్డం తిరిగింది... అక్కడే కథ అడ్డం తిరిగింది. హోటల్ వద్దకు రాగానే అఖీలుద్దీన్ కానిస్టేబుల్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకొని తన సోదరుడు షకీల్‌కు ఫోన్ చేశాడు. తాను బావార్చి హోటల్ వద్ద ఉన్నట్టు చెప్పాడు. అంతే... క్షణాల్లో తప్పించుకునేందుకు షకీల్ పథకం పన్నాడు. తన ఇద్దరు అనుచరులతో కలిసి నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాడు. హోటల్ నుంచి కానిస్టేబుళ్లు, అఖీలుద్దీన్లు బయటికి రాగానే షకీల్, ఇద్దరు అనుచరులు పెప్పర్ స్ప్రేతో పోలీసులపై దాడి చేశారు. వారు తేరుకునే లోపే అఖీలుద్దీన్ను తమ బైక్‌పై కూర్చోబెట్టుకుని పారిపోయారు. ఈ క్రమంలోషకీల్ మాత్రం పోలీసులకు చిక్కాడు. అఖీలుద్దీన్ పరారైన సమయంలో అతని చేతికి బేడీలు ఉన్నాయి. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు నిందితుల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి రాత్రి 9 గంటల ప్రాంతంలో చైతన్యపురి పోలీసులకు పిర్యాదు చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే... అఖిల్‌ను జైలుకు తరలించే క్రమంలో ఎస్కార్ట్‌గా వెళ్లిన కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగినట్టు భావిస్తున్నారు. బిర్యానీ కోసంహోటల్ దగ్గర ఆగడం... నిందితునికి సెల్ఫోన్లో ఇతరులతో మాట్లాడే అవకాశం కల్పించడం వల్లనే పరారైనట్టు తెలుస్తోంది. పరారైన ముగ్గురి కోసం పోలీసులు విస్తృతంగాగాలిస్తున్నారు. ఇటీవల నగర పోలీసులకు చిక్కిన పేరు మోసిన చైన్ స్నాచర్ లంబా కేసులోనూ అఖిల్‌పై రిసీవర్ కేసులు నమోదైనట్టు సమాచారం. షకీల్ రిమాండ్.... పోలీసులకు చిక్కిన షకీల్‌పై కేసు నమోదు చేసి మంగళవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించిన ట్లు ఎస్ఐ కోటయ్య తెలిపారు. షకీల్ కూడా చైన్‌స్నాచర్ అని... 2013లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్‌స్నాచింగ్ కేసులో నిందితుడని ఎస్ఐ తెలిపారు. -
చిత్తూరులో ఎస్కార్ట్కు మస్కా
* ఆరుగురు సిబ్బంది కళ్లుగప్పి ఖైదీ పరార్ * ఆస్పత్రి కిటికీలోంచి పారిపోయిన వైనం * ఎస్కార్ట్ సిబ్బందిపై ఎస్పీ వేటు..? చిత్తూరు (అర్బన్) : ఓ ఖైదీని పోలీసులు ఆరోగ్యం బాగాలేందంటే ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించిన తరువాత అతడు అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్లాలని చెప్పడంతో చేతికున్న బేడీలను పోలీసులు తొలగించారు. రేయ్.. ఎలాంటి మోసం చెయ్యొద్దురా..! బాత్రూమ్కు వెళ్లిందే వచ్చేయ్. అని చెప్పి పంపించారు. 5 నిముషాలయింది. ఖైదీ రాలేదు. 10.., 15.., 20 నిముషాలయింది. అయినా రాలేదు. తీరా విషయం ఏంటని చూస్తే బాత్రూమ్లో ఉన్న కిటీకి సందులోంచి అతడు పరారయ్యాడు. ఈ సంఘటన శనివారం చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం దిండుక్కల్‌కు చెందిన సెల్వం అనే అన్భు (45) ఈ ఏడాది జూన్ 12న తిరుపతికి గంజారుు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. స్థానిక చంద్రగిరి వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా సెల్వం దాదాపు 150 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. పోలీసులు మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానం రిమాండు విధించగా, అతడు అప్పటి నుంచి చిత్తూరు జిల్లా కారాగారంలో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సెల్వంతోపాటు మరో ఖైదీ చిన్నదొరైకు జ్వరం రావడంతో శనివా రం చిత్తూరు జిల్లా జైలులో ఎస్కార్ట్‌గా ఉన్న ఓ ఏఎస్ఐ, ఐదుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్స అనంతరం ఖైదీలను వ్యానులోకి ఎక్కించడానికి ముందు అర్జెంటుగా బాత్రూమ్కు వెళ్లాలని సెల్వం ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసులకు చెప్పాడు. దీంతో చేతికున్న సంకెళ్లను తీసిన పోలీసులు నేరుగా బాత్రూమ్లోకి వెళ్లి వచ్చేయాలని చెప్పి మరీ పంపించారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో ఉన్న మరుగుదొడ్డి లోపలికి వెళ్లి అతడు గడియ పెట్టుకున్నాడు. దాదాపు 20 నిముషాలైనా బయటకు రాలేదు. అనుమానం వచ్చిన ఎస్కార్ట్ పోలీసులు తలుపులు తట్టినా బయటకు రాలేదు. తలుపులు పగులగొట్టి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుగుదొడ్డిలోని కిటీకీ సందులోంచి సెల్వం పారిపోయినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎస్కార్ట్‌గా వచ్చిన చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వు పోలీసులపై వేటు వేయడానికి రంగం సిద్ధమయింది. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఖైదీ పారిపోయినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న ఓ ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్, నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్ల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు నివేదిక ఇచ్చిన వెంటనే వారిని ఎస్పీ సస్పెండ్ చేసే అవకాశం ఉంది. పారిపోయిన ఖైదీపై నేరం రుజువైతే దాదాపు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉండటంతో ఈ ఘటనపై ఎస్పీ కూడా సీరియస్‌గా ఉన్నారు. ఎస్కార్టు వెళ్లిన పోలీసులు వీరే రిమాండు ఖైదీలకు ఎస్కార్టుగా వెళ్లిన వారిలో చిత్తూరు ఆర్ముడు రిజర్వు (ఏఆర్) ఏఎస్ఐ పెరుమాళ్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ దాసు, ఏఆర్ కానిస్టేబుళ్లు వెంకటేష్, అయ్యప్ప, వాసు, రామాంజనేయులు ఉన్నారు.