బిర్యానీ అన్నారు.. బేర్‌మనిపించారు..!
ఎస్కార్ట్ సిబ్బందికి రిమాండ్ ఖైదీ ఝలక్
పెప్పర్ స్ప్రేతో దాడి అనుచరులతో కలసి పరారు
సినిమాను తలపించిన సన్నివేశం పోలీసుల అదుపులో నిందితుడి సోదరుడు
చైతన్యపురి: సమయం: సాయంత్రం 6 గంటల ప్రాంతం
స్థలం: చైతన్యపురిలోని గ్రీన్ బావార్చి హోటల్.
హోటల్ ముందు ఓ మోటార్ సైకిల్ ఆగింది. దానిపై శేఖర్, ఉపేందర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు...ఆ మధ్యలో బేడీలతో అఖీలుద్దీన్ అనే వ్యక్తి ఉన్నారు. మోటార్ సైకిల్‌ను నిలిపి ముగ్గురూ కిందకు దిగారు. ఇంతలో అఖీలుద్దీన్ కానిస్టేబుల్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడాడు. అతనితో కలసి కానిస్టేబుళ్లు బిర్యానీ తినేందుకు లోపలికి వెళ్లారు. కాసేపటి తరువాత ముగ్గురూ బయటికి వచ్చారు. అప్పుడు అనుకోని సంఘటన చోటుచేసుకుంది. హఠాత్తుగా ముగ్గురు వ్యక్తులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అందులో ఇద్దరు పెప్పర్ స్ప్రేతో కానిస్టేబుళ్లపై దాడి చేశారు. కళ్లు మూసి తెరిచేలోగా అఖీలుద్దీన్‌ను తమ మోటార్ సైకిల్‌పై ఎక్కించుకొని పరారయ్యారు. ఈ క్రమంలో బృందంలోని మరో వ్యక్తి షకీల్ పోలీసులకు చిక్కాడు. అంతవరకూ ఈ తతంగాన్ని చూస్తున్న జనం ఇదేదో సినిమా షూటింగ్ అనుకున్నారు. కాసేపటికి తేరుకొని... వాస్తవమని తెలిసి విస్తుపోయారు.
ఇదీ కథ..
పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన ఈ సంఘటనకు సంబంధించి చైతన్యపురి ఎస్‌ఐ కోటయ్య తెలిపిన వివరాలివీ.. పాతబస్తీలోని జహనుమా ప్రాంతానికిచెందిన అఖీలుద్దీన్(22) పాత నేరస్థుడు. చైన్ స్నాచింగ్ కేసులలో ఇరుక్కొని గతంలో జైలుకు వెళ్లివచ్చాడు.ఇటీవల కుషాయ్‌గూడ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులకు చిక్కి... చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఎల్‌బీనగర్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెంబర్ 802/2014 కేసులోనూ అఖీలుద్దీన్ నిందితుడే. పీటీ వారెంట్‌పై అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఎల్బీ నగర్ పోలీసులు భావించి...జైలు అధికారుల కు లేఖ రాశారు. పీటీ వారెంట్ వేసే సమయంలో నిందితు డు ఉండాలి. ఈ మేరకు చర్లపల్లి జైలు అధికారుల అనుమతితో అఖీలుద్దీన్‌ను ఎల్బీనగర్ కానిస్టేబుళ్లు శేఖర్, ఉపేందర్‌లు ఎస్కార్ట్‌గా ఉండి సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణను మరుసటి రోజు కు కోర్టు వాయిదా వేసింది. తిరిగి జైలుకు తరలించేందుకు అఖీలుద్దీన్ చేతులకు బేడీలు వేసి.. మోటార్ సైకిల్‌పై శేఖర్, ఉపేందర్‌లు బయలుదేరారు. దారిలో బిర్యానీ తినేందుకు చైతన్యపురిలోని గ్రీన్‌బావార్చి హోటల్‌కు తీసుకువచ్చారు.
ఇలా అడ్డం తిరిగింది...
అక్కడే కథ అడ్డం తిరిగింది. హోటల్ వద్దకు రాగానే అఖీలుద్దీన్ కానిస్టేబుల్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకొని తన సోదరుడు షకీల్‌కు ఫోన్ చేశాడు. తాను బావార్చి హోటల్ వద్ద ఉన్నట్టు చెప్పాడు. అంతే... క్షణాల్లో తప్పించుకునేందుకు షకీల్ పథకం పన్నాడు. తన ఇద్దరు అనుచరులతో కలిసి నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాడు. హోటల్ నుంచి కానిస్టేబుళ్లు, అఖీలుద్దీన్‌లు బయటికి రాగానే షకీల్, ఇద్దరు అనుచరులు పెప్పర్ స్ప్రేతో పోలీసులపై దాడి చేశారు. వారు తేరుకునే లోపే అఖీలుద్దీన్‌ను తమ బైక్‌పై కూర్చోబెట్టుకుని పారిపోయారు. ఈ క్రమంలోషకీల్ మాత్రం పోలీసులకు చిక్కాడు. అఖీలుద్దీన్ పరారైన సమయంలో అతని చేతికి బేడీలు ఉన్నాయి. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు నిందితుల కోసం గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి రాత్రి 9 గంటల ప్రాంతంలో చైతన్యపురి పోలీసులకు పిర్యాదు చేశారు.
సిబ్బంది నిర్లక్ష్యంతోనే...
అఖిల్‌ను జైలుకు తరలించే క్రమంలో ఎస్కార్ట్‌గా వెళ్లిన కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగినట్టు భావిస్తున్నారు. బిర్యానీ కోసంహోటల్ దగ్గర ఆగడం... నిందితునికి సెల్‌ఫోన్‌లో ఇతరులతో మాట్లాడే అవకాశం కల్పించడం వల్లనే పరారైనట్టు తెలుస్తోంది. పరారైన ముగ్గురి కోసం పోలీసులు విస్తృతంగాగాలిస్తున్నారు. ఇటీవల నగర పోలీసులకు చిక్కిన పేరు మోసిన చైన్ స్నాచర్ లంబా కేసులోనూ అఖిల్‌పై రిసీవర్ కేసులు నమోదైనట్టు సమాచారం.
షకీల్ రిమాండ్....
పోలీసులకు చిక్కిన షకీల్‌పై కేసు నమోదు చేసి మంగళవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించిన ట్లు ఎస్‌ఐ కోటయ్య తెలిపారు. షకీల్ కూడా చైన్‌స్నాచర్ అని... 2013లో ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్‌స్నాచింగ్ కేసులో నిందితుడని ఎస్‌ఐ తెలిపారు.