
హోటళ్లలో చికెన్ బిర్యానీ ఆర్డర్లు తగ్గుముఖం
ఫుడ్ ఆర్డర్ యాప్స్‌లోనూ దీనిపై విముఖత
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో భారీగా పడిపోయిన అమ్మకాలు
లబోదిబోమంటున్న నగర హోటళ్ల పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్ : బిర్యానీ.. ఈ పేరు వినగానే మాంసాహార ప్రియులకు పండగే. లొట్టలు వేసుకుంటూ లాగించాల్సిందే. చికెన్ బిర్యానీ అంటే మరింత మక్కువ. కానీ.. ప్రస్తుతం నగరంలో చికెన్ బిర్యానీల విక్రయాలు తగ్గిపోయాయి. ఫిష్, మటన్ బిర్యానీల వైపు మొగ్గు కనిపిస్తోంది. చికెన్ బిర్యానీ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీని అంతటికీ కారణం బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్. ఈ వైరస్ కారణంగా కోళ్లు చనిపోతుండటంతో చికెన్ బిర్యానీల విక్రయాలు ఒక్కసారిగా పడిపోయాయి.
చికెన్‌తో చేసే వంటకాలకూ డిమాండ్ తగ్గిపోవడంతో హోటళ్ల పరిశ్రమ లబోదిబోమంటోంది. ఈ పరిణామాలు చివరికి గిగ్‌వర్కర్లపైనా పడింది. టేక్ అవే.. ఇతర ఆన్‌లైన్ ఆర్డర్లు కూడా తగ్గిపోవడంతో స్విగ్గీ, జొమాటో తదితర ఆహార పదార్థాల సరఫరాల రంగంపైనా ప్రభావం చూపుతోంది. ఐకానిక్ చికెన్ బిర్యానీ పరిస్థితి ఇలావుంటే.. కోడిగుడ్ల అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి. బర్డ్‌ఫ్లూ ప్రభావం మన రాష్ట్రంలో లేదని పౌల్ట్రీరంగం, ప్రభుత్వం నిత్యం చెబుతున్నా.. పక్క రాష్ట్రంలో దీని ఆనవాళ్లు భారీగా ఉండడంతో చికెన్, గుడ్డు తినే అంశంపై జనాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.
మాంసం, సీ ఫుడ్స్‌కే ప్రాధాన్యం..
గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు 15 నుంచి 20 లక్షల చికెన్ బిర్యానీలు అమ్ముడవుతుండగా.. తాజాగా ఇవి సగానికి తగ్గిపోయినట్లు ప్రముఖ హోటల్ షాదాబ్ యజమాని స్పష్టం చేశారు. దీని స్థానంలో శాకాహార వంటకాలు లేదా మాంసం, సీ ఫుడ్స్‌కు ప్రాధాన్యమిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బర్డ్‌ఫ్లూ మూలంగా చికెన్ బిర్యానీ ఆర్డర్లు భారీగా తగ్గాయని షాదాబ్ హోటల్ యజమాని ఆదిల్ సోహెల్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో చికె¯Œ ఆర్డర్‌ను కూడా తగ్గించినట్లు ఆయన చెప్పారు. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫిష్, మటన్‌ను ఎక్కువ వండి వడ్డిస్తున్నట్లు తెలిపారు. వీటికి డిమాండ్ పెరగడంతో వీటి సరఫరాదారులు ధరలు కూడా పెంచినట్లు ఆయన వివరించారు.
‘ఇంతకు ముందు మేం రోజుకు 70– 80 హండీల బిర్యానీ సిద్ధం చేసేవాళ్లం. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ బిర్యానీ విక్రయాలు తగ్గాయి. 30 హండీలు కూడా సేల్ కావటం లేదు. గతంలో మేం 15 హండీల మటన్ మాత్రమే విక్రయించేవాళ్లం. ప్రస్తుతం మటన్ బిర్యానీకి గిరాకీ పెరిగింది. గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువగా దాదాపు 45 హండీల మటన్ బిర్యానీ విక్రయిస్తున్నాం’ అని అఫ్జల్‌గంజ్‌లోని న్యూ గ్రాండ్ çహోటల్ యజమాని మహ్మద్ హుస్సేన్ యావరీ తెలిపారు. కాగా.. సాధారణ రోజుల్లోనే గ్రేటర్ పరిధిలో 3 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు ఉండగా.. ఆదివారం 10– 12 లక్షల కిలోలు అమ్మేవారు. ప్రస్తుతం లక్ష కిలోల చికెన్ విక్రయాలు కూడా జరగడం లేదు.
తగ్గిన ఆన్‌లైన్ ఆర్డర్లు..
స్విగ్గీ ఆర్డర్లలో 90 శాతం చికెన్ బిర్యానీ ఉంటుంది. నాలుగు రోజులుగా స్విగ్గీ, జొమాటో నుంచి చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేసే వారి సంఖ్య 70 శాతం మేరకు పడిపోయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment