సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 ఏళ్లు పైబడిన వారిలో 2.35 లక్షల మంది బాత్రూమ్‌లో గాయపడుతున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక చెబుతోంది. ఇంట్లో అతి చిన్న గదే అయినప్పటికీ.. వంటగది తరువాత బాత్రూమ్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం.
బాత్రూమ్‌లో సంభవించే ప్రమాదాల కారణంగా ఒక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే నిత్యం 370 మంది మరణిస్తున్నారు. మన దేశంలో ఎముకల చికిత్స కోసం వెళుతున్న వారిలో దాదాపు 35నుంచి 45 శాతం మంది బాత్రూమ్‌లో జారిపడి గాయాల పాలైనవారే. ప్రముఖ సినీ నటి శ్రీదేవి దగ్గర్నుంచి తాజాగా చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు వరకూ అనేక మంది ప్రముఖుల మరణాలు బాత్రూమ్‌లోనే సంభవించాయి.
ఈ జాగ్రత్తలు పాటించాలి
వదులుగా ఉన్న టాయిలెట్ బౌల్ రిమ్‌పై కూర్చోవడం వల్ల అది అటూ ఇటూ కదిలి శరీరానికి గాయం చేయవచ్చు. ప్లాస్టిక్ సీట్లు పగిలిపోవడం, వ్యక్తి బరువు వల్ల కూలిపోవడం కూడా గాయాలు కలిగించవచ్చు. టాయిలెట్లలో సిగరెట్లు వంటివి పడేయడం వల్ల అవి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.
కోసుకుపోవటం, ఎముకలు విరగటం, వెన్నెముకకి గాయాలు, ఫ్రాక్చర్లు, వంటివి మామూలే. సాధారణంగా బాత్రూమ్ ప్రమాదాలు మనం టబ్‌లోంచి బయటకు వస్తున్నప్పుడో, టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడో, తువ్వాలు తీసుకుంటున్నప్పుడో లేదా జారుడు నేలపై నడిచినప్పుడో జరుగుతాయి. ఇలాంటివి ఆపాలంటే బాత్రూమ్ వాడుతున్నప్పుడు లైట్లు, డోర్ మ్యాట్లు వేయాలి. బాత్రూమ్ నేలను పొడిగా ఉండేలా చూసుకోవడంతో పాటు, పట్టుకోడానికి హ్యాండిల్స్ పెట్టించాలి.
పాశ్చాత్య టాయిలెట్‌లో కూర్చుని లేచే సమయంలో హ్యాండిల్ పట్టుకుని లేవాలి. బాత్రూమ్‌కి వెళ్లినప్పుడు లోపల గట్టిగా గడియపెట్టుకోవకపోవడం వృద్ధులకు మంచిది. షవర్ కింద స్నానం చేసే సమయంలో స్టూల్ వాడాలి. చల్లని నీటితో స్నానం చేసినప్పుడు ముందుగా తలపై కాకుండా పాదాలపై నీటిని పోసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చరిత్రలో కొన్ని దుర్ఘటనలు
♦ చైనాలోని జిన్ రాష్ట్ర పాలకుడు క్రీస్తు పూర్వం 581లో టాయిలెట్ పిట్‌లో పడి మరణించాడు.
♦చరిత్రలో మర్చిపోలేని దుర్ఘటన ఒకటి 1184 జూలై 26న సంభవించింది. ‘ఎర్ఫర్ట్ లెట్రిన్ విపత్తు’గా పిలిచే ఈ ప్రమాదం రోమన్ చక్రవర్తి హెన్రీ అనధికార సమావేశం నిర్వహిస్తుండగా.. దానికి హాజరైన వారి బరువు కారణంగా చెక్క భవనం రెండవ అంతస్తు నేల కూలిపోయింది. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి మునిగిపోవడంతో 60 మంది మరణించారు.
♦ 1760లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన కింగ్ జార్జ్ అక్టోబర్ 25న టాయిలెట్‌లో మరణించాడు.
♦1945లో జర్మన్ జలాంతర్గామి ఒక టాయిలెట్ ప్రమాదంలో మునిగిపోయింది.
♦1983 జూన్ 2న ఎయిర్ కెనడా విమానం–797 వెనుక లావెటరీలో మంటలు చెలరేగి విమానం మొత్తం కాలిపోయింది. ప్రమాదంలో 23 మంది మరణించారు.
♦ బ్రిటిష్ వ్యాపారవేత్త, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు క్రిస్టోఫర్ షేల్ జూన్ 26, 2011న గ్లాస్టన్‌బరీ ఫెస్టివల్‌లో పోర్టబుల్ టాయిలెట్‌లో గుండెపోటుతో చనిపోయాడు.
♦ టాయ్‌లెట్ల ఫిట్టింగ్‌లు సరిగ్గా లేకపోవడం వల్ల ఏటా దాదాపు 10 వేల ఓడలు ప్రపంచవ్యాప్తంగా మునిగిపోతున్నాయి.
వృద్ధుల ప్రాణాలు తీస్తున్నాయ్
ఇంట్లో 65 ఏళ్లు పైబడిన పెద్దవారు ఉంటే.. బాత్రూమ్ ప్రమాదాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి నలుగురిలో ముగ్గురు వృద్ధులు ఏడాదికి ఒకసారైనా బాత్రూమ్‌లో జారిపడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాల్లో 65 శాతం చిన్న గాయాలతో సరిపెట్టినా.. మిగతా 35 శాతం మాత్రం ప్రాణాలు తీస్తున్నాయి. మన దేశంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. దేశంలో 42 శాతం మంది టాయిలెట్లలో 7 నుంచి 10 సార్లు ప్రమాదాలకు గురవుతున్నారు.
58 శాతం మంది 11 నుంచి 15 సార్లు పడిపోతున్నారు. సరైన తలుపులు లేకపోవడం ప్రమాదానికి వంద శాతం కారణమవుతుండగా, జారే ఫ్లోర్ 91.9 శాతం, బాత్రూమ్ పరిమాణం 80.3 శాతం, ఎత్తైన తలుపు థ్రెషోల్డ్ 53.5 శాతం, నాన్–స్కిడ్ మ్యాట్ లేకపోవడం 99.5 శాతం, గ్రాబ్ బార్‌లు లేకపోవడం 97 శాతం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకపోవడం 96.6 శాతం, బాత్రూమ్‌లో వెలుతురు సరిపోకపోవడం వల్ల 94.4 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి.
వేడి నీటి వినియోగం 89.9 శాతం, సీట్ ఉపరితలం 55.6 శాతం, ప్రవేశ ద్వారం వద్ద లైట్ స్విచ్ లేకపోవడం 53 శాతం, చిందరవందరగా ఉన్న మార్గం వంటివి 39.4 శాతం కారణమవుతున్నాయి. ఎన్‌సీబీఐ మార్కెటింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. 11 శాతం హార్ట్ అటాక్‌లు బాత్రూమ్‌లోనే వస్తున్నాయి. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లేదా స్నానం చేస్తున్న సమయంలో ఇవి సంభవిస్తున్నాయి.
అప్రమత్తంగా ఉండండి
బాత్రూమ్‌లో మరణించే వారిలో ఎక్కువ శాతం హార్ట్ అటాక్ వల్లే సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం చల్లని నీటితో తలస్నానం చేసినప్పుడు.. ఆ నీటిని తలపై పోసుకుంటే శరీరంలో ఆ భాగం చల్లగా మారుతుంది. దీంతో రక్తనాళాలు వెంటనే అలర్ట్ అయ్యి రక్తాన్ని ఒక్కసారిగా పైకి పంపిస్తాయి.
దీనివల్ల తల భాగం వైపు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ అటాక్ వస్తుంది. కొన్నిసార్లు పక్షవాతం కూడా రావచ్చు. జారి పడిపోయినప్పుడు తల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వెన్నుపూస కూడా విరగవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ సుధాకర్ కనపర్తి, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణుడు, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment