అతడి విమానం ఎంతో గొప్పదట!
అమెరికాః రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్షపదవికి పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ తన విమానం గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాడట. తాను ప్రచారానికి వినియోగించే స్వంత ఫ్లైట్ ముందు ఎయిర్ ఫోర్స్ విమానం కూడ ఎందుకూ పనికిరాదన్నాడట. తన విమానంలో ఉన్న ప్రత్యేక సౌకర్యాలు అధ్యక్షుడు ఒబామా ప్రయాణించే విమానానికి సైతం లేకపోవచ్చంటూ చెప్పడం చూస్తే... నిజంగా ఆయనగారి విమానం ఏ రేంజ్ లో ఉందోనని అంతా ఎగ్జైటింగ్ గా ఫీలయ్యారట.
తన ప్రచారంలో భాగంగా ఓ వేదికపై స్పీచ్ ఇస్తున్న డోనాల్డ్ ట్రంప్ తన విమానంగురించి చెప్పి మురిసిపోయాడట. విమానంలోని సీటు బెల్టులకు, బాత్ రూం లోని ట్యాప్ లకు సైతం బంగారు పూత పూసి ఉంటుందని చెప్పుకొచ్చాడట. సాధారణంగా బోయింగ్ విమానం అంటే 200 మంది ప్రయాణీకులతో, ఎయిర్ హోస్టెస్ లతో సందడి చేస్తుంది. అలాంటిది ట్రంప్ వినియోగించే బోయింగ్ 757 విమానం మాత్రం ఆయన చెప్పినట్లుగానే ప్రత్యేక సౌకర్యాలు కలిగి ఉందట. కేవలం 43 మంది ప్రయాణీకులు మాత్రమే ఎక్కగలిగేట్లు విమానంలో ఏర్పాట్లు చేశారట. స్టాబాంగ్ ఏవియేషన్ నిర్వహణలో ఆ ప్రత్యేక విమానం నడుస్తుంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అల్టెన్ నుంచి ట్రంప్ ఆ విమానాన్ని 2005 సంవత్సరంలోనే కొనుగోలు చేసి, అనంతరం అందులో తనకు కావలసినట్లుగా మార్పులు చేర్పులు చేసుకున్నాడు.
నిజంగా ట్రంప్ సొంత విమానం చూస్తే అన్ని హంగులూ కలిగిన స్వంత గృహంలా కనిపిస్తుంది. విమానంలో లగ్జరీ సీట్లు, వాటికున్న బెల్టులకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పూత ఉంటాయి. తన అభిరుచికి తగ్గట్లుగా చేసుకున్న ఏర్పాట్లలో ముఖ్యంగా విమానంలో మీటింగ్ హాళ్ళు, సిల్క్ లైన్ మాస్టర్ బెడ్ రూం, సుమారు వెయ్యి చిత్రాలను ప్రదర్శించగలిగే శక్తి ఉన్న 57 అంగుళాల టెలివిజన్, సకల సౌకర్యాలు కలిగిన బాత్ రూం లు, వీలైనంత వరకూ బంగారు పూతతోనే కనిపిస్తాయట. ఈ ప్రత్యేక విమానంలోనే ఆయన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఇన్ని హంగులతో కూడిన ఆ విమానం ప్రస్తుతం 100 మిలియన్ డాలర్లు అంటే.. సుమారు 675 కోట్ల రూపాయలు విలువ చేస్తుందట.