వృద్ధాప్యంలో కీలక సమస్య ‘ఫాల్’
డాక్టర్ సలహా
ఇటీవల పెద్దవయసు వారు బాత్‌రూమ్‌ల్లోనూ, మెట్ల దగ్గర పడిపోతున్న ఉదంతాలను ఎక్కువగా చదువుతున్నాం. ఇలా పడిపోయే అవకాశాలను ముందుగా తెలుసుకునే పరీక్షలు ఏమైనా ఉన్నాయా? - సీహెచ్. సుదర్శన్‌రావు, మహబూబ్‌నగర్
ఫాల్ అంటే పడిపోవడం. వృద్ధుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ. చిన్నవయసు వారు పడిపోయి, ఫ్రాక్చర్ అయినా వారు కోలుకునే వ్యవధి తక్కువ. ఎముక అతుక్కునే తీరు కూడా వేగంగా జరుగుతుంది. కానీ పెద్దవారు పడిపోయి, ఎముక ఫ్రాక్చర్ అయితే అది మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే తాము పడిపోయే అవకాశాన్ని వృద్ధులు తమకు తామే పరీక్షించుకోవచ్చు. ముందుగా మీ కుడి చేతిని గోడకు ఆనించి నిలబడండి. దాన్ని గోడకు ఆనించి ఉంచే పిడికిలి బిగించి నేరుగా ముందుకు చాపండి. ఇలా కుడి చేతిని నిటారుగా ఉంచి ముందుకు కొద్దికొద్దిగా ఒంగుతూ... పడిపోకుండా గరిష్టంగా ఎంతమేరకు ఒంగగలరో చూడండి. ముందుకు ఒంగకుండా కేవలం కుడి చేయి చాచి ఉన్నప్పుడూ.... పడిపోకుండా ముందుకు ఒంగుతూ చాచిన చేతిని పొడిగించినప్పుడూ ఉన్న తేడా ఒక అడుగు (30 సెం.మీ.) ఉంటే అలాంటి వృద్ధుల్లో ‘ఫాల్’కు (పడిపోవడానికి) అవకాశం చాలా తక్కువ.
అయితే ఒకవేళ ఇలా ఒంగుతూ చేతిని సాచినప్పుడు మీరు మీ చేతిని కేవలం 30 సెం.మీ లోపే సాచగలుగుతుంటే మాత్రం బాత్‌రూమ్‌లోనో లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడో లేదా ఇతరత్రా కార్యకలాపాల్లో పడిపోయే అవకాశాలు ఎక్కువ అని గుర్తించండి. ఇలాంటి వాళ్లు నడిచేసమయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఇతరుల సహాయం తీసుకోవాలి.
- డాక్టర్ బి. విజయకుమార్, సీనియర్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్