స్నానం చేస్తుండగా వీడియో తీసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్టు
* సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఘనకార్యం
* నిందితుడి అరెస్టు
సాక్షి,హైదరాబాద్: బాత్‌రూంలో యువ తి స్నానం చేస్తుండగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దొంగచాటుగా తన సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ ప్రబుద్ధుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మెహిదీపట్నం సమీపంలోని హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి లో ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ ఆనంద్ కథనం ప్రకారం... గచ్చిబౌలిలో నివాసముండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దినేష్ (29) రెండు రోజుల క్రితం హుమాయూన్‌నగర్‌లో తన బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం అతను తన ఇంటి పరిసరాల్లో వాకింగ్ చేస్తుండగా.. ఎదురింట్లోని బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే అతను బాత్‌రూమ్ వెంటిలేటర్‌లోంచి చూడగా యువతి స్నానం చేస్తూ కనిపించింది.
అతను తన సెల్‌ఫోన్ ద్వారా ఆ దృశ్యాలు చిత్రీకరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అలికిడి రావడంతో ఉలిక్కిపడ్డ యువతి వెంటిలేటర్ వైపు చూడగా.. సెల్‌ఫోన్‌తో ఎవరో చిత్రీకరిస్తున్నట్టు కనిపించింది. ఆమె పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి దినేష్‌ను పట్టుకున్నారు. అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దినేష్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.