విశాఖపట్నం: అంతటా సందడి వాతావరణం.. కొత్త జీవితంలో అడుగు పెడుతున్న ఆ జంటను చూసి ఇరు కుటుంబాల సంతోషానికి అవధుల్లేవు. పాస్టర్లు ప్రార్థనలు చేసి, క్రీస్తు దీవెనలు అందజేశారు. నూతన జంట కలకాలం చల్లగా వర్థిల్లాలని ఆశీర్వదించారు. ఉంగరాలు మార్చుకునే క్షణం రానేవచ్చింది. ఇంతలో బిగ్ ట్విస్ట్. పెళ్లి కొడుకు బాత్రూమ్‌కు అని చెప్పి వెళ్లాడు. అక్కడి నుంచి ఎంతకీ రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. బాత్రూమ్ వద్దకు వెళ్లి తలుపులు ఎంత కొట్టినా అతను తెరవలేదు. చివరకు బతిమలాడటంతో బయటకు వచ్చి పెళ్లి ఇష్టం లేదని బాంబు పేల్చాడు.
ఏవో కుంటిసాకులు చెప్పుకొచ్చాడు. దీంతో బంధువులు, పెళ్లి పెద్దలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా కొడతారేమోనన్న భయంతో వరుడు డయల్ 100కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్టేషన్‌కు పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె, వారి బంధువులను పిలిపించారు. వరుడు, వధువుకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. అర్థం పర్థం లేని వరుడి తీరును చూసి వధువు, ఆమె బంధువులు వివాహానికి నిరాకరించారు. పెద్దల సమక్షంలో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఈ వివాహం రద్దయింది.
ఈ ఘటన బుధవారం పాత గోపాలపట్నంలోని ఓ చర్చిలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన అమ్మాయికి, పాత గోపాలపట్నంకు చెందిన అబ్బాయికి మూడు నెలల కిందట పెళ్లి సంబంధం కుదిరింది. కట్నంగా రూ.3 లక్షలు, తులమున్నర చైన్, ద్విచక్రవాహనం లాంఛనంగా ఇచ్చేందుకు పెళ్లి కుమార్తె తరఫు వారు అంగీకరించారు. బుధవారం వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. కొద్ది క్షణాల్లో పెళ్లి తంతు ముగుస్తుందనగా.. వరుడు తీరుతో రద్దయింది. పెళ్లి సంబంధం కుదిర్చిన తర్వాత ఫోన్‌లో అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదన్న కారణంతో పెళ్లికి వరుడు నిరాకరించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment