ఈ హాస్టళ్ల ఉండలేం!
‘తానం చేద్దామంటే బాత్‌రూమ్‌లు బయట ఉన్నయి. తొవ్వొంట పోయే అబ్బాయిలు వచ్చి భయపెడుతండ్రు. ప్రహరీ లేక ఎప్పుడుపడితే అప్పుడు వత్తండ్రు.. బెదిరిత్తండ్రు. నిన్న ఇద్దరు అబ్బాయిలు వచ్చిండ్రు. కొట్టినంత పనిచేసిండ్రు. అందరం కలిసి తరిమినం. ఎవలకు చెప్పుకోమంటరు. ఎప్పుడు ఏమైతదో తెల్వదు. ఆడపిల్లలం.. మాకేమైన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తరు. మమ్ములను మా ఇంటికి పంపించుండ్రి. మేం ఇక్కడ ఉండలేం.. రక్షణ కల్పించకుంటే దసరకు పోయి మళ్లరానేరాం..’ అంటూ హుస్నాబాద్‌లోని కస్తూరిబా గిరిజన బాలికల ఆశ్రమ విద్యాలయం విద్యార్థినులు మంగళవారం హాస్టల్‌పెకైక్కి ఆందోళనకు దిగారు. ‘మీ పిల్లలను ఇలాంటి హాస్టల్‌లో ఉంచుతారా..’ అంటూ అధికారులను ప్రశ్నించారు.
హుస్నాబాద్ :
కస్తూరిబా బాలికల విద్యాలయం పట్టణానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూర్తిగా నిర్మానుష్య ప్రదేశంలో నిర్మించిన దీనికి ప్రహరీ చేపట్టలేదు. స్నానపుగదులు బయటే ఉన్నాయి. దీంతో పట్టపగలే ఆకతాయిలు విద్యాలయంలోకి చొరబడి బెదిరిస్తున్నారని పేర్కొంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పాఠశాల భవనంపెకైక్కి నిరసన తెలిపారు. ప్రహరీ నిర్మించాలని, అప్పటివరకు తమను ఇళ్లకు పంపించాలని, లేకుంటే దసరా సెలవులకు ఇంటికెళ్లి తిరిగిరాబోమని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ విజయ్‌సాగర్, ఎస్సై మహేందర్‌రెడ్డి, వార్డెన్ మమత అక్కడికి చేరుకున్నారు. అబ్బాయిలు తరచూ వస్తున్నారని, పిల్లలను బెదిరింపులకు గురిచేస్తున్నారని హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్నెల్ల క్రితం హడావుడిగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రహరీ ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. పాములు, తేళ్లు, విష పురుగులు వస్తున్నాయని, అయినా తమను పట్టించుకున్న వారు లేరని ఆందోళన వ్యక్తం చేశారు.
వారం రోజుల్లో తాత్కాలిక కంచె
ప్రహరీ నిర్మించడంలో భూమి పట్టాదారుడితో వివాదం ఉందని, వారంలోపు తాత్కాలికంగా కంచె ఏర్పాటు చేయిస్తామని తహశీల్దార్ విద్యార్థినులకు హామీ ఇచ్చారు.
కలెక్టర్‌తో మాట్లాడుతా
: ఎమ్మెల్యే వొడితెల
బాలికలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సాయంత్రం విద్యాలయాన్ని సందర్శించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ప్రహరీ నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చుట్టూపక్క రైతులతో మాట్లాడాలని తహశీల్దార్‌కు సూచించారు.