కేజీబీవీ విద్యార్థినులపై ప్రిన్సిపాల్ దాష్టీకం
అల్లూరి జిల్లాలో ఘటన
జి.మాడుగుల: అసెంబ్లీకి సమయానికి రాలేదని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలోని కస్తూర్బా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదువుతున్న విద్యార్థినుల జుత్తును ప్రిన్సిపాల్ కత్తిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజైన శుక్రవారం నాడు పాఠశాల, కళాశాల విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకొని పూజలు చేసుకొని ఆలస్యంగా కేజీబీవీకి వచ్చారు.
పాఠశాలలో రోజువారీ నిర్వహించే అసెంబ్లీకి ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు అలస్యంగా రావడంతో వారిపై ప్రిన్సిపాల్ ఆగ్రహించారు. విద్యార్థినులను పాఠశాల, కళాశాలల ఆవరణలో ఎండలో 2 గంటలు సేపు నిలబెట్టారు. అసెంబ్లీకి రాని విద్యార్థినుల్లో కొంతమందిని దండించారు. వీరిలో 15 మందికి జట్టును ఇష్టానుసారంగా కత్తిరించారు.
మనోవేదనకు గురైన విద్యార్థినులు ప్రిన్సిపాల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచినా.. వెంబడించి మరీ జుత్తు కత్తిరించినట్టు సమాచారం. వీరిలో ఒక విద్యార్థిని దేవుని మొక్కు ఉందని జుత్తు కటింగ్ చేయవద్దని ప్రాథేయపడినా ప్రిన్సిపాల్ కనికరించలేదు. జుత్తు కట్ చేస్తున్న సమయంలో మనోవేదనకు గురైన ఒక విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయినప్పటికీ తాగడానికి మంచినీరు కూడా ప్రిన్సిపాల్ అందించటానికి నిరాకరించారు.
క్రమశిక్షణ నేర్పాలనే...
విద్యార్థినుల జుత్తు కత్తిరింపుపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సాయి ప్రసన్నను వివరణ కోరగా విద్యార్థినుల జుత్తు బాగా పెరిగిపోవడం వల్ల పేలు పట్టి, తలపై కురుపులు వస్తాయని, క్రమశిక్షణగా ఉంటారనే ఉద్దేశంతో జుత్తు కట్ చేసినట్లు తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సాయిప్రసన్న తెలిపారు.
ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం
కేజీబీవీలో విద్యార్థినుల జుత్తును అకారణంగా కటింగ్ చేసినట్టు కొంతమంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమ దృష్టికి తీసుకు వచ్చారని ఎంఈవో బాబూరావుపడాల్ తెలిపారు. ఈ విషయంపై కేజీబీవీని సందర్శించేందుకు వెళ్లగా ప్రిన్సిపాల్ సెలవులో ఉన్నట్టు చెప్పారన్నారు. అక్కడ నుంచి ఫోన్‌లో ప్రిన్సిపాల్‌ని సంప్రదించగా విద్యార్థినులకు జుట్టు పెరిగిపోయిందని, క్రమశిక్షణ(డిసిప్లేన్) కోసం విద్యార్థినుల్లో కొంతమంది జత్తు కటింగ్ చేసినట్టు చెప్పారని ఎంఈవో తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖ, జీసీడీవోకు సమాచారం అందించామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment