2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి మెరుగైన లింగ ఆధారిత బడ్జెట్ అమలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ప్రస్తావించకుండానే గత ప్రభుత్వ ఫలితాలను జెండర్ బడ్జెట్ ఉపోద్ఘాతంలో ప్రస్తావించిన కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్టంలో మహిళా సాధికారత కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన కృషిని కూటమి ప్రభుత్వం భేష్ అని పరోక్షంగా ప్రస్తావించక తప్పలేదు. కూటమి సర్కారు సోమవారం ప్రవేశపెట్టిన జెండర్ బడ్జెట్ ఉపోద్ఘాతంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండానే గత ప్రభుత్వం సాధించిన ఫలితాలను ప్రస్తావించింది. రాష్ట్రంలో మహిళలను విద్య, ఉపాధి, సంక్షేమం, ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో సాధికారత వైపు అడుగులు వేయించేలా ఐదేళ్ల (2021–25) పటిష్ట కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర బడ్జెట్‌లో కొంతభాగాన్ని జెండర్ బడ్జెట్ పేరుతో మహిళాభివృద్ధికి ప్రభుత్వం 2021–22 నుంచి కేటాయింపులు చేస్తోంది. 2021–22లో మొదలైన జెండర్ బడ్జెట్ 2022–23 నాటికి మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మొదలైంది.
విద్య, ఉపాధి, భూమి కేటాయింపు వంటి అనేక కీలకమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్ పనుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టం చేయడంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది. దీంతో మహిళలు ఇంటి యాజమాన్యంతోపాటు రాజకీయంగానూ, సామాజికంగానూ ముందడుగు వేశారు. ఫలితంగా మహిళా సాధికారతలో జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ రూపొందించిన ర్యాంకింగ్లో 4 నుంచి మూడో ర్యాంకును సాధించింది. 18 మహిళా పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, వన్‌స్టాఫ్ సెంటర్లు, హెల్ప్‌డెస్‌్కల ఏర్పాటు వంటి అనేక చర్యలు చేపట్టింది. ఇలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అంశాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జెండర్ బడ్జెట్‌లోని ఉపోద్ఘాతంలో ప్రస్తావించడం విశేషం.
జెండర్ బడ్జెట్ కేటాయింపులు ఇలా
ప్రత్యేకంగా మహిళలు, బాలికల కోసం ఉద్ధేశించిన జెండర్ బడ్జెట్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం ప్రధాన కేటాయింపులు తగ్గించింది.
⇒ కూటమి ప్రభుత్వం(2024–25) బడ్జెట్‌లో 100శాతం కేటాయింపులు (పార్ట్–ఏ ప్రోగ్రామ్)లో రూ.20,935.56కోట్లు కేటాయించింది. 30 నుంచి 99శాతం లబ్ధి కలిగే పథకాలు (పార్ట్–బి ప్రోగామ్)లో రూ.58,355.44కోట్లు కేటాయించింది. మొత్తం రూ.79,291కోట్లు మాత్రమే కేటాయించింది.
చిన్నారుల సంక్షేమానికి ఇలా..
⇒ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిన్నారుల సంక్షేమానికి మొత్తం రూ.21,910.75కోట్లు కేటాయించింది. నూరు శాతం పిల్లలకే ఉద్దేశించిన పథకాలు (పార్ట్–ఎ)లో రూ.13,793.51కోట్లు, పార్ట్–బిలో రూ.8,117.24కోట్లు మాత్రమే కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment