మయామి: అమెరికా రహస్య పత్రాల కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన నేరాభియోగాల్లో ఎన్నో ఊహకందని అంశాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ తనతో పాటు గుట్టలు గుట్టలుగా రహస్య పత్రాలను కార్డ్‌బోర్డ్ బాక్సుల్లో ఉంచి ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో ఎస్టేట్‌లో ఉంచారు. ఆ ఎస్టేట్‌లో ఆయన ఆ పత్రాలను ఉంచని స్థలమే లేదంటే అతిశయోక్తి కాదు. బెడ్ రూమ్, బాల్‌రూమ్ (డ్యాన్స్‌లు చేసే గది), బాత్‌రూమ్, ఆఫీసు రూమ్, స్టోరేజీ రూమ్ ఇలా ప్రతీ చోటా దాచి ఉంచారు. చివరికి టాయిలెట్‌లో షవర్‌పైన, సీలింగ్‌లో ఆ బాక్సుల్ని ఉంచడం ఫొటోల్లో కనిపించింది. కీలకమైన పత్రాలను కూడా ట్రంప్ నిర్లక్ష్యంగా నేలపై పడేశారని అభియోగాల్లో వివరించారు. మొత్తం 13 వేలకు పైగా రహస్య పత్రాలు ట్రంప్ ఎస్టేట్‌లో లభిస్తే, అందులో 300 పత్రాలు అత్యంత రహస్యమైనవి ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ట్రంప్‌పై 37 అభియోగాలను నమోదు చేసింది.
కీలక సమాచారం..
ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య ప్రాంతాల్లో దేశ భద్రత, సైనిక వ్యవస్థకి సంబంధించిన కీలక సమాచారం ఉంది. అమెరికా అణు కార్యక్రమాలు, అమెరికా, ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధ సంపత్తి, అమెరికా దాని మిత్రదేశాలకు పొంచి ఉన్న మిలటరీ ముప్పు, ప్రతీకారంగా చేయబోయే ఎదురు దాడులకు సంబంధించిన వ్యూహరచనలు వంటివి ఉన్నాయి. ట్రంప్ శ్వేతసౌధం ఖాళీ చేసి వెళ్లిన తర్వాత ఏడాది పాటు ఆ పత్రాలన్నీ ఎస్టేట్‌లోనే ఉన్నాయని, రోజూ వేలాది మంది అతిథులు వచ్చే ఆ ఎస్టేట్‌లో ప్రభుత్వ రహస్యాలు ఎన్ని బయటకు పొక్కాయోనని ప్రాసిక్యూటర్ ఆందోళన వ్యక్తం చేశారు. వైట్ హౌస్ ఖాళీ చేసే సమయంలో ట్రంపే ఆ పత్రాలన్నీ బాక్సుల్లో సర్దినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది.
ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారా ?
ఒక ప్రైవేటు పార్టీలో ట్రంప్ రహస్య పత్రాల్లోని సమాచారాన్ని కూడా పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడికి సన్నాహాలు చేస్తోందంటూ సున్నితమైన సమాచారాన్ని ట్రంప్ తన పొలిటికల్ యాక్షన్ కమిటీలో ఉన్న వ్యక్తులతో 2021లో జరిగిన ఒక పార్టీలో పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా మిలటరీ ఆపరేషన్ చేపట్టాలనుకుంటున్న ఒక దేశం మ్యాప్‌ను చూపిస్తూ ఏదో మామూలు సమాచారమంటూ షేర్ చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి.
ఆడియో సంభాషణలతో బిగుస్తున్న ఉచ్చు?
ట్రంప్‌పై నమోదైన అభియోగాలతో పాటు సాక్ష్యాల కింద వీడియోలు, ట్రంప్ అనుచరులతో మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఫోన్ మెసేజ్‌లు ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించింది. ఆ ఆడియో టేపుల్లో ట్రంప్ ‘‘ఆ బాక్సుల్ని ఎవరూ చూడొద్దు. అసలు ఇక్కడ ఏమీ లేవని వారికి చెబితే సరి. వారి ప్రశ్నలకు బదులివ్వకపోతే ఇంకా మేలు. వారితో ఆడుకోవడం మంచిది కాదు’’ వంటివి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment