papers
-
బహిరంగంగా ప్రశ్నాపత్రాలు.. నేటి నుంచి వార్షిక పరీక్షలు!
బీహార్ విద్యాశాఖ లీలలు తరచూ బయటపడుతుంటాయి. రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్ సెక్రటరీ కెకె పాఠక్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీహార్ విద్యావ్యవస్థలో మార్పురావడం లేదు. దీనికి ఉదాహరణగా ఛప్రా జిల్లా పాఠశాల నిలిచింది. ఈ పాఠశాలలో బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ నిర్వహించబోయే 11వ, 9వ తరగతుల వార్షిక పరీక్షల ప్రశ్న పత్రాల బండిల్స్ బహిరంగంగా విసిరివేశారు. వీటిని పంపిణీ చేసేందుకు విద్యాశాఖలో ఏ ఉద్యోగి బాధ్యత తీసుకోలేదు. జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తమ పాఠశాల కోడ్ ప్రకారం ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లేందుకు ఈ పాఠశాలకు వచ్చి, టెర్రస్ అంతా కలియ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు 9,11 తరగతుల వార్షిక పరీక్షలను మార్చి 13 నుంచి నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు తమ పాఠశాల కోడ్ ప్రకారం ప్రశ్నపత్రాలను వెదికేందుకు గత మూడు రోజులుగా ఇక్కడే తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. పరీక్ష తేదీ సమీపించినా కొన్ని పాఠశాలలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సంబంధిత ఉపాధ్యాయులకు ఇంకా చేరనేలేదు. మీడియాకు అందిన అందిన సమాచారం ప్రకారం 11వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 13 నుంచి, 9వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో తూర్పు చంపారన్‌లో కూడా విద్యాశాఖాధికారుల ఇటువంటి నిర్లక్ష్యం కనిపించింది. -
క్రిసిల్ సంస్థ పేరుతోనూ పురందేశ్వరి తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై క్రిసిల్ సర్వే నివేదిక అంటూ శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చూపిన కాగితాలు అసలు ఆ సంస్థకు సంబంధించిన నివేదికే కాదని తేలింది. వాటిని చూపిస్తూ (ప్రతులు మీడియా ప్రతినిధులకు ఇవ్వలేదు) ఆమె రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తీరా చూస్తే.. ఆ కాగితాలు ఓ వ్యక్తి తన పరిశోధన కోసం క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ రిపోర్ట్)గా వెబ్సైట్లో రాసుకున్న అంశాలని సాక్ష్యాధారాలతో స్పష్టమైంది. ఆ కాగితాలను పురందేశ్వరి మీడియాకు చూపిస్తున్నప్పుడు తీసిన ఫొటోలోనూ అదొక ఆన్లైన్ వెబ్సైట్లో ఉంచిన గ్రౌండ్ రిపోర్టు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన గ్రౌండ్ రిపోర్టును ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చి(ఎన్సీఏఈఆర్)’ సంస్థకు పరిశీలనకు సమర్పించారు. ఎన్సీఏఈఆర్ ఆ రిపోర్టును తిరస్కరించింది. అంటే.. అందులో వివరాలు అవాస్తవాలు, విలువ లేనివి. ఆ వ్యక్తి గ్రౌండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలు కూడా 2020 మే నెల 7వ తేదీ నాటిది. అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయి అప్పటికి ఏడాది కూడా పూర్తవదు. దీనినే క్రిసిల్ నివేదిక అంటూ పురందేశ్వరి రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు మేరకే స్కిల్ స్కాంపై సీఐడీ కేసు: పురందేశ్వరి ఎవరో విజిల్ బ్లోయర్ (అవినీతికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలిసిన అజ్ఞాత వ్యక్తి) ఫిర్యాదు మేరకే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసి, విచారణ జరిపి చంద్రబాబు అరెస్టు దాకా వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆమె శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేసుపై విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం లేదు. అరెస్టు చేసిన విధానంలో లోపాలు ఉన్నాయని బీజేపీ ఆనాడే చెప్పింది. అవినీతి జరిగిందా లేదా అన్నది కోర్టే తేల్చాలి’ అని అన్నారు. చంద్రబాబు ఆయన భద్రత, చికిత్స బాధ్యత ఎవరిదో వారినే అడగాలని అన్నారు. తనను అమిత్ షా పిలిచారని లోకేశ్ చెబుతున్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘ఎవరు పిలిచారన్నది అప్రస్తుతం. లోకేశ్‌కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు ఆరోగ్య స్థితి, కేసు, సెక్షన్లు, జడ్జిలు ఎవరో ఆరా తీశారు. బాబు అరెస్టులో బీజేపీ హస్తం ఉంటే వారు ఎలా కలుస్తారు?’ అంటూ బదులిచ్చారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరమన్న లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించనని చెప్పారు. ఆరోపణలపై జగన్ సిబీఐ విచారణ కోరాలి రాష్ట్రంలో మద్యం తయారీ, నాణ్యత, అమ్మకాలు, ఇసుక, మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని, సీఎంజగన్ నిజాయితీని నిరూపించుకునేందుకు సీబీఐతో విచారణ చేయించుకోవాలని పురందేశ్వరి సవాల్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 20 మద్యం తయారీ సంస్థలలో 12 చంద్రబాబు కాలంలోనే అనుమతులు పొందాయని, అయితే 2019 తర్వాత మద్యం తయారీదారుల్ని బెదిరించి వైఎస్సార్సీపీ నేతలు వాటిని లాక్కున్నారని ఆరోపించారు. -
పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు!
సాక్షి, పెద్దపల్లి: టీఎస్పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్‌చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. జూన్ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాలను దిగజార్చిన కేసీఆర్
చుంచుపల్లి: ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లా డారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని ప్రలోభా లకు గురిచేసి తమ వైపు తిప్పుకునే సంస్కృతి బీఆర్ఎస్లో కొనసాగుతోందని, ప్రలోభాలకు లొంగకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘ఎవడిపాలైందిరో తెలంగాణ’ అనే పాటతో రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసిన సోమన్న.. గతంలో ఈ ప్రభుత్వంతో కొట్లాడారని, అలాంటి వ్యక్తి నేడు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యాడని, నాయకులను, ప్రజాగాయకుల ను ఎలా లొంగదీసుకుంటున్నారో దీన్ని బట్టే అర్థం అవుతోందని ఈటల వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వ హయాంలో వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి 17 పేపర్లు లీక్ అయ్యాయని, ఫలితంగా ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలు ఆగమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబంలో ఐదు పదవులు ఉన్నాయని, అవి కూడా అత్యంత కీలకమైన శాఖలని గుర్తుచే శారు. కాగా, బీజేపీకి సంబంధించి అసెంబ్లీ ఎన్ని కల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చురుగ్గా సాగుతోందని, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో దరఖాస్తుల పరిశీ లన జరుగుతోందని ఆయన చెప్పారు. -
వేస్ట్ పేపర్‌తో వావ్ అనిపించే బొమ్మలు!!..చిత్తుకాగితానికి కొత్తరంగు
న్యూస్‌పేపర్ జీవితకాలం ఒక్కరోజు మాత్రమే. ఈ రోజు పేపర్‌కున్న విలువ మరుసటి రోజుకు ఉండదు. ఏరోజుకు ఆరోజు కొత్తపేపర్ కావాల్సిందే. అందుకే నిన్నటి పేపర్ చిత్తుకాగితంగా మారిపోతుంది. ఇలా టన్నులకొద్దీ పేపర్ భూమిలో కలిసిపోవడం నచ్చని సిమ్రాన్.. కాగితాలతో పేపర్ మఛే క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తోంది. వేస్ట్ పేపర్‌ను వావ్ అనేలా తీర్చిదిద్దుతోంది. ప్రయాగ్ రాజ్‌కు చెందిన ఇరవైఎనిమిదేళ్ల సిమ్రాన్ కేసర్వాణికి చిన్నప్పటి నుంచి వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడమంటే చాలా ఇష్టం. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సాంప్రదాయ క్రాఫ్ట్స్‌ను తయారు చేస్తుండేది. ఫ్యాషన్ డిగ్రీ పూర్తయ్యాక, ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లొమా చేసింది. తనతోటివారిలా కార్పొరేట్ రంగంలో అడుగుపెట్టాలనుకోలేదు. తనకెంతో ఇష్టమైన క్రాఫ్ట్స్ తయారీనే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా సృజనాత్మకంగా చేయాలని ఆలోచిస్తోన్న సిమ్రాన్‌కు.. చిన్నతనంలో చేసిన ‘టోఫీ బాక్స్’ గుర్తుకువచ్చింది. సిమ్రాన్ పుట్టినరోజుకి టోపీ బాక్స్‌లు తయారు చేసి పంచింది. ఆ బాక్స్‌లు చూసిన వారంతా సిమ్రాన్ ప్రతిభను చూసి తెగ మెచ్చుకున్నారు. దీంతో ‘పేపర్మఛే క్రాఫ్ట్స్’ తయారు చేయడం ప్రారంభించింది. పేపర్‌ను పేస్టుచేసి.. పురాతన కాలం నుంచి మఛే క్రాఫ్ట్స్‌కు మంచి గుర్తింపు ఉంది. పేపర్‌ను నానబెట్టి, తరువాత పేస్టులా నూరి వివిధ రకాల అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. దీనినే పేపర్ మఛే క్రాఫ్ట్స్ అంటారు. ఇవి పర్యావరణానికి ఎటువంటి హానీ చేయవన్న భరోసాతో సిమ్రాన్ వీటిని ఎంచుకుంది. కస్టమర్ల దృష్టిని ఆకర్షించే విధంగా వివిధ ఆకారాల్లో ఈ క్రాఫ్ట్స్ తయారు చేయడం మొదలు పెట్టింది సిమ్రాన్. పేపర్ వెయిట్స్, ఫోల్డర్స్, చెరియాళ్ మాస్క్‌లు, ఆకర్షణీయమైన వివిధరకాల ఇంటి అలంకరణ వస్తువులను తయారు చేస్తోంది. ఈ క్రాఫ్ట్స్‌ను మరింత నాణ్యంగా అందంగా తయారు చేసేందుకు స్థానిక కళాకారుల వద్ద మెళకువలు నేర్చుకుంటోంది. అడ్డంకులు అధిగమించి... ‘‘పేపర్ మఛే క్రాఫ్ట్స్ తయారీ సర్టిఫైడ్ జాబ్ కాదు. దీనికి పెద్ద గుర్తింపు ఉండదు. నువ్వు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ చదువు’’ అని తల్లిదండ్రులు ఎంతగా హెచ్చరించినప్పటికీ తనని తాను నిరూపించుకోవాలన్న కసితో క్రాఫ్ట్స్ తయారీని ప్రారంభించింది సిమ్రాన్. అయితే సాంప్రదాయ కళాకృతుల గురించి అవగాహన తక్కువ ఉండడం, మార్కెట్ కొత్త కావడంతో సిమ్రాన్‌కు అనేక సమస్యలు ఎదురయ్యాయి. తనకెదురయ్యే ప్రతి వాళ్ల నుంచి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ.. సోషల్ మీడియా స్కిల్స్‌తో తన ఉత్పత్తులకు మార్కెట్ చేస్తోంది. వివిధరకాల ఎగ్జిబిషన్లలో పేపర్ మఛే క్రాఫ్ట్స్‌ను ప్రదర్శిస్తూ కస్టమర్లకు సరికొత్త అలంకరణ వస్తువులను పరిచయం చేస్తోంది. మద్దారీ మీటర్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కూడా మఛే క్రాఫ్ట్స్‌ను విక్రయిస్తోంది సిమ్రాన్. -
పనులు.. నిధులు.. పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ పదో తేదీలోపు వెలువడుతుందనే సంకేతాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్, సచివాలయానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు. తమ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని, వివిధ పనులకు సంబంధించిన పెండింగు బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు. నిధుల అడ్డంకి ఉంటే తాము ప్రతిపాదించిన పనులకు కనీసం పాలనా పరమైన అనుమతులు అయినా ఇప్పించాలని విన్నవిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సుమారు పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్నందున తమ వినతులను సత్వరం పరిష్కరించాలంటూ లేఖలు సమర్పిస్తున్నారు. కేటీఆర్ సంతకాలతో కూడిన సిఫారసు లేఖలను తీసుకుని సచివాలయంలోని సంబంధిత శాఖల ఉన్నతాధి కారులు, జిల్లా అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పనులు.. పోస్టింగులు ఎమ్మెల్యేల వినతుల్లో పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు తమ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వాటికి పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారు లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే వీరిలో తమకు అనుకూలురైన పోలీసు, రెవెన్యూ అధికారుల పోస్టింగుల కోసం కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే పోస్టింగులు పూర్తయిన కొన్నిచోట్ల మార్పులకు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే తక్షణం నిధుల విడుదలకు సంబంధం లేని పనులకు ఓకే చెప్తూ, ఇతర అంశాలను పరిశీలిస్తామని మాత్రమే కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ఎన్నికలు సమీపిస్తుండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. వీటితో పాటు తుది దశలో ఉన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా సంబంధిత శాఖల మంత్రులను ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తు న్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ నెల రోజుల క్రితం ఆగస్టు 21న సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది రెండేసి పర్యాయాలకు పైగా వరుస విజయాలు సాధించిన వారే ఉండటంతో వివిధ పథకాల ద్వారా లబ్ధి ఆశిస్తున్న వారి నుంచి వీరు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తమపై ఉన్న ప్రతికూలతను తొలగించుకునేందుకు, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే పనులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీసీబంధు, గృహలక్ష్మి ఒత్తిడి.. ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఎదురవు తున్నట్లు సమాచారం. బీసీబంధు పథకం కింద రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు చెక్కుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించగా, ప్రస్తుతం లబ్ధిదారులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిగతా రెండు విడ తలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరో వైపు గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు లబ్ధిదారుల జాబితా పై స్పష్టత వచ్చేలా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తు న్నారు. మరోవైపు సామాజిక పింఛన్ల కోసం కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ సంఖ్యలో దరఖా స్తులు అందుతున్నాయి. -
బెడ్ రూమ్ నుంచి బాత్రూమ్ వరకు.. ఆ రహస్య పత్రాల్లో ఏముందంటే..?
మయామి: అమెరికా రహస్య పత్రాల కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన నేరాభియోగాల్లో ఎన్నో ఊహకందని అంశాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ తనతో పాటు గుట్టలు గుట్టలుగా రహస్య పత్రాలను కార్డ్బోర్డ్ బాక్సుల్లో ఉంచి ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో ఎస్టేట్‌లో ఉంచారు. ఆ ఎస్టేట్‌లో ఆయన ఆ పత్రాలను ఉంచని స్థలమే లేదంటే అతిశయోక్తి కాదు. బెడ్ రూమ్, బాల్రూమ్ (డ్యాన్స్‌లు చేసే గది), బాత్రూమ్, ఆఫీసు రూమ్, స్టోరేజీ రూమ్ ఇలా ప్రతీ చోటా దాచి ఉంచారు. చివరికి టాయిలెట్లో షవర్పైన, సీలింగ్‌లో ఆ బాక్సుల్ని ఉంచడం ఫొటోల్లో కనిపించింది. కీలకమైన పత్రాలను కూడా ట్రంప్ నిర్లక్ష్యంగా నేలపై పడేశారని అభియోగాల్లో వివరించారు. మొత్తం 13 వేలకు పైగా రహస్య పత్రాలు ట్రంప్ ఎస్టేట్‌లో లభిస్తే, అందులో 300 పత్రాలు అత్యంత రహస్యమైనవి ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ట్రంప్‌పై 37 అభియోగాలను నమోదు చేసింది. కీలక సమాచారం.. ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య ప్రాంతాల్లో దేశ భద్రత, సైనిక వ్యవస్థకి సంబంధించిన కీలక సమాచారం ఉంది. అమెరికా అణు కార్యక్రమాలు, అమెరికా, ఇతర దేశాలకు సంబంధించిన ఆయుధ సంపత్తి, అమెరికా దాని మిత్రదేశాలకు పొంచి ఉన్న మిలటరీ ముప్పు, ప్రతీకారంగా చేయబోయే ఎదురు దాడులకు సంబంధించిన వ్యూహరచనలు వంటివి ఉన్నాయి. ట్రంప్ శ్వేతసౌధం ఖాళీ చేసి వెళ్లిన తర్వాత ఏడాది పాటు ఆ పత్రాలన్నీ ఎస్టేట్‌లోనే ఉన్నాయని, రోజూ వేలాది మంది అతిథులు వచ్చే ఆ ఎస్టేట్‌లో ప్రభుత్వ రహస్యాలు ఎన్ని బయటకు పొక్కాయోనని ప్రాసిక్యూటర్ ఆందోళన వ్యక్తం చేశారు. వైట్ హౌస్ ఖాళీ చేసే సమయంలో ట్రంపే ఆ పత్రాలన్నీ బాక్సుల్లో సర్దినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ప్రైవేటు వ్యక్తులతో పంచుకున్నారా ? ఒక ప్రైవేటు పార్టీలో ట్రంప్ రహస్య పత్రాల్లోని సమాచారాన్ని కూడా పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడికి సన్నాహాలు చేస్తోందంటూ సున్నితమైన సమాచారాన్ని ట్రంప్ తన పొలిటికల్ యాక్షన్ కమిటీలో ఉన్న వ్యక్తులతో 2021లో జరిగిన ఒక పార్టీలో పంచుకున్నట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా మిలటరీ ఆపరేషన్ చేపట్టాలనుకుంటున్న ఒక దేశం మ్యాప్‌ను చూపిస్తూ ఏదో మామూలు సమాచారమంటూ షేర్ చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఆడియో సంభాషణలతో బిగుస్తున్న ఉచ్చు? ట్రంప్‌పై నమోదైన అభియోగాలతో పాటు సాక్ష్యాల కింద వీడియోలు, ట్రంప్ అనుచరులతో మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఫోన్ మెసేజ్‌లు ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించింది. ఆ ఆడియో టేపుల్లో ట్రంప్ ‘‘ఆ బాక్సుల్ని ఎవరూ చూడొద్దు. అసలు ఇక్కడ ఏమీ లేవని వారికి చెబితే సరి. వారి ప్రశ్నలకు బదులివ్వకపోతే ఇంకా మేలు. వారితో ఆడుకోవడం మంచిది కాదు’’ వంటివి ఉన్నాయి. -
ఏ మి టీ రహస్య పత్రాల కేసు..?
అమెరికా అధ్యక్షుడు ఎవరైనా పదవి దిగిపోయిన వెంటనే తన అధీనంలో ఉన్న ప్రభుత్వ డాక్యుమెంట్లు జాతీయ ఆర్కీవ్స్ అండ్ రికార్డ్స్ ఏజెన్సీ (ఎన్ఏఆర్ఏ)కి అప్పగించాలి. ప్రభుత్వానికి సంబంధించిన ఆ రహస్య పత్రాలన్నీ జాతి సంపదగా భావిస్తారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలైన కొద్ది నెలలకి అంటే 2021 మేలో ఎన్ఏఆర్ఏ ట్రంప్ రహస్య పత్రాలు పూర్తిగా ఇవ్వలేదని తొలిసారిగా బయటపెట్టింది. రెండు డజన్ల బాక్సుల్లో ఉండే పత్రాలు ఇవ్వలేదని పేర్కొంది. దీనిపై విచారణ మొదలై ట్రంప్ అధీనంలో ఉన్న రహస్య పత్రాలన్నీ ఆర్కీవ్స్‌కు ఇవ్వాలంటూ కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 2021 జనవరిలో అధ్యక్షుడిగా గద్దె దిగిన ట్రంప్ వందలాది పత్రాలను తన అధీనంలోనే ఉంచుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాలతో ట్రంప్ తరఫు లాయర్లు మరో 30 పత్రాలు అందజేశారు. అంతకు మించి తమ దగ్గర ఏవీ లేవని స్పష్టం చేశారు. 2022 ఆగస్టులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రంగంలోకి దిగి ఫ్లోరిడాలోని ట్రంప్ ప్రైవేటు ఎస్టేట్ మార్ ఎ లాగోలో సోదాలు చేపడితే 15 బాక్సుల్లో 184 కీలక పత్రాలు లభించాయి. ఇందులో 67 విశ్వసనీయ పత్రాలు, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు లభించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే తరహా రహస్య పత్రాల కేసులో ట్రంప్ హయాంలో ఉపాధ్య’క్షుడిగా వ్యవహరించిన మైక్ పెన్స్, అంతకు ముందు ఉపాధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై కేసులు నమోదై ఉన్నాయి. వైట్ హౌస్ నుంచి అత్యంత కీలకమైన డాక్యుమెంట్లను ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే తీసుకువెళ్లారా ? గూఢచర్య చట్ట నిబంధనల్ని ట్రంప్ ఉల్లంఘించారా ? అన్న దిశగా ప్రాసిక్యూషన్ విచారణ సాగిస్తోంది.అయితే శ్వేతసౌధం ఖాళీ చేయడానికి తక్కువ సమయం ఇవ్వడంతో హడావుడిగా తీసుకువెళ్లిన సామాన్లలో పత్రాలు కూడా వచ్చి ఉంటాయని ట్రంప్ కార్యాలయం అప్పట్లో సమర్థించుకుంది. ట్రంప్ ఎదుర్కొంటున్న కేసులు ఇవే..! హష్ మనీ అగ్రరాజ్యం చరిత్రలో నేరాభియోగాలు ఎదుర్కొన్న ఒక మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ హష్ మనీ కేసులో నిలిచారు. 2016 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నప్పుడు తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ నోరు మూయించడానికి 1.30 లక్షల డాలర్లను ముట్టజెప్పినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ట్రంప్ లాయర్ మైఖేల్ కోహెన్ ద్వారా సొమ్ములు చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ట్రంప్ మన్‌హట్టన్ క్రిమినల్ కోర్టుకు ఈ ఏడాది ఏప్రిల్ 4న హాజరయ్యారు. ఎన్నికల్లో అక్రమాలు 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికల తుది ఫలితాలు ప్రకటించడానికి ముందే జో బైడెన్‌పై గెలుపు తనదేనంటూ ట్రంప్ ప్రచారం చేయడంపై విచారణ జరుగుతోంది. జార్జియా రాష్ట్ర కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడుతూ జార్జియాలో జరిగిన రీకౌంట్‌లో తనకు అదనపు ఓట్లు లెక్కించాలంటూ మాట్లాడిన సంభాషణ బయటకు రావడంతో ఈ కేసు నమోదైంది. ఈ ఏడాది జులై–సెప్టెంబర్ మధ్య ఈ కేసులో నేరాభియోగాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. క్యాపిటల్‌పై దాడి 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ట్రంప్ ఓటమి భారాన్ని తట్టుకోలేక క్యాపిటల్ భవనంపై దాడికి తన అనుచరుల్ని ఉసిగొల్పిన ఘటనకు సంబంధించిన కేసు కూడా పెండింగ్‌లో ఉంది. కొలంబియా జిల్లా కోర్టులో ట్రంప్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. అదే సమయంలో కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను కాంగ్రెస్ ధ్రువీకరించకుండా అడ్డుకోవాలని అప్పటి ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌పై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలపై కూడా కేసు నమోదై ఉంది. అక్రమ వ్యాపారాలు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లో చేసిన వ్యాపారాల్లో నిబంధనల్ని తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడ్డారని, తన ఆస్తుల్ని కూడా తప్పుడుగా చూపించారంటూ న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ కేసు నమోదు చేశారు. ట్రంప్ న్యూయార్క్ రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలు కొనసాగించకుండా నిషేధం విధించాలంటూ ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంలో ఇప్పటికే ట్రంప్‌ను అటార్నీ జనరల్ తన కార్యాలయంలోనే కొన్ని గంటలు ప్రశ్నించారు. న్యాయస్థానంలో ఈ కేసు అక్టోబర్‌లో విచారణకు రానుంది. కాలమిస్ట్‌పై అత్యాచారం మూడు దశాబ్దాల క్రితం తనపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో కాలమిస్ట్ జీన్ కరోల్ వేసిన కేసులో డొనాల్డ్ ట్రంప్‌ను న్యూయార్క్ కోర్టు మే 9న దోషిగా తేల్చింది. 1990లో మన్‌హటన్‌లోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశారంటూ 2019లో న్యూయార్క్ కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. ఏప్రిల్ 25న దీనిపై విచారణ మొదలైంది. కరోల్‌ను అబద్ధాల కోరుగా ప్రచారం చేసి ఆమె పరువుని బజారుకి ఈడ్చినందుకు నష్టపరిహారంగా 50 లక్షల డాలర్లు చెల్లించాలంటూ న్యూయార్క్ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ట్రంప్ న్యాయనిపుణుల బృందం పై కోర్టుకు వెళ్లనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్‌కి ఆఫీస్ పేపర్లను చింపి వైట్‌హౌస్ టాయిలెట్లో వేయడం హాబీ!
Documents ripped up, stuffed down the toilet: అమెరికా అధ్యక్షుల రికార్డులను భద్రపరిచే నేషనల్ ఆర్కైవ్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యహహార శైలిపై విచారణ చేయాలని న్యాయశాఖను అభ్యర్థించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష్య డాక్యుమెంట్లను చింపేసి టాయిలెట్లో పడేయడం లేదా ఫ్లోరిడాకు తరలించడం వంటివి చేశారని ఆరోపించింది. అంతేకాదు ట్రంప్ అధ్యక్ష పత్రాలను భద్రపరచడంలో చట్టాలను ఉల్లంఘించారని ఆర్కైవ్స్ పేర్కొంది. రిపబ్లికన్ మద్దతుదారులను ఆకర్షించే నిమిత్తం ట్రంప్ గతంలో ప్రెసిడెన్షియల్ డెకోరమ్ ఆమోదించిన అనేక నిబంధనన పత్రాలను పాడు చేసినట్లు వెల్లడించింది. అంతేకాదు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడూ వైట్‌హౌస్ పేపర్లను చించిపడేసే ట్రంప్ అలవాటు పై దర్యాప్తు చేయాలని ఆర్కైవ్స్ కోరింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ రికార్డుల కార్యాలయం ట్రంప్ ఫ్టోరిడా ఎస్టేట్ నుండి 15 బాక్సుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ధృవీకరించింది. పైగా వాటిని ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన సమయంలో తనతోపాటు తీసువెళ్లారని పేర్కొంది. అంతేకాదు ఆ పత్రాలలో చాలామటుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కి సంబంధించిన అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల తోపాటు అప్పటి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్ కోసం ఓవల్ ఆపీస్ని విడిచి వెళ్తున్నప్పుడు రాసిన లేఖ కూడా ఉందని వెల్లడించింది . అయితే ట్రంప్ మాత్రం అవన్ని ప్రేమ లేఖలని చెప్పడం గమనార్హం. ఈ మేరకు వాటర్‌గేట్ కుంభకోణం నేపథ్యంలో ఆమోదించిన 1978 ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్ (పీఆర్ఏ) ప్రకారం యూఎస్ అధ్యక్షులు అన్ని ఈమెయిల్‌లు, ఉత్తరాలు, ఇతర పని పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు బదిలీ చేయాలి. అయితే ట్రంప్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ ఈ ఆరోపణలన్నింటిని ఖండించారు. అంతేగాదు ఆర్కైవ్స్‌తో తన వ్యవహారాలను ఎలాంటి వివాదం లేకుండా స్నేహపూరిత వాతావరణంలోనే కొనసాగించినట్లు పేర్కొన్నాడు. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ మ్యాగీ హేబెర్మాన్ రాసిన "కాన్ఫిడెన్స్ మ్యాన్" పుస్తకం ప్రకారం వైట్ హౌస్ నివాసంలోని సిబ్బంది క్రమానుగతంగా మూసుకుపోతున్న టాయిలెట్లో ప్రింటెడ్ పేపర్‌ను కనుగొన్నారు అని రాయడం కొసమెరుపు. హేబెర్మాన్ ట్రంప్‌తో తీసుకున్న ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పుస్తకాన్ని రాశాడు. జనవరి 6, 2020న అమెరికా క్యాపిటల్ పై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక కమిటీ కూడా ట్రంప్ అధికారిక పత్రాల కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కమిటీ అధ్యక్షురాలు కరోలిన్ మలోనీ మాట్లాడుతూ..ట్రంప్ పదేపదే అధ్యక్ష రికార్డులను నాశనం చేయడానికి ప్రయత్నించారని, తాము ఆ రికార్డుల గురించి ఆందోళన చెందుతున్నాం. ఇది తీవ్రమైన ఉల్లంఘన కిందకే వస్తుంది. అని వ్యాఖ్యానించారు. -
చిత్తు కాగితానికి కటకట.. కిలో రూ.15 నుంచి రూ.40కి పెంపు
సాక్షి, హైదరాబాద్: చిత్తు కాగితం బంగారమైపోయింది. నాలుగు బజ్జీలు పొట్లం చుట్టివ్వాలన్నా, ఇడ్లీ, దోశలు ప్యాక్ చేయాలన్నా ఓ కాగితం కావాల్సిందే. మరి.. అలాంటి కాగితానికే పెద్ద కరువొచ్చి పడింది. కిరాణా దుకాణాలు, టిఫిన్‌సెంటర్లు, చుడువా బండ్లు, పాన్‌షాపులలో కాగితానికి కటకట ఏర్పడింది. హైదరాబాద్ నుంచి పేపర్ మిల్లులకు తరలించే కాగితం ఎగుమతులు సైతం భారీగా పడిపోయాయి. కోవిడ్ నేపథ్యంలో వివిధ రకాల కాగితం వినియోగం బాగా తగ్గిపోయింది. స్కూళ్లు, కాలేజీలు మూత పడ్డాయి. న్యూస్పేపర్లతో పాటు వివిధ రూపాల్లో వినియోగించే కాగితం కొరత తలెత్తింది. దీంతో కొంతకాలంగా నగరంలో చిత్తు కాగితానికి భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో కేవలం రూ.10 నుంచి రూ.15కే కిలో చొప్పున లభించిన స్క్రాప్ పేపర్ ఇప్పుడు ఏకంగా రూ.40కి చేరుకొంది. నగరంలో చిత్తుకాగితాల వ్యాపారం 30 శాతానికి పైగా పడిపోయినట్లు వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గృహ వ్యర్థాల్లో తగ్గుదల.. సాధారణంగా ఇళ్లలో వివిధ రూపాల్లో కాగితం పేరుకుంటుంది. చదివి పక్కన పెట్టిన దినపత్రికలు, పిల్లలు ఏటా వినియోగించే నోట్ పుస్తకాలు, వస్తువులతో పాటు వచ్చే ప్యాకింగ్ పేపర్, మేగజైన్లు, మెడికల్ బాక్సులతో వచ్చే పేపర్లు తదితర రకాల్లో ఇళ్లలోకి వచ్చి చేరే కాగితాన్ని కిలోల లెక్కన చిల్లర వ్యాపారులకు విక్రయిస్తారు. ఇల్లిల్లూ తిరిగి కాగితాలు సేకరించే చిరు వ్యాపారులు ఒక స్థాయి పెద్ద వ్యాపారులకు క్వింటాళ్లలో విక్రయిస్తారు. హైదరాబాద్‌లో వందలాది మంది వ్యాపారులు పెద్ద పెద్ద గోడౌన్లను ఏర్పాటు చేసుకొని చిల్లర వర్తకుల నుంచి కాగితం కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన కాగితాన్ని బడా వ్యాపారులు టన్నుల్లో కొనుగోలు చేసి పేపర్ మిల్లులకు తరలిస్తారు. బేగంబజార్, కోఠి, మలక్‌పేట్, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్ వ్యాపారులు గతంలో రోజుకు 250 టన్నుల వరకు కొనుగోలు చేసి ఎగుమతి చేశారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి 150 టన్నుల చిత్తుకాగితాలు కూడా లభించడం లేదని అంబర్‌పేట్‌కు చెందిన రాజేందర్ అనే వ్యాపారి తెలిపారు. 30 శాతానికి పైగా కాగితం వినియోగం తగ్గిందన్నారు. ‘కాగితం తిరిగి మార్కెట్లోకి రావాలంటే స్క్రాప్ పేపర్ మిల్లులకు వెళ్లాల్సిందే. కానీ తగినంత స్క్రాప్ అందుబాటులో లేకపోవడంతో కాగితం ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది’ అని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలే మిగిలాయి.. ఇతని పేరు మారుతి. ఉప్పల్‌లో నివాసం. చాలా ఏళ్లుగా చిత్తు కాగితాలను సేకరించి హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. కాగితంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, బాటిళ్లు తదితర గృహ వ్యర్థాలను కొనుగోలు చేస్తాడు. ఏడాది కాలంగా కాగితం పెద్దగా లభించడం లేదని, ప్లాస్టిక్ వ్యర్థాలపైనే ఆధారపడాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ‘రెండేళ్ల క్రితం వారానికి రెండు వందల క్వింటాళ్ల చొప్పున చిత్తుకాగితాలు విక్రయించాను. ఇప్పుడు 50 కిలోలు కూడా లభించడం లేదు. పైగా సేకరించిన కాగితం గోడౌన్లకు చేరకుండానే టిఫిన్‌సెంటర్లు, కిరాణా దుకాణాల వాళ్లు కొనుక్కెళ్తున్నారు గతంలో కేవలం రూ.8కే కిలో చొప్పున సేకరించి హోల్‌సేల్ వ్యాపారులకు రూ.15కు కిలో చొప్పున విక్రయించారు. ఇప్పుడు చిల్లర వర్తకులే కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లించాల్సివస్తోంది’ అని చెప్పారు. -
Pandora Papers: అంతా పెద్దలే!
కళ్ళ ముందున్నా... కనిపించకుండా దాచిన నిజాలు బయటపడ్డప్పుడు కొందరికి కష్టం కలగచ్చు. మరికొందరికి కోపం రావచ్చు. అత్యధికులకు ఆ నిజాలతో ఆశ్చర్యం తప్పదు. ఆర్థిక లావాదేవీల రహస్యపత్రాల్ని ‘పండోరా పేపర్స్’ పేరిట ఆదివారం బయటపెట్టినప్పుడూ అంతే. ప్రపంచ వ్యాప్తంగా వందలాది కోటీశ్వరులు అపరిమిత ఆదాయాన్ని పన్ను బెడద లేని పనామా, దుబాయ్ లాంటి దేశాల్లో ఆఫ్‌షోర్ కంపెనీలు, ట్రస్టులకు గుట్టుగా దోచిపెట్టి, దాచిపెట్టిన నిజం ఇప్పుడు మరోసారి సంచలనమైంది. రాజకీయాలు, వినోదం, వ్యాపారం, ఆటలు, ఆధ్యాత్మికత దాకా వివిధ రంగాల ‘పెద్ద మనుషుల’ పేర్లు డొల్ల కంపెనీల్లో లక్షల కోట్ల డాలర్లు దాచినవారి జాబితాలో బయట పడ్డాయి. దేశాల నేతల సహా 130 మంది బిలియనీర్లు ఈ బాపతువారేనన్నది కళ్ళు తిరిగే నిజం. పరిశోధనే ప్రాణంగా గడిపే జర్నలిస్టుల కృషితో ‘ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్’ (ఐసీఐజే) అయిదేళ్ళ క్రితం 2016లో ‘పనామా పేపర్స్’ను బయటపెట్టి తేనెతుట్టెను కదిలించింది. ఇప్పుడు ‘పండోరా పేపర్స్’తో మరో బాంబు పేల్చింది. అమెరికాలోని ‘వాషింగ్టన్ పోస్ట్’ మొదలు భారత్‌లోని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దాకా 117 దేశాల్లోని 150 మీడియా సంస్థలకు చెందిన 600 మంది దాకా జర్నలిస్టులు చేసిన పరిశోధన ఇది. మన దేశం నుంచి పలువురు ఐసీఐజే డేగకళ్ళకు చిక్కారు. దాంతో పన్నులెగవేస్తూ, ఆదాయాన్ని అక్రమంగా విదేశాల్లో దాచిపెడుతున్నట్టు పేర్లు బయటకొచ్చిన భారతీయులపై నిజనిర్ధారణ కోసం దర్యాప్తు జరపాలని కేంద్రం సోమవారం ఆదేశించాల్సి వచ్చింది. కేంద్ర ప్రత్యక్షపన్నుల బోర్డు సారథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక గూఢచర్య విభాగం (ఎఫ్ఐయు)తో కూడిన బృందం ఈ దర్యాప్తు సాగించనుంది. మునుపటి ‘పనామా పేపర్స్’ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడీ ‘పండోరా పేపర్స్’ ఆ స్థాయిలో కాకపోయినా, రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో సంచలనం రేపుతోంది. అనిల్ అంబానీ, సచిన్ టెండూల్కర్, జాకీష్రాఫ్, నీరా రాడియా లాంటి ప్రసిద్ధుల పేర్లు బయటకొచ్చాయి. పాతికేళ్ళ పైచిలుకుగా ఇలాంటి ‘పెద్దలు’ ఇంద్రభవనాలు, సముద్రతీర నివాసాలు, విలాసవంతమైన నౌకలు లాంటి ఆస్తిపాస్తుల రూపంలో తమ సంపదను దాచేస్తున్నారని కథనం. ప్రపంచం నలుమూలల్లోని 14 వేర్వేరు న్యాయ, ఆర్థికసేవల సంస్థల నుంచి సేకరించిన కోటీ 20 లక్షల రహస్యఫైళ్ళను తిరగేస్తే, తేలిన విషయమిది. ఇలా రహస్యంగా సంపదను పోగేసుకున్న వారిలో జోర్డాన్ రాజు, చెక్ ప్రధాని సహా రష్యా అధ్యక్షుడు పుతిన్ – పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ల సన్నిహితులూ ఉన్నారు. దేశ ఆర్థిక మంత్రి సహా అనేకులు ఆ జాబితాలో ఉండడం ఇమ్రాన్‌కు మింగుడుపడడం లేదు. ఎందుకంటే, ఆయన తన రాజకీయ బద్ధవిరోధి, మాజీ పీఎం నవాజ్ షరీఫ్‌ను ప్రభుత్వ పీఠంపై లేకుండా చేసింది అప్పట్లో బయటపడ్డ ‘పనామా పేపర్స్’ సాయంతోనే! ఇప్పుడీ ‘పండోరా పేపర్స్’ తన పీకలకు చుట్టుకుంటుందేమోనని దర్యాప్తుకు ఆదేశించారు. విచారణను ఎదుర్కొంటున్నవారు అధికార హోదాల్లో ఉంటే గనక, ఆ దర్యాప్తు ఆశించిన ఫలితాలివ్వదన్నది ఆ రోజుల నుంచి ఇమ్రాన్ వాదన. ఆ వాదనకు కట్టుబడి ఇప్పుడీ సన్నిహిత సహచరులను కూడా దర్యాప్తు పూర్తయ్యే వరకు పదవి నుంచి వైదొలగమని ఆయన ఆదేశిస్తారా? ప్రధాని హోదాలో ఇమ్రాన్‌కు ఇది అగ్నిపరీక్షే. ఆర్థిక సలహాదార్ల పక్కావ్యూహంతో కొందరు ధనికులు ప్రభుత్వాల కన్నుగప్పి తమ సంపదను వేర్వేరు దేశాల్లో పెట్టడం చాలాకాలంగా ఉన్నదే. అయితే, విదేశీ ఖాతాలు, ఆఫ్‌షోర్ రిజిస్టర్డ్ ట్రస్టు లన్నింటిలోనూ దొంగ డబ్బే ఉందనలేం. వాటిలో అన్నీ కాకున్నా, కొన్నయితే అక్రమమే. ‘పండోరా’ లాంటి వెల్లడింపుల వల్ల అలాంటి బడా బాబుల జాతకాలు కట్టగట్టుకు బయటకొస్తాయి. ఆ సమాచారం ఆధారంగా వారి వివరాల కూపీ లాగి, అక్రమాలకు పాల్పడినట్టుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నిజానికి, మన దేశీయులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల డాలర్ల మేర విదేశాలకు పంపే వీలుంది. అదే ప్రవాస భారతీయులకైతే ఆ పరిమితి అనేక రెట్లు ఎక్కువ. ప్రపంచమొక కుగ్రామమైన వేళ విదేశీ వ్యాపార ఒప్పందాలు, ఆదాయాలు మామూలయ్యాయి. అందుకే, అక్రమాలకు పాల్పడినట్టు తేలేంత వరకు ఈ సంపన్నులందరూ చట్టరీత్యా నిర్దోషులే. వేధింపులు లేకుండా, వేగంగా దర్యాప్తు జరపడం అవసరం. నిజానికి, మనదేశంలో పన్ను భారం అమితంగా పెరిగేసరికి, సంపన్నులు పక్కచూపులు చూడడమూ పెరుగుతోంది. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల నుంచి వెనక్కి వెళ్ళలేని వర్తమానంలో మన ప్రభుత్వాలు ఒక పని చేయవచ్చు. దేశంలో నుంచి భారీమొత్తంలో బయటకు ధనం తీసుకువెళ్ళే సంపన్నులకు ప్రోత్సాహ కాలు తగ్గించవచ్చు. మన పన్నుల విధానాన్ని అలా మార్చుకోవచ్చు. అదే సమయంలో శరవేగంతో దూసుకుపోతూ, అధిక రాబడినిచ్చే విపణిగా మన దేశపు ఆకర్షణ కొనసాగేలానూ జాగ్రత్తపడాలి. అసలీ బెడద పోవాలంటే, బ్రిటన్‌లో లాగా ప్రతి ట్రస్టు, సంస్థ తాలూకు అసలైన ప్రయోజనం పొందే యజమాని ఎవరో తెలిసే పద్ధతి ప్రపంచమంతా ఉండాలి. విదేశీ మదుపరులకు కనిష్ఠమైన పన్నుతో ఆకర్షిస్తున్న ‘స్వర్గధామ’ దేశాలు తమ గడ్డ మీది సంస్థల చట్టబద్ధమైన యజమానులెవరో బయటపెట్టాలి. అలా వెల్లడించడానికి ‘జీ–20’ దేశాలు తుది గడువు పెట్టాలి. ప్రపంచవ్యాప్త కనిష్ఠ పన్ను 15 శాతం ఉండేలా చూస్తే, అసలీ దేశాల్లో దాచే అవసరమూ రాకపోవచ్చు. అలాంటివి లేనంత వరకు పనామా, పండోరా – ఇలా పెద్దల గుట్టు విప్పే పరిశోధనలు మరెన్నో రాక తప్పదు. -
టెన్త్.. ఆరు ప్రశ్న పత్రాలే..
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రత్యక్ష విద్యా బోధన దెబ్బతిన్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పదో తరగతి పరీక్షల్లో ఉండే 11 ప్రశ్నపత్రాలను ఆరుకు కుదించింది. ప్రశ్నల్లో రెట్టింపు చాయిస్ ఉండేలా ఏర్పాట్లు చేసింది. మొత్తం 20 ప్రశ్నలు ఇచ్చి ఏవైనా 10 ప్రశ్నలకు జవాబు రాయాలని అడిగే విధానాన్ని కొత్తగా ప్రవేశ పెట్టనుంది. గతం లో 10 మార్కులకే ఉన్న ఆబ్జెక్టివ్/బహుళైచ్ఛిక ప్రశ్నలను 20 మార్కులకు పెంచేలా చర్యలు చేపట్టింది. దీంతో విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు లభించనుండగా, ఒత్తిడికి లోనుకాకుండా కూడా ఉంటారు. మే 17 నుంచి నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో వీటిని అమలు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల సమయం పెంపు.. పదో తరగతి పరీక్షల సమయాన్ని ప్రభుత్వం మరో అర గంట పెంచింది. గతంలో 2.45 గంటలు ఉన్న పరీక్ష సమయాన్ని 3.15 గంటలకు పొడిగించింది. సెప్టెంబర్ 1 నుంచి నిర్వహించిన ఆన్లైన్ బోధన, ప్రస్తుతం చేపట్టబోయే ప్రత్యక్ష బోధనకు సంబంధించిన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. అన్ని సబ్జెక్టుల్లో కోర్ కాన్సెప్ట్‌లు, బోధించించాల్సిన అంశాలకు సంబంధించి ఇప్పటికే కేలండర్‌ను ప్రకటించింది. వాటి ప్రకారమే ప్రశ్నలు అడిగేలా చర్యలు చేపట్టింది. జనరల్ సైన్స్ ప్రశ్నపత్రం కూడా ఒక్కటే ఉంటుంది. అయితే అందులో మూల్యాంకన సౌలభ్యం కోసం ఫిజికల్ సైన్స్ (పార్ట్–ఎ)కు, బయోలాజికల్ సైన్స్‌కు (పార్ట్–బి) వేర్వేరుగా జవాబు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాత పరీక్ష, ఇంటర్నల్స్ మార్కుల్లో ఎలాంటి మార్పు ఉండదని, ప్రతి సబ్జెక్టుకు 100 చొప్పున 600 మార్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ఓరియంటల్ ఎస్సెస్సీ, వొకేషనల్ కోర్సుల్లోనూ ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది. ఇదీ ప్రశ్న పత్రాల స్వరూపం – 2 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ కింద ఇంటర్నల్స్‌కు 20 మార్కులు – ఒక్కో ప్రశ్న పత్రంలో 20 ఆబ్జెక్టివ్/బహుళైచ్ఛిక ప్రశ్నలకు 20 మార్కులు – వాక్య రూపంలో సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. 60 మార్కుల కోసం ఇచ్చే ప్రశ్నల స్వరూపం – వ్యాసరూప ప్రశ్నల విభాగంలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక సెక్షన్లో ఇచ్చే 3 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకు సమాధానం రాయాలి. దానికి 8 మార్కులు ఉంటాయి. మరో సెక్షన్‌లోనూ 3 ప్రశ్నల్లో ఒక దానికి సమాధానం రాయాలి. 8 మార్కులు ఉంటాయి. ఇందులో మొత్తంగా 16 మార్కులు. – స్వీయ రచన విభాగంలో 2 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 4 చొప్పున 8 ప్రశ్నలు ఉంటాయి. అందులో 2 చొప్పున 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 16 మార్కులు ఉంటాయి. – సృజనాత్మకత విభాగంలో 3 ప్రశ్నల్లో ఒక దానికి సమాధానం రాయాలి. దానికి 8 మార్కులు ఉంటాయి. – అవగాహన, ప్రతిస్పందన విభాగంలో మూడు ప్యాసేజీలు ఉంటాయి. వాటికి 20 మార్కులు ఉంటాయి. – గతంలో ద్వితీయ భాష మినహా మిగతా 5 సబ్జెక్టుల్లో రెండు చొప్పున 10 పేపర్లు ఉండేవి. ఇప్పుడు ద్వితీయ భాష, మిగతా 5 సబ్జెక్టులకు 5 పేపర్లే ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో ఆబ్జెక్టివ్/బహుళైచ్ఛిక ప్రశ్నలవి 20 మార్కులు కలుపుకొని 80 మార్కులకు ఒక్కో ప్రశ్న పత్రాన్ని ఇస్తారు. ఇలా మొత్తంగా 480 మార్కులు ఉంటాయి. అలాగే ఒక్కో సబ్జెక్టులో ఇంటర్నల్స్ 20 మార్కులు ఉంటాయి. ఇలా ద్వితీయ భాష, 5 సబ్జెక్టుల్లో మొత్తం 120 మార్కులు ఉంటాయి. – గతంలో హిందీ మినహా ఇతర సబ్జెక్టుల్లో ఉన్న 10 పేపర్లలో ఒక్కో పేపర్లో ఆబ్జెక్టివ్‌ను 5 మార్కులకు 10 ప్రశ్నలు ఇచ్చి ఒక్కో దానికి అర మార్కు ఇచ్చేవారు. ఇలా ప్రతి సబ్జెక్టులో రెండు పేపర్లలో కలిపి 10 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు 20 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 20 మార్కులు ఉండనున్నాయి. -
సోన్‌భద్ర కాల్పులు : కీలక పత్రాలు మాయం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో సోన్‌భద్ర నరమేధానికి సంబంధించి సంచలన విషయం వెలుగు చూసింది. 10 మంది రైతుల మరణానికి కారణమైన ఈ వివాదంలో కీలకమైన ల్యాండ్ డీల్ ఫైలు మాయమైపోయిందన్న వార్త కలకలం రేపుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, భూమి బదిలీ వివరాలను కలిగి ఉన్న 1955 ఫైలు మిస్ అయింది. ముఖ్యంగా ప్రభుత్వ అటవీభూమి ఒక ట్రస్ట్ కిందకు ఎలా పోయింది అనేది ప్రశ్నార్ధంగా మారిన నేపథ్యంలో ఈ పేపర్లు మాయం కావడం గమనార్హం. కాల్పుల ఉదంతం చోటు చేసుకున్న అయిదురోజుల తరువాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. జిల్లా రెవెన్యూ పత్రాల్లో దీనికి సంబంధించిన కీలక పత్రాలు లభించడం లేదని అధికారులు కూడా ధృవీకరించారు. డిసెంబర్ 17, 1955లో ఆదర్శ్ కోపరేటివ్ సొసైటీ పేరుతో రిజిస్టర్ అయిన పత్రాలు లభించడం లేదనీ, ఆరు దశాబ్దాల నాటి కేసుకు సంబంధించి తమ వద్ద1955 ఫైలు మినహా అన్ని పత్రాలు ఉన్నాయని సోన్‌భద్ర జిల్లా మేజిస్ట్రేట్ అంకిత్ అగర్వాల్ పేర్కొన్నారు. ఘర్షణకు దారి తీసిన ఈ వివాదంలో 1950లో సుమారు 600 బిగాల భూమిని జమీందారీ నిర్మూలన , భూ సంస్కరణల చట్టం, బంజరు భూమిగా ప్రకటించారు. అనంతరం ఆ ప్రాంతంలోని ఆదివాసీలు (గోండ్లు) మూడు తరాలుగా ఆ భూమిని సాగు చేసుకొంటున్నారు. ఈ 600 బిగాల అధికారిక పత్రాలలో గ్రామ సభ భూమిగా నమోదు చేశారు. 1955లో, సుమారు 463 భిగాల భూమిని ఆదర్శ్ సహకారి సమితి అనే సమాజానికి బదిలీ చేశారు. బీహార్ కేడర్ మాజీ ఐఎఎస్ అధికారి ప్రభాత్ కుమార్ మిశ్రా దీన్ని స్థాపించారు. ఈ సొసైటీలో తన మామ మహేశ్ మిశ్రాను ప్రెసిడెంట్‌గాను, అతిని భార్య, కూతురిని ఆఫీసు బేరర్లుగాను నియమించారు. 1989 లో సిన్హా మరణం తరువాత, సుమారు 200 బిగాల భూమిని సిన్హా కుమార్తె, మిశ్రా భార్య అయిన ఆశా మిశ్రా, మనువరాలు వినీత పేరుతో బదిలీ చేశారు. అయితే 2017లో ఈ భూమిని గ్రామ ప్రధాన్ యజ్ఞదత్తో పాటు మరో 10 మందికి రూ.2 కోట్లకు అమ్మారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా దత్ ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడే వివాదం మొదలైంది. ఈ భూమి తమదంటూ దత్ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేంచిన గోండ్లు, 2017 ఒప్పందం చట్టవిరుద్ధమంటూ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పరస్పరం పలు కేసులు నమోదయ్యాయి. అయితే జూలై 6 న, 32 ట్రాక్టర్లు, 300 మందితో దత్ భూమికి మీదికి రావడంతో ఘర్షణ ముదిరింది. యజ్ఞదత్ మనుషులు నాటు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్డారు. ఇదిలావుండగా పదిమంది రైతుల హత్యపై నివేదిక సమర్పించాలని కోరుతూ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్‌సిఎస్‌టి) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసు జారీ చేసింది. కాగా మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అరెస్టు, ఎట్టకేలకు ఆమె బాధితులను కలవడంతోపాటు, కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఈ కాగితంపై మళ్లీ మళ్లీ రాయొచ్చు
ఇప్పుడున్న కాగితాలు కొంత కాలానికి చిరిగిపోతాయి. వాటిపై రాతలు కొన్ని రోజులకే చెరిగిపోతాయి. చైనా శాస్త్రవేత్తలు ఈ ఇబ్బందుల్ని తప్పించే కొత్త రకం కాగితాన్ని తయారు చేశారు. ఈ కాగితంపై మళ్లీ మళ్లీ రాసుకోవచ్చు. దీనిపై రాసింది 6 నెల్లదాకా చెక్కుచెదరదు. ఫ్యుజియన్ నార్మల్ వర్సిటీకి చెందిన లుజోహు చెన్ బృందం ఈ కాగితాన్ని తయారు చేసింది. ఈ కాగితం 3 పొరలుగా ఉంటుంది. ఒక వైపు పొరపై ప్రత్యేకంగా తయారు చేసిన నీలిరంగు పూస్తారు. వేడి తగలగానే ఆ రంగు మాయమై కాగితం తెల్లగా మారుతుంది. రెండోవైపు నలుపు రంగు పూస్తారు. దీన్ని వెలుతురులో పెట్టినప్పుడు వేడిని పుట్టిస్తుంది. 65 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రతలో ఈ కాగితంపై నీలిరంగు వస్తూపోతూ ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఈ కాగితం తెల్లగా కనబడుతుంది. ఉష్ణోగ్రత మైనస్ పది డిగ్రీల కంటే తక్కువుంటే కాగితం నీలిరంగుకు మారుతుంది.వేడిని పుట్టించే ప్రత్యేకమైన పెన్నుతో ఈ కాగితంపై రాయవచ్చు.ఈ కాగితంపై వందసార్లు రాసుకోవచ్చునని చెన్ చెబుతున్నారు. పెన్నుతో రాసింది చెరిగిపోవాలంటే కాగితాన్ని మైనస్ పది డిగ్రీల సెల్సియస్‌లో ఉంచితే చాలు. ఈ కొత్తరకం కాగితాన్ని అనేక సార్లు ఉపయోగించుకునే వీలు ఉండటం వల్ల కాగితం వినియోగం గణనీయంగా తగ్గుతుందని, ఫలితంగా కాగితం తయారీ కోసం చెట్లను నరకడం తగ్గుతుందని వారు వివరిస్తున్నారు. -
టెన్త్ జవాబు పత్రాలు @ రూ.8,500
పట్నా: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను చెత్తతో కలిపి అమ్మేశారు కొందరు ఘనులు. బిహార్‌లోని గోపాల్‌గంజ్ లోని ఓ పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్ట్రాంగ్ రూమ్‌లో భద్ర పరిచిన సుమారు 40 వేల జవాబు పత్రాలు కనిపించకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల నైట్‌వాచ్‌మన్ పూజన్ సింగ్, ప్యూన్ చిట్టు సింగ్‌లను అరెస్టు చేసి విచారించారు. విచారణలో అవి ఓ చెత్త కొనుగోలు డీలరు పప్పు కుమార్ గుప్తాకు రూ.8,500కు అమ్మేసినట్లు తేలింది. -
మూల్యాంకనంపై మీమాంస
నల్లజర్ల/నిడమర్రు : విద్యా సంవత్సరం పూర్తయి 10 రోజులు దాటింది. ముందెన్నడూ లేనివిధంగా వేసవి సెలవుల ముందే కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన సమ్మెటివ్–3 (వారి్షక) పరీక్షల జవాబు పత్రాల సంగ్రహణాత్మక మూల్యాంకన (సమ్మెటివ్ అసెస్మెంట్) విషయంలో విద్యాశాఖ నిర్ణయాలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఫలితంగా వీటి మూల్యాంకన వాయిదా పడగా, ఎట్టకేలకు సోమవారం నుంచి 6, 7 తరగతుల జవాబు పత్రాల్లో 5 శాతం మూల్యాంకన మాత్రమే ప్రారంభమైంది. అందుబాటులో ఉన్న సబ్జెక్ట్ నిపుణులతో ఈ ప్రక్రియను అధికారులు హడావుడిగా ప్రారంభించారు. అయితే, 8, 9వ తరగతుల జవాబు పత్రాల మూల్యాకనంపై అధికారులు నేటికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో మీమాంస నెలకొంది. టెన్త స్పాట్‌తో ఆలస్యం 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకన (స్పాట్ వేల్యూయేషన్)లో హైసూ్కల్ ఉపాధ్యాయులు వి«ధులు నిర్వహిస్తున్నారు. మరోపక్క పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించినట్టు చెబుతూనే ‘సవరణాత్మక బోధన’ అనే 100 రోజుల కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటికే పాఠశాలల్లో సిబ్బంది కొరత కారణంగా సవరణాత్మక బోధన తలకు మించిన భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో బాహ్య మూల్యాంకనానికి వెళ్లేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడం లేదు. ఫలితంగా 6 నుంచి 9వ తరగతుల మూల్యాకనం మూలనపడింది. అరకొరగానే ప్రారంభం జిల్లాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 2.18 లక్షల మంది విద్యార్థులు సమ్మెటివ్–3 పరీక్షలు రాశారు. ప్రతి తరగతికి 6 చొప్పున సుమారు 14 లక్షల వరకూ జవాబు పత్రాలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న సిబ్బందిని ఉపయోగించుకుని మూల్యాంకన అయినకాడికి పూర్తి చేసేలా జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. 8, 9వ తరగతుల మూల్యాకనం 100 శాతం జవాబు పత్రాలను బాహ్య మూల్యాంకనం చేయాల్సి ఉంది. సీసీఈ విధానంలో 8, 9వ తరగతుల్లో లభించిన మార్కుల ఆధారంగా పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఇవ్వాల్సి ఉం టుంది. దీనివల్ల విద్యార్థుల జవాబు పత్రాలను వారు చదివిన పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు దిద్దితే అవకతవకలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో వాటిని బాహ్య మూల్యాకనం (బయటి ఉపాధ్యాయులతో దిద్దించడం) చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ జవాబు పత్రాలు 1.8 లక్షల వరకూ ఉంటాయి. వీటిని దిద్దాలంటే మండలానికి 50 నుంచి 60 మంది ఉపాధ్యాయులు అవసరం. దీంతో టెన్త్ స్పాట్ ముగిసిన తర్వాత ఆ సిబ్బందిని కలుపుకుని ఈనెల 20 లోపు మూల్యాకనం పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. మొత్తం మీద పదో తరగతి స్పాట్ వేల్యూయేషన్ మాదిరిగా తొలిసారి 8, 9 తరగతుల మూల్యాకనం ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 20లోగా పూర్తి చేస్తాం పదవ తరగతి స్పాట్ వేల్యూయేషన్ వల్ల సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ కారణంగానే సమ్మెటివ్ అసెస్మెంట్–3 బాహ్య మూల్యాకనం ప్రక్రియ ఆలస్యమైంది. ఉన్న సిబ్బందిని ఉపయోగించుకుని తొలివిడతగా 6, 7 తరగతులు, తర్వాత 8, 9 తరగతులు బాహ్య మూల్యాంకన పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నాం. 10వ తరగతి స్పాట్‌కు వెళ్లిన ఉపాధ్యాయులంతా ఈనెల 15 నుంచి అందుబాటులో ఉంటారు. 6, 7 తరగతులు బోధించే ఉపాధ్యాయులను టెన్త్ స్పాట్ నుంచి∙తప్పించాం. మొత్తంగా ఈనెల 20వ తేదీలోగా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేస్తాం. – ఆర్ఎస్ గంగాభవాని, డీఈవో -
అంగట్లో ప్రశ్నపత్రాలు!
► విద్యార్థుల చేతుల్లో 7వ తరగతి ► సామాన్యశాస్త్రం ఇంగ్లిష్ మీడియం పేపర్ ► వనపర్తిలో ఒకరోజు ముందే వెలుగులోకి ► క్వశ్చన్ పేపర్ ధర రూ.100 సాక్షి వనపర్తి : ఏడో తరగతి సామాన్యశాస్త్రం ఇంగ్లిష్ మీడియం పేపర్ వనపర్తిలో ఒకరోజు ముందుగానే విద్యార్థుల చేతుల్లోకి చేరింది. ప్రస్తుతం 10వ తరగతి మినహా అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన రోజు నుంచి ఇదేతంతు కొనసాగుతోందని సమాచారం. స్థానికంగా ఉన్న మీసేవా కేంద్రాలు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు ప్రశ్నపత్రాలకు అడ్డాగా మారాయి. క్వశ్చ¯ŒS పేపర్‌ను రూ.100కు విక్రయిస్తున్నారని తెలిసింది. దీంతో విద్యార్థులు కొందరు పేపర్ కొనుగోలు చేసి ఇతర విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పంపుకుంటున్నారని తెలుస్తోంది. గురువారం జరగాలి్సన సామాన్యశాస్త్రం పేపర్‌ను ఇలానే ఓ విద్యార్థి కొని తెచ్చుకోవడంతో తండ్రి మందలించాడని సాక్షిదృష్టికి వచ్చింది. వెంటనే ఈ విషయమై నిజానిజాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగడంతో అసలుసంగతి బయటపడింది. పరీక్ష ముందురోజే క్వశ్చన్ పేపర్ తెచ్చుకుని విద్యార్థులు బట్టీపట్టడం, లేదా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడటం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రం మార్కెట్లో దొరకడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కుమ్మక్కై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
జీవో 123 ప్రతులు దహనం
హుస్నాబాద్‌రూరల్ : గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీవో 123ని వ్యతిరేకిస్తూ గుడాటిపల్లిలో శనివారం జీవో ప్రతులతో దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని పక్కనబెట్టి రైతులకు న్యాయం చేస్తామని చెబుతూ బోగస్ జీవో తెచ్చిందని పలువురు విమర్శించారు. న్యాయమైన పరిహారం ఇస్తామంటూ మాయమాటలు చెప్పి, దొంగచాటున సంతకాలు తీసుకొని భూములు లాక్కుంటోందన్నారు. గ్రామ సభలో నిర్ణయించిన పరిహారాన్ని రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు యాదమ్మ సంపత్, వివేకానంద్, తిరుపతిరెడ్డి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. -
చదువు.. సంస్కారం...శీలవైభవం
విద్య - విలువలు తెల్లవారి లేస్తే పేపర్లలో, టీవీ ఛానళ్లలో రక్తపుముద్దలను భయంకరంగా విపులీకరించి చూపడం, పైగా దానిని స్లోమోషన్లో అనేక పర్యాయాలు చూపించడం. ఎక్కడో ఎవడో ఉన్మాదంగా ప్రవర్తిస్తే దాన్నే పదేపదే చూపించడం... అరే. పిల్లలుంటారు, వాళ్ళకూ మనసులనేవి ఉంటాయి, లేతగా ఉంటాయి, వాటిపై ప్రభావం ఉంటుంది, అది గంట ఉండొచ్చు, కొన్ని రోజులుండొచ్చు, కొన్ని జీవితపర్యంతం ఉండొచ్చు, వారేమైపోతారని ఆలోచించగలిగినవాడు లేడు. ఆరోగ్యవంతమైన భయం... దీన్ని గురించి చెప్పేవాడే లేడు. ఈ పరిస్థితుల్లో సంస్కారం అనే మాట మీ జీవితాల్లోకి ఎలా ప్రవేశించగలుగుతుంది. అసలు చేరే అవకాశమే ఉండదు. లేనప్పుడు ఎటువంటి పనైనా సరే, ఎంత చెయ్యగూడని పనైనా సరే, చెయ్యడానికి సిద్ధపడిపోతున్నారు. పైగా దీనికంతటికీ ఏం చెబుతున్నారంటే.. నిర్భయత్వం. ఏ భయం లేకుండా ఉండాలని. అసలు మనిషికి భయమనేది ఉండకూడదని. ఏం చెయ్యడానికైనా తెగింపు ఉండాలని అంటున్నారు. తెంపరితనానికి, తెగింపుకు మారుపేరు ఉల్లంఘనం.. గీతదాటడం. మీరు మంచిమాటలు విడిచిపెట్టి ప్రవర్తించడమే ఉల్లంఘనం. నేను చట్టానికి లోబడి ఉండాలనే భయం ఒక పౌరుడికి ఉండాలి. ఉంటే.. సంస్కారం ఉంటుంది. అవతలివాడికి ప్రయోజనం లేని మాట నేను మాట్లాడకూడదనే భయం వక్తకు ఉండాలి. అప్పుడే అతని మాట సమాజానికి పనికి వస్తుంది. ఐశ్వర్యవంతుడికి నా సంపద నలుగురికీ ఉపయోగపడాలనే తాత్విక చింతన, కర్తవ్య నిష్ఠతో కూడిన సామాజిక భయం ఉండాలి. అప్పుడు వాడి ద్రవ్యానికి ఒక విలువ ఉంటుంది. ఏ భయం లేని చోట ఎవరికి విలువ ఉంటుందో చెప్పండి. నీకు నీవు బరువైపోతావు. సమాజానికి బరువైపోతావు. చదువుకోవడం చాలా గొప్ప విషయం, చాలా గొప్పగా చదువుకుంటున్నారు. కానీ ఆ పక్కన చేరవలసిన సంస్కారం చేరడం లేదు. దానికి కారణం పిల్లలు మాత్రం కాదు, కారణం చదువులో ఉంది. చదువుతో పాటూ దాని పక్కన ఇది చేరాలి. ఇది లేని నాడు, ఎంత చదువుకున్నా అది శోభించదు. అది మీకు ఉపయుక్తం కాదు. అది గుబాళించాలి. అది క్షీర వైభవంగా ప్రకాశించాలి. అంటే నీకు ఎప్పుడూ ఆరోగ్యవంతమైన భయం ఉండాలి. అది లేకపోతే మీరు పాడయిపోతారని చెప్పేవాడు లేకపోవడం సమాజ దురదృష్టం. చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామివారు కంచికామకోఠి పీఠాధిపత్యాన్ని స్వీకరించిన తొలిరోజుల్లో ఒక రోజున ఆయన మధ్యాహ్నం భిక్ష(భోజనం) చేస్తూ ‘ఈ పదార్థం బాగుంది, ఏమిటిద’ని అడిగారట. ‘‘అది తోటకూరపప్పు’’ అని వంటవాడు చెప్పాడు. ‘‘ఓ చాలా బాగుంది’’ అన్నారట. మరునాడు భిక్షలో కూడా అది కనిపించింది. ఆయన బాగుంది’’ అన్నారట. అలా రోజూ కనిపిస్తున్నది. ఐదవరోజున వంటవాడిని పిలిచి రోజూ ఎందుకుచేస్తున్నావని అడిగారు. దానికి వంటమనిషి ‘ఈ మఠానికి మీ శిష్యులు చాలా మంది వస్తారు. వారితో చెప్పాను. మీకిష్టమని వారు ఇక్కడికి వచ్చేటప్పుడు కట్టలుకట్టలతోటకూర ఆకుకూర పట్టుకొస్తున్నారు. అందుకని రోజూ చేస్తున్నా’ అని చెప్పాడు. ఆయన విని ఊరుకున్నారట. మరునాడు భిక్షసమయానికి విస్తరి ముందు కూర్చోకుండా గోశాలలోకి వెళ్లి, అక్కడినుంచి ఆవుపేడ తీసి నాలుకకు రాసుకున్నారట. ఆ పక్కరోజున కూడా ఇలాగే చేస్తుంటే మఠం మేనేజర్ చూసి పరుగు పరుగున వచ్చి ‘‘అయ్యా! మీరేం చేస్తున్నారు’’అని అడిగాడు. దానికి స్వామి వారు...‘‘నేను ప్రపంచానికి మార్గదర్శకం చేయవలసిన పీఠాధిపతిని. సత్యదండం ధరించి, కాషాయం ధరించి వెడుతుంటే సాక్షాత్ శంకరాచార్యులవారు వస్తున్నారు’ అని అంటారు. ఏ ఊరువెళ్ళినా ఈ వార్త వెడుతుంది. శంకరాచార్యులవారికి తోటకూర పప్పు ఇష్టమని కొన్నాళ్ళు తెస్తారు. ఎండాకాలం వస్తుంది. ఎక్కడినుంచో కష్టపడి తెస్తారు. ఆ తరువాత ఈ శంకరాచార్యుల వారికి తోటకూర తేవడానికి ఛస్తున్నాం’ అంటారు. పదిమందికి మంచి గురించి, నిగ్రహం గురించి చెప్పవలసిన వాడిని, భోజనం విషయంలో నాలుక నిగ్రహం చేసుకోలేని నేను ఈ నాలుకతో దేశానికి ఏం మంచిమాట చెప్పగలను. వంటవాడిది కాదు తప్పు, రుచికి లొంగిన నాది. అందుకే రుచికి లొంగడం మానితే తప్ప మంచిమాట చెప్పడం కుదరదని నాలుకను గోమయంతో శుభ్రం చేసుకుంటున్నాను. శుద్ధి తర్వాత మళ్ళీ పదార్థాలు తీసుకుంటాను’’ అని చెప్పి మూడు రోజుల తర్వాత ఆయన ఆహారం తీసుకున్నారు. అదీ శీలవైభవం. అదీ ఆరోగ్యవంతమైన భయం అంటే. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తిక్కపుడితే.. చదివి కలెక్టర్‌నవుతా..!
పత్రికలపై ‘రసమయి’ ఆక్రోశం తిమ్మాపూర్ : తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పత్రికలపై ఆక్రోశం వెళ్లగక్కారు. రైతుల ఆత్మహత్యలపై బాధ్యతగా వ్యవహరించాల్సిన పత్రికలు పతాక శీర్షికల్లో వాటిని రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. తప్పుడు రాతలు రాసిన విలేకరిని వేరే దేశంలో ఉరితీశారని చెప్పుకొచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో బీసీ బాలికల గురుకుల పాఠశాల భవనం, కేజీబీవీ భవనాల్ని ప్రారంభించేందుకు మంత్రి జోగు రామన్న, ఎంపీ వినోద్‌కుమార్ రాగా.. సభలో వారి ఎదుటే ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధి కావడం చాలా కష్టమని, తిక్కపుడితే.. నాలుగు నెలలు ఇంట్లో కూర్చుని చదువుకుంటే.. కరీంనగర్ జిల్లాకు కలెక్టర్నవుతానని ఎమ్మెల్యే రసమయి స్పష్టం చేశారు. పత్రికలు మంచిని రాస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. -
పారేసుకోబోయి.. ఆరేసుకోవాలి
సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. ఈ సూత్రాన్ని ఫ్లోరిడాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ క్రిస్టీన్ ఎలిస్ బాగా ఒంటబట్టించుకుంది. చిరుగుల జీన్స్లనే ఎగబడి కొంటున్న నేపథ్యంలో పనికిరాని వస్తువులతో రూపొందించే దుస్తులకు ఇంకెంత గిరాకీ ఉంటుందో కదా అని ఆలోచించింది. అంతే.. పారేసే వస్తువులతో ఇలా రకరకాల దుస్తులను రూపొందించింది. కాగితాలు, మేగజైన్లు, చాక్లెట్ రేపర్లు, చివరకు పేకముక్కలతో కూడా పలు డిజైన్లు తయారుచేసింది. చెత్తతో తయారుచేసినా కొత్తగా ఉంటే వింతే కదా..! క్రిస్టీన్ డిజైన్లకు తెగ డిమాండ్ వచ్చేసింది. 500 డాలర్ల (దాదాపు రూ.30 వేలు) నుంచి 1500 డాలర్ల (దాదాపు రూ.90 వేలు) మధ్య వాటి ధరలు నిర్ధారించినా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. దీంతో ఆమె వ్యాపార సామ్రాజ్యం కూడా ఫ్లోరిడా నుంచి న్యూయార్క్‌కు విస్తరించింది. -
చిన్నబోతున్న కల్యాణలక్ష్మి
కరీంనగర్‌కు చెందిన దళితయువతి రజిత(19)కు ఈనెల 31న పెళ్లి కుదిరింది. నెలరోజుల ముందే కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంది. తీరాచూస్తే పెళ్లికొడుకు కుల, నివాస, ఆదాయ వివరాలు, ఆధార్ నెంబర్ లేవనే కారణంతో దరఖాస్తును పక్కనపెట్టినట్లు తెలిసింది. పెళ్లికొడుకు కుటుంబసభ్యులను కలిసి ఆ వివరాలివ్వాలని అడిగితే ‘పెళ్లికి ముందు ఇస్తే మాకేం లాభం? వచ్చిన డబ్బులు మీరే ఖర్చు చేస్తారు. పెళ్లయ్యాక ఇస్తే కోడలు మా ఇంటికే వస్తుంది. అప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఆ డబ్బులు మాకే వస్తాయి’ అని కరాఖండిగా చెప్పారు. పెళ్లికి ముందు డబ్బులొస్తే కొంత ఆర్థిక భారం తగ్గుతుందని ఆశపడ్డ రజిత తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. బయట అప్పుజేసి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. మంథని డివిజన్‌కు చెందిన గిరిజన యువతి శ్రీలక్ష్మి(21)కి అక్టోబర్‌లో పెళ్లయింది. ఆన్లైన్లో కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం అందించే రూ.51వేల నగదు ఆమెకు ఇప్పటికీ అందలేదు. అధికారులను కలిసి అడిగితే ‘మీకు ఇదే మొదటి పెళ్లి అని రుజువు చేసేలా సర్టిఫికెట్ ఇవ్వలేదు. మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని జతచేస్తేనే పరిశీలనకు వస్తాం’ అని చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని రజిత, ఆమె కుటుంబసభ్యులు మిగిలిన పత్రాన్ని తెచ్చే పనిలో పడ్డారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద లబ్ది పొందాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. ఈ పథకాల ద్వారా లబ్ది పొందాలంటే సవాలక్ష పత్రాలు సమర్పించాల్సి రావడం, వెరిఫికేషన్ పేరిట పుణ్యకాలం గడిపోతుండటంతో నెలలు గడుస్తున్నా వధువు బ్యాంకు ఖాతాలో డబ్బు జమకావడం లేదు. వాస్తవానికి ఈ పథకాల విషయంలో ప్రభుత్వ ఆలోచన వేరు. నిరుపేద దళిత, గిరిజన, మైనారిటీ కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఆయా సామాజికవర్గాల ఆడపిల్లలకు పెళ్లి నాటికే ప్రభుత్వం తరపున రూ.51వేల నగదును అందజేయాలనే భావనతో ప్రవేశపెట్టిన ఈ పథకం పెళ్లికి ముందు కాదు కదా... పెళ్లయి నెలలు గడుస్తున్నా లబ్దిదారులను గుర్తించే పరిస్థితి లేకపోవడం గమనార్హం. 10 శాతానికి మించని దరఖాస్తులు కరీంనగర్ జిల్లా విషయానికొస్తే... దళిత, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ది పొందాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 563 మంది దరఖాస్తు చేసుకున్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే ఎస్సీలు 365, ఎస్టీలు 27, మైనారిటీలు 171 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవనికి గడిచిన నాలుగు నెలల కాలానికి జిల్లాలో ఆయా సామాజికవర్గాలకు సంబంధించి ఆరువేల పైచిలుకు పెళ్లిళ్లు జరిగినట్లు అధికారుల అంచనా. అందులో నూటికి తొంభై శాతం కుటుంబాలకు తెల్లకార్డులున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంవత్సరాదాయం రూ.రెండు లక్షలోపు కలిగి ఉన్న కుటుంబాలు తెల్లకార్డులకు అర్హులే కాబట్టి వీరంతా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు అర్హులుగానే పరిగణించవచ్చు. అయినప్పటికీ అందులో పది శాతం కూడా దరఖాస్తులు రాకపోవడం విశేషం. దరఖాస్తు దారులు ముప్పుతిప్పలు ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ రూ.51వేల నగదు ప్రోత్సహకాన్ని అందించారా అంటే అదీలేదు. 563 దరఖాస్తులకు 101 మంది ఖాతాల్లోకే నగదు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వాటిలో కొన్ని పరిశీలన దశలో, మరికొన్ని అన్ని పత్రాలు లేవనే కారణంతో పెండింగ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిస్థితి మరీ దారుణం. ఇప్పటివరకు 27 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, అందులో ఒకరిని మాత్రమే అర్హురాలిగా గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా పత్రాన్ని అందజేశారు. ఇంతవరకు సదరు అర్హురాలి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమకాలేదని తెలుస్తోంది. సవాలక్ష పత్రాలు సమర్పిస్తేనే...! కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటేనే చుక్కలు కన్పిస్తున్నాయి. మీ సేవ లేదా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి రావడం, ఆ సమయంలోనే దాదాపు ఇరవైకిపైగా పత్రాలు సమర్పించాల్సి వస్తోంది. వధువు తెలంగాణ రాష్ట్ర నివాసితురాలిగా ఉండాలని, వధూవరుల నివాస, కుల, ఆదాయ, వయసు, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులతోపాటు ఇదే మొదటి వివాహమని రుజువు చేసే పత్రాలను, విద్యార్హతల పత్రాలను సమర్పించాలి. వధూవరుల పెళ్లి తేదీ ఖరారును ధ్రువీకరిస్తూ వీఆర్ఓ లేదా పంచాయతీకార్యదర్శి ధ్రువీకరణపత్రం తప్పనిసరి. చాలా మందికి ఈ పథకాల పట్ల అవగాహన లేకపోవడం ఒక ఎత్తయితే అవగాహన ఉన్నవారికి సైతం పైన పేర్కొన్న పత్రాలన్నీ సమర్పించాల్సి రావడం కష్టతరమవుతోంది. మరోవైపు సంబంధిత పత్రాలను జారీ చేసే అధికారుల వద్దరకు వెళితే సమయానికి ఉండకపోవడం, ఒకవేళ ఉన్నా రేపు, మాపంటూ పదేపదే తిప్పుతుండటం, కొందరైతే ఁఅమ్యామ్యా*లిస్తేనే ధ్రువీకరణ పత్రాలిస్తామంటూ ఇబ్బంది పెడుతుండటం వంటి అనేక కారణాలవల్ల ఆయా పత్రాలను సకాలంలో సమర్పించడం తలకుమించిన భారమవుతోంది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.మూడు కోట్లు విడుదల చేసినప్పటికీ, రూ.అరకోటికి మించి ఖర్చు కాలేదని తెలుస్తోంది. మైనారిటీ శాఖ విషయానికొస్తే జిల్లాలో 1078 మందికి షాదీ ముబారక్ పథకాన్ని వర్తింపజేసేందుకు నిధులు మంజూరయ్యాయని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ప్రకటించారు. పథకం ల క్ష్యాలు ఘనంగా ఉన్నా, నిధులు దండిగా ఉన్నా ఆచరణలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. నిబంధనలను సరళతరం చేస్తేనే లబ్దిదారులకు తొందరగా న్యాయం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ప్రగతి ఇలా 1. ఎస్సీలకు సంబంధించి..... వచ్చిన దరఖాస్తులు -365 పరిశీలనలో ఉన్నవి -243 మంజూరైనవి -122 ట్రెజరీ శాఖకు వెళ్లినవి -102 లబ్దిదారుల ఖాతాల్లో జమ అయినవి : 50 (మంజూరైన వాటన్నింటికీ సంబంధించిన నగదును ఈ నెలాఖరులోగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు) 2. ఎస్టీలకు సంబంధించి.... వచ్చిన దరఖాస్తులు -27 పరిశీలనలో ఉన్నవి -18 మంజూరైనవి -1 లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్లినవి -0 3. మైనారిటీలకు సంబంధించి... వచ్చిన దరఖాస్తులు -171 పరిశీలనలో ఉన్నవి -98 మంజూరైనవి -73 లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్లినవి -50 -
ఆ త్రివర్ణ పతాకమే ఉపయోగించాలి
సాక్షి, హైదరాబాద్: కాగితాలు, వస్త్రాలపై తయారుచేసిన మూడు రంగుల జెండాను మాత్రమే జాతీయ దినోత్సవాలు, క్రీడలు, ఇతర సాంస్కృతిక ఉత్సవాలకు ఉపయోగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్లాస్టిక్ జెండాలు వాడరాదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (రాజకీయ) అజయ్‌మిశ్రా జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులకు గురువారం ఆదేశాలు ఇచ్చారు. త్రివర్ణ పతాకాలను అలంకరణలకు ఉపయోగించరాదని, ముఖ్యమైన జాతీయ దినాలు, క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల్లో దాన్ని ఊపవచ్చన్నారు. జెండా ఆవిష్కరణలు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయో.. లేదో పరిశీలించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. జెండాను అగౌరవపరిస్తే నేరంగా పరిగణిస్తామన్నారు. -
వాయనం: కలర్‌ఫుల్ బ్యాగ్స్ తయారు చేద్దామా!
పాలిథీన్ బ్యాగ్స్‌ని వాడకూడదని పర్యావరణవేత్తలు చెప్పడంతో వాటి వాడకం తగ్గిపోయింది. వాటి స్థానంలో పేపర్బ్యాగ్స్ వాడుతున్నారు. అయితే వాటి ఖరీదు పాలిథీన్ బ్యాగ్స కంటే కొంచెం ఎక్కువ. అదే కాస్త ఇబ్బంది. కానీ దీనికో మంచి పరిష్కార మేమిటంటే బ్యాగ్సని మనమే చేసుకోవడం! నిజానికి పేపర్ బ్యాగ్ తయారు చేయడం చాలా తేలిక. పేపర్, గమ్, చిన్న తాడు, కత్తెర ఉంటే చాలు. ముందుగా పేపర్‌ను ముడతలు లేకుండా నేలమీద పరవాలి. బ్యాగ్ ఎంత పొడవు, వెడల్పు ఉండాలో... అంత పొడవు, వెడల్పు ఉన్న రెండు మూడు పుస్తకాలను దొంతరలాగా పేపర్ మీద పెట్టాలి. తర్వాత పేపర్ని అన్ని వైపులా మడవాలి (ఫొటో 1,2,3). ఒక పక్క వదిలేసి మిగతా అన్ని పక్కలా కాగితాన్ని గమ్‌తో అంటించాలి. అంటించని వైపున మడతను విప్పి పుస్తకాలు బయటకు తీసేయాలి (ఫొటో 4లో చూపినట్టు అవుతుంది). ఆపైన మడత విప్పిన వైపున కాగితాన్ని సమానంగా పట్టుకుని కత్తిరించాలి (ఫొటో 5). చివరిగా బ్యాగుకు చిన్న చిన్న రంధ్రాలు చేసి తాడు లేక వైరును అమర్చుకోవాలి (ఫొటో 6). అంతే... బ్యాగ్ రెడీ అయిపోయినట్టే! స్టేషనరీ షాపుల్లో రకరకాల కాగితాలు, డిజైన్లతో దొరుకుతాయి. తెచ్చుకుని ఒకేసారి నాలుగైదు బ్యాగ్స్ చేసి పెట్టేసుకుంటే... అస్తమానం బ్యాగ్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. కాస్త మందంగా ఉన్నవి ఎంచుకుంటే ఎక్కువ బరువును తట్టుకుంటాయి. ఎక్కువ కాలం మన్నుతాయి. బ్యాచిలర్స్ కోసం భలే మెషీన్! ఇడ్లీని మించిన టిఫిన్ మరొకటి లేదు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకే ఇడ్లీని కాస్త ఎక్కువగానే తింటుంటాం మనం. అయితే బ్యాచిలర్స్కి వీటిని రోజూ తినే అదృష్టం ఉండదు. ఎందుకంటే వాళ్లు అంత కష్టపడి ఇడ్లీలు చేసుకోలేరు. పప్పు నానబెట్టాలి, కడగాలి, రుబ్బాలి, ఇడ్లీ గిన్నెల్లో వేయాలి, నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి ఆన్ చేయాలి, కూత పెట్టేవరకూ చూసి ఆపాలి... అబ్బబ్బబ్బ, బోలెడు పని అంటారు వాళ్లు. అయితే వాళ్లకు తెలియనిది ఒకటుంది. ఇప్పుడు ఇడ్లీ చేసుకోవడం చాలా ఈజీ. ఇక్కడున్న ఈ బుజ్జి మిషన్... ఇడ్లీలను చాల ఈజీగా వండేస్తుంది. ఇందులో ఉన్న గిన్నెల్లో పిండిని పోసి, మూతపెట్టి, స్విచ్ ఆన్ చేయడమే. క్షణాల్లో ఇడ్లీలు రెడీ అయిపోతాయి. కాచుకుని కూచోవాల్సిన పని లేదు. ఇడ్లీలు తయారయ్యాక కుక్కర్ ఆటోమేటిగ్గా ఆగిపోతుంది. కాబట్టి ఆన్‌చేసి, బయటకు కూడా వెళ్లి రావచ్చు. మరి పిండి సంగతేంటి అంటారా? ఆల్రెడీ మార్కెట్లో రెడీమేడ్ పిండి దొరకుతోంది. పచ్చళ్లూ దొరుకుతున్నాయి. కాబట్టి నో టెన్షన్. దీని ధర రూ. 1,100. ఆన్లైన్లో కొంటే రూ.900. దీంతో మరో ఉపయోగం కూడా ఉంది. గుడ్లు ఉడకబెట్టుకోవచ్చు. బ్యాచిలర్స్కి గుడ్లు కూడా మంచి ఫుడ్డే కదా! అలాగని వాళ్లే కొనాలని లేదు. కరెంటుతో పని చేస్తుంది కాబట్టి గ్యాస్ అయిపోయినప్పుడు వాడుకోవడానికి అందరిళ్లలో ఉండటం మంచిదే!