చిన్నబోతున్న కల్యాణలక్ష్మి | Dumbstruck kalyanalaksmi | Sakshi
Sakshi News home page

చిన్నబోతున్న కల్యాణలక్ష్మి

Published Wed, Jan 28 2015 4:15 AM | Last Updated on Tue, Oct 30 2018 8:01 PM

చిన్నబోతున్న కల్యాణలక్ష్మి - Sakshi

చిన్నబోతున్న కల్యాణలక్ష్మి

కరీంనగర్‌కు చెందిన దళితయువతి రజిత(19)కు ఈనెల 31న పెళ్లి కుదిరింది. నెలరోజుల ముందే కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంది. తీరాచూస్తే పెళ్లికొడుకు కుల, నివాస, ఆదాయ వివరాలు, ఆధార్ నెంబర్ లేవనే కారణంతో దరఖాస్తును పక్కనపెట్టినట్లు తెలిసింది. పెళ్లికొడుకు కుటుంబసభ్యులను కలిసి ఆ వివరాలివ్వాలని అడిగితే ‘పెళ్లికి ముందు ఇస్తే మాకేం లాభం? వచ్చిన డబ్బులు మీరే ఖర్చు చేస్తారు.

పెళ్లయ్యాక ఇస్తే కోడలు మా ఇంటికే వస్తుంది. అప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఆ డబ్బులు మాకే వస్తాయి’ అని కరాఖండిగా చెప్పారు. పెళ్లికి ముందు డబ్బులొస్తే కొంత ఆర్థిక భారం తగ్గుతుందని ఆశపడ్డ రజిత తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. బయట అప్పుజేసి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు.
 
మంథని డివిజన్‌కు చెందిన గిరిజన యువతి శ్రీలక్ష్మి(21)కి అక్టోబర్‌లో పెళ్లయింది. ఆన్‌లైన్‌లో కళ్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం అందించే రూ.51వేల నగదు ఆమెకు ఇప్పటికీ అందలేదు. అధికారులను కలిసి అడిగితే ‘మీకు ఇదే మొదటి పెళ్లి అని రుజువు చేసేలా సర్టిఫికెట్ ఇవ్వలేదు. మ్యారేజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని జతచేస్తేనే పరిశీలనకు వస్తాం’ అని చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని రజిత, ఆమె కుటుంబసభ్యులు మిగిలిన పత్రాన్ని తెచ్చే పనిలో పడ్డారు.

 
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద లబ్ది పొందాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. ఈ పథకాల ద్వారా లబ్ది పొందాలంటే సవాలక్ష పత్రాలు సమర్పించాల్సి రావడం, వెరిఫికేషన్ పేరిట పుణ్యకాలం గడిపోతుండటంతో నెలలు గడుస్తున్నా వధువు బ్యాంకు ఖాతాలో డబ్బు జమకావడం లేదు. వాస్తవానికి ఈ పథకాల విషయంలో ప్రభుత్వ ఆలోచన వేరు.

నిరుపేద దళిత, గిరిజన, మైనారిటీ కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఆయా సామాజికవర్గాల ఆడపిల్లలకు పెళ్లి నాటికే ప్రభుత్వం తరపున రూ.51వేల నగదును అందజేయాలనే భావనతో ప్రవేశపెట్టిన ఈ పథకం పెళ్లికి ముందు కాదు కదా... పెళ్లయి నెలలు గడుస్తున్నా లబ్దిదారులను గుర్తించే పరిస్థితి లేకపోవడం గమనార్హం.
 
10 శాతానికి మించని దరఖాస్తులు
కరీంనగర్ జిల్లా విషయానికొస్తే... దళిత, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ది పొందాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 563 మంది దరఖాస్తు చేసుకున్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే ఎస్సీలు 365, ఎస్టీలు 27, మైనారిటీలు 171 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవనికి గడిచిన నాలుగు నెలల  కాలానికి జిల్లాలో ఆయా సామాజికవర్గాలకు సంబంధించి ఆరువేల పైచిలుకు పెళ్లిళ్లు జరిగినట్లు అధికారుల అంచనా.

అందులో నూటికి తొంభై శాతం కుటుంబాలకు తెల్లకార్డులున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంవత్సరాదాయం రూ.రెండు లక్షలోపు కలిగి ఉన్న కుటుంబాలు తెల్లకార్డులకు అర్హులే కాబట్టి వీరంతా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు అర్హులుగానే పరిగణించవచ్చు. అయినప్పటికీ అందులో పది శాతం కూడా దరఖాస్తులు రాకపోవడం విశేషం.
 
దరఖాస్తు దారులు ముప్పుతిప్పలు
ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ రూ.51వేల నగదు ప్రోత్సహకాన్ని అందించారా అంటే అదీలేదు. 563 దరఖాస్తులకు 101 మంది ఖాతాల్లోకే నగదు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వాటిలో కొన్ని పరిశీలన దశలో, మరికొన్ని అన్ని పత్రాలు లేవనే కారణంతో పెండింగ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిస్థితి మరీ దారుణం. ఇప్పటివరకు 27 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, అందులో ఒకరిని మాత్రమే అర్హురాలిగా గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా పత్రాన్ని అందజేశారు. ఇంతవరకు సదరు అర్హురాలి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమకాలేదని తెలుస్తోంది.
 
సవాలక్ష పత్రాలు సమర్పిస్తేనే...!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటేనే చుక్కలు కన్పిస్తున్నాయి. మీ సేవ లేదా ఆన్‌లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి రావడం, ఆ సమయంలోనే దాదాపు ఇరవైకిపైగా పత్రాలు సమర్పించాల్సి వస్తోంది. వధువు తెలంగాణ రాష్ట్ర నివాసితురాలిగా ఉండాలని, వధూవరుల నివాస, కుల, ఆదాయ, వయసు, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులతోపాటు ఇదే మొదటి వివాహమని రుజువు చేసే పత్రాలను, విద్యార్హతల పత్రాలను సమర్పించాలి.

వధూవరుల పెళ్లి తేదీ ఖరారును ధ్రువీకరిస్తూ వీఆర్‌ఓ లేదా పంచాయతీకార్యదర్శి ధ్రువీకరణపత్రం తప్పనిసరి. చాలా మందికి ఈ పథకాల పట్ల అవగాహన లేకపోవడం ఒక ఎత్తయితే అవగాహన ఉన్నవారికి సైతం పైన పేర్కొన్న పత్రాలన్నీ సమర్పించాల్సి రావడం కష్టతరమవుతోంది. మరోవైపు సంబంధిత పత్రాలను జారీ చేసే అధికారుల వద్దరకు వెళితే సమయానికి ఉండకపోవడం, ఒకవేళ ఉన్నా రేపు, మాపంటూ పదేపదే తిప్పుతుండటం, కొందరైతే ఁఅమ్యామ్యా*లిస్తేనే ధ్రువీకరణ పత్రాలిస్తామంటూ ఇబ్బంది పెడుతుండటం వంటి అనేక కారణాలవల్ల ఆయా పత్రాలను సకాలంలో సమర్పించడం తలకుమించిన భారమవుతోంది.

వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.మూడు కోట్లు విడుదల చేసినప్పటికీ, రూ.అరకోటికి మించి ఖర్చు కాలేదని తెలుస్తోంది. మైనారిటీ శాఖ విషయానికొస్తే జిల్లాలో 1078 మందికి షాదీ ముబారక్ పథకాన్ని వర్తింపజేసేందుకు నిధులు మంజూరయ్యాయని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ప్రకటించారు. పథకం ల క్ష్యాలు ఘనంగా ఉన్నా, నిధులు దండిగా ఉన్నా ఆచరణలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. నిబంధనలను సరళతరం చేస్తేనే లబ్దిదారులకు తొందరగా న్యాయం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
 
 
 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ప్రగతి ఇలా
 
 1. ఎస్సీలకు సంబంధించి.....
 వచ్చిన దరఖాస్తులు    -365
 పరిశీలనలో ఉన్నవి    -243
 మంజూరైనవి    -122
 ట్రెజరీ శాఖకు వెళ్లినవి    -102
 లబ్దిదారుల ఖాతాల్లో జమ అయినవి    : 50
 (మంజూరైన వాటన్నింటికీ సంబంధించిన నగదును ఈ నెలాఖరులోగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు)
 2. ఎస్టీలకు సంబంధించి....
 వచ్చిన దరఖాస్తులు    -27
 పరిశీలనలో ఉన్నవి    -18
 మంజూరైనవి    -1
 లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్లినవి    -0
 3. మైనారిటీలకు సంబంధించి...
 వచ్చిన దరఖాస్తులు    -171
 పరిశీలనలో ఉన్నవి    -98
 మంజూరైనవి    -73
 లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్లినవి    -50

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement