kalyana Lakshmi scheme
-
TS: ‘కల్యాణ’ కానుకేదీ?
నల్లగొండ జిల్లా చండూరు మండలం దోనిపాములకు చెందిన ఇప్ప లక్ష్మయ్య తన కుమార్తె వివాహం 2022 జూన్‌లో చేశాడు. ఆ తర్వాత కల్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించాడు. దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కల్యాణ కానుక అందలేదు. క్రమం తప్పకుండా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు నెలరోజుల్లో వస్తుందని చెబుతున్నా.. అలాంటి నెలలెన్నో గడిచిపోతుండటంతో లక్ష్మయ్య సాయంపై ఆశలు వదులుకునే పరిస్థితికి చేరుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన బి.అమృత తన కుమార్తె వివాహం గతేడాది ఫిబ్రవరి 9న చేసింది. వెంటనే కల్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. పథకం అర్హత, సాయం కోసం అధికారులను అడిగినప్పుడల్లా.. వివరాలను సంబంధిత అధికారులకు పంపించామని, ప్రభుత్వం నిధులు ఇచి్చనప్పుడు అందిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సాయం అందుతుంతో లేదో ఆమెకు అర్థం కావడం లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి పథకం పడకేసింది. కుమార్తెల వివాహాలు చేసి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. ఏడాది, ఏడాదిన్నర దాటుతున్నా ‘కల్యాణ’ కానుక జాడ లేక పోవడంతో..సమీప భవిష్యత్తులోనైనా వస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి రోజు నాటికే వధువు కుటుంబానికి రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని (కానుక) అందించాలనేది కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశం. దరఖాస్తు ప్రక్రియలో నిబంధనలు, క్షేత్రస్థాయిలో విచారణ నేపథ్యంలో అర్జీదారులంతా వివాహం తర్వాతే దరఖాస్తు సమర్పిస్తున్నారు. అలా సమర్పించిన దరఖాస్తును పరిశీలించి విచారణ పూర్తి చేసిన తర్వాత అర్హతలను ఖరారు చేసి, లబ్దిదారు కుటుంబానికి చెక్కు రూపంలో సాయం అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పథకాలకు నిధుల విడుదల నిలిచిపోగా.. క్షేత్రస్థాయిలో దరఖాస్తు పరిశీలన కూడా ఆగిపోయింది. ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన అర్జీదారులకు ఎలాంటి సమాచారం అందడం లేదు. దాదాపు నాలుగు నెలలుగా రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చెక్కుల పంపిణీ జరగడం లేదు. రెండు పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా 1,04,613 దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నట్లు సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విడుదల కాని నిధులు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి లక్షకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో ఆ మేరకు బకాయిలు కూడా పేరుకుపోయాయి. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. 2023–24 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలాఖరు నాటికి రెండు పథకాలకు సంబంధించి 1,32,046 దరఖాస్తులు అందగా, 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మరో 69,715 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ దరఖాస్తులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జత (క్యారీ ఫార్వర్డ్) చేశారు. క్యారీ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులతో 2023–24 డిసెంబర్ నెలాఖరు నాటికి వచ్చిన వాటిని కలిపితే మొత్తం దరఖాస్తులు 2,01,761. వీటిలో 97,148 దరఖాస్తులను అధికారులు విడతల వారీగా పరిష్కరించి క్లియర్ చేశారు. వీటికి సంబంధించి ప్రభుత్వం రూ.972.60 కోట్లు విడుదల చేసింది. కానీ 1,04,613 దరఖాస్తులకు సంబంధించి రూ.1,047.68 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గత నాలుగు నెలలుగా ఎన్నికల కోడ్, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిధుల విడుదల జరగక చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. కాగా ప్రస్తుత బకాయిల్లో బీసీ, ఈబీసీ కేటగిరీల వారి దరఖాస్తులకు సంబంధించినవే సగానికిపైగా ఉండడం గమనార్హం. కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చా? లేదా? రాష్ట్రంలో గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికాకంలోకి వచ్చింది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు గత ప్రభుత్వ హయాంలోనే అమల్లో ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్..అధికారంలోకొస్తే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకాలకు నిధుల విడుదల నిలిచిపోవడంతో బంగారం సంగతి సరే బకాయిల సంగతి ఏమిటనే ఆందోళన, ఆయోమయం దరఖాస్తుదారుల్లో నెలకొంది. ఏడాదిన్నరకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో..ఆయా పథకాలకు అర్హతలున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కేటగిరీ వారీగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ బకాయిలు (రూ.కోట్లలో) సంక్షేమ శాఖ పెండింగ్ దరఖాస్తులు చెల్లించాల్సిన బకాయిలు బీసీ, ఈబీసీ 55541 556.29 మైనారిటీ 23599 236.28 ఎస్సీ 14267 142.90 ఎస్టీ 11206 112.21 మొత్తం 104613 1047.68 -
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.3210 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ‘కల్యాణ’ కానుకకు 2023– 24 బడ్జెట్లో ప్రాధాన్యత దక్కింది. క్షేత్రస్థాయి నుంచి సాయం అందుకునే వారి సంఖ్య పెరుగు తుండడంతో కేటాయింపులను సైతం రాష్ట్ర ప్రభుత్వం అమాంతం పెంచేసింది. తాజా బడ్జెట్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకా లకు రూ.3210 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో రూ.2750 కోట్లు కేటాయించగా... ఈసారి బడ్జెట్లో ఏకంగా రూ.460 కోట్లు పెంచింది. తాజా కేటాయింపులతో 3.20లక్షల మందికి కల్యాణ కానుక అందనుంది. -
పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు
ఖమ్మం మయూరిసెంటర్: పేదల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో 64మందికి రూ.6.40కోట్ల విలువైన కల్యాణలక్ష్మి పథకం చెక్కులను మంత్రి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు ఖమ్మం నియోజకవర్గంలో 7,515 మందికి రూ.70.21 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల నిధులను సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఇక రైతులకు 24 గంటల విద్యుత్, సాగునీరు, పేద ఆడపడుచులకు కేసీఆర్ కిట్లు, ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలు, మగ పిల్లవాడు జన్మిస్తే రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వివరించారు. అనంతరం లబ్ధిదారులు, వారి కుటుంబీకులతో కలిసి పువ్వాడ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, తహసీల్దార్ శైలజ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు.. ఎందుకిలా?
మలక్‌పేటకు చెందిన ఆటో డ్రైవర్ మస్తాన్ తన ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సాయం కోసం షాదీముబారక్ పథకం కింద ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు సదరు దరఖాస్తుపై విచారణ జరగలేదు. సంబందిత తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నా సరైన సమాధానం మాత్రం లభించడం లేదు. ఇది ఒక్క మస్తాన్ సమస్య కాదు.. నగరంలో వందలాది మంది నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్య. సాక్షి, హైదరాబాద్: దేవుడు వరం ఇచ్చినా... పూజారి కరుణించని చందంగా తయారైంది షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల పరిస్థితి. ఉన్నతాధికారుల ఉదాసీనవైఖరితో నిరుపేద ఆడబిడ్డల ఆర్థిక చేయూతకు గ్రహణం పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు సాయంపై గంపెడాశతో అప్పో సప్పో చేసి ఆడబిడ్డల పెళ్లిల్లు చేస్తున్న పేద కుటుంబాలు మరింత ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఏడాది గడిస్తే కానీ ఆర్థిక సాయం అందే పరిస్థితి కానరావడం లేదు. ప్రధానంగా దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ రెవెన్యూ యంత్రాంగానికి గుదిబండగా తయారైంది. ఒకవైపు వీఆర్వోలను ఇతర శాఖలకు బదిలీ చేయడం, మరోవైపు డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏల ఆందోళన... సిబ్బంది కొరత కారణంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధ్రువీకరణ పత్రాల జారీ, పింఛన్లు ఇతరత్రా విధుల్లో బిజీబిజీగా ఉండటంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉండగా... ఇప్పటికే క్షేత్ర స్థాయి విచారణ పూర్తయినా మిగితా ప్రక్రియ కూడా నత్తకు నడక నేర్పిస్తోందనడం నిర్వివాదంశం. వెంటాడుతున్న నిధుల కొరత ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను గ్రీన్ చానల్ కింద ప్రకటించినా నిధుల కొరత వెంటాడుతోంది. బడ్జెట్లో పథకాలకు కేటాయింపులు ఘనంగా ఉన్నా.. ఆమలులో మాత్రం పథకం చుక్కలు చూపిస్తోంది. క్షేత్ర స్థాయి విచారణ అనంతం ఆర్థిక సాయం మంజూరైనా... ట్రెజరీ బిల్లుల పెండింగ్‌లో పడిపోతున్నాయి. ప్రభుత్వ సాయం అందితే పెళ్లికి చేసిన అప్పులు తీర్చాలని భావిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. పేదింటి బిడ్డలను ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ప్రభుత్వం 2014లో శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన వధువులకు రూ. 1,00,116 సాయంగా అందజేస్తున్నారు. కార్యాలయాల చూట్టూ... కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు సంబంధిత తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ప్రభుత్వ సాయం అందలేదని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. దరఖాస్తులు తమ వద్ద పెండింగ్‌లో లేవని అధికారులు పేర్కొంటుండటంతో స్థానిక ఎమ్మెల్యేల వద్దకు పరుగులు చేస్తున్నారు. పరిస్థితి ఇలా... హైదరాబాద్ జిల్లాలో 14 వేల పైగా షాదీముబారక్ దరఖాస్తులు 2 వేలపైగా కల్యాణలక్ష్మి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విషయంలో కనీస విచారణ జరగకపోవడం కొసమెరుపు. (క్లిక్ చేయండి: మునుగోడు ఎన్నికల బరిలో ఉంటాం) -
అప్పుడేమో పెళ్లై పిల్లలు పుట్టాక.. ఇప్పుడేమో అప్లికేషన్ పెడ్తేచాలు..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరవుతోంది. వివాహమైన ఏడాదికో రెండేళ్లకో, పిల్లలు పుట్టాక వచ్చే కల్యాణలక్ష్మి చెక్కులు.. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటికి సంబంధించిన చకచకా సాగిపోతోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు వేగంగా సిద్ధం చేస్తుండగా, ఇప్పుడు సంక్షేమ పథకాల మంజూరును జిల్లా యంత్రాంగం వేగంగా చేపడుతోంది. త్వరలోనే నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. నియోజకవర్గంలో దరఖాస్తుల వివరాలు.. ►ఆగస్టు నెలలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో కల్యాణలక్ష్మి పథకం కోసం 268 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అవి మంజూరయ్యాయని చెక్కులు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ►చౌటుప్పల్ మండలంలో ఈ నెలలో ఇప్పటి వరకు 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటి మంజూరు కోసం ఉన్నతాధికారులకు పంపించారు. ►నారాయణపూర్ మండంలో జూలై నెలలో 10 దరఖాస్తులు రాగా, ఆగస్టు నెలలో 78 దరఖాస్తులు, ఈ నెలలో ఇప్పటివరకు 12 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అవి మంజూరయ్యాయని, త్వరలోనే చెక్కుల పంపిణీకి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ►మునుగోడు మండలంలో ఆగస్టు 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 19 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ప్రాసెస్ చేసిన రెవెన్యూ అధికారులు.. ఆమోదం కోసం నల్లగొండ ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. త్వరలోనే చెక్కులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ►మర్రిగూడ మండలంలో జూలై నెలలో కల్యాణలక్ష్మి కోసం 25 దరఖాస్తులు రాగా, ఆగస్టు నెలలో 27 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెలలో ఇప్పటివరకు 4 దరఖాస్తులు వచ్చాయి. వాటిన్నింటిని ఆమోదం ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. ►నాంపల్లి మండలంలో ఆగస్టు నెలలో 36 దరఖాస్తులు రాగా, ఈ నెలలో మరో 2 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆమోదం కోసం ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. ►చండూరు మండలం పరిధిలో జూలైలో 3 దరఖాస్తులు, ఆగస్టులో 16 దరఖాస్తులు రాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 3 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆమోదం కోసం నల్లగొండ ఆర్డీవో కార్యాలయానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. మండల స్థాయిలో పెండింగ్ లేకుండా.. నియోజకవర్గంలోని రిజర్వాయర్ల నిర్మాణంతో నిర్వాసితులైన వారికి పెండింగ్‌లో ఉన్న పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతోంది. ఇటీవలే దాదాపు 10 వేల కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. గొర్రెల పంపిణీకి కసరత్తు చేస్తోంది. చండూరు మండలంలోని గొల్లగూడెం, శేరిగూడెం, మునుగోడు మండలంలోని బీరెల్లిగూడెం, గంగోరిగూడెం, గుండ్లోరిగూడెం, రావిగూడెం గ్రామాలకు రేషన్ దుకాణాలను మంజూరు చేసింది. ఇప్పుడు కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేసే ప్రక్రియను వేగంగా చేస్తోంది. ఇందుకోసం వచ్చివ దరఖాస్తులను వెంట వెంటనే తహసీల్దార్లు ప్రాసెస్ చేస్తున్నారు. దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా, ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపిస్తున్నారు. ప్రస్తుతం వాటన్నింటిని మంజూరు చేసే పనిలో జిల్లా యంత్రాంగం ఉంది. -
‘ఇలాంటి ఫథకం దేశంలో ఎక్కడా లేదు’
సాక్షి,కూకట్పల్లి(హైదరాబాద్): పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించడం దేశంలో ఎక్కడా లేదని, అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 15 వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించామని, రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు. పింఛన్ డబ్బుల్లో రూ.1900 కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.100 మాత్రమే ఇస్తుందన్నారు. అంతా తామే ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారాలతో బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, చేతనైతే అభివృద్ధిలో పోటీ పడాలని బీజేపీ నేతలకు ఆయన సూచించారు. దేశంలో జాతీయ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో అయినా ప్రస్తుత పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుందని బీజేపీ నాయకులకు హితవు పలికారు. నేడు దేశం అంతా కరెంటు లేక సతమతం అవుతుంటే.. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నేడు తెలంగాణలో 24గంటల విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీష బాబురావు, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. చదవండి: దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్ -
జరిగిందంతా తూచ్.. ఈ కేసు కథ కంచికి చేరినట్లేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: రెవెన్యూశాఖను కుదిపేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అక్రమాల కేసు అటకెక్కినట్లేనా? ఈ కేసులో సుమారు నెల రోజులపాటు విచారణ జరిపి సమర్పించిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదిక బుట్టదాఖలైనట్లేనా? విచారణలో పలువురిపై చర్యలకు రాష్ట్రస్థాయి అధికారులు చేసిన సిఫారసులు ‘షోకాజ్’లతో సరిపుచ్చారా?... అంటే రెవెన్యూ వర్గాలనుంచి అవుననే సమాధానం వస్తోంది. పేదల కోసం ఉద్దేశించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో కొందరు తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. చెక్కుల పంపిణీ కోసం భారీగా వసూళ్లకు పాల్పడిన పలువురిపై సీరియస్‌గా స్పందించిన ఉన్నతాధికారులు మొదట చర్యలకు సిఫారసు చేశారు. విచారణ నివేదికల ఆధారంగా షోకాజ్‌లు జారీ చేసి కీలక పోస్టుల నుంచి తప్పించారు. ఓ వైపు విచారణ జరుగుతుండగా.. ఇవే కేసుల్లో తప్పించబడిన పలువురికి మళ్లీ పోస్టింగ్‌లు ఇస్తుండడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. విజిలెన్స్ నివేదికలు అటకెక్కినట్లేనా.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అనర్హులకు నగదు చెల్లించడం, అర్హులనుంచి వసూళ్లకు పాల్పడ్డారన్న వివాదంలో రాష్ట్రవ్యాప్తంగా 55 మంది తహసీల్దార్లు, ఇతర ఉద్యోగులుంటే.. ఉమ్మడి వరంగల్ నుంచి 16 మంది వరకు వివిధ స్థాయి అధికారులు ఉన్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ తహసీల్దార్ ఆఫీసు కేంద్రంగా జరిగిన వాటికి బాధ్యులుగా అప్పటి తహసీల్దార్ రాజును, మరో ఇద్దరిని జనవరి 24న అక్కడి నుంచి తప్పించారు. పరకాల ఆర్డీఓ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయాలపైన ఇచ్చిన నివేదికల ప్రకారం అందరికీ షోకాజ్‌లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇంకా విచారణ జరుగుతున్న సమయంలో పరకాల ఆర్డీఓ కార్యాలయానికి అటాచ్డ్ చేసిన రాజును రెండు నెలలైనా కాకముందే శాయంపేట తహసీల్దార్‌గా బదిలీ చేశారు. శాయంపేట తహసీల్దార్ కార్యాలయంపైనా స్పెషల్ బ్రాంచ్ అధికారులు విచారిస్తుండగా, అక్కడి తహసీల్దార్ పోరిక హరికృష్ణను బదిలీ చేయడం ఇప్పుడు రెవెన్యూశాఖలో చర్చనీయాంశంగా మారింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్లలో అదుపుతప్పిన అవినీతిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్వయంగా క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దింపారు. దీంతో ధర్మసాగర్, శాయంపేట తహసీల్దార్ కార్యాలయంతో పాటు పరకాల, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట, మహబూబాబాద్, గూడూ రు, కేసముద్రం, మహబూబాబాద్ తదితర తహసీల్దారు కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి, ములుగులో రెవెన్యూ సిబ్బందికి తోడు కంప్యూటర్ ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. క్షేత్రస్థాయిలో వివిధ పార్టీల లీడర్లు, వారి అనుచరులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, మరికొందరు దళారులు కలిసి అక్రమాలకు పాల్పడినట్లుగా 2021 డిసెంబర్లో నిఘావర్గాలు వెల్లడించిన నివేదిక ఆధారంగా జనవరిలో చర్యలు ప్రారంభించారు. ఇంకా విచారణ పూర్తికాకపోగా, మరికొందరిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో చర్యల్లో భాగంగా లూప్లైన్లకు పంపిన వారికి మళ్లీ పోస్టింగ్‌లు ఇస్తున్న నేపథ్యంలో కల్యాణలక్ష్మి అక్రమాల కథ కంచికి చేరినట్లేనన్న చర్చ జోరందుకుంది. -
ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు
హైదరాబాద్: ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండూ కష్టమైనవే. అలాంటిది ముఖ్యమంత్రి కేసీఆరే ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో భాగంగా 10 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.8,421 కోట్లు ఖర్చు చేశాం. ఇగ పెళ్లి చేసుకోవడానికి, ఆ తర్వాత పిల్లల బారసాల చేసుకోవడానికి ఫంక్షన్ హాళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే నిర్మిస్తోంది’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం సనత్‌నగర్ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్లో రూ.61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, వాణీదేవిలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తొలుత ఎస్పీ రోడ్డులోని ప్యాట్నీ నాలాపై రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పాటిగడ్డలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను, ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా రూ.45 కోట్లతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను అల్లంతోటబావి, బ్రాహ్మణవాడీలలో ప్రారంభించారు. పాటిగడ్డలో ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం నుంచి పని చేయించుకోవడం, ప్రజలకు ముందుండి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా సనత్‌నగర్ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. పాటిగడ్డలో ఆర్‌అండ్‌బీకి చెందిన 1,200 గజాల స్థలంలో ఇక్కడివారికి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించాలని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఇక్కడి పేదలు బర్త్ డేలు, వివాహాలు.. ఇలా చిన్నా పెద్దా శుభకార్యాలు చేసుకోవాలంటే వేల రూపాయల కిరాయిలు చెల్లిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇక్కడ చక్కటి ఫంక్షన్ హాల్ నిర్మించాల్సిందిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ అడిగిన వెంటనే రూ.6 కోట్లు మంజూరు చేశామన్నారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే దసరా నాటికి ప్రారంభించుకుందామని తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా కేసీఆర్ నాయకత్వంలో రహదారులు, మంచినీటి వ్యవస్థలు బాగుపడుతున్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్లు టి.మహేశ్వరి శ్రీహరి, కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు అరుణ, తరుణి, శేషుకుమారి, రూప, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్‌కుమార్ యాదవ్, రాజయ్య, శేఖర్ ముదిరాజ్, శ్రీనివాస్‌గౌడ్, అఖిల్ అహ్మద్ పాల్గొన్నారు. -
50 ఏళ్ల కింద పెళ్లయిన వారికి.. ‘కల్యాణలక్ష్మి’!
సాక్షి, హైదరాబాద్: ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే. కానీ అసలు దరఖాస్తు చేయకున్నా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయం రావడం, అదీ ఎప్పుడో 40, 50 ఏళ్ల కింద పెళ్లయిన వృద్ధుల ఖాతాల్లో పడుతుండటం విచిత్రం. ఇందులోనూ కొందరికి రెండు, మూడుసార్లు సొమ్ము జమవుతుండటం గమనార్హం. ►ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన శకుంతలబాయి వయసు 67 ఏళ్లు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పదిహేనేళ్ల కిందే పిల్లల పెళ్లిళ్లు జరిగిపోయాయి. కానీ శకుంతల బాయి బ్యాంకు ఖాతాలో రెండుసార్లు కల్యాణలక్ష్మి ఆర్థిక సాయం జమ అయింది. ►సిరికొండ మండలానికే చెందిన 65 ఏళ్ల సుమన్‌బాయి బ్యాంకు ఖాతాలో అయితే మూడు సార్లు కల్యాణలక్ష్మి నిధులు జమకావడం గమనార్హం. ►ఇచ్చోడ మండలం చించోలికి చెందిన గంగుబాయి వయసు 70 ఏళ్లు. ఆమె భర్త పదేళ్ల క్రితం మరణించాడు. ఆమె బ్యాంకు ఖాతాలోనూ రెండుసార్లు ఆర్థికసాయం నిధులు జమయ్యాయి. పొరపాటు కాదు.. అక్రమాలే! వృద్ధుల ఖాతాల్లో కల్యాణలక్ష్మి సొమ్ములు దఫదఫాలుగా జమకావడం కేవలం సాంకేతిక పొరపాటు కాదని.. నిధులను దారిమళ్లించే అక్రమాలేనని ఆరోపణలు ఉన్నాయి. కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ పథకాల సొమ్మును కాజేసేందుకు.. నకిలీ లబ్ధిదారుల పేరిట దరఖాస్తులు చేస్తున్నారని తెలిసింది. వారి ఖాతాల్లో జమ అయిన సొమ్మును ఏదో ఒక కారణం చెప్పి విత్‌డ్రా చేయించుకుంటున్నారని సమాచారం. అక్రమాలపై ‘నిఘా’.. ఏదీ? సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి నిఘా వ్యవస్థ బలహీనంగా ఉంది.. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో మరింత గందరగోళం నెలకొందని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం తొలుత ఈ పథకాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ద్వారా అమలు చేసింది. తర్వాత కొత్త విధానాన్ని తెచ్చింది. దరఖాస్తుల స్వీకరణను ఆన్లైన్ చేసింది. దరఖాస్తుల పరిశీలన, మంజూరు ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం, శాసనసభ్యులకు అధికారం ఇచ్చింది. కేవలం నిధులు విడుదల చేసే బాధ్యతను సంక్షేమశాఖలకు అప్పగించింది. ఇలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రెండేసి శాఖలు అమలు చేస్తుండడంతో.. అక్రమాలను నివారించే బాధ్యత ఎవరికీ పట్టడం లేదు. కనీసం ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపైనా స్పష్టత లేదు. దీనితో మధ్యవర్తులు, అవినీతి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.2వేల కోట్ల మేర ఈ పథకాలకు ఖర్చు చేస్తున్నా.. నిఘా వ్యవస్థపై ఇప్పటికీ దృష్టిసారించకపోవడం గమనార్హం. అర్హత నిర్ధారణలో జాప్యం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలనలో మూడు దశలు ఉంటాయి. ముందుగా ఆన్లైన్లో నమోదైన దరఖాస్తు తహసీల్దార్ లాగిన్‌కు చేరుతుంది. తహసీల్దార్ ఆ దరఖాస్తును తెరిచి పరిశీలిస్తారు. తర్వాత రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి విచారణ చేపట్టి అర్హతలను నిర్ధారిస్తారు. తర్వాత ఆ దరఖాస్తు ఎమ్మెల్యేకు చేరుతుంది. అక్కడ ఆమోదం పొందాక.. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) వద్దకు చేరుతుంది. ఆర్డీవో అర్హత నిర్ధారించి పథకాన్ని మంజూరు చేస్తారు. తర్వాత నిధులు విడుదలవుతాయి. అయితే రెవెన్యూ అధికారులపై పనిభారం కారణంగా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఎమ్మెల్యే, ఆర్డీవో స్థాయిల్లోనూ నెలల తరబడి పరిశీలనకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,09,027 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో సగానికిపైగా దరఖాస్తులు గత ఏడాది లబ్ధిదారులకు సంబంధించినవే.. ఈ ఏడాదికి క్యారీ ఫార్వార్డ్ అయినవి. పెళ్లయి నెలలు గడుస్తున్నా.. సొమ్ము రావట్లే.. ఆడబిడ్డ పెళ్లి నాటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఎక్కడా ఈ లక్ష్యం నెరవేరడం లేదు. పెళ్లయిన నెలరోజులకు సాయం అందినా కాస్త ఊరట దక్కుతుందని.. కానీ నెలలు గడుస్తున్నా ఆర్థిక సాయం అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరైతే ఏడాది దాటినా తమకు సాయం అందలేదంటూ సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి నిధుల విడుదల దాకా తీవ్ర జాప్యం జరుగుతుండటమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఏటా సగటున 1.5 లక్షల నుంచి 2 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. బడ్జెట్లో ప్రభుత్వం ఈమేరకు నిధులు కేటాయిస్తున్నా.. విడుదలలో జాప్యం జరుగుతోంది. సదరు ఆర్థిక సంవత్సరం ముగిసినా బిల్లులు క్లియర్ కావడం లేదు. వాటిని మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్ చేస్తుండడంతో.. బడ్జెట్ కేటాయింపులు సరిపోని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సంక్షేమశాఖల గణాంకాలు చెప్తున్నాయి. బడ్జెట్ లేకపోవడంతో వాటిని వివిధ దశల్లో ఆపినట్టు సమాచారం. వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు కేటగిరీ తహసీల్దార్ ఎమ్మెల్యే ఆర్డీవో ఎస్సీ 6,082 3,831 5,665 ఎస్టీ 4,665 2,663 10,013 బీసీ 16,458 10,481 13,584 ఈబీసీ 1,905 1,031 1,671 మైనార్టీ 5,034 3,173 22,771 మొత్తం 34,144 21,179 53,704 విజిలెన్స్ గుర్తించినా చర్యలేవీ? కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు విజిలెన్స్ విభాగం గతంలోనే గుర్తించింది. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో విజిలెన్స్ విభాగం అధికారులు చేపట్టిన విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు మొదలు డిప్యూటీ తహసీల్ధార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుల దాకా వసూళ్లకు తెగబడుతున్నట్టు తేల్చింది. కొన్నిచోట్ల గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, రాజకీయ పార్టీల నాయకులు మధ్యవర్తులుగా, ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించింది. ఈ అంశంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు కూడా చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కూడా. కానీ ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. మ్యాన్యువల్ వ్యవహారానికి చెక్ పెడితేనే.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకే ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. దానిని పక్కాగా అమలు చేస్తేనే అక్రమాలకు చెక్‌పడుతుందని లబ్ధిదారులు అంటున్నారు. వసూళ్ల కోసమే మధ్యవర్తులు, అధికారులు మ్యాన్యువల్ దరఖాస్తుల వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాము ముందుండి దరఖాస్తులను ప్రాసెస్ చేయిస్తున్నట్టు వ్యవహరించడం, తప్పులు ఉన్నాయని, సరిచేయడానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం సులువు అవుతోందని అంటున్నారు. మ్యాన్యువల్‌గా దరఖాస్తులు తీసుకోవద్దని అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనివల్ల అక్రమాలకు చెక్పడటంతోపాటు పారదర్శకత పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. పెళ్లయి నెలలు గడుస్తున్నా.. సొమ్ము రావట్లే.. ఆడబిడ్డ పెళ్లి నాటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఎక్కడా ఈ లక్ష్యం నెరవేరడం లేదు. పెళ్లయిన నెలరోజులకు సాయం అందినా కాస్త ఊరట దక్కుతుందని.. కానీ నెలలు గడుస్తున్నా ఆర్థిక సాయం అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరైతే ఏడాది దాటినా తమకు సాయం అందలేదంటూ సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి నిధుల విడుదల దాకా తీవ్ర జాప్యం జరుగుతుండటమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఏటా సగటున 1.5 లక్షల నుంచి 2 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. బడ్జెట్లో ప్రభుత్వం ఈమేరకు నిధులు కేటాయిస్తున్నా.. విడుదలలో జాప్యం జరుగుతోంది. సదరు ఆర్థిక సంవత్సరం ముగిసినా బిల్లులు క్లియర్ కావడం లేదు. వాటిని మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్ చేస్తుండడంతో.. బడ్జెట్ కేటాయింపులు సరిపోని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సంక్షేమశాఖల గణాంకాలు చెప్తున్నాయి. బడ్జెట్ లేకపోవడంతో వాటిని వివిధ దశల్లో ఆపినట్టు సమాచారం. దరఖాస్తుకు ఏమేం కావాలి? దరఖాస్తుదారులు ఈపాస్ వెబ్సైట్లో నేరుగాగానీ, మీసేవ కేంద్రాల ద్వారాగానీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో పెళ్లికూతురు వివరాలు, ఆధార్ కార్డు, కులధ్రువీకరణ పత్రం, వివాహ ధ్రువీకరణ పత్రం, పెళ్లికార్డు, పెళ్లి జరిగిన రుజువులతో కూడిన ఫొటో, తల్లి బ్యాంకు ఖాతా నంబర్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. మ్యాన్యువల్‌గా ఈ దరఖాస్తును, ఆధారాలను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సిన అవసరం లేదు. త్వరగా అందితేనే సాయానికి విలువ పేద కుటుంబాలను ఆదుకోవడానికే ప్రభుత్వం కల్యాణలక్షి్మ, షాదీ ముబారక్ పథకాలను తెచి్చంది. ఆడపిల్ల పెళ్లి నాటికి ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. పెళ్లి రోజే సాయం చేస్తామని ప్రకటించినా.. ఆరు నెలలు, ఏడాది దాకా కూడా ఆర్థిక సాయం అందడం లేదు. ఇది ఈ పథకాల స్ఫూర్తికే విరుద్ధం. ఈ పథకాలకు సకాలంలో నిధులు ఇవ్వకపోవడం సరికాదు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అడ్వాన్స్‌గా నిధులు ఉంచి గ్రీన్ చానెల్ ద్వారా పంపిణీ చేయాలి. బకాయిలు ఉండకుండా చూడాలి. కనీసం దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లోగా పరిష్కరిస్తే పేదింటికి లాభం జరుగుతుంది. – రమ్య, కార్యనిర్వాహక అధ్యక్షురాలు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం -
కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!
పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆ కుటుంబాలకు భారం కాకూడదన్న ఉదాత్త లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిని పారదర్శకంగా అమలు చేసేందుకు ఆన్లైన్ విధానాన్నీ ప్రవేశపెట్టింది. కానీ కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం ఆడబిడ్డలకు అందే ఆర్థికసాయంలోనూ కక్కుర్తిపడుతున్నారు. చేయి తడిపితేనే పనవుతుందంటూ వసూళ్లకు తెగబడుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల దాకా కమీషన్ల రూపంలో దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు దళారులుగా మారి కమీషన్లు తీసుకుంటున్నారు. ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఇలాంటి వాస్తవాలెన్నో బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని వెల్లడైంది. దీనిపై ప్రత్యేక కథనం. -చిలుకూరి అయ్యప్ప నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన శ్రీలత (పేరుమార్చాం) కల్యాణలక్ష్మి పథకం కోసం మీసేవ కేంద్రంలో రూ.150 చెల్లించి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు ప్రింటవుట్‌తోపాటు ఇతర ఆధారాలు, జిరాక్సు పత్రాలతో కూడిన ఫైల్‌ను మండల కార్యాలయంలో సమర్పించాలని సదరు మీసేవ నిర్వాహకుడు సూచించాడు. అదే తనకు రూ.500 ఇస్తే ఫైల్‌ను నేరుగా సంబంధిత అధికారులకు చేరుస్తానని.. మీరు వెళితే జాప్యం అవుతుందని చెప్పాడు. దీనితో శ్రీలత సదరు మీసేవ నిర్వాహకుడికి రూ.500 ఇచ్చింది. తర్వాత ఒకరిద్దరు మధ్యవర్తులు శ్రీలత తల్లిదండ్రులను సంప్రదించారు. తహసీల్దార్ ఆఫీసులో పనిత్వరగా కావాలన్నా, దరఖాస్తు ఆమోదం పొందాలన్నా రూ.5వేలు ఖర్చవుతుందని గాలం వేశారు. చేసేదేమీ లేక శ్రీలత తల్లిదండ్రులు డబ్బులు కట్టారు. తర్వాత పరిశీలన, విచారణ వారం, పదిరోజుల్లో పూర్తయ్యాయి. కొద్దిరోజుల తర్వాత చెక్కు జారీ అయిందని, దానికి రూ.2 వేలు ఖర్చవుతుందని మధ్యవర్తులు మళ్లీ ఫోన్ చేశారు. డబ్బులు చెల్లించాక కొద్దిరోజులకు కల్యాణలక్ష్మి సొమ్ము చేతికి అందింది. నిజామాబాద్ జిల్లా భీంగల్‌కు చెందిన షాహీన్ (పేరుమార్చాం) షాదీ ముబారక్ పథకం కింద మీసేవ కేంద్రంలో దరఖాస్తు సమర్పించింది. తర్వాత షాహీన్ తల్లి సదరు దరఖాస్తు, ఇతర ఆధారాలను స్థానిక ప్రజాప్రతినిధి భర్తకు ఇచ్చి ఆర్థిక సాయం త్వరగా వచ్చేలా చూడాలని కోరింది. ఆయన మున్సిపల్ అధికారులు, ఆర్డీవో కార్యాలయంలోని అధికారులకు ‘చెయ్యి తడిపితే’నే పనవుతుందంటూ రూ.10 వేలు వసూలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత దరఖాస్తు పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాయని చెప్పాడు. దాదాపు ఆరేడు నెలల తర్వాత షాదీముబారక్ నగదు బ్యాంకు ఖాతాలో జమ అయింది. పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయంలోనూ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల కాసుల కక్కుర్తికి ఈ రెండూ చిన్న ఉదాహరణలు. అక్కడ ఇక్కడ అని కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు సరిగా విడుదలకాక లబ్ధిదారులకు సొమ్ము అందడంలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. అప్పోసొప్పో చేసి ఆడపిల్లలకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు.. ప్రభుత్వ సాయం ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంపై బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా సరిగా స్పందించలేదు. నిధులు త్వరలోనే విడుదలవుతాయని, లబ్ధిదారులందరికీ సాయం జమ అవుతుందని మాత్రం పేర్కొన్నారు. అందిన చోటల్లా వసూళ్లే.. అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో వసూళ్లకు తెగబడుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల నుంచి.. పత్రాల సమర్పణ, పరిశీలన, విచారణ, చెక్కుల మంజూరు దాకా.. ఒక్కోదశలో ఒక్కొక్కరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చాలాచోట్ల దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాక నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వకుండా.. స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించాల్సి వస్తోంది. నేరుగా వెళితే పథకం సొమ్ము రాదంటూ దరఖాస్తుదారులను భయపెడుతుండటమే దీనికి కారణం. స్థానిక ప్రజాప్రతినిధులు తమవద్దకు వచ్చినవారి దరఖాస్తులను సంబంధిత కార్యాలయానికి పంపుతున్నారు. తర్వాత ఫైళ్ల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ, మంజూరు సమయంలో అధికారులు, సిబ్బందికి ఇవ్వాలంటూ.. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఎవరివాటా వారికి ఇచ్చి, తామూ కొంత తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా ఒక్కో దరఖాస్తుదారు వద్ద రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఒక్కచోటే 86లక్షలుమింగేశారు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంగా విజిలెన్స్ అధికారులు చేసిన పరిశీలనలో దిమ్మతిరిగే అంశాలను గుర్తించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన, ప్రాసెసింగ్ విషయంలో.. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీవో) కార్యాలయంలోని ఒక సీనియర్ అసిస్టెంట్ ఏకంగా రూ.86,09,976 దారి మళ్లించినట్టు గుర్తించారు. దీనిపై గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. సదరు సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్టు చేశారు. ఇది కేవలం ఒక్క ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అక్రమాల లెక్క మాత్రమే. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఈ తరహా అక్రమాలు భారీగా చోటు చేసుకున్నట్టు విజిలెన్స్ వర్గాలు చెప్తున్నాయి. వివాహ ధ్రువీకరణ పత్రం జారీలోనూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులకు కులధ్రువీకరణ పత్రంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జత చేయాలి. కుల ధ్రువీకరణ పత్రం జారీ సాధారణంగానే జరుగుతున్నా.. వివాహ ధ్రువీకరణ పత్రం కోసం వసూళ్లు సాగుతున్నాయి. స్థానిక సంస్థలు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కులధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి వీలుంది. అయితే 95 శాతం మంది స్థానిక సంస్థల నుంచే పత్రాలను తీసుకుంటున్నారు. పంచాయతీల పరిధిలో కార్యదర్శి, మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు వాటిని జారీ చేస్తున్నారు. ఈ సమయంలో రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్టు జనాలు చెప్తున్నారు. ఆన్లైన్.. పేరుకే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తి పారదర్శకతతో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. అర్హత ఉన్న లబ్ధిదారులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. దానిపై అవగాహన లేనివారు సమీపంలోని మీసేవ కేంద్రంలో సర్వీసు చార్జీలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుతోపాటు ఆధారాలను స్కాన్‌చేసి అప్లోడ్ చేయాలి. కానీ చాలాచోట్ల మ్యాన్యువల్‌గా సమర్పించిన దరఖాస్తులనే అధికారులు, సిబ్బంది పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసి.. మ్యాన్యువల్‌గా సమర్పించని వారి అర్జీలను నిర్దేశించిన గడువు తర్వాత తిరస్కరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మ్యాన్యువల్‌గా పత్రాల సమర్పణపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకున్నా.. రెవెన్యూ అధికారులు, పరిశీలన సిబ్బంది అత్యుత్సాహం తీవ్ర గందరగోళానికి దారితీస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. -
‘ఎన్ని కష్టాలెదురైనా.. ప్రజా ఆశీర్వాదంతో ముందుకు సాగుతాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రజా ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ముందుకు సాగుతున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.1 కోటి 88 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా స్థానిక కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో జరిగిన షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 3కోట్ల 49 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ రాష్ట్ర చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా చైర్మన్ పాండురంగారెడ్డి, హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రసంగిస్తూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని, కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రజా సంక్షేమాన్ని చేపడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల 4 వేల 70 మందికి కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులను అందించిందని పేర్కొన్నారు. మొదటి విడతగా 6వేల కోట్లు, రెండో విడతగా 2వేల కోట్లు మొత్తం 8వేల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. పాలనలో తెలంగాణ రాష్ట్రం భారత దేశానికి ఆదర్శం అని అన్నారు. -
కల్యాణ లక్ష్మి డబ్బుల కోసం వీఆర్వో కక్కుర్తి
సాక్షి, నల్లబెల్లి(వరంగల్): నిరుపేద కుటుంబాల్లో యువతుల వివాహానికి ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం దరఖాస్తు ఆమోదించేందుకు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు యువతి తండ్రి నుంచి రూ.3వేలు తీసుకుంటున్న వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడపల్లి వీఆర్వో ఐలయ్య సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలు.. విచారణ నివేదిక కోసం.. మేడపల్లి గ్రామానికి చెందిన దేవరాజు పద్మ – ఏకాంబ్రం దంపతుల కుమార్తె మౌనిక వివాహాన్ని ఈ ఏడాది జనవరి 6న జరిపించారు. ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి పథకం కోసం ఏకాంబ్రం మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసి పత్రాలను ఫిబ్రవరి 13న వీఆర్వో ఐలయ్యకు అందించాడు. అయితే, విచారణ నివేదికను పూర్తి చేసేందుకు వీఆర్వో ఐలయ్య రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో రూ.5వేలైనా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. ఈమేరకు మొత్తాన్ని చెక్కు వచ్చాక ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నాడు. గత నెల 25న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారురాలి తల్లి పద్మ చెక్కు తీసుకున్నప్పటి నుంచి వీఆర్వో ఐలయ్య రూ.5వేల కోసం వేధిస్తుండగా, ఏకాంబ్రం తమ వద్ద డబ్బు లేదని చెప్పాడు. రూ.3వేలైనా ఇవ్వాలని తేల్చిచెప్పడంతో ఏకాంబ్రం శుక్రవారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ మధుసూదన్, సీఐలు క్రాంతికుమార్, శ్యాంసుందర్ రంగంలోకి దిగి ఏకాంబ్రం నివాసం ఉంటున్న నర్సంపేట మండలం రాజుపేటలో సోమవారం మాటు వేశారు. అక్కడకు వచ్చిన వీఆర్వో ఐలయ్య రూ.3 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం ఆయనను నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి రికార్డులు పరిశీలించారు. అనంతరం డీఏస్పీ మధుసూదన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 94404 46146 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీంతో చైల్డ్‌లైన్ ప్రతినిధులు బాలిక, బాలుడితో పాటు వారి తల్లిదండ్రులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్ -
వెనకబడిన తరగతులకు వెయ్యిన్నర కోట్లు పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ వెనుకబడిన తరగతులకు కాస్త ఊరటనిచ్చింది. గత రెండేళ్లుగా అరకొర నిధులతో సరిపెట్టిన ప్రభుత్వం 2021–22 బడ్జెట్ కేటాయింపుల్లో కాస్త ప్రాధాన్యతనిచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం రూ.5,522.09 కోట్లు ఖర్చు చేయనుంది. ఈమేరకు బడ్జెట్లో కేటాయింపులు చేసింది. 2020–21 వార్షిక బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే 2021–22 వార్షిక బడ్జెట్లో రూ.1,618.51 కోట్లు అధికంగా కేటాయించింది. దీంతో బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఊపిరి అందించినట్లయింది. కార్పొరేషన్లకు చేయూత.. ఫెడరేషన్లకు రిక్తహస్తం.. వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థ, అత్యంత వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థలకు తాజా బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించారు. ఇందులో బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు దక్కాయి. ఈమేరకు నిధులు కేటాయించడంతో 2021–22 సంవత్సరంలో ఈ రెండు విభాగాల ద్వారా పథకాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సైతం అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ కులాలకు సంబంధించిన ఫెడరేషన్లకు మాత్రం ఈసారి బడ్జెట్లో నిధులు దక్కలేదు. కేవలం నిర్వహణ నిధులతో సరిపెట్టిన ప్రభుత్వం.. ప్రగతి పద్దులో మాత్రం ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం గమనార్హం. కల్యాణలక్ష్మికి రూ.500 కోట్లు అదనం.. 2021–22 సంవత్సరంలో కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించింది. 2020–21 బడ్జెట్లో కల్యాణ లక్ష్మి కింద రూ.1,350 కోట్లు కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ.1,850 కోట్లకు పెంచింది. క్షేత్రస్థాయి నుంచి బీసీ వర్గాల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగడం, లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేటాయింపులు చాలడం లేదు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో దాదాపు 40 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే తాజా బడ్జెట్లో రూ.500 కోట్లు అదనంగా కేటాయించడంతో బకాయిలన్నీ పరిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే 2021–22 ఏడాదిలో కల్యాణలక్ష్మి పథకాన్ని బకాయిలు లేకుండా అమలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్లో ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలకు పెద్దపీట వేసింది. ఈ రెండు శాఖల ద్వారా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు సైతం అమలవుతుండగా.. వాటికి సరిపడా కేటాయింపులు చేస్తూనే మరిన్ని పథకాల అమలుకు నిధులు కేటాయించింది. వచ్చే సంవత్సరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా రూ.5,587.97 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.3,056.12 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇక మైనార్టీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు కాస్త పెరిగాయి. 2020–21 వార్షికంలో రూ.1,138.45 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.1,606.39 కోట్లు కేటాయించింది. -
బోగస్ పెళ్లిళ్లు 90!
ఆదిలాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్యాణలక్ష్మి స్కాంలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు మూడేళ్లుగా వచ్చిన కల్యాణలక్ష్మి దరఖాస్తులను పరిశీలించిన తహసీల్దార్లు 90 పెళ్లిళ్లకు సంబంధించిన దరఖాస్తులు బోగస్‌గా ఉన్నాయని గుర్తించారు. ఒకసారి కల్యాణలక్ష్మి డబ్బులు తీసుకోగా మళ్లీ అవే ఫొటోలతో రెండోసారి దరఖాస్తు చేసినట్లుగా పరిశీలనలో తేలింది. మావల మండలానికి చెందిన మూడు బోగస్ దరఖాస్తులకు సంబంధించి డబ్బుల రికవరీ చేయగా, నాలుగు మండలాల పరిధిలోని 87 బోగస్ పెళ్లిళ్లకు సంబంధించి డ బ్బులు రికవరీ చేసే పనిలో అధికారులు నిగమ్నమయ్యారు. బోగస్ లబ్ధిదారులు, మధ్యవర్తుల బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని కలెక్టర్ ఇది వరకే ఎల్డీఎంను ఆదేశించారు. అయితే బోగస్దారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అలానే ఉన్నాయా? లేక డ్రా చేశారా? డ్రా చేస్తే ఆ డబ్బులు ఎలా.. ఎప్పుడు రికవరీ చేయాలనే దానిపై అధికారులు సమాలోచన చేసి ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో యంత్రాంగం తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. (చదవండి: చిచ్చురేపిన క్రికెట్.. కాల్పుల కలకలం) ఈ ఏడాదిలోనే జరిగిందా? రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను 2016లో ప్రారంభించి మొదట రూ.50,116 ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయంగా అందించింది. దానిని 2018 ఏప్రిల్‌లో రూ.1,00,116కు పెంచింది. ఏటా వేల సంఖ్యలో వివాహాలు జరగడం, పథకానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.. మూడు సెట్ల జిరాక్స్ కాపీలను తహసీల్ కార్యాలయంలో అందజేయడం తప్పనిసరి. కాని అలా జరగలేదు. అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న వారి దరఖాస్తులు మాత్రమే మ్యానువల్‌గా తహసీల్ ఆఫీసులకు అందాయి. బోగస్ పెళ్లిళ్లకు సంబంధించిన మ్యానువల్ దరఖాస్తులు తహసీల్దార్ల కార్యాలయాలకు రాలేదని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలమైన వ్యక్తుల ఫొటోలు, బ్యాంకు ఖాతాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జతచేసి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా సంబంధిత మండల తహసీల్దార్ల లాగిన్ నుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయానికి పంపుతూ వచ్చారు. ఒకసారి కల్యాణలక్ష్మి డబ్బులు పొందిన లబ్ధిదారుల ఫొటోలు మళ్లీ పెట్టి తల్లిదండ్రుల పేర్లు, బ్యాంకు ఖాతా, ధృవీకరణ పత్రాలు మార్చి రెండోసారి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 2019లో పెళ్లి జరిగినట్లుగా దరఖాస్తులో పొందుపర్చి డబ్బులు ఈ ఏడాదిలో దండుకున్నట్లు విచారణలో తేలినట్లుగా సమాచారం. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కాలంలోనే బోగస్ పెళ్లిళ్లకు చెందిన బిల్లులు ఎక్కువ పాసయ్యాయని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, తహసీల్దార్లు లాగిన్, పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశం ఉన్నా.. ఆ సమయంలో చేంజ్ చేద్దామనే ఆలోచన రాకపోవడం గమనార్హం. (చదవండి: అయ్యో.. ఐఫోన్ అందకపాయె..! ) కొనసాగుతున్న విచారణ.. జిల్లాలోని ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో కల్యాణలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన ముగిసింది. మూడేళ్లుగా వచ్చిన దరఖాస్తులను నాలుగైదు రోజుల పాటు కుప్పలు తెప్పలుగా పోసి క్షుణ్ణంగా పరిశీలించారు. 90 దరఖాస్తులు బోగస్‌గా తేలగా, 3 దరఖాస్తుల డబ్బులు రికవరీ చేశారు. మిగతా 87 దరఖాస్తులకు సంబంధించిన లబ్ధిదారుల నివాస ప్రాంతాలు ఉట్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, బజార్హత్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, గుడిహత్నూర్, మావల మండలాల తహసీల్దార్ల లాగిన్ల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఎవరు దరఖాస్తుదారు, చెక్ ఎవరి పేరిట మంజూరైంది? బ్యాంకు ఖాతా.. పెళ్లికి సంబంధించిన పత్రాలు, ఫొటో, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తదితరవి వాటిపై ఆయా మండల కార్యాలయాల్లో విచారణ జరుగుతోంది. బోగస్‌గా గుర్తించినవి సరైనవేనా.? అనేది తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి విచారిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. విచారణ ముగిశాక ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెబుతున్నారు. విచారణ జరుగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు దరఖాస్తులు పరిశీలించి బోగస్‌గా 90 దరఖాస్తులు గుర్తించాం. ఇందులో మూడు దరఖాస్తులకు చెందిన డబ్బులు రికవరీ అయ్యాయి. మిగతా 87 దరఖాస్తులపై విచారణ జరుగుతోంది. పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుంది. అనంతరం రికవరీ చేస్తాం. – జాడి రాజేశ్వర్, ఆదిలాబాద్ ఆర్డీవో -
మోక్షమెప్పుడో..?
పాల్వంచకు చెందిన షేక్ ఆలియాకు 2019 ఏప్రిల్ 28న వివాహమైంది. ఈమెకు ప్రస్తుతం 10నెలల పాప ఉంది. కానీ ఇప్పటివరకు షాదీముబారక్ చెక్కు ఇవ్వలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితంలేదు. నగదు మంజూరై ఆర్డీవో పీడీ ఖాతాలో ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తోంది. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. చెక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. ఈ పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కుటుంబాల్లోని యువతులకు వివాహం చేస్తే ప్రభుత్వం రూ.1,00,116 చొప్పున అందిస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ట్రెజరీకి, అక్కడి నుంచి ఆర్డీఓ పీడీ(పర్సనల్ డిపాజిట్) ఖాతాకు నిధులొచ్చినా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. పెళ్లయిన నెలరోజుల లోపే చెక్కులు అందించాల్సి ఉండగా, రెండేళ్లు దాటినా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. కొందరు యువతులకు వివాహమై పిల్లలు జన్మించడంతో పాటు రెండున్నరేళ్లు దాటినప్పటికీ సదరు మొత్తం అందడం లేదు. దీంతో వివాహమై ఇతర జిల్లాలు, ప్రాంతాలకు వెళ్లిన యువతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా జాప్యం.. జిల్లాలో 2019–20 సంవత్సరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు 5,661 మంది దరఖాస్తు చేసుకోగా, 174 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 5,487 మందికి సంబంధించిన నగదు ట్రెజరీ ద్వారా ఆర్డీఓ పీడీ ఖాతాకు చేరింది. ఇందులో సుమారు 450 మందికి మాత్రం నెలల తరబడి, కొందరికి ఏడాది, మరికొందరికి ఏడాదిన్నర పైబడినప్పటికీ చెక్కులు అందించకుండా జాప్యం చేస్తున్నారు. 2020–21లో 1,909 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో తహసీల్దార్ల వద్ద 283, ఎమ్మెల్యేల వద్ద 193 పెండింగ్‌లో ఉన్నాయి. 3 దరఖాస్తులను తిరస్కరించారు. 1,430 ఎమ్మెల్యేల వద్ద అప్రూవల్ అయి ఉన్నాయి. వీటికి సంబంధించిన నగదు ఆర్డీవో పీడీ ఖాతాలో జమ కాలేదు. 2020–21లో కోవిడ్–19 కారణంగా ఆలస్యమైనా, 2019–20కి సంబంధించిన చెక్కులు అందకపోవడంతో లబ్ధిదారులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 2017, 2018 వివాహమైన యువతుల్లో కొందరికి ఇప్పటికీ చెక్కులు రాలేదు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా చెక్కులు ఇచ్చేందుకే జాప్యమా..? కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 2015లో ప్రారంభం కాగా, మొదట్లో నేరుగా సదరు యువతి ఖాతాలో జమ అయ్యేవి. తర్వాత కాలంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చెక్కుల రూపంలో పంపిణీ చేయిస్తున్నారు. ప్రస్తుతం పలువురు లబ్ధిదారులకు సంబంధించి నగదు మంజూరై ట్రెజరీ నుంచి ఆర్డీవో పీడీ ఖాతాలోకి వచ్చినట్లు ఆన్‌లైన్‌లోనూ చూపిస్తోంది. బ్యాంకర్లు చెక్కులు ఇవ్వడంలేదనే కారణంతో వీటి పంపిణీ ఆలస్యం చేస్తున్నారు. కోవిడ్–19 సమయంలో ఎక్కువమంది గుమిగూడే అవకాశం లేనందున నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడమో లేక వారికి నేరుగా ఇచ్చే అవకాశముంది. కానీ ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేసేందుకే తాత్సారం చేస్తున్నారని, ఇదంతా ఎమ్మెల్యేల ప్రచార కండూతి కోసమేననే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై ఆర్డీవో కనకం స్వర్ణలతను వివరణ కోరగా... కోవిడ్–19 కారణంగా ఆలస్యమవుతోందని తెలిపారు. మరోవైపు మంజూరైనవాటికి సంబంధించి బ్యాంకర్లు చెక్కులు ఇవ్వడంలో జాప్యం కావడంతో పంపిణీ చేయలేదన్నారు. -
కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
-
‘పెళ్లి’కి నిధుల్లేవ్!
‘నగరంలోని వారాసిగూడకు చెందిన ఖాజాబీ సరిగ్గా నాలుగేళ్ల కిందట షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక చేయూత కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందలేదు. దీంతో ఈ నెల మొదటి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆర్థిక సహాయం ఇప్పించాలని జాయింట్ కలెక్టర్ రవికి మొర పెట్టుకుంది. దీనిపై స్పందించిన జేసీ అక్కడే ఉన్న జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారిని పరిశీలించాలని ఆదేశించారు’’ ఇదొక ఖాజాబీ సమస్య కాదు..పాతబస్తీకి చెందిన ఎందరో ఇలా ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్’ పథకాలను నిర్లక్ష్యం, నిధుల కొరత వెంటాడుతున్నాయి. బడ్జెట్లో కేటాయింపులు ఘనంగా ఉన్నా..నిధుల మంజూరు, విడుదలలో మాత్రం నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని గంపెడు ఆశలతో అప్పోసప్పో చేసి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన పేద కుటుంబాలు నిరాశకు గురవుతున్నాయి. రెవెన్యూ శాఖలో ఒకవైపు దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతుండగా..మరోవైపు తహసీల్దారు పరిశీలన పూర్తయి ఎమ్మెల్యే, ఆర్డీవో ఆమోదం పొంది మంజూరుతో ట్రెజరీలకు బిల్లులు వెళ్తున్నా ఆర్థిక సహాయం మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు. పెళ్లిళ్లు జరిగి పిల్లలు పుట్టినా సాయం మాత్రం అందని దాక్ష్రగా తయారైంది. ఫలితంగా పేద కుటుంబాలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు పేదకుటుంబాల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నా..ఆర్థిక సహాయం అంతంత మాత్రంగా తయారైంది. పథకం ఇలా... ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన చెందిన..18 ఏళ్లకు పైబడిన ఆడబిడ్డల వివాహాల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉన్న ఆడబిడ్డల కుటుంబాలు ఆర్హులు..ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే బాధ్యతలను రెవెన్యూ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఆన్లైన్ ద్వారా రిజిష్టర్ అయిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతిపాదనలు స్థానిక ఎమ్మెల్యేలకు రెవెన్యూ శాఖ నివేదిస్తుంది. ఫైనల్‌గా ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాక..నిధులు మంజూరు చేస్తారు. షాదీ ముబారక్ పరిస్థితి ఇదీ... ♦ హైదరాబాద్ జిల్లా పరిధిలో గతేడాదికి సంబంధించి 5100 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది మరో 9120 దరఖాస్తులు వచ్చి చేరాయి. మొత్తం 14220 దరఖాస్తులకు గాను 274 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం మీద 10,049 దరఖాస్తులకు మంజూరు లభించగా, అందులో సుమారు 4237 దరఖాస్తుల బిల్లులు ట్రెజరీకి పంపకుండా రెవెన్యూ డివిజన్ స్థాయిలో మూలుగుతున్నాయి. ట్రెజరీ పంపిన వాటిలో 54 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం మీద 5758 బిల్లులకు మాత్రమే పీడీ అకౌంట్లలో డిపాజిట్ అయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ♦ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో సైతం గతేడాదికి సంబంధించి 671 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా ఈ ఏడాది కొత్తగా 1385 దరఖాస్తులు వచ్చాయి. 19 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 1587 దరఖాస్తులకు మంజూరు లభించగా, 606 బిల్లులు ట్రెజరీకు పంపలేదు. 184 బిల్లులు ట్రెజరీ వద్ద పెండింగ్‌లో ఉండగా, 797 బిల్లులకు సంబందించిన డిపాజిట్ మాత్రమే పీడీ అకౌంట్లలో జమ అయ్యాయి. ♦ రంగారెడి జిల్లా పరిధిలో గతేడాది 1084 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏడాది కొత్తగా 1770 కుటుంబాలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 243 తిరస్కరణకు గురయ్యాయి. 2161 దరఖాస్తులకు మంజూరు లభించింది. 986 దరఖాస్తుల బిల్లులు ట్రెజరీ పంపకుండా పెండింగ్‌లో ఉండగా, కేవలం 1175 బిల్లులకు మాత్రమే నిధులు పీడీ ఖాతాలో డిపాజిట్ అయ్యాయి. కల్యాణ లక్ష్మి పరిస్థితి ఇదీ.. ♦ హైదరాబాద్ జిల్లా పరిధిలో గతేడాది 355 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏదాడి ఇప్పటి వరకు కొత్తగా 923 దరఖాస్తులు వచ్చాయి. 30 తిరస్కరణకు గురయ్యాయి. 896 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 9 బిల్లులు ట్రెజరీకి పంపకుండా ఆర్డీవో వద్దనే ఉంచారు. ట్రెజరీ వద్ద 95 బిల్లులు పెండింగ్ ఉండగా, కేవలం 799 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ♦ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో గతేడాది 259 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 926 దరఖాస్తులు వచ్చి చేరాయి. 16 తిరస్కరణకు గురయ్యాయి. 927 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 30 బిల్లులు ట్రెజరీకి పంపలేదు. ఇక ట్రెజరీ వద్ద 185 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, 712 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ♦ రంగారెడ్డి జిల్లా పరిధిలో గతేడాది 381 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1202 దరఖాస్తులు వచ్చి చేరాయి. 33 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం మీద 1109 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 172 బిల్లులు ట్రెజరీకి పంపలేదు. ట్రెజరీ వద్ద 29 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, మొత్తం మీద 908 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. -
పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా కల్యాణలక్ష్మీ కోసం..
సాక్షి, నారాయణఖేడ్: నకిలీ ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకొని మంజూరు చేయించుకున్న కేసులో శుక్రవారం ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నారాయణఖేడ్ సీఐ రవీందర్‌రెడ్డి శుక్రవారం నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో వవరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఖేడ్ మండలం కొండాపూర్ తండాలో కల్యాణలక్ష్మి పథకంలో అవకతవకలు జరిగాయని తండాకు చెందిన రాంచందర్ ద్వారా ఫిర్యాదు స్వీకరించిన ఖేడ్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ విచారణ జరిపడంతో వాస్తవం బయటపడింది. ఈమేరకు తహసీల్దార్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్‌లకు చాలా ఏళ్ల క్రితం వివాహాలు జరిగాయి. ఈ మధ్యనే వివాహాలు జరిగినట్లు ఫొటోలు, నకిలీ ఆధార్‌కార్డులు, నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రాలను సృష్టించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి తహసీల్దార్ విచారణ జరపకుండా ధ్రువీకరించడంతో ఇద్దరికి కల్యాణలక్ష్మి పథకం కింద చెరో రూ.1,00,116 మంజూరు అయ్యాయి. లబ్ధిదారుల జాబితాను కొండాపూర్ తండాలో అతికించడంతో ఇద్దరు తమ తండావాసులే కాదని రాంచందర్ అనే వ్యక్తి గుర్తించి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తుర్కపల్లి తండాకు చెందిన దేవిదాస్, నెహ్రూనాయక్, వారి భార్యలు కవిత, తారాబాయి, నెహ్రూనాయక్ అత్త కొండాపూర్ తండాకు చెందిన దేవులీబాయితోపాటు తారాసింగ్‌పై కేసు నమోదు చేశారు. శుక్రవారం వారిలో దేవిదాస్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. సమావేశంలో ఎస్ఐ సందీప్ పాల్గొన్నారు. -
బినామీ పేరుపై ‘కల్యాణలక్ష్మి’
సాక్షి, ఖానాపూర్: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్రప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం.. స్థానిక అధికారుల నిర్లక్ష్యం.. వెరసి పథకం అమలులో చోటు చేసుకుంటున్న లోపాలతో ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుందని పలువురు పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తన్‌పల్లిలో బినామి పేర్లతో కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసిన దళారులు అధికారులతో కుమ్మకై చెక్కును మంజూరు చేయించుకోవడంతో పాటు డబ్బులు స్వాహా చేసేందుకు ప్రయత్నించారనే బలమైన ఆరోపణలు ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలిలా ఉన్నాయి. నలుగురు మనుషులు లేకున్నా ఉన్నట్లు సృష్టి సత్తన్‌పల్లి గ్రామంలోని దొమ్మటి రమ–వెంకటేశ్‌గౌడ్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురు లేదు. కాని కుటుంబ సభ్యులకు సంబందం లేకుండా గ్రామాలోని ఇద్దరు దళారులు ఆదంపతులకు కూతురు శ్యామల ఉన్నట్లు సృష్టించడంతో పాటు గ్రామంలో అసలే లేని పెళ్లికొడుకు, వారి తల్లిదండ్రులను కల్పితంగా సృష్టించి వివాహ ఆహ్వాన కార్డును ముద్రించారు. ఇరువురికి గ్రామంలోనే గత సంవత్సరం డిసెంబర్ 14న వివాహం జరిగినట్టు సృష్టించి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేశారు. దీంతో గ్రామానికి చెందిన దొమ్మటి రమ పేరుపై చెక్కు మంజూరైంది. ఈ నెల 4న స్తానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ తతంగం అధికారుల దృష్టికి వచ్చింది. అధికారులు చెక్కును ఇవ్వకుండా లోలోపల సమస్య సమసిపోయేలా గోప్యత ప్రదర్శించారనే విమర్శలొచ్చాయి. రమ–వెంకటేశ్‌లు మాత్రం ఇందులో తమ ప్రమేయం ఏమీలేదన్నారు. అధికారుల తీరుపైనే అనుమానం.. గ్రామస్థాయిలోరెవెన్యూ అధికారి, మండల స్థాయిలో గిరిధవార్లు క్షేత్రస్థాయిలో నిర్థారించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తే చెక్కు మంజూరవుతుంది. కానీ అధికారులు మాత్రం పోర్జరీ చేసి దరఖాస్తు చేశారని, తమ ప్రమేయం లేదని దాటవేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ సత్యనారాయణను వివరణ కోరగా తహసీల్దార్ విజయారెడ్డి ఘటన జరిగినరోజు విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చామన్నారు. విధుల బహిష్కరణ సందర్భంగా ఇంకా విచారణ జరుపలేదన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత దోషులపై చట్టపరమైన చర్యలకోసం పైఅధికారులకు నివేదిస్తామన్నారు. -
‘కల్యాణ’ కమనీయం ఏదీ.?
సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్): పేదింటి ఆడబిడ్డల వివాహ సమయంలో ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు లబ్ధిదారుల దరి చేరడం లేదు. పెళ్లి పందిరిలోనే అర్హులైన పేదింటి ఆడపిల్లకు చెక్కులు అందిస్తామన్న ప్రభుత్వం పథకం సాగదీత పథకంగా మారింది. వివాహం జరిగి నెలలు గడుస్తున్నా డబ్బులు చేతికి అందకపోవడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు నిరుత్సాహానికి గురవుతున్నారు. పెండింగ్‌లో వందలాది దరఖాస్తులు.. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కోసం గడిచిన ఏడాది నుంచి ఇప్పటి వరకూ 3771 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1361 మందికి డబ్బులు అందజేశారు. మిగిలిన వాటిలో 23 తహసీల్దార్ పరిశీలనలో తిరస్కరణకు గురయ్యాయి. తహసీల్దార్ వెరిఫికేషన్ స్థాయిలో 357 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఎమ్మె ల్యే పరిశీలనలో 410, ఎమ్మెల్యే ఆప్రూవల్ అనంతరం మంజూరు స్థాయిలో 1583 ఉన్నారు. ఇటీవల 37 దరఖాస్తుల డబ్బులు మంజూరై ట్రెజ రీలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు నిధులు మంజూరు కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం.. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం వివాహ కానుకగా మొదట రూ.51వేలు అందించింది. తర్వాత కానుకను రూ.1,00, 116/– కు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులు మురిసిపోయారు. కాని చెక్కుల మంజూరులో తీవ్ర జా ప్యం జరుగుతుండడంతో నిరాశలో మునిగారు. మరోవైపు ఈ పథకాల దరఖాస్తులు తహసీల్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వర కూ వివిధ దశల్లో పెండింగ్‌లో ఉంటున్నాయి. పథకంపై ఆశలు పెట్టుకుని ఆడ పిల్లల పెళ్లిలు పూర్తి చేసిన తల్లిదండ్రులు తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. దీనికి తోడు చెక్కుల కోసం నిత్యం తహసీల్ కార్యాల యం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డబ్బులు మంజూరు చేసి ఆదుకోవాలని కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులు కోరుతున్నారు. కళ్యాణలక్ష్మీ ఆలస్యంతో సరోజ స్పందన రెబ్బెన మండలంలోని గోలేటి పంచాయతీ పరిధి భగత్‌సింగ్ నగర్. జనరల్ స్టోర్స్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గతేడాది డిసెంబర్లో రెండో కూతురుకి వివాహం చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం డబ్బులు వస్తాయనే భరోసాతో అప్పు చేసి మరీ కల్యాణం జరిపించింది. వివాహ అనంతరం పథకం కోసం దరఖాస్తు చేసుకోగా నేటికీ ఒక్క పైసా కూడా రాలేదు. దాదాపు 10 నెలలుగా ఈ కానుక కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమస్య ఒక్క సరోజది మాత్రమే కాదు. జిల్లాలో గతేడాది నుంచి వివాహాలు జరిపిన అర్హులైన ప్రతి తల్లిదండ్రులది. నిధులు మంజూరు కావాల్సి ఉంది జిల్లాలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తమే. అయితే జిల్లాస్థాయిలో చాలా తక్కువ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేయాల్సిన దరఖాస్తుల సంఖ్యే అత్యధికంగా ఉంది. ఇటీవల 37 మందికి బిల్లులు మంజూరు కాగా లబ్ధిదారుల ఖాతాలో జమయ్యాయి. మిగిలిన వాటి కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపాం. మంజూరు కాగానే లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమవుతాయి. – సిడాం దత్తు, ఆర్డీవో -
‘సాయం’తో సంతోషం..
సాక్షి, కొత్తగూడెం : ఒకప్పుడు ఆడ బిడ్డ పెళ్లి చేయాలంటే ఆ కుటుంబం అప్పులపాలయ్యే పరిస్థితి ఉండేది. దీంతో తల్లిదండ్రులకు కంటినిండా కునుకు పట్టకపోయేది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ర్వాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పేరుతో ఆర్థిక సాయం అందిస్తూ నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతోంది. ఆడపిల్ల పెళ్లి భారంగా భావించిన తల్లిదండ్రులకు ఈ పథకం వరంగా మారింది. అమ్మాయిల పెళ్లిళ్లను వైభవంగా జరిపిస్తూ గౌరవ మర్యాదలను నిలుపుకుంటున్నారు. పెళ్లికి వచ్చిన వారికి ఏ లోటూ లేకుండా చూసుకోగలుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆడబిడ్డలకు ఇచ్చే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మొత్తాన్ని క్రమంగా పెంచుతుండడంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. జిల్లాలో ఈ ఏడాది 5036 దరఖాస్తులు... 2019–20 ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాలుగు నెలల్లో జిల్లాలో 5036 మంది కల్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థాయిలో పరిశీలన జరిపి 2318 మందికి మంజూరు చేశారు. వీటిలో ఇప్పటికే 1649 మందికి పంపిణీ చేశారు. ఇంకా 669 మందికి పంపిణీ చేయాల్సి ఉంది. మరో 2718 మంది దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. రూ.లక్ష దాటిన పథకం లబ్ధి... 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను ప్రవేశపెట్టింది. మొదట ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రూ.51 వేలు మంజూరు చేశారు. 2017 ఏప్రిల్ 1 నుంచి ఈ మొత్తాన్ని రూ.75,116కు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు బీసీ, ఈబీసీలకు సైతం పథకాన్ని వర్తింపజేశారు. 2018 ఏప్రిల్ 1 నుంచి రూ.1,00,116కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు మాత్రం ఈ పథకం కింద రూ.1, 25,140 లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించింది. అంతేకాక అనాథ ఆడ పిల్లలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. వీరికి అర్బన్ ప్రాంతంలో అయితే రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు చెల్లిస్తున్నామని, విడాకులు తీసుకుని రెండో వివాహం చేసుకునే మహిళలు గతంలో కల్యాణలక్ష్మి పథకంతో లబ్ధి పొందకుంటే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని అధికారులు వివరించారు. -
వధువుకు ఏదీ చేయూత?
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ ’ పథకాలకు నిధుల కొరత వెంటాడుతోంది. బడ్జెట్లో కేటాయింపులు ఘనంగా ఉన్నా.. నిధుల మంజూరు, విడుదలలో మాత్రం నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా పరిణమించింది. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని గంపెడు ఆశలతో అప్పో సప్పో చేసి ఆడబిడ్డల పెళ్ళిలు చేసిన పేద కుటుంబాలు మరింత ఆర్థికంగా చితికి పోతున్నారు. రెవెన్యూ శాఖలో ఒకవైపు దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతుండగా... మరోవైపు తహసీల్దారు పరిశీలన పూర్తయి ఎమ్మెల్యే, ఆర్డీవో ఆమోదం పొంది ట్రెజరీలకు బిల్లులు వెళ్తున్నా...ఆర్థిక సహయం మాత్రం బ్యాంక్ ఖాతాలో జమా కావడం లేదు. ఫలితంగా నెలల తరబడి పేదలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఆర్థిక సహాయం మాత్రం అందని ద్రాక్షగా తయారైంది. ఇదీ పరిస్ధితి.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద వధువు చేయూత నత్తలకు నడక నేర్పిస్తోంది. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం కళ్యాణ లక్ష్మి పథకం కింద 4,480 కుటుంబాలు, షాదీముబారక్ పథకం కింద 9,504 కుటుంబాలు దరఖాస్తు చేస్తుకున్నాయి. అందులో సగానికి పైగా దరఖాస్తులకు అతీగతీ లేకుండా పోగా, మరి కొన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పథకం అమలు తీరు పరిశీలిస్తే మొత్తం దరఖాస్తుల్లో తహసీల్ స్థాయిలో 399, ఎమ్మెల్యే అమోదం కోసం 612, రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో 1518, ట్రెజరీ వద్ద 288 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. షాదీముబారక్ పథకం కింద మొత్తం 9,504 దరఖాస్తులకు గాను తహసీల్ స్ధాయిలో 528 దరఖాస్తులు, ఎమ్మెల్యే స్థాయిలో 881, రెవెన్యూ డివిజన్ స్థాయిలో 3,958 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ. 73.53 కోట్లు అత్యవసరం హైదరాబాద్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద రూ. 73.53 కోట్లు అత్యవసరమని అధికారం యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రసుత్తం షాదీ ముబారక్ పథకం కింద రూ. 52,01,39,000, కళ్యాణ లక్ష్మి పథకం కింద బీసీ, ఓబీసీ లబ్ధిదారులకు రూ, 17,01,16,000, ఎస్సీ సామాజిక వర్గం లబ్ధిదారులకు 3,00,34,800లు, ఎస్టీ సామాజిక వర్గం లబ్ధిదారులకు రూ.1,50, 11, 600 నిధులు అత్యవసరం ఉన్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. -
బుల్లెట్‌పై తిరుగుతూ.. చెక్కులు పంచుతూ..
ఎల్లారెడ్డి: పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందజేశారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని 20 మంది లబ్ధిదారుల ఇంటింటికీ బుల్లెట్‌పై ఎమ్మెల్యే వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. పట్టణంలో బుల్లెట్‌పై ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లడంతో ఆయనను వింతగా చూశారు. ఎమ్మెల్యే ఏమిటి.. బుల్లెట్‌పై తిరగడమేంటి.. ఇంటింటికీ రావడం ఏమిటని ఒకరిని ఒకరు గుసుగులాడుకున్నారు. లబ్ధిదారులు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటికి వచ్చి అందజేయడాన్ని అందరూ చాలా సంతోషించారు. ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుడుముల సత్యం, ఇమ్రాన్, జలందర్ రెడ్డి, పద్మారావు, రవీందర్, నర్సింలు, సతీష్, శ్రీనివాస్, తిమ్మాపూర్ సర్పంచ్ దామోదర్ ఉన్నారు. -
కల్యాణ‘లబ్ధి’ ఒక్కసారే...!
సాక్షి, హైదరాబాద్: లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఒక్కసారే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో మొదటి పెళ్లి, రెండో పెళ్లి అనే అంశాలు అప్రస్తుతమని తేల్చి చెప్పింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన సోదరి రెండో వివా హం నేపథ్యంలో కల్యాణలక్ష్మి లబ్ధి పొందవచ్చా అని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం లోతుగా పరిశీలించి ఈ ఆదేశాలు జారీ చేసింది. -
సిద్దిపేటను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చుదాం