సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా వెనుకబడిన కుటుంబాల్లోని యువతులకు కూడా కల్యాణ లక్ష్మి పథకం కింద రూ.51 వేల ఆర్థిక సాయం అందించనున్నారు.
హైదరాబాద్: పేద యువతుల వివాహాలకు ఆర్థికంగా తోడ్పాటునిచ్చే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వెనుకబాటు తనమే ప్రామాణికంగా ఇకపై అన్ని పేద కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా వెనుకబడిన కుటుంబాల్లోని యువతులకు కూడా వివాహ సమయంలో రూ.51 వేల రూపాయల ఆర్థిక సాయం అందించేలా పథకం నిబంధనల్లో సవరణ చేశారు. తల్లిదండ్రుల ఇద్దరి ఆదాయం కలిపి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకుండా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.