‘కల్యాణ లక్ష్మి’కి దరఖాస్తు ఇలా..
నిర్మల్ అర్బన్ : పెళ్లి వేడుకలు నేడు ఖరీదయ్యాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా వ్యయాలు పెరిగిపోయాయి. ఫంక్షన్ హాళ్లు, కార్డుల పంపిణీ, బట్టల కొనుగోలు, సామగ్రి, నిత్యావసర సరుకులు.. ఇలా అన్ని ధరలు పెరిగిపోయాయి. దీంతో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీలు వివాహ ఖర్చులకు అప్పుల పాలయ్యేవారు. మరి కొందరు ఆర్థిక భారాన్ని భరించే స్థోమత లేక పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చేది. ఇలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీల వివాహానికి ప్రభుత్వం రూ.51వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఇది కాస్తా ఊరటనివ్వడంతో పాటు కొందరికి వరంగా మారింది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ..
‘కల్యాణలక్ష్మి’ పథకం ద్వారా లబ్ధి పొందే వారు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వధూవరుల పూర్తి వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అనంతరం దాని ప్రతిని సమీపంలోని సాంఘిక సంక్షే మ శాఖ కార్యాలయంలో అందజే యాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న పత్రాలతో పాటు వధువుకు సంబంధించిన కులం, ఆదాయం, నివాసం, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్, మొదటి వివాహంగా వీఆర్వో, గజిటెడ్ అధికారులతో వేర్వేరుగా ధ్రువీకరించిన పత్రాలు, అబ్బాయికి సంబంధించిన ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తదితర పూర్తి వివరాల జిరాక్స్ ప్రతులతో దరఖాస్తులు అందజేయాలి. అలాగే వెడ్డింగ్ కార్డును జతపరిచి పెళ్లికి ముందే అధికారులకు అప్పగించాలి. రూ.2లక్షల వార్షికాదాయం ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. 2014 అక్టోబర్ 2వ తేదీ తర్వాత పెళ్లి చేసుకున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు తమ పెళ్లి ఫొటో, పెళ్లి పత్రికను దరఖాస్తుతో జతపరచాల్సి ఉంటుంది.
పరిశీలన పూర్తయిన వెంటనే మంజూరు..
సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు దరఖాస్తులు అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో పూర్తి పరిశీలన చేపడతారు. అందించిన వివరాలు సరియైనవో.. కాదో.. తేల్చుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అనంతరం జిల్లా కార్యాలయం నుంచి నిధులు మంజూరవుతాయి. నేరుగా రూ.51 వేలు వధువు బ్యాంక్ అకౌంట్‌లో జమవుతాయి. ఈ పథకం అమలుకు నిధుల కొరత ఏమీ లేదని.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం జిల్లాకు సుమారు రూ.6 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు.
అవగాహన కల్పిస్తే మేలు..
పేద, నిరుపేదలైన దళితుల కోసం ప్రవేశపెట్టిన ‘కల్యాణ లక్ష్మి’ పథకంపై ప్రజల్లో అవగాహన కొరవడింది. ఎవరికి దరఖాస్తులు అందించాలో.. ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయడంతో అవి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరడానికి, దరఖాస్తుల పరిశీలనకు తీవ్ర జాప్యం జరుగుతుందనే ఆరోపణలున్నాయి.
‘కల్యాణ లక్ష్మి’ పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. దళితుల్లో ఎక్కువ మంది నిరక్ష్యరాస్యులుండడం, దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అందించలేక పోవడం, ఏయే పత్రాలు జతపర్చాలన్న విషయాలు తెలియకపోవడంతో పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనే విమర్శలున్నారుు. ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే అధికారులు దళితులను మరింత చైతన్యపరచాల్సిన అవసరముందని పలువురు పేర్కొంటున్నారు.
51 దరఖాస్తులు అందాయి
- మహ్మద్ అబ్దుల్ అలీం, అసిస్టెంట్ సాంఘిక సంక్షేమశాఖ అధికారి, నిర్మల్
ఇప్పటివరకు 51 దరఖాస్తులు అందగా 38 పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాం. మిగిలిన వాటికి సంబంధించి దరఖాస్తుదారుల నుంచి మరికొన్ని వివరాలు, పత్రాలు అందాల్సి ఉంది. అవి అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.అన్ని పత్రాలు అందజేసిన వారికి ఇప్పటికే ఆర్థికసాయం మంజూరైంది.