![Kalyana Lakshmi Scheme Applicants awaiting government assistance - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/20/shadi.jpg.webp?itok=06Z_GhNz)
నల్లగొండ జిల్లా చండూరు మండలం దోనిపాములకు చెందిన ఇప్ప లక్ష్మయ్య తన కుమార్తె వివాహం 2022 జూన్‌లో చేశాడు. ఆ తర్వాత కల్యాణ లక్ష్మి పథకం కింద ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించాడు. దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కల్యాణ కానుక అందలేదు. క్రమం తప్పకుండా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు నెలరోజుల్లో వస్తుందని చెబుతున్నా.. అలాంటి నెలలెన్నో గడిచిపోతుండటంతో లక్ష్మయ్య సాయంపై ఆశలు వదులుకునే పరిస్థితికి చేరుకున్నాడు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన బి.అమృత తన కుమార్తె వివాహం గతేడాది ఫిబ్రవరి 9న చేసింది. వెంటనే కల్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. పథకం అర్హత, సాయం కోసం అధికారులను అడిగినప్పుడల్లా.. వివరాలను సంబంధిత అధికారులకు పంపించామని, ప్రభుత్వం నిధులు ఇచి్చనప్పుడు అందిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సాయం అందుతుంతో లేదో ఆమెకు అర్థం కావడం లేదు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి పథకం పడకేసింది. కుమార్తెల వివాహాలు చేసి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. ఏడాది, ఏడాదిన్నర దాటుతున్నా ‘కల్యాణ’ కానుక జాడ లేక పోవడంతో..సమీప భవిష్యత్తులోనైనా వస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి రోజు నాటికే వధువు కుటుంబానికి రూ.1,00,116 ఆర్థిక సాయాన్ని (కానుక) అందించాలనేది కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశం.
దరఖాస్తు ప్రక్రియలో నిబంధనలు, క్షేత్రస్థాయిలో విచారణ నేపథ్యంలో అర్జీదారులంతా వివాహం తర్వాతే దరఖాస్తు సమర్పిస్తున్నారు. అలా సమర్పించిన దరఖాస్తును పరిశీలించి విచారణ పూర్తి చేసిన తర్వాత అర్హతలను ఖరారు చేసి, లబ్దిదారు కుటుంబానికి చెక్కు రూపంలో సాయం అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పథకాలకు నిధుల విడుదల నిలిచిపోగా.. క్షేత్రస్థాయిలో దరఖాస్తు పరిశీలన కూడా ఆగిపోయింది.
ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన అర్జీదారులకు ఎలాంటి సమాచారం అందడం లేదు. దాదాపు నాలుగు నెలలుగా రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద చెక్కుల పంపిణీ జరగడం లేదు. రెండు పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా 1,04,613 దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నట్లు సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
విడుదల కాని నిధులు
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి లక్షకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో ఆ మేరకు బకాయిలు కూడా పేరుకుపోయాయి. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. 2023–24 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలాఖరు నాటికి రెండు పథకాలకు సంబంధించి 1,32,046 దరఖాస్తులు అందగా, 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మరో 69,715 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ పెండింగ్ దరఖాస్తులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జత (క్యారీ ఫార్వర్డ్) చేశారు. క్యారీ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులతో 2023–24 డిసెంబర్ నెలాఖరు నాటికి వచ్చిన వాటిని కలిపితే మొత్తం దరఖాస్తులు 2,01,761. వీటిలో 97,148 దరఖాస్తులను అధికారులు విడతల వారీగా పరిష్కరించి క్లియర్ చేశారు. వీటికి సంబంధించి ప్రభుత్వం రూ.972.60 కోట్లు విడుదల చేసింది.
కానీ 1,04,613 దరఖాస్తులకు సంబంధించి రూ.1,047.68 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గత నాలుగు నెలలుగా ఎన్నికల కోడ్, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిధుల విడుదల జరగక చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. కాగా ప్రస్తుత బకాయిల్లో బీసీ, ఈబీసీ కేటగిరీల వారి దరఖాస్తులకు సంబంధించినవే సగానికిపైగా ఉండడం గమనార్హం.
కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చా? లేదా?
రాష్ట్రంలో గత డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికాకంలోకి వచ్చింది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు గత ప్రభుత్వ హయాంలోనే అమల్లో ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్..అధికారంలోకొస్తే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకాలకు నిధుల విడుదల నిలిచిపోవడంతో బంగారం సంగతి సరే బకాయిల సంగతి ఏమిటనే ఆందోళన, ఆయోమయం దరఖాస్తుదారుల్లో నెలకొంది.
ఏడాదిన్నరకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో..ఆయా పథకాలకు అర్హతలున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
కేటగిరీ వారీగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ బకాయిలు (రూ.కోట్లలో)
సంక్షేమ శాఖ పెండింగ్ దరఖాస్తులు చెల్లించాల్సిన బకాయిలు
బీసీ, ఈబీసీ 55541 556.29
మైనారిటీ 23599 236.28
ఎస్సీ 14267 142.90
ఎస్టీ 11206 112.21
మొత్తం 104613 1047.68
Comments
Please login to add a commentAdd a comment