సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్‌లో లోక్‌సభ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్ల కోసం టీపీసీసీ దరఖాస్తులను ఆహ్వానించగా గడువు ముగిసే సమయానికి 306 దరఖాస్తులు వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. తొలి రెండు రోజుల్లో 41 దరఖాస్తులు రాగా శుక్రవారం 100 దరఖాస్తులు, శనివారం ఏకంగా 165 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, నల్లగొండ స్థానాలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది.
శనివారం దరఖాస్తు చేసుకున్న ప్రముఖుల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ (ఖమ్మం), చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ, రేవంత్‌రెడ్డి సన్నిహితుడు పటేల్ రమేశ్‌రెడ్డి (నల్లగొండ), టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ (భువనగిరి), రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు పిడమర్తి రవి (వరంగల్), టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు (మెదక్), సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం (కరీంనగర్) తదితరులున్నారు.
బరిలోకి బంధుగణం..
గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న లోక్‌సభ స్థానాలకు పార్టీలోని ముఖ్య నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా స్థానాల్లో మంత్రులు, ఇతర ముఖ్య నేతల బంధువులు, వారి సన్నిహితులు రంగంలోకి దిగారు.
దరఖాస్తుదారుల్లో గడ్డం వంశీ, ఊట్ల వరప్రసాద్, గోమాస శ్రీనివాస్, పెరిక శ్యామ్ (పెద్దపల్లి), సిరిసిల్ల రాజయ్య, మోత్కుపల్లి నర్సింహులు, సర్వే సత్యనారాయణ, నమిండ్ల శ్రీనివాస్ (వరంగల్), మల్లు రవి, ఎస్. సంపత్‌కుమార్ (నాగర్‌కర్నూల్), కుందూరు రఘువీర్, పటేల్ రమేశ్‌రెడ్డి (నల్లగొండ), చామల కిరణ్, కోమటిరెడ్డి పవన్, కుంభం కీర్తిరెడ్డి, చనగాని దయాకర్, పున్నా కైలాశ్‌నేత (భువనగిరి), జగ్గారెడ్డి, సోమేశ్వరరెడ్డి (మెదక్), బండ్ల గణేశ్, దిలీప్ కుమార్, హరివర్ధన్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి), బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ (మహబూబాబాద్), వి. హనుమంతరావు, రేణుకాచౌదరి, మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, వి.వి. రాజేంద్రప్రసాద్ (ఖమ్మం) ఉన్నారు.
దరఖాస్తుల గడువు ముగియడంతో ఈ నెల 6లోగా టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశమై వాటిని షార్ట్‌లిస్టు చేస్తుందని, ఆ జాబితాను ఏఐసీసీ నియమించిన తెలంగాణ స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తుందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment