కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే హరీశ్
సిద్దిపేట జోన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బడ్జెట్‌లో విస్మరించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారు లకు నగదుతోపాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తలేదన్నారు.
అలాగే మైనార్టీలకు పెద్దపీట వేస్తామని చెప్పి నిధుల కేటాయింపులో మొండి చెయ్యి చూపిందని విమర్శించారు. బడ్జెట్‌లో మైనార్టీలకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి, నేడు రూ.2,200 కోట్లే కేటాయించిందని, రెండు నెలలుగా వృద్ధులకు పింఛన్లు కూడా అందడం లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.12 వేల కోట్ల ఆర్థిక సాయం చేసిందని గుర్తు చేశారు. వ్యవసాయానికి కనీసం 16 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదని, పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సిద్దిపేట ప్రాంతానికి చెందిన మైనార్టీల ఉమ్రా యాత్ర కోసం తన సొంత డబ్బు వెచ్చిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment