
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట భస్మాసుర హస్తం: హరీశ్
సాక్షి, హైదరాబాద్/చిన్నకోడూరు (సిద్దిపేట): అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని పదేపదే చెప్పిన కాంగ్రెస్ పార్టీ .. ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అభయ హస్తం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని దుయ్యబట్టారు.
ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదనే ఆవేదనతో ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య గ్రామ సభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. నాగయ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం. రోడ్డున పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాగా, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెల్కలపల్లి ప్రజలను భూ నిర్వాసితులుగా గుర్తించి ఆదుకోవాలని నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు గురువారం లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment