ఆ ఏడు స్థానాల్లో అదనపు బ్యాలెట్‌ యూనిట్లు | Additional ballot units in those seven seats | Sakshi
Sakshi News home page

ఆ ఏడు స్థానాల్లో అదనపు బ్యాలెట్‌ యూనిట్లు

Published Thu, Nov 16 2023 3:40 AM | Last Updated on Thu, Nov 16 2023 3:40 AM

Additional ballot units in those seven seats - Sakshi

సాక్షి, హైదరాబాద్, సాక్షి, సిద్దిపేట/గజ్వేల్‌: సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలతో పాటు మరో అయిదు సెగ్మెంట్లలో అభ్యర్ధులు లెక్కకి మించి ఉండటంతో అదనపు బ్యాలెట్‌ యూనిట్లను అమర్చి పోలింగ్‌ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

కేసీఆర్‌ గజ్వేల్, కామారెడ్డి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండగా, బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత గజ్వేల్‌ నుంచి 44 మంది, కామారెడ్డి నుంచి 39 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ఈ రెండు శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ రోజు వినియోగించనున్న ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)కు మూడు చొప్పున బ్యాలెట్‌ యూనిట్లను అమర్చి పోలింగ్‌ నిర్వహించనున్నారు. 

ఈవీఎంలకు మూడు బ్యాలెట్‌ యూనిట్లు 
ఒక ఈవీఎంలో కంట్రోల్‌ యూనిట్, బ్యాలెట్‌ యూనిట్, వీవీ ప్యాట్‌ అనే మూడు ప్రధాన విభాగాలుంటాయి. ఒక బ్యాలెట్‌ యూనిట్‌పై నోటాతో సహా 16 మంది అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తు, ఫోటో ఉంటాయి. నియోజకవర్గంలో 16 మందికి మించి అభ్యర్థులు పోటీ చేస్తే ఒకటికి మించి బ్యాలెట్‌ యూనిట్లను వాడాల్సి ఉంటుంది. నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17 నుంచి 32లోపు ఉంటే రెండు బ్యాలెట్‌ యూనిట్లు, 33 నుంచి 48లోపు ఉంటే మూడు బ్యాలెట్‌ యూనిట్లను వినియోగించక తప్పదు. దీంతో గజ్వేల్, కామారెడ్డిలో వినియోగించనున్న ఈవీఎంలకు మూడు చొప్పున బ్యాలెట్‌ యూనిట్లను అమర్చి పోలింగ్‌ నిర్వహించనున్నారు. 

‘ఎం3’రకం ఈవీఎంల వినియోగం 
2013 నుంచి అందుబాటులోకి వచ్చిన ‘ఎం3’రకం ఈవీఎంలను రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. ఒక కంట్రోల్‌ యూనిట్‌కు వీవీ ప్యాట్‌తో పాటు గరిష్టంగా 24 బ్యాలెట్‌ యూనిట్లను అనుసంధానం చేసి ఒక ఈవీఎంను తయారు చేయవచ్చు. దీంతో ఒకే ఈవీఎం ఆధారంగా గరిష్టంగా 384 అభ్యర్థులకు పోలింగ్‌ నిర్వహించవచ్చు. 384 మందికి లోపు అభ్యర్థులు పోటీ చేస్తే ఒకే కంట్రోల్‌ యూనిట్‌కు అవసరమైన సంఖ్యలో బ్యాలెట్‌ యూనిట్లను అమర్చనున్నారు.

అయితే, అభ్యర్థుల సంఖ్య 384కు మించితే రెండో కంట్రోల్‌ యూనిట్‌ను వినియోగించక తప్పదు. 2006  నుంచి 2013 వరకు జరిగిన ఎన్నికల్లో ‘ఎం2’రకం ఈవీఎంలను ఎన్నికల సంఘం వినియోగించింది. ఆ తర్వాత  నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ‘ఎం3’రకం ఈవీఎంలను వాడుతోంది. ఒక ఈవీఎం గరిష్టంగా 2వేల ఓట్లను నమోదు చేయగల సామరŠాధ్యన్ని కలిగి ఉండనుంది. సాధారణంగా 1500 ఓట్లకు మించి ఒక పోలింగ్‌ కేంద్రానికి ఓట్లను  కేటాయించరు. 

ఓటర్లు కన్‌ఫ్యూజ్‌ అవుతారేమోనని పార్టీల ఆందోళన 
సోమవారంతో ముగిసిన నామినేషన్ల పరిశీలన అనంతరం గజ్వేల్‌లో 114 మంది బరిలో ఉండగా, బుధవారం 70 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కామారెడ్డిలో నామినేషన్ల పరిశీలన అనంతరం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 19 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరకు గజ్వేల్‌ నుంచి మొత్తం 44 మంది, కామారెడ్డి నుంచి మొత్తం 39 మంది పోటీ చేస్తుండగా, రెండు చోట్లలో కూడా మూడు బ్యాలెట్‌ యూనిట్లతో పోలింగ్‌ నిర్వహించనుండడంతో ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యే ప్రమాదముందని రాజకీయ పార్టీలు ఆందోళనకు గురి అవుతున్నాయి.  

మరో 5 చోట్ల సైతం... 
ఎల్బీనగర్‌లో 38 మంది, శేరిలింగంపల్లిలో 33 మంది అభ్యర్థులు బరిలో మిగలడంతో అక్కడ సైతం 3 బ్యాలెట్‌ యూనిట్లను వినియోగించనున్నారు. ఇబ్రహీంపట్నంలో 28 మంది, మహేశ్వరంలో 27 మంది, రాజేంద్రనగర్‌లో 25 మంది అభ్యర్థులు మిగలడంతో ఈ చోట్లలో రెండు బ్యాలెట్‌ యూనిట్లతో పోలింగ్‌ జరపనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement