ballot unit
-
ఆ ఏడు స్థానాల్లో అదనపు బ్యాలెట్ యూనిట్లు
సాక్షి, హైదరాబాద్, సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలతో పాటు మరో అయిదు సెగ్మెంట్లలో అభ్యర్ధులు లెక్కకి మించి ఉండటంతో అదనపు బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండగా, బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత గజ్వేల్ నుంచి 44 మంది, కామారెడ్డి నుంచి 39 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ఈ రెండు శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు వినియోగించనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)కు మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలకు మూడు బ్యాలెట్ యూనిట్లు ఒక ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ అనే మూడు ప్రధాన విభాగాలుంటాయి. ఒక బ్యాలెట్ యూనిట్‌పై నోటాతో సహా 16 మంది అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తు, ఫోటో ఉంటాయి. నియోజకవర్గంలో 16 మందికి మించి అభ్యర్థులు పోటీ చేస్తే ఒకటికి మించి బ్యాలెట్ యూనిట్లను వాడాల్సి ఉంటుంది. నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17 నుంచి 32లోపు ఉంటే రెండు బ్యాలెట్ యూనిట్లు, 33 నుంచి 48లోపు ఉంటే మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించక తప్పదు. దీంతో గజ్వేల్, కామారెడ్డిలో వినియోగించనున్న ఈవీఎంలకు మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించనున్నారు. ‘ఎం3’రకం ఈవీఎంల వినియోగం 2013 నుంచి అందుబాటులోకి వచ్చిన ‘ఎం3’రకం ఈవీఎంలను రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. ఒక కంట్రోల్ యూనిట్‌కు వీవీ ప్యాట్‌తో పాటు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానం చేసి ఒక ఈవీఎంను తయారు చేయవచ్చు. దీంతో ఒకే ఈవీఎం ఆధారంగా గరిష్టంగా 384 అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించవచ్చు. 384 మందికి లోపు అభ్యర్థులు పోటీ చేస్తే ఒకే కంట్రోల్ యూనిట్‌కు అవసరమైన సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను అమర్చనున్నారు. అయితే, అభ్యర్థుల సంఖ్య 384కు మించితే రెండో కంట్రోల్ యూనిట్‌ను వినియోగించక తప్పదు. 2006 నుంచి 2013 వరకు జరిగిన ఎన్నికల్లో ‘ఎం2’రకం ఈవీఎంలను ఎన్నికల సంఘం వినియోగించింది. ఆ తర్వాత నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ‘ఎం3’రకం ఈవీఎంలను వాడుతోంది. ఒక ఈవీఎం గరిష్టంగా 2వేల ఓట్లను నమోదు చేయగల సామరŠాధ్యన్ని కలిగి ఉండనుంది. సాధారణంగా 1500 ఓట్లకు మించి ఒక పోలింగ్ కేంద్రానికి ఓట్లను కేటాయించరు. ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారేమోనని పార్టీల ఆందోళన సోమవారంతో ముగిసిన నామినేషన్ల పరిశీలన అనంతరం గజ్వేల్‌లో 114 మంది బరిలో ఉండగా, బుధవారం 70 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కామారెడ్డిలో నామినేషన్ల పరిశీలన అనంతరం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 19 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరకు గజ్వేల్ నుంచి మొత్తం 44 మంది, కామారెడ్డి నుంచి మొత్తం 39 మంది పోటీ చేస్తుండగా, రెండు చోట్లలో కూడా మూడు బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ నిర్వహించనుండడంతో ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యే ప్రమాదముందని రాజకీయ పార్టీలు ఆందోళనకు గురి అవుతున్నాయి. మరో 5 చోట్ల సైతం... ఎల్బీనగర్లో 38 మంది, శేరిలింగంపల్లిలో 33 మంది అభ్యర్థులు బరిలో మిగలడంతో అక్కడ సైతం 3 బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. ఇబ్రహీంపట్నంలో 28 మంది, మహేశ్వరంలో 27 మంది, రాజేంద్రనగర్‌లో 25 మంది అభ్యర్థులు మిగలడంతో ఈ చోట్లలో రెండు బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ జరపనున్నారు. -
యంత్రంలో ఓటు మంత్రం
సాక్షి, నరసరావుపేట : ఎన్నికల సమరంలో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అందులోనూ గతంలో మాదిరి బ్యాలెట్ ఓటింగ్ కాకుండా.. ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటు వేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో ఓటు ఏలా వేయాలో తెలుసుకుందాం. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశం మీరు పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లేసరికి ప్రిసైడింగ్ అధికారి మీ బ్యాలెట్‌ను సిద్ధంగా ఉంచుతారు. ఓటు వేయడం ఇలా బ్యాలెట్ యూనిట్(ఈవీఎం)పైన మీకు నచ్చిన అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు(బ్లూ) బటన్‌ను గట్టిగా నొక్కాలి. సిగ్నల్ : ఓటు వేసినప్పుడు మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు, గుర్తుకు ఎదురుగా ఎర్రలైట్ వెలుగుతుంది. ప్రింట్‌ను చూడండి ప్రింటర్– మీరు ఎన్నుకున్న అభ్యర్థి సీరియల్ నంబర్, పేరు, ఫొటో, గుర్తుతో ఓ బ్యాలెట్ స్లిప్ ప్రింట్‌ను వీవీప్యాట్‌లో చూడవచ్చు. గమనించాల్సిన విషయం ఒక వేళ మీకు బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా, బీప్ శద్ధం గట్టిగా వినిపించకపోయినా ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించవచ్చు. ఓటు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటేయొచ్చు! ఓటర్ జాబితా సవరణతో కొత్తగా ఓటర్‌గా నమోదైన వారికి సైతం ఇటీవల గుర్తింపు కార్డులు వచ్చాయి. అయితే ప్రస్తుత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండీ గుర్తింపు కార్డు లేదని బాధపడుతున్నారా! ఇప్పుడు ఆ చింత అవసరం లేదు. ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇవి ఉంటే సరి.. డ్రైవింగ్ లైసెన్సు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు, ఫొటోతో ఉన్న బ్యాంక్ పాస్‌పుస్తకం, పోస్టాఫీసులు జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్‌బుక్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, పింఛన్‌కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు .. ఇలా వీటిల్లో ఏదో ఒక దానిని చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. చాలెంజ్ ఓటు.. ఏప్రిల్ 11 2019ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటర్ తన గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్ అభ్యంతరం చెబితే ఓటర్ను.. ఏజెంట్‌ను ప్రిసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచి రూ. 2 చాలెంజ్ ఫీజుగా తీసుకుంటారు. అప్పుడు ఓటర్ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్ఓను పిలిచి అతడు స్థానిక ఓటరా కాదా అనే విషయం.. పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు. అతడు స్థానిక ఓటరై, జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే వయన్సు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రిసైడింగ్ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్‌ను, ఓటరును పోలీసులకు అప్పగించవచ్చు. -
అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డుపై దొరికిన బ్యాలెట్
జైపూర్ : రాజస్థాన్‌లో ఎన్నికల అధికారులు బ్యాలెట్ యూనిట్లను తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బరాన్ జిల్లాలో కిషన్ గంజ్ అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని షహాబాద్‌లో రోడ్డుపైనే బ్యాలెట్ యూనిట్ లభించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎం మిషిన్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. రోడ్డుపై లభించిన బ్యాలెట్ యూనిట్‌ను కిషన్‌గంజ్‌లోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. రాజస్థాన్ అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను ఒక్కటి మినహా 199 సీట్లకు శుక్రవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధి లక్ష్మణ్ సింగ్ హఠాన్మరణంతో ఆల్వార్ జిల్లా రామ్‌గఢ్ నియోజకవర్గం ఎన్నిక నిలిచిపోయింది. ఓటింగ్ ముగిసే సాయంత్రం 5 గంటల సమయానికి 74.02% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. -
శోభమ్మకు ఓటుతో నివాళి
సిద్ధమవుతున్న ఆళ్లగడ్డ ప్రజలు - ఎన్నికపై నెలకొన్న సస్పెన్స్‌కు తెర - ఆమె గెలిస్తే ఉప ఎన్నిక నిర్వహణ - ఈసీ నిర్ణయంతో అభిమానులకు ఊరటకుదుటపడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆపదలో కొండంత అండ. ఎలాంటి సమయంలోనైనా నేనున్నాననే భరోసా. పార్టీలకు అతీతంగా.. వర్గాలకు తావివ్వక చిరునవ్వుతో ప్రజల హృదయాలను గెలిచిన శోభమ్మ మృతి జిల్లా ప్రజలను కలచివేసింది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు తీరని దుఃఖం మిగిల్చింది. ఇక గెలుపు లాంఛనమేనన్న పరిస్థితుల్లో ఆమె అకాలమరణంతో ఎన్నో ప్రశ్నలు తెరపైకొచ్చాయి. ఈవీఎంలలో ఆమె పేరును తొలగిస్తారని.. ఓటు వేసినా చెల్లదని.. గెలిచినా పరిగణనలోకి తీసుకోరనే ప్రచారం గందరగోళానికి తావిచ్చింది. ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు ఎన్నికల కమిషన్ తెరదించింది. శోభా నాగిరెడ్డికి వేసే ఓట్లు చెల్లుబాటు అవుతాయని.. ఒకవేళ ఆమె గెలిస్తే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పట్ల ఆమె అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆళ్లగడ్డ అసెంబ్లీ బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈనెల 24న మరణించిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఎన్నిక నిర్వహణపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. ఆడపడచులా భావించిన నియోజకవర్గ ప్రజలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆదివారం ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డికి ఓటేస్తే చెల్లదని ప్రకటించారు. పారదర్శక పాలనతో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఆమెకు ఓటుతో నివాళి అర్పించాలనుకున్న ప్రజలకు ఆ ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. దీంతో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి.. జిల్లా కలెక్టర్, జేసీలతో సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా సోమవారం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ అధికారులతో మాట్లాడి ఆళ్లగడ్డ ఎన్నికపై స్పష్టత కోరారు. ఆర్టికల్ 52 ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం ఆళ్లగడ్డ ఎన్నికకు ఎలాంటి అభ్యంతరం లేదని.. మెజార్టీ ప్రజలు ఎవరికి అధికంగా ఓట్లు వేస్తారో వారినే ఎమ్మెల్యేగా ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు. అయితే గెలిచిన అభ్యర్థి అప్పటికే మృతి చెందినట్లయితే ఉప ఎన్నిక నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఎట్టకేలకు నిర్ణయం వెలువడటంతో ఊపిరి పీల్చుకున్న అధికారయంత్రాంగం సోమవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై బ్యాలెట్ యూనిట్‌ను అమర్చే కార్యక్రమం పూర్తి చేశారు. -
ఇదీ.. ఈవీఎం పనితీరు
సాక్షి, నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలివి (ఈవీఎంలు). ఫొటోలో కనిపిస్తున్న రెండింటిలో ఎడమవైపుది కంట్రోలింగ్ యూనిట్ (సీయూ). కుడివైపుదిబ్యాలెట్ యూనిట్ (బీయూ). ఎన్నికల కేంద్రంలోని అధికారుల వద్ద సీయూ ఉంటుంది. ఓటర్లుబీయూలో ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రతి ఓటరుఓటు వేయడానికి వెళ్లినప్పుడు అధికారి సీయూలోని‘బ్యాలెట్’ బటన్‌ను నొక్కితే.. ఓటరు వద్ద నున్నబ్యాలెట్ యూనిట్ ద్వారా ఓటు వేసేందుకు వీలవుతుంది. బీయూలో 16 గుర్తుల వరకు ఉంటాయి.ఒకవేళ అంతకంటే ఎక్కువ గుర్తులు (అభ్యర్థులు)బరిలో ఉంటే.. మరో యంత్రాన్ని వినియోగిస్తారు. అభ్యర్థులు పదిమంది కంటే తక్కువ మంది ఉంటే.. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటే.. అంతమంది అభ్యర్థుల గుర్తులు మాత్రమే ఉండేలా సాంకేతిక చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకుపదిమంది అభ్యర్థులు పోటీలో ఉంటే పది బటన్లు(గుర్తులు) మాత్రమే పనిచేసేలా చేస్తారు. ఈసారిఎన్నికల్లో ‘పై వారిలో ఎవరూ కాదు’ (నోటా) బటన్ కూడా ఉంటుంది. ఇది అభ్యర్థులందరిగుర్తుల కంటే దిగువన ఉంటుంది. ఎన్నికల అధికారిసీయూలో బ్యాలెట్ బటన్‌ను నొక్కగానే ఓటువేసేందుకు వెళ్లిన పౌరుడి వద్ద ఉన్న బీయూలోని ‘రెడీ’ బల్బు వెలుగుతుంది. వెనువెంటనే సీయూలోని ‘బిజీ’ బల్బు వెలుగుతుంది. బీయూలోనిఅభ్యర్థుల గుర్తుల్లో తమకు నచ్చిన అభ్యర్థి గుర్తుఎదురుగా ఉన్న బటన్‌ను నొక్కితే.. ఓటింగ్ పూర్తయినట్లు. ఎన్నిక పూర్తికాగానే బిజీ బల్బు ఆగిపోతుంది. అప్పుడు మరో ఓటరును పంపించి ఎన్నికల అధి కారి ‘బ్యాలెట్’ బటన్‌ను నొక్కుతారు. అప్పుడు మరొకరు ఓటు వే సేందుకు వీలవుతుంది. ఎరుపు రంగులో దీర్ఘచతురస్రాకారంలో ఉన్నభాగం ‘డిస్ప్లే’. సదరు ప్రాంతంలో ఎంతమంది ఓట్లు వేసింది ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దిగువన నీలిరంగులో చతురస్రాకార భాగాలున్న ప్రాంతాన్ని ‘క్యాండ్సెట్ యూని ట్’గా వ్యవహరి స్తారు. వీటిని రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో పోలింగ్‌కు ముందుగా తగిన విధంగా సెట్ చేస్తారు. ఈవీఎంలపై ఆయా రాజకీయ పార్టీల సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు వీలుగా మాక్‌పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మాక్‌పోలింగ్ సందర్భంగాఆయా పార్టీల అభ్యర్థులు తమకు నచ్చిన గుర్తులపైఓట్లు వేసి.. తర్వాత పోలైన ఓట్లతో.. ఏయే గుర్తులకుఎన్ని ఓట్లు పడ్డాయో పోల్చి చూసుకోవచ్చు.నీలిరంగు మూతలు తెరిస్తే.. ‘క్లోజ్, రిజల్ట్,ప్రింట్, క్లియర్’ అనే బటన్లు కనిపిస్తాయి. ఆయాసూచికలు సదరు పనులు చేస్తాయి. ‘రిజల్ట్’బటన్ నొక్కితే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయోతెలుస్తుంది. ఇవన్నీ రిటర్నింగ్ అధికారులు నిర్వహించే పనులు కాగా, రాజకీయ పార్టీల అనుమానాలు తొలగించేందుకు మాక్‌పోలింగ్‌లో వీటి ద్వారా ఈవీఎంల పనితీరు తెలియజేస్తారు. ఇవి సీయూ,బీయూల వెనుకవైపు చిత్రాలు ఇందులోని ‘క్యూసీ’క్వాలిటీచెక్ జరిగిందని తెలిపేది. ఈవీఎంతయారీ సంస్థ ఈసీఐల్ ప్రతినిధి, జిల్లా ఎన్నికల అధికారి ప్రతినిధి ఈవీఎంల పనితీరు, క్వాలిటీని ధ్రువీకరిస్తూ సంతకాలు చేస్తారు. అవగాహన ఏదీ? సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరో పది హేను రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పూర్తిగా ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లను వాడనున్నారు. ఈసారి ఈవీఎంలలో కొత్తగా రెండు ఆప్షన్లను ఎన్నికల సంఘం ఓటర్లకు కల్పించింది. అందులో ఒకటి నోటా (నన్ ఆఫ్ దీ ఎబో). ఎన్నికల బరిలో నిల్చిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే తిరస్కరిస్తూ ‘నోటా’ బటన్ నొక్కవచ్చు. ఇక రెండోది వీవీపాట్ (ఓటర్ వెరిఫైయబుల్ ప్రింట్ ఆడిట్ ట్రయల్). దీని ద్వారా తమ ఓటు సక్రమంగా నమోదయ్యిందా? లేదా..? అనే విషయం తెలుసుకునేందుకు రశీదు పొందవచ్చు. ఓటర్లకోసం ఎన్నికల సంఘం ఈ సారి ఈ కొత్త ఆప్షన్లను ప్రవేశపెట్టింది. కాని వీటిపై ఓటర్లకు, రాజకీయ పార్టీలకు, ఎన్నికల సిబ్బందికి సైతం సరైన అవగాహన లేదనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు వీటి వినియోగంపై ఎక్కడా అవగాహన కల్పించ లేదు. చర్యలు శూన్యం... గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎంలో ఏదో ఒక బటన్ నొక్కి ఓటువేయడం మాత్రమే తెలుసు. ఇప్పుడున్న కొత్త ఆప్షన్ల గురించిగాని, వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంగానీ తెలియదు. వీటిపై అవగాహన కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడంలేదు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, నిన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు బ్యాలెట్ పేపర్లపైనే ఓటు వేశారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించి వాటిలోనూ కొత్త ఆప్షన్లు పెడితే ఎలా తెలుస్తాయనేది చాలా మందిలో ఉన్న సందేహం. దాన్ని నివృత్తి చేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.