
శోభమ్మకు ఓటుతో నివాళి
సిద్ధమవుతున్న ఆళ్లగడ్డ ప్రజలు
- ఎన్నికపై నెలకొన్న సస్పెన్స్‌కు తెర
- ఆమె గెలిస్తే ఉప ఎన్నిక నిర్వహణ
- ఈసీ నిర్ణయంతో అభిమానులకు ఊరటకుదుటపడిన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆపదలో కొండంత అండ. ఎలాంటి సమయంలోనైనా నేనున్నాననే భరోసా. పార్టీలకు అతీతంగా.. వర్గాలకు తావివ్వక చిరునవ్వుతో ప్రజల హృదయాలను గెలిచిన శోభమ్మ మృతి జిల్లా ప్రజలను కలచివేసింది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు తీరని దుఃఖం మిగిల్చింది. ఇక గెలుపు లాంఛనమేనన్న పరిస్థితుల్లో ఆమె అకాలమరణంతో ఎన్నో ప్రశ్నలు తెరపైకొచ్చాయి.
ఈవీఎంలలో ఆమె పేరును తొలగిస్తారని.. ఓటు వేసినా చెల్లదని.. గెలిచినా పరిగణనలోకి తీసుకోరనే ప్రచారం గందరగోళానికి తావిచ్చింది. ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కు ఎన్నికల కమిషన్ తెరదించింది. శోభా నాగిరెడ్డికి వేసే ఓట్లు చెల్లుబాటు అవుతాయని.. ఒకవేళ ఆమె గెలిస్తే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పట్ల ఆమె అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆళ్లగడ్డ అసెంబ్లీ బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈనెల 24న మరణించిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఎన్నిక నిర్వహణపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. ఆడపడచులా భావించిన నియోజకవర్గ ప్రజలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆదివారం ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డికి ఓటేస్తే చెల్లదని ప్రకటించారు.
పారదర్శక పాలనతో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఆమెకు ఓటుతో నివాళి అర్పించాలనుకున్న ప్రజలకు ఆ ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. దీంతో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి.. జిల్లా కలెక్టర్, జేసీలతో సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా సోమవారం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ అధికారులతో మాట్లాడి ఆళ్లగడ్డ ఎన్నికపై స్పష్టత కోరారు.
ఆర్టికల్ 52 ఆర్‌పీ యాక్ట్ 1951 ప్రకారం ఆళ్లగడ్డ ఎన్నికకు ఎలాంటి అభ్యంతరం లేదని.. మెజార్టీ ప్రజలు ఎవరికి అధికంగా ఓట్లు వేస్తారో వారినే ఎమ్మెల్యేగా ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు. అయితే గెలిచిన అభ్యర్థి అప్పటికే మృతి చెందినట్లయితే ఉప ఎన్నిక నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఎట్టకేలకు నిర్ణయం వెలువడటంతో ఊపిరి పీల్చుకున్న అధికారయంత్రాంగం సోమవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై బ్యాలెట్ యూనిట్‌ను అమర్చే కార్యక్రమం పూర్తి చేశారు.